Tuesday, November 29, 2022

సంతోషం ఉంటే అన్నీ ఉన్నట్లే..

- Advertisement -

Happiness

సంతోషం ఒక భావన..
సంతోషం ఒక అనుభూతి..
సంతోషం ఒక అనుభవం..
అదొక మానసిక స్థితి.
ఎవరి సంతోషం వారిదే.
ఒకరికి సంతోషం కలిగించేది మరొకరికి కలిగించకపోవచ్చు.

సంతోషంగా ఉండాలంటే అధిక ధనవంతుడై ఉండనక్కర్లేదు. సంతోషం, దుఃఖం లాంటి భావోద్వేగాలన్నీ మన చేతుల్లోనే ఉంటాయి. ఎవరో మనల్ని సంతోషపెడతారనేది తప్పు. మన ఆలోచనలు, పనులే సంతోషాన్ని కలిగిస్తాయి. ‘నువ్వు సంతోషంగా ఉంటేనే ఇతరులకు సంతోషాన్ని పంచగలవని’
అంటాడు రూజ్‌వెల్ట్. ‘మనుషులు తమ కోసం తాము కోరుకునే ఒకే ఒక్క అంశం సంతోషం మాత్రమే’ అంటూ చక్కగా నిర్వచించాడు అరిస్టాటిల్ మహాశయుడు. అసలు సంతోషం అనగానే భవిష్యత్తులో దొరికే వస్తువుగా చాలామంది భావిస్తారు. కలలు కంటారు. ఇలా చేస్తే ఇంత సంతోషంగా ఉండొచ్చని అనుకుంటారు. కానీ సంతోషాన్ని రోజువారీ జీవితంలో కూడా అనుభవించాలని సూచిస్తున్నారు మానసికవేత్తలు. ఒక్క నిముషం మీకోసం ఇలా ఆలోచిస్తే రోజూ సంతోషాన్ని పొందొచ్చని సెలవిస్తున్నారు.
సంతోషమే సగం బలం అనే నానుడి అందరికీ తెలిసిందే. అవసరాలకు తగినంత డబ్బు, ఆరోగ్యం, జీవనభద్రత లాంటివి మనుషుల ఆనందానికి తోడ్పడతాయి. అసలు సంతోషం అంటే ఏంటి అనే విషయంపై శాస్త్రవేత్తలు దశాబ్దాలుగా పరిశోధనలు సాగిస్తూనే ఉన్నారు.
ప్రపంచవ్యాప్తంగా సంతోషం ఏ స్థాయిలో ఉందో తెలుసుకోవడానికి ఐక్యరాజ్య సమితి 2012 నుంచి ప్రతి సంవత్సరం ‘వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్’ విడుదల చేస్తోంది. దేశ జనాభాలో అత్యధికులు సంతోషంగా లేరనే వాస్తవాన్ని ఇప్పటివరకు వచ్చిన రిపోర్టులు చెబుతూనే ఉన్నాయి.
సంతోషంతో లాభాలెన్నో: ఆధ్యాత్మిక చింతన, కుటుంబీకుల మధ్య సఖ్యత, వారి ఆదరాభిమానాలు, ఇతరులపై సానుకూల దృక్పథం, సాయపడే ధోరణి, ప్రియమైన సంభాషణలు, కృతజ్ఞతా భావం, మంచి అలవాట్లను కలిగివుండటం …ఇవన్నీ నిత్యజీవితంలో సంతోషాన్ని కలిగించే అంశాలంటున్నారు నిపుణులు. ఎప్పుడో అమావాస్యకో పౌర్ణమికో కాకుండా నిత్యం ఇలా చిన్నచిన్నవిషయాల వల్ల సంతోషాన్ని కలిగి ఉండటం వల్ల ఎన్నో లాభాలు కూడా ఉన్నాయంటున్నారు మానసికనిపుణులు. సంతోషమే సగం బలం అన్నట్లుగా ఆనందంగా ఉండటం వల్ల
*రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
*చిన్నచిన్న బాధలు, సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది.
* చేసే పనిలో మెరుగుదల కనిపిస్తుంది.
* ముసలితనం దరిచేరదు.
*మానసిక స్థైర్యం, ఆత్మవిశ్వాసం పెరుగుతాయి.
* సామాజిక సంబంధాలు మెరుగుపడతాయి.
మత విశ్వాసాలు లేని వాళ్లతో పోలిస్తే, మత విశ్వాసాలు ఉన్న వాళ్లే ఎక్కువ సంతోషంగా ఉంటున్నట్లు ‘వరల్డ్ వాల్యూ సర్వే’ నివేదిక వెల్లడించింది. అంతర్జాతీ య నిపుణులు 1981నుంచి 2014 వరకు సుదీర్ఘకాలం నిర్వహించిన నివేదిక ప్రకారం యవ్వనంలో ఆరోగ్యంగా ఉన్నవాళ్లు, పరిమితమైన ఆకాంక్షలు కలిగిన వాళ్లు, పనికి తగిన ప్రతిఫలం పొందుతున్న వాళ్లు, చేస్తున్న పనిలో సంతృప్తి పొందుతున్న వాళ్లు, వైవాహిక బంధంలో ఉన్నవాళ్లు, ఆత్మగౌరవం నిలుపుకునే వాళ్లు, జీవితం పట్ల ఆశావహ దృక్పథం ఉన్న వాళ్లు సంతోషంగా ఉంటున్నట్లు తేలింది.
ప్రపంచ సంతోష సూచిక 2019: ఈ సూచికను యునైటెడ్ నేషన్స్ సస్టెయినబుల్ డెవలప్‌మెంట్ సొల్యూషన్స్ నెట్‌వర్క్ ప్రతి ఏడాది మార్చి 20న విడుదల చేస్తుంది. 156 దేశాలకు ర్యాకింగ్ ఇస్తారు. రిపోర్టును తయారు చేయడానికి ఆదాయం, స్వతంత్రాన్ని, నమ్మకాన్ని, ఆరోగ్యకరమైన జీవితాన్ని, సామాజిక మద్దతుని, ఔదార్యాన్ని పరిగణనలోకి తీసుకుంటారు. అయితే ఈ ఆరింటిని ప్రకారం మొదటి 5స్థానాల్లో ఫిన్‌లాండ్, డెన్మార్క్, నార్వే, ఐస్‌లాండ్, నెదార్లాండ్. ఫిన్‌లాండ్ 2018, 19 కూడా రెండుసార్లు మొదటి స్థానంలో ఉంది. భారతదేశం ర్యాకింగ్ ఎంతంటే …

2018లో భారత్ 1౩౩వ స్థానంలో నిలవగా, 2019లో 140కు పడిపోయింది. 2019లోని మొదటి పదిస్థానాల్లో ఈసారి కూడా అగ్రరాజ్యలేవీ చోటు దక్కించుకోకపోవడం గమనార్హం. ఈ జాబితాలో అమెరికా 19వ స్థానంలోను, బ్రిటన్ 15వ స్థానంలోను నిలిచాయి. అత్యధిక జనాభా గల చైనా 93, మన పొరుగుదేశాల్లో పాకిస్తాన్ 67 వ స్థానంలోను, బంగ్లాదేశ్ 125, శ్రీలంక 116, మయన్మార్ 130వ స్థానాల్లోనూ నిలిచాయి. అత్యంత దుఃఖదాయకమైన దేశాల్లో 156వ దేశంగా దక్షిణ సూడాన్, 155వ స్థానంలో సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్, 154వ స్థానంలో ఆఫ్ఘనిస్తాన్‌లున్నాయి.
మెదడులో జరిగే ఓ చర్యే ఆనందం:
సంతోషాన్ని కలిగించే ఎండార్ఫిన్ వంటి జీవ రసాయనాలు మెదడు నుంచే ఉత్పత్తమవుతుంటాయి. ఆనందాన్ని కలిగించే ఒక రసాయనాన్ని ‘మెకలమ్’ అనే శాస్త్రవేత్త 1902లో కనుగొన్నాడు. దానికి ‘ఆనందమైడ్’ అని పేరు పెట్టారు. ఎన్ ఆరాకిడోనోయల్ డోపమైన్, నలడోయిన్, ఆరాకిడోనోయల్ గ్లిసరాల్, వైరోడమైన్ వంటి రసాయనాలు మెదడులో స్రవిస్తూ ఉంటాయి. ఇతరులకు సాయం చేసినప్పుడు, చేసిన మంచి పనుల వల్ల ప్రశంసలు పొందినప్పుడు, ఏదైనా విజయం సాధించినప్పుడు మెదడులో ఇలాంటి రసాయనాలు స్రవిస్తూ ఉంటాయి. ఇవి సంతోషాన్ని కలిగిస్తాయి. ఇవి కలిగించే ప్రభావాలనే కొన్ని రకాల మొక్కల ఉత్పత్తులు, కృత్రిమ రసాయనాల ద్వారా కూడా పొందొచు. ఇవి ఉత్సాహాన్ని పెంచుతాయి. బాధను తగ్గిస్తాయి. వీటిని ఉపయోగించాక ఆకలి పెరుగుతుంది. మొక్కల ఉత్పత్తులు, రసాయనాల ఔషధాల ద్వారా పొందే ఆనందానుభూతి తాత్కాలికమే. మళ్లీ మళ్లీ అదే ఆనందానుభూతిని పొందాలనుకునేవారు గంజాయి, నల్లమందు వంటి మొక్కల ఉత్పత్తులను, ఓపియాయిడ్స్, ఎండార్ఫిన్స్, డైనార్ఫిన్స్ వంటి కృత్రిమ రసాయన ఔషధాలను తరుచుగా తీసుకుంటూ ఉంటారు. ఇవి తాత్కాలికంగా ఆనందం కలిగించినా, వీటికి బానిసలై దీర్ఘకాలం వాడుతుంటే ఆరోగ్యంపై దుష్ప్రభావాలు చూపిస్తాయి. అకాల మరణానికి దారితీస్తాయి. అందువల్ల తాత్కాలిక ఆనందాన్ని ఇచ్చే కృత్రిమ పద్ధతుల జోలికి పోకుండా సహజసిద్ధంగా సంతోషం పొందాలి.
ఆనందం అంటురోగంలాంటిదే…
* చదువు సంధ్యలు లేనివాళ్లతో పోలిస్తే విద్యావంతులే కొంత ఎక్కువ సంతోషంగా ఉంటారట. చదువుకునేటప్పుడు చదువు తక్షణమే సంతోషం కలిగించకపోయినా, ఆ తర్వాత జీవితంలో సంతోషానికి ఇతోధికంగా దోహదపడుతుందని
‘ఫౌండేషన్స్ ఆఫ్ హెడోనిక్ సైకాలజీ’ అధ్యయనంలో తేలింది.
* డబ్బుతో సంతోషాన్ని కొనలేమని చాలామంది అపోహపడతారు గాని, సంతోషం పొందడానికి డబ్బు కూడా ముఖ్యసాధనం. అయితే డబ్బును ఎలా ఖర్చు చేశామనే దానిపై సంతోషం స్థాయి ఆధారపడి ఉంటుంది. వస్తువులను కొనడానికి డబ్బు వెచ్చించడం కంటే అనుభవాలు పొందడానికి డబ్బు వెచ్చించడం ఎక్కువ సంతోషాన్ని ఇస్తుందని లండన్‌లోని క్వీన్ మేరీ యూనివర్శిటీ నిర్వహించిన అధ్యయనంలో బయటపడింది.
* యూనివర్శిటీ కాలేజ్ లండన్ సైకాలజీ ప్రొఫెసర్ పీటర్ ఫోనగీ చేపట్టిన పరిశోధనల్లో మనుషుల్లోని సంతోషం స్థాయికి జన్యువులు కూడా కీలక పాత్ర పోషిస్తున్నట్లు చెబుతున్నాడు.
* ఆనందం ఆయువును పెంచుతుంది. దిగులుగా రోజులు వెళ్లదీసే వారితో పోలిస్తే, సంతృప్తిగా సంతోషంగా ఉండేవారు ఎకువ కాలం బతుకుతారని కాలిఫోర్నియా అలమెడా కౌంటీలో అమెరికన్ శాస్త్రవేత్తలు దాదాపు మూడు దశాబ్దాల పాటు నిర్వహించిన సుదీర్ఘ పరిశోధనలో వెల్లడైంది. సంతోషంగా ఉండేవాళ్లు సంతోషంగా లేనివారి కంటే దాదాపు పదేళ్ల కాలం ఎక్కువ బతుకుతారని పరిశోధనలు చెబుతున్నాయి.
* ఆనందం కూడా ఆవులింతల్లాగానే ఒకరి నుంచి ఒకరికి అంటుకుంటుంది. మనసు బాగోనప్పుడు ఆనందంగా కాలక్షేపం చేసే ఆత్మీయుల వద్దకు వెళ్లినట్లయితే చాలా మార్పు కనిపిస్తుంది. మనసు తేలిక పడుతుంది. వాళ్ల ఆనందం మీకూ అంటుకుంటుంది. మనసంతా సంతోషంతో నిండిపోతుంది. సంతోషం ఒకరి నుంచి మరొకరికి శరవేగంగా వ్యాపిస్తుందని పదేళ్ల కిందట ‘టైమ్’ మ్యాగ్‌జీన్ నిర్వహించిన అధ్యయనంలో వెల్లడైంది.

రోజువారీ జీవితంలో సంతోషంగా ఉండటం ఎలాగో చెబుతున్నారు మానసిక శాస్త్రవేత్తలు. 1౩ రకాల సులువైన పద్ధతుల ద్వారా జీవితాన్ని ఆనందమయం చేసుకోవచ్చని హెన్రిక్ ఎడ్‌బర్గ్ అనే మానసికవేత్త సెలవిస్తున్నాడు.
* ఒక్క నిముషం చాలు : ఒక్క నిముషం సేపు ప్రశాంతంగా కూర్చోండి. ఆ క్షణం మీకు మీరుగానీ లేదా ఇంట్లో సభ్యులు చేసిన మంచి పనికి మనస్ఫూర్తిగా పొగడండి. లేకుంటే స్నేహితుణ్ణి అభినందించండి. ఈ అనుభూతి మీకు ఎంతో అనుకూలతను కలిగిస్తుంది. రోజంతా సంతోషంగా ఉండేందుకు తోడ్పడుతుంది.
* మీ ఫీలింగ్స్‌ను బయటకు చెప్పండి. పొగిడించుకోవడమే కాదు పొగడటాన్నీ అలవాటు చేసుకోండి. దీనివల్ల ఆ రోజంతా ఒకరిని సంతోషపెట్టినవారం అవుతాం. భావోద్వేగాలు జీవితంలో చాలా ముఖ్యపాత్ర వహిస్తాయని మర్చిపోవద్దు.
* ఇతరులకు సాయంచేయడంలో ఆనందం పొందొచ్చు. సాయం అంటే డబ్బు సాయం మాత్రమే కాదు. ఓ మంచి సలహా కావొచ్చు, పోత్సాహం కావొచ్చు, లేదా ఎదుటివారి ఆవేదనను వినడం కూడా ఓ రకంగా సాయమే.
* మూడు నిముషాలపాటు చిన్నగా నడవండి. అలా చుట్టుపక్కల గమనించుకుంటూ నడవడం కూడా ఓ సంతోషమే. చుట్టూ చిన్నపిల్లల ఆటలనో, పెద్దవాళ్ల మాటలనో.. ఇలా గమనిస్తూ పోతే రోజూ మీరు ఏది మిస్సవుతున్నారో అర్థమౌతుంది.
* ఎదుటివారిని చూసి చిరునవ్వు నవ్వితే సొమ్మేంపోదు. అక్కడి నుంచి కూడా స్వచ్ఛమైన పలకరింపు నవ్వు రూపంలో వస్తుంది. దీంతో రోజంతా సంతోషంగా ఉండే అవకాశం ఉంది. ఇద్దరు మనుషుల్ని కలిపేది నవ్వు కూడా.
* ఇతరుల సంతోషమూ ముఖ్యమే. అవతలి వారి నవ్వును హరించకండి. ఆత్మీయులను గట్టిగా కౌగిలించుకోండి. అప్పుడప్పుడూ చిన్నదైనా సరే ఓ బహుమతిని అందించండి. ప్రియతముల కోసం ఓ మంచి ఆహారాన్ని స్వయంగా వండి పెట్టండి. ప్రేమగా వడ్డించండి.
* ఉదయాన్నే నిద్ర లేవగానే మీలో మీరు ఇలా అనుకోండి. ఈ రోజంతా సంతోషంగా ఉండాలి. అందర్నీ ఉంచాలి. ఆ రోజు కట్టుకునే బట్టలు, తినే తిండి, మిత్రుల పలకరింపు, ఆఫీసులోని వాతావరణం మొత్తం సంతోషంగా ఉండేలా చూసుకోవాలి. ఇలా చేస్తే మీరు మిగతావారికి స్ఫూర్తిగా మారతారు. ఈ ప్రభావం రోగనిరోధక శక్తి పెరగడానికీ తోడ్పడుతుంది.
* ప్రతిరోజూ నీదే. ఎవరో రోజును ఆనందపరుస్తారని ఊహించొద్దు. నీకు నువ్వే బాస్. సంతోషమనే బంతి నీదే. రోజంతా కష్టపడి పనిచేసి సాయంత్రాలు ఎలా మలుచుకోవాలో నిర్ణయించుకోవాలి.
సాయంత్రం ఫ్రెండ్స్‌తో కలిసి పబ్, సినిమా, కాఫీ షాప్‌లాంటి వాటికి వెళ్లడానికి ప్రయత్నించాలి.
* ఉదయాన్నే వ్యాహ్యాళికి వెళ్లండి. దీనివల్ల ఎనర్జీ లెవల్స్ పెరిగి రోజంతా ఉత్సాహంగా ఉంటారు.
* కొత్తవాటిని ఆహ్వానించండి. ఇంతకు ముందు తినని పదర్థాన్ని తినండి. లేదా ఓ కొత్త పాటను, ఆల్బమ్‌ను వినండి. ఓ కొత్త పుస్తకాన్ని లేదా సినిమాను చూడండి. రాని ఆటను నేర్చుకోండి. ఇలా చేయడం వల్ల కొత్త ప్రదేశానికి వెళ్లాల్సివస్తే మీకు అక్కడివేమీ కొత్త గా అనిపించవు. అలవాటు పడటం నేర్చుకున్నట్లే. కొత్తను ఆస్వాదించడమూ ఆనంద కారకమే.
* ఒక్కోసారి మొహమాటాలు కొంపముంచుతాయి. ఒత్తిడి పెంచుతాయి. అందుకనే వీలుకాని వాటికి ‘నో’ చెప్పేయండి.
* లాఫింగ్ బ్రేక్. పని మధ్యలో రెండు నిముషాలు నవ్వేందుకు బ్రేక్ తీసుకోండి. దాన్నే లాఫింగ్ బ్రేక్ అంటారు. ఇందువల్ల ఒత్తిడి నుంచి బయటపడొచ్చు. అందుకనే పని మధ్యలో ఒత్తిడికి గురవుతున్నప్పుడు నవ్వు వచ్చే ఓ చిన్న వీడియో క్లిప్పింగ్ చూడండి. నవ్వండి. అంతే రిలాక్స్ అయిపోతారు. అలాగే ఓ ఆన్‌లైన్ కామిక్‌ని గానీ, స్టాండప్ షోగానీ చూడొచ్చు.
* నీళ్లు తాగండి. ఒత్తిడిగా ఉన్నప్పుడు ఓ గ్లాసు నీళ్లను తాగండి. ఓ పండు తినండి.
* ఓ నిమిషంపాటు నిలబడండి. కళ్లు మూసుకోండి. ఎంత విశ్రాంతిగా ఉంటుందో అనుభవిస్తేగానీ తెలియదు. ఇలా చేస్తే పని చేయడం ఎంతో తేలిక అవుతుంది. ఇవన్నీ ది పాజిటివిటీ బ్లాగ్‌లో హెన్రిక్ ఎడ్‌బర్గ్ చెప్పిన విషయాలు.

International Day of Happiness

మల్లీశ్వరి వారణాసి

Related Articles

- Advertisement -

Latest Articles