Thursday, March 28, 2024

మసక బారుతున్న మోడీ ప్రభ

- Advertisement -
- Advertisement -

International media criticism of Modi

 

కరోనా సెకండ్ వేవ్ సృష్టిస్తున్న విలయానికి నేడు దేశం విలవిలలాడుతోంది. ఇంతకుముందెన్నడు లేని భయానకమైన విపత్తును దేశ ప్రజలు ఎదుర్కొంటున్నారు. ఆసుపత్రులలో రోగులకు పడకలు దొరకని పరిస్థితి, స్మశానాలలో చనిపోయిన వారిని కాల్చటానికి క్యూలైన్లలో ఉంచాల్సిన దీనస్థితి, ఆస్పత్రుల్లో రోగులకు ఆక్సిజన్ దొరకక పడే నానారకాల యాతనలు, మందుల కొరత హృదయాలను కలచి వేస్తున్నాయి. సామూహిక శవ దహనాలతో రోజంతా భూమాత ఎరుపెక్కి పోతోంది. ప్రస్తుతం ప్రపంచంలో నమోదవుతున్న కేసులలో సగాని కంటే ఎక్కువగా భారత్ నుంచి వస్తుండటం, మరణాలు వేల సంఖ్యలో ఉండటం దేశ ప్రజలను మరోవైపు ప్రపంచ దేశాలను ఆందోళన పెడుతున్నది. రెండో దశ కరోనా ముంచుకొచ్చే ప్రమాదం ఉందని గత అక్టోబర్ మాసం నుంచి అంటురోగాల వైద్య నిపుణులు, శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నప్పటికి కేంద్ర ప్రభుత్వం పట్టించుకున్న పాపాన పోలేదు. ప్రజల ఆరోగ్యాన్ని పక్కనపెట్టి ఐదు రాష్ట్రాల ఎన్నికలలో గెలుపే పరమావధిగా భావించి ప్రభుత్వ పెద్దలు, ప్రతిపక్షాలు అడ్డు అదుపులేని ఆడంబరమైన రాజకీయ ర్యాలీలు నిర్వహించి కరోనా ఉత్పాతానికి కారణమయ్యారు.

ఎన్నికల సంఘం తన అధికారాలను పూర్తిగా మరిచి తన ఉనికినే కోల్పోయింది. అనాలోచితంగా కుంభమేళాకు అనుమతి ఇచ్చిన ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ ప్రభుత్వాలు దేశం నలుమూలల వైరస్ వ్యాప్తి చెందటానికి కారణమయ్యాయి. నేడు దేశంలో కరోనా సృష్టిస్తున్న భయోత్పాతానికి అంతర్జాతీయ దేశాలు కలవరపడుతున్నాయి. అంతర్జాతీయ మీడియాలో దేశంలోని ప్రజల దయనీయమైన పరిస్థితులు ప్రధాన వార్తా స్రవంతిలో కథనాలుగా వస్తున్నాయి. భారత్‌లో విజృంభిస్తున్న కరోనా వైఫల్యానికి ప్రధాని మోడీని ప్రధాన కారకుడిగా బోనులో నిలబెడుతున్నాయి. కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల భారత్ కరోనా కూపంగా మారిందని, కొత్త కొత్త కరోనా వేరియంట్లు పుట్టుకొచ్చి ప్రపంచమంతటికీ వ్యాప్తి చెంది ప్రమాదకరంగా పరిణమించే అవకాశం ఉందని అంతర్జాతీయ మీడియా ఆందోళన వ్యక్తం చేస్తోం ది. వాషింగ్టన్ పోస్ట్, న్యూయార్క్ టైమ్స్, ఎబిసి( ఆస్ట్రేలియా), గార్డియన్, ఎకానమిస్ట్, సిడ్నీ మార్నింగ్ హెరాల్డ్, గల్ఫ్ టైమ్స్ వంటి ప్రముఖ మీడియా సంస్థలు దేశంలోని హృదయ విదారక సంఘటనలను, ప్రభుత్వ వైఫల్యాలను ఎలుగెత్తి చాటుతున్నాయి.

భారత్‌లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితి విచారకరమని జాగ్రత్తలు కొనసాగించి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని వాషింగ్టన్ పోస్ట్ వ్యాఖ్యానిస్తే, అతి విశ్వాసం కారణంగానే కరోనాను ఎదుర్కోవడంలో భారత ప్రభుత్వం తడబడిందంటూ, భారత్‌లోని పరిస్థితి ప్రపంచానికి గుణపాఠం కావాలని ది గార్డియన్ తన ఎడిటోరియల్‌లో వ్యాఖ్యానించింది. ప్రభుత్వ తప్పటడుగులు, ప్రజల నిర్లక్ష్యం కరోనా సంక్షోభం తీవ్రమవ్వడానికి కారణమని న్యూయార్క్ టైమ్స్ స్పష్టం చేస్తే, కరోనా నిబంధనలు నిర్లక్ష్యం చేయడమే ప్రస్తుత పరిస్థితికి కారణమని, సరైన చర్యలు తీసుకుంటే ఈ సమస్య వచ్చి ఉండేది కాదని ఎబిసి(ఆస్ట్రేలియా) పేర్కొంది. భారతదేశ మీడియాను మోడీ ప్రభావితం చేశారని అందు కే కరోనా వ్యాప్తికి కారణమైన ఎన్నికలు, లక్షల మంది పాల్గొన్న కుంభమేళా వంటి జాతరపై అంతగా స్పందించ లేదని ప్రపంచంలోని ప్రముఖ పత్రికలు వ్యాఖ్యానించాయి. వివిధ దేశాల బిజీ పర్యటనల తో విదేశీ మీడియాను ఆకర్షించే ప్రధాని నరేంద్ర మోడీ పై అంతర్జాతీయ మీడియా నుంచి ఇంత తీవ్రస్థాయిలో ఘాటైన విమర్శలు రావడం ఇదే తొలిసారి. భారత్‌లో కరోనా సెకండ్ వేవ్ లో మోడీ కొట్టుకుపోయారని లండన్ నుంచి వెలువడే టైమ్స్ పత్రిక వ్యాఖ్యానించింది.

కరోనా సెకండ్ వేవ్ ముంచుకు వచ్చే అవకాశం ఉందని అంటురోగాల నిపుణులు చేసిన హెచ్చరికల ప్రాతిపదికగా పలు దేశాలు దాన్ని ఎదుర్కోవడానికి యుద్ధ ప్రాతిపదికపై ఏర్పాట్లు చేసుకున్నాయి. కరోనా సెకండ్ వేవ్‌కు ముందే దాని వ్యాప్తి నిరోధానికి కేంద్ర ప్రభుత్వానికి సరిపోయినంత సమయం ఉన్నప్పటికీ దాని నివారణకు సన్నద్ధం కావాల్సింది పోయి ఐదు రాష్ట్రాల ఎన్నికలు, ప్రచార ర్యాలీలు, రాజకీయ వ్యూహాలు, పార్టీ ఫిరాయింపులు, ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన ప్రభుత్వాలను పడగొట్టడం లాంటి కార్యక్రమాలకు ప్రాధాన్యతనిచ్చి వాటి ద్వారా కరోనా వ్యాప్తికి కారకులై ప్రజల ఆరోగ్యాన్ని ప్రమాదంలోకి నెట్టేశారు. దేశంలో మార్చి 27న ప్రారంభమైన 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు సుదీర్ఘంగా కొనసాగి ఏప్రిల్ 29న ఎనిమిదవ దశతో ముగియడంతో వైరస్ విజృంభించింది. తమిళనాడు, కేరళ, పుదుచ్చేరిలకు ఒకే విడతలో పోలింగ్ జరగగా అసోంకు మూడు విడతల్లో, పశ్చిమ బెంగాల్‌కు ఎనిమిది విడతలలో సుదీర్ఘంగా ఎన్నికలు జరిగాయి.

ఆయా రాష్ట్రాల్లో ఎన్నికల షెడ్యూల్ ప్రారంభంలో పదుల సంఖ్యలో ఉన్న కరోనా కేసులు ఎన్నికలు ముగిసేనాటికి వేల సంఖ్యకు, మరణాలు వందల సంఖ్యలో పెరిగిపోవడం దాని వ్యాప్తికి నిదర్శనంగా నిలుస్తోంది. అధికార, ప్రతిపక్షాలు వందలాది ఎన్నికల సభలు పెట్టడం, ప్రచారాలు చేయడంతో పరిస్థితి విషమించి పోయింది. ప్రధాని మోడీ 20, అమిత్ షా 30 వరకు భారీగా జన సమీకరణ చేసిన ర్యాలీలలో పాల్గొనడం, బెంగాల్ లో ఒక సభను ఉద్దేశించి మోడీ మాట్లాడుతూ ఇంత భారీ జన సమూహాన్ని తన జీవితకాలంలో చూడలేదని వ్యాఖ్యానించడం కరోనా ఓ అంటువ్యాధి అనే విషయం మరిచిపోయిన వైనాన్ని తెలియజేస్తోంది. ప్రజల ప్రాణాలను పణంగా పెట్టి నిర్వహించిన ఎన్నికలపై ఎన్నికల సంఘాన్ని, మద్రాసు హైకోర్టు కడిగిపారేసింది. ఎన్నికల కమిషన్ పై మర్డర్ కేసు పెడితే సరిపోతుందని, దేశంలో సెకండ్ వేవ్ ప్రబలడానికి మీరే కారణమంటూ మద్రాస్ హైకోర్టు తీవ్ర స్వరం వినిపించడం పరిస్థితికి అద్దం పడుతోంది.

గత ఏడాది మార్చి నెలాఖరులో ఢిల్లీలోని నిజాముద్దీన్ మర్కజ్ లో జరిగిన తబ్లిగీ జమాత్ ప్రార్ధనలలో దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రతినిధులు పాల్గొనడం వారు స్వస్థలాలకు వెళ్లడం వలన కరోనా వేగంగా వ్యాప్తి చెందిందని చెప్పిన ప్రభుత్వం దాన్నో గుణపాఠంగా తీసుకోవాల్సింది పోయి ఏప్రిల్ 1నుంచి కరోనా నిబంధనలను గాలికొదిలేసి కేంద్రం, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ ప్రభుత్వాలు కుంభమేళాకు అనుమతి ఇవ్వడం, లక్షల సంఖ్యలో దేశం నలుమూలల నుంచి భక్తులు రావడం గంగానదిలో పుణ్య స్నానాలు, పూజలు చేసి తిరిగి సొంత ప్రదేశాలకు వెళ్లడంతో వైరస్ వ్యాప్తి చెంది పరిస్థితి విషమించి పోయింది. తబ్లీగ్ జమాత్ సమావేశాల వలన కరోనా వ్యాప్తి చెందిన విషయాన్ని ప్రచారం చేసి గగ్గోలు పెట్టిన కొన్ని మీడి యా సంస్థలు కుంభమేళాలో జరిగిన కరోనా విస్ఫోటనం గూర్చి నిమ్మకు నీరెత్తినట్లుగా ప్రవర్తించాయని విమర్శలు వస్తున్నాయి. కుంభమేళాలో ఓవైపు కరోనా వ్యాప్తి చెందుతుంటే, మరోవైపు ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి గంగానదిలో స్నానం చేయటం ద్వారా పాపాల ప్రక్షాళన జరుగుతుందని ప్రకటించడం విడ్డూరంగా కనబడుతోంది.

దేశంలో కరోనా వ్యాక్సినేషన్ పై కేంద్ర ప్రభుత్వానికి దూరదృష్టి లేకపోవడం, ప్రణాళికాలోపం, అవసరమయ్యే వ్యాక్సిన్లు, సంస్థల ఉత్పత్తి సామర్థ్యం మొదలగు వాటిపై అవగాహన లోపంతో దేశంలో టీకాల కొరతతో కార్యక్రమం నత్తనడకన సాగుతోందని పలువురు అభిప్రాయపడుతున్నారు. జనవరి 16 న ప్రారంభమైన కరోనా వ్యాక్సిన్ పై ప్రజల్లో అవగాహన కల్పించకపోవడంతో టీకా వేసుకోవడానికి ఎవరూ ముందుకు రాలేదు. దాదాపు రెండు నెలల వరకు వ్యాక్సినేషన్ నత్తనడకన సాగింది. దేశంలో కరోనా కేసులు పెరగటం, ఏప్రిల్ 1 నుంచి 45 ఏళ్లు పైబడిన వారందరికీ టీకా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించడంతో టీకా కేంద్రాల వద్ద రద్దీ ఏర్పడింది. డిమాండ్ కు తగ్గట్టుగా టీకాలు దొరకని పరిస్థితితో ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాలలో ప్రజలు పడిగాపులు కాస్తున్నారు. మే 1 నుంచి 18 సంవత్సరాలు పైబడిన వారికి టీకా వేయడానికి ఇప్పటికే రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభించడంతో పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది.

సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా, భారత్ బయోటెక్ కంపెనీలకు ప్రభుత్వం తమకు ఎన్ని టీకాలు కావాలో ముందే చెప్పలేకపోవడం, కావాల్సిన ఆర్డర్లు ఇవ్వటంలో జరిగిన జాప్యంతో వేరే దేశాలకు వ్యాక్సిన్ ఎగుమతి చేసే స్థాయి నుంచి విదేశీ వ్యాక్సిన్లను దిగుమతి చేసుకునే స్థాయికి పరిస్థితి దిగజారింది. మొదట్లో విదేశీ కంపెనీలు అత్యవసర వినియోగం కోసం కేంద్రానికి దరఖాస్తు చేసుకుంటే అనేక నిబంధనలతో అనుమతి ఇవ్వని ప్రభుత్వం ప్రస్తుతం టీకాలకు కొరత ఏర్పడడంతో చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లు నిబంధనలు సడలించి ఫైజర్, మోడెర్నా జాన్సన్ అండ్ జాన్సన్, కంపెనీలకు అనుమతులు ఇస్తామని ప్రకటించి, తాజాగా స్పుత్నిక్ టీకాకు అనుమతి ఇవ్వడం జరిగింది. దేశంలోని వ్యాక్సిన్ కంపెనీలు ధరలు నిర్ణయించడంలో ఇష్టాను రీతిగా ప్రవర్తిస్తున్నాయని రాష్ట్ర ప్రభుత్వాలు మండిపడుతున్నాయి.

పూటకో రేటు మార్చుతూ వివిధ రాష్ట్ర ప్రభుత్వాలను గందరగోళంలో పడేస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వానికి రూ. 150, రాష్ట్ర ప్రభుత్వాలకు రూ. 300 నుంచి 400, ప్రైవేటుకు రూ. 600 నుంచి 1200 వరకు అందజేస్తామని బహుళ విధానాలను సీరం, బయోటెక్ కంపెనీలు ప్రకటిస్తుంటే కేంద్ర ప్రభుత్వం చోద్యం చూస్తోంది. కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వాలకు ఇచ్చే ధరల వ్యత్యాసంతో స్థూలంగా రూ. 30 -40 వేల కోట్ల రూపాయల తేడా వస్తుందని, ఈ భారాన్ని దేశం ఎందుకు మోయాలని సుప్రీంకోర్టు తాజాగా ఆక్షేపించడం, 100% టీకాలను కేంద్రమే కొని రాష్ట్రాలకు ఇవ్వకూడదా అని ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించింది. దేశంలో మెడికల్ ఆక్సిజన్ కొరత ఏర్పడి వేలకొలది మరణాలు సంభవిస్తుంటే మేల్కొన్న ప్రభుత్వం 551 ఆక్సిజన్ ఉత్పత్తి ప్లాంట్లను దేశ వ్యాప్తంగా జిల్లా కేంద్రాల్లో గల ప్రభుత్వాసుపత్రుల్లో ఏర్పాటు చేస్తామని ప్రధాని మోడీ ప్రకటించారు. గతేడాది మార్చి మాసంలో కరోనా అంటువ్యాధిగా నిర్ధారించబడిన తరువాత ఆక్సిజన్ ప్లాంట్ల ఏర్పాటు విషయంలో ప్రభుత్వం సెప్టెంబర్ మాసం వరకు ఎలాంటి చర్యలు చేపట్టలేదు.

భారత ఆరోగ్య మంత్రిత్వ శాఖ పరిధిలోని సెంట్రల్ మెడికల్ సర్వీసెస్ సొసైటీ అక్టోబర్ 21న 163 మెడికల్ ఆక్సిజన్ ప్లాంట్ల ఏర్పాటుకు రూ 201.5 కోట్ల రూపాయల ఖర్చుతో టెండర్లు పిలిచింది. వాటి నిర్మాణం విషయంలో అలసత్వం, ముందస్తు ప్రణాళిక లేకపోవడంతో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా పరిస్థితి తయారైంది. మే మాసాంతం నాటికి నాటికి 80 ప్లాంట్ల నిర్మాణం పూర్తి చేయనున్నట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. అక్టోబర్‌లో టెండర్లు పిలిచిన 163 ఆక్సిజన్ ప్లాంట్ల నిర్మాణం వేగంగా జరిగి ఉంటే ఇన్ని ప్రాణాలు నేడు గాల్లో కలిసేవి కావు. ఫిబ్రవరి 21వ తేదీన భారతీయ జనతా పార్టీ ఓ తీర్మానం ద్వారా కరోనాను దేశంలో అంతమొందించినందుకు మోడీని అభినందించడం, మార్చి మాసంలో కేంద్ర ఆరోగ్య మంత్రి కరోనా లేదని ప్రకటించటంతో ప్రజలలో నిర్లక్ష్యం ఏర్పడింది. కరోనా పట్ల ప్రభు త్వం ప్రదర్శించిన ఉదాసీనత, ముందస్తు నివారణ చర్యలు చేపట్టకపోవడంతో నేడు దేశం మూల్యం చెల్లించుకుంటోంది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News