Home బిజినెస్ ‘బేర్’ పట్టు బిగిస్తోంది!

‘బేర్’ పట్టు బిగిస్తోంది!

bsnss

 ఇన్వెస్టర్లూ… జాగ్రత్త
 ఈక్విటీలపై అంతర్జాతీయ అమ్మకాల ఒత్తిడి
 ఈ వారం కూడా అప్రమత్తంగా ఉండాలి
 హెచ్చరిస్తున్న ఆర్థిక నిపుణులు

న్యూఢిల్లీ: కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత రోజు నుంచి దేశీయ స్టాక్ మార్కెట్లు ఆందోళనలో వున్నాయి. లాంగ్ టర్మ్ గెయిన్ పన్నుతో పాటు అంతర్జాతీయంగా అమెరికా స్టాక్ ఎక్సేంజీల భారీ పతనం దేశీయంగా తీవ్ర ప్రభావం చూపుతోంది. ఫిబ్రవరి 1 నుంచి చూస్తే బాంబే స్టాక్ ఎక్సేంజ్(బిఎస్‌ఇ) 1900 పాయింట్లు పతనం కాగా.. నేషనల్ స్టాక్ ఎక్సేంజ్(ఎన్‌ఎస్‌ఇ) నిఫ్టీ 50 దాదాపు 500 పాయింట్లు పడిపోయింది. సెక్యూరిటీ మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ చైర్మన్ అజయ్ త్యాగీ చెప్పిన ప్రకారం, అంతర్జాతీయ అంశాల వల్ల దేశీయ మార్కెట్ల ఒడిదుడుకులు మరికొంత కాలం కొనసాగవచ్చని అన్నారు. అయితే ఈ అమ్మకాల ఒత్తిడితో ఆందోళన చెందొద్దని, భారత్ తగిన రిస్క్ మేనేజ్‌మెంట్ వ్యవస్థను కలిగి ఉందని అభయమిచ్చారు.
మరోవైపు అంతర్జాతీయ స్టాక్‌మార్కెట్లలో ఒడిదుడుకులు, స్థూల ఆర్థిక గణాంకాలు ఈవారం కూడా దేశీయ ఈక్విటీ మార్కెట్లపై ప్రభావం చూపనున్నాయని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. అలాగే కంపెనీల క్యూ3 ఫలితాలు, క్రూడ్ ఆయిల్ ధరల హెచ్చుతగ్గులు, విదేశీ నిధుల ప్రవాహం, డాలర్‌తో పోలిస్తే రూపాయి కదలికలు కూడా మార్కెట్‌ను శాసిస్తాయని, ఈ అంశాలను కూడా గమనించాలని వారు సూచిస్తున్నారు. ‘ఈ వారం ఇన్వెస్టర్లు.. క్యూ3 ఫలితాలు, స్థూల డేటా, అంతర్జాతీయ అంశాలపై దృష్టి పెట్టాలి’ అని డేల్టా గ్లోబల్ పాట్నర్స్ వ్యవస్థాపకుడు దేవేంద్ర నెవ్గి అన్నారు. గ్లోబల్ మార్కెట్లు ఇప్పటికీ అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయని, వీటి ప్రభావం భారత్ మార్కెట్లను తాకనుందని తెలిపారు. ఎఫ్‌పిఐ(విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు) నికర అమ్మకందారులు, దేశీయ ఇన్వెస్టర్ల నుంచి మద్దతు ఉన్నా.. అంతర్జాతీయంగా ఒడిదుడుకుల పరిస్థితులు మార్కెట్లను వెనక్కి లాగుతాయని ఆయన సూచిస్తున్నారు. గత కొద్ది వారాలుగా గ్లోబల్ మార్కెట్లను చూస్తే భారీగా అమ్మకాలు వెల్లువెత్తగా.. దీంతో భారత్ మార్కెట్లు కూడా రెడ్ మార్క్‌లో పడిపోయాయి. కాగా స్థూల ఆర్థిక గణాంకాలూ, విదేశీ మార్కెట్లలో నెలకొనే పరిస్థితులు వంటి అంశాలే దేశీయ మార్కెట్లను ప్రభావితం చేయనున్నాయి. ఫెడరల్ రిజర్వ్ సహా పలు దేశాల కేంద్ర బ్యాంకులు వడ్డీ రేట్ల పెంపు బాటను అనుసరించనున్న అంచనాలతో అంతర్జాతీయంగా స్టాక్ మార్కెట్లు పతనమవుతున్నాయి. అమెరికా మార్కెట్లు గత రెండేళ్లలో ఎప్పుడూ లేనివిధంగా గతవారం 5 శాతం కుప్పకూలాయి. దీంతో బేర్ దశలోకి ప్రవేశించినట్లు పలువురు నిపుణులు పేర్కొంటున్నారు.
నిఫ్టీ 10,300 దిగువకు పడిపోనుందా?
అత్యధిక వాల్యుయేషన్, అంతర్జాతీయ పరిణామాలు వెరసి సూచీలు కరెక్షన్ బాటపట్టాయి. జనవరి 29నాడు నిఫ్టీ జీవితకాల గరిష్టస్థాయి 11,171 పాయింట్ల స్థాయిని చేరగా.. పలు అంశాలను పరిగణలోనికి తీసుకుంటే ఈస్థాయి అత్యంత కీలకమైన టెక్నికల్ అంశమని హెచ్‌డిఎఫ్‌సి సెక్యూరిటీస్ టెక్నికల్ రీసెర్చ్ అనలిస్ట్ నాగరాజ్ షెట్టి తెలిపారు. ఈ స్థాయినే టాప్‌గా భావిస్తే వచ్చే వారంలో నిఫ్టీ 10,276 పాయింట్ల స్థాయికి పడిపోతుందని భావించవచ్చని విశ్లేషిస్తున్నారు. నిఫ్టీకి 10,400 పాయింట్ల వద్ద సపోర్ట్ ఉన్నప్పటికీ.. ఇక్కడ నిలబడడం కష్టంగానే కనబడుతుందన్న ఆయన చార్టులు పతనాన్నే సూచిస్తున్నాయని పేర్కొన్నారు. ట్రేడర్లు స్టాప్‌లాస్‌లు నిర్వహిస్తు ట్రేడింగ్ చేయడం ఉత్తమమైన నిర్ణయంగా సూచించారు. మరీ ముఖ్యంగా మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్‌లలో పతనం ఎక్కువగా ఉంటుందని సూచించారు. ఇది కేవలం హెచ్‌డిఎఫ్‌సి సెక్యూరిటీస్ టెక్నికల్ రీసెర్చ్ అనలిస్ట్ నాగరాజ్ షెట్టి అభిప్రాయం మాత్రమే. ఇన్వెస్టర్లు ఏదైనా నిర్ణయం తీసుకోవాడనికి ముందు సలహాదారులనుతమ సొంత అధ్యయనం తరువాత మాత్రమే తుది నిర్ణయం తీసుకోవడం మంచిది.

ద్రవ్యోల్బణం ఎలా ఉండనుంది?

bsns

సోమవారం(12న) దేశీయ ద్రవ్యోల్బణం గణాంకాలు వెలువడనున్నాయి. జనవరి నెలకు గాను సిపిఐ(వినియోగ ధరల సూచీ) ఆధారిత ద్రవ్యోల్బణం గణాంకాలను ప్రభుత్వం విడుదల చేయనుంది. ఇదే రోజు డిసెంబర్ నెలలో పారిశ్రామికోత్పత్తి ప్రగతి(ఐఐపి) వివరాలను కూడా వెల్లడించనుంది. 2017 డిసెంబర్‌లో సిపిఐ 5.21 శాతం పెరిగింది. ఇక నవంబర్‌లో ఐఐపి 8.4 శాతం పురోగమించింది. అలాగే ఈనెల 14వ తేదీనాడు జనవరికి టోకు ధరల సూచీ(డబ్లూపిఐ) ఆధారిత ద్రవ్యోల్బణం గణాంకాలను ప్రభుత్వం విడుదల చేయనుంది. 2017 డిసెంబర్‌లో డబ్ల్యూపిఐ 3.58 శాతం పెరగ్గా.. ఇప్పుడు ఎలా ఉండనుందో వేచిచూడాలి. సిపిఐ, ఐఐపి, డబ్లుపిఐ గణాంకాలు తదుపరి ఆర్‌బిఐ పరపతి సమీక్షలపై ప్రభావం చూపనున్నాయి. గత పాలసీ సమీక్షలో యథాతథ రేట్లనే ఆర్‌బిఐ కొనసాగించింది. అయితే వచ్చే సమీక్షల్లో మాత్రం వడ్డీ రేట్ల తగ్గింపు పెంపు ఉండొచ్చనే సంకేతాలను ఇచ్చింది. దీంతో ఇన్వెస్టర్లు ధరల తీరును నిశితంగా గమనించనున్నట్లు నిపుణులు పేర్కొంటున్నారు. ఈ వారం పలు బ్లూచిప్స్ క్యూ3 (అక్టోబర్ -డిసెంబర్) పనితీరును వెల్లడించనున్నాయి. అమరరాజా, కేశోరామ్, కోల్ ఇండియా ఫలితాలు ప్రకటించాయి.
ఈ నెల 12న బ్రిటానియా, బ్యాంక్ ఆఫ్ ఇండియా, గెయిల్ ఫలితాలు ఉంటాయి. 13న ఎన్‌బిసిసి, ఎన్‌ఎండిసి, ఇక 14వ తేదీనాడు గ్రాసిమ్, గోద్రెజ్ ఇండస్ట్రీస్, జెట్ ఎయిర్‌వేస్, నెస్లే, సన్ ఫార్మా, టాటా పవర్ పనితీరును వెల్లడించనున్నాయి.