Monday, November 4, 2024

అంతరాష్ట్ర బైక్‌ల దొంగల అరెస్ట్

- Advertisement -
- Advertisement -

Interstate Gang Arrested in Hyderabad

హైదరాబాద్: ఆటోమోబైల్స్ దొంగతనాలు చేస్తున్న అంతరాష్ట్ర దొంగలను సౌత్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు, సెంట్రల్ జోన్ పోలీసులు అరెస్టు చేశారు. ఆరుగురు నిందితులను అదుపులోకి తీసుకోగా ముగ్గురు పరారీలో ఉన్నారు. వారి వద్ద నుంచి 23మోటార్ సైకిళ్లు, బంగారు ఆభరణాలు, కిలో వెండి వస్తువులు, సిసిటివి డివిఆర్, ల్యాప్‌టాప్, మూడు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ తన కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. కర్నాటక రాష్ట్రం, బీదర్ జిల్లాకు చెందిన వాజిద్, షేక్ సోను అలియాస్ మను, అబ్దుల్ సమీర్ అలియాస్ షోహిబ్, బాబురావు అలియాస్ రాజు, నగరంలోని వట్టేపల్లికి చెందిన ఎండి సమీర్ అలియాస్ షఫత్, కరీంనగర్‌కు చెందిన ఇస్మాయిల్, బీదర్‌కు చెందిన షాహిద్, అమీర్, ఇలియాస్ కలిసి దోపడీలు చేస్తున్నారు. ఇందులో షాహిద్, అమీర్, ఇలియాస్ పరారీలో ఉన్నారు.

వీరిలో ప్రధాన నిందితుడు అబ్దుల్ సమీర్ అలియాస్ షోహిబ్ గతంలో పహాడీషరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన హత్య కేసులో నిందితుడు, మైలార్‌దేవ్‌పల్లి పిఎస్ పరిధిలో రాబరీ, రెండు బైక్‌లను చోరీ చేశాడు. నిందితులు హైదరాబాద్4, సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్‌లో 15, రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 06 నేరాలు చేశారు. పదోతరగతి వరకు చదువుకున్న వాజిద్ ఉపాధి కోసం నగరానికి వచ్చాడు. ఇక్కడి ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగంలో చేరాడు. ఈ సమయంలో మిగతా నిందితులతో పరిచయం ఏర్పడింది. విధులకు సరిగా హాజరు కాకపోవడంతో ఉద్యోగంలో నుంచి తీసివేశారు. అందరు నిందితులు వ్యసనాలకు బానిసగా మారడంతో డబ్బులు సరిపోవడంలేదు. దీంతో దోంగతనాలు చేయాలని ప్లాన్ వేశారు. వాజిద్, సోను, షోహిబ్, షఫత్ కలిసి 26 దొంగతనాలు చేశారు. కేసులు నమోదు కావడంతో పోలీసులు నిందితులపై నిఘా పెట్టి అరెస్టు చేశారు. విలేకరుల సమావేశంలో జాయింట్ సిపి విశ్వప్రసాద్, ఎడిసిపి చక్రవర్తి గుమ్మి, ఎసిపి వెంకట్ రెడ్డి, ఇన్స్‌స్పెక్టర్ అంజయ్య, రాఘవేంద్ర తదితరులు పాల్గొన్నారు.

లాడ్జీల్లో బస…

నిందితులు దొంగతనాలు చేసే ముందు స్థానికంగా ఉన్న తక్కువ డబ్బులు చెల్లించే లాడ్జీల్లో దిగేవారు. నగర శివార్లలోని ప్రాంతాల్లో రెక్కీ నిర్వహించి చోరీలు చేస్తున్నారు. లాక్ వేసి ఉన్న బైక్‌లు రాయల్ ఎన్‌ఫీల్డ్, బజాజ్ పల్సర్, హోండా యాక్టివా, యమహా తదితర బైక్‌లను చోరీలు చేస్తున్నారు. దొంగతనం చేసిన బైక్‌లను కరీంనగర్, బీదర్, నిజామాబాద్ తదితర ప్రాంతాల్లో విక్రయించేవారు. అంతేకాకుండా బైక్‌లను రూ.15,000, 30,000కు కుదువ బెట్టేవారు.

Interstate Gang Arrested in Hyderabad

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News