Thursday, April 25, 2024

స్వశక్తితో జీవిస్తేనే ఆడవారికి గౌరవం

- Advertisement -
- Advertisement -

Interview With author Marxist genius Ranganayakamma

 

సుప్రసిద్ధ రచయిత్రి మార్కిస్టు మేధావి రంగనాయకమ్మతో వివిధ సామాజిక అంశాల మీద సీనియర్ జర్నలిస్టు గోవిందరాజు చక్రధర్ ముఖాముఖిలోని కొన్ని ప్రశ్నలకు ఆమె ఇచ్చిన సమాధానాలు

ప్రశ్న: ఇప్పుడున్న స్వేచ్ఛా వాణిజ్య ప్రపంచంతో మార్క్సిజానికి ఉన్న సంబంధం ఏమిటి?

జవాబు: ‘స్వేచ్ఛా వాణిజ్యం‘ అన్నది, శ్రామిక వర్గపు ’శ్రమని’ దోస్తూ, స్వంత శ్రమ లేకుండా జీవించే మార్గం. ఈ స్వేచ్ఛ దోపిడీకి. ఈ వాణిజ్యంతో మార్క్సిజానికి వున్న సంబంధం ఏమిటా? ఆ వాణిజ్యాన్ని తీసి పారేసి, సమాజంలో వున్న ప్రతీ మనిషీ, తన బ్రతుకు దెరువు కోసం, స్వంత శ్రమ చేసి తీరాలి అని వివరించే సంబంధం.

ప్ర: ‘వ్యక్తి’ నుంచి ‘రాజ్య వ్యవస్థల’ దాకా అణచివేతలు నిరా ఘాటంగా కొనసాగుతున్నాయి. వ్యక్తిగా ఇంట్లో స్త్రీలను అణ చివేస్తారు. బయట ప్రశ్నించే గొంతులను ప్రభుత్వాలూ, వారి పోలీసు యంత్రాంగామూ అణచివేస్తుంది. వీటి మూలాలు ఏమిటి? అసలు సిసలు ప్రజావాది విలసిల్లేదెపుడు?

జ: అణచివేతలు దేనికి సంకేతం – అంటే, అసమానత్వానికే సంకేతం కదా? అణచివేతల మూలాలు ఎక్కడా – అంటే, ‘శ్రమ దోపిడీ’లో! – వీటిని ఇలా ఇంత క్లుప్తంగా చెప్పుకుంటే సరిపోదు. మానవ చరిత్రని చూస్తే, రాజ్య వ్యవస్త అనేది లేని దశ ఒకటి వుండేదని గ్రహించగలం. ఎప్పుడైతే బానిస సమాజం ఏర్పడ్డం మొదలైందో, దాని కోసం రాజ్య వ్యవస్త కూడా మొదలైంది. బానిసల శ్రమని దోచడానికీ, దోపిడీ పీడనలకి వ్యతిరేకంగా తిరగబాటు చేసే బానిసల్ని అణచడానికీ, సాయుధులైన రక్షక భటులు అవసరం అయ్యారు. అదే, రాజ్య వ్యవస్తగా తయారైంది. ఈ నాడు తిరగబాటు చేసే కార్మికుల్ని అణిచివుంచేది, పెట్టుబడిదారీ వర్గం ఏర్పర్చుకున్న రాజ్య వ్యవస్తే. కాకపోతే, పూర్వ కాలంలో లేనివి కోర్టులూ, రాత రూపంలో వున చట్టాలూ, గవర్నమెంటు ఆఫీసులూ వంటివి, ఈ రాజ్యాంగం లో వచ్చాయి. గూఢచార వ్యవస్తా, సైన్యమూ వంటివి, అప్పుడూ వున్నవే; అవి ఇప్పుడూ వున్నాయి. ‘రాజ్య వ్యవస్త’ అనేది, ఒక వర్గం ఇంకో వర్గాన్ని అణిచి వుంచడానికి, అణిచే పాలక వర్గం చేతిలో వుండే పనిముట్టు అని మారక్స్ – ఎంగెల్సులు వివరించారు. వర్గాలున్నంత వరకూ ‘రాజ్య వ్యవస్త’ వుంటూనే వుంటుంది.
ఇకపోతే, వ్యక్తుల స్తాయిలో జరిగే అణచివేతలు కూడా దోపిడీ సమాజంలో వున్న అసమానతల వల్లే, ఆ భావాల వల్లే, వీలవుతుంది. ఇంట్లో స్త్రీలని అణిచి వేస్తారన్నారు. ఇది కూడా, స్త్రీ – పురుష అసమానత్వం వల్ల జరిగేదే. పోలీసు యంత్రాంగం చేసే అణచివేత, రాజ్య వ్యవస్త పనుల్లో ఒకటి. సైనికులు అనే వాళ్ళు ‘తప్పుడు సామాజిక సంబంధాల వల్లా; సామాజిక రుగ్మతల వల్లా‘ అవసరం అవుతారంటాడు మార్క్సు.
మీరు అడిగే ’అసలు సిసలు ప్రజావాది విలసిల్లేది’ వర్గాలు లేని సమాజంలోనే. అంటే, సమాజంలో ప్రతీ ఒక్కరూ (చిన్న పిల్లలూ, వృద్ధులూ, రోగులూ, శారీరక ఇబ్బందులు వున్న వారూ తప్ప) శ్రమ చేస్తూ, శ్రమ సాధనాల్ని సమిష్టిగా ఉప యోగిస్తూ నడిచే సమాజంలో అణచివేతకి అవసరం వుండదు.

ప్ర: కమ్యూనిస్టు చైనా నుంచి, ఇస్లాం దేశాల వరకూ పలు రకాల అణచివేతలు; స్త్రీలపై ఆంక్షలు, ఇప్పటికీ కొనసాగు తున్నాయి. ఇవన్నీ నాగరిక ప్రపంచానికి గౌరవప్రదమేనా?

జ: కమ్యూనిస్టు దేశాల్లో కూడా రక రకాల అణిచివేతలు సాగుతున్నాయని తెలుస్తున్నాయి; అది నాగరిక ప్రపంచమేనా? – అన్నారు మీరు. ’కమ్యూనిస్టు దేశాలు’ అనేవి, ఈ నాడు లేవు. ఆ నాడైనా, ఆ దేశాలు పూర్తిగా ఏర్పడి పోయినవి కావు. అవి, ఆ నాడు మొదటి అడుగులు వేశాయి. పాత రాచరిక ప్రభుత్వాల్ని తిరస్కరించి, ఆ అధికారం తీసుకోగలిగాయి. ఆ తర్వాత, భూస్వాముల ఆధీనంలో వున్న భూమిని స్వాధీనం చేసుకున్నాయి. దాని తర్వాత జరగ వలిసిన విప్లవకరమైన మార్పులు అనేకం వుంటాయి. అవి, జరగనే లేదు. ఎందుకు జరగలేదు – అనే ప్రశ్నకి, అక్కడ శ్రామిక వర్గం ఇంకా ’అమాయకంగానే’ వుంది – అనడం తప్ప, ఏం జవాబు వుంటుంది? జరగవలిసిన సరియైన మార్పులు జరగ లేదంటే, అది కమ్యూనిస్టు సమాజం ఎలా అవుతుంది? ఇప్పుడున్న రష్యా, చైనాల్ని కమ్యూనిస్టు సమాజాలని ఎవరైనా అంటే కదా, మీరు వాటి గురించి ’అవి గౌరవప్రదమేనా?’ అనవలిసింది?

ప్ర: విద్య, వైద్యం – ఒకటేమిటి, అన్ని రంగాల్లో కార్పొరేట్ దోపిడీ కొనసాగుతోంది. ప్రభుత్వాలు మంచి ఆస్పత్రులు, విద్యాలయాలు నిర్మించి, ప్రజల బాగోగులు పట్టించుకోవెందుకు?

జ: ‘అన్ని రంగాల్లోనూ కార్పొరేట్ దోపిడీ సాగుతోంది’ అన్నారు. ఆ ’దోపిడీ సాగుతోందని’ తెలిసిన వాళ్ళకి, అది ఎందుకు సాగుతోందో తెలియదా? ’దోపిడీ’కి కారణమే తెలియక పోతే, దానికి ’అడ్డుకట్ట’ వుంటుందని తెలుస్తుందా? ఇవి ప్రజా ప్రభుత్వాలు కావు కాబట్టీ, కార్పొరేట్ల బంటు ప్రభుత్వాలు కాబట్టీ, ప్రజల్ని సమస్యల్ని పట్టించుకోవు.

ప్ర: మనం నిజంగా నాగరీకులమేనా? టెక్నాలజీపరంగా దూసుకెళ్తున్నా, కులం, మతం, ప్రాంతం, సంప్రదాయం, ఐడియాలజీ, పరిధి దాటలేక పోతున్నాం. నిజమైన ‘వసుధైక కుటుంబం’ ఎప్పుడు ఏర్పడుతుంది?

జ: ’వసుధైక కుటుంబం’ అంటే, ’వసుధ’ అంతా (భూమి అంతా) ఒకే కుటుంబంగా వుండడం’ – అనే కదా? కులం, మతం, వంటి అనేక తేడాలు పోతే, ప్రపంచ కుటుంబం ఏర్పడుతుందనే అర్ధం మీ ప్రశ్నలో వుంది. నిజంగా అది జరగాల్సిందే. ’వసుధైక కుటుంబం’ అని చెప్పిన వాళ్ళెవరూ, అది ఏర్పడడానికి మార్గంగా ఏదీ చెప్పలేదు. మార్క్సు కన్నా ముందు, ’సోషలిజం, కమ్యూనిజం’ అన్న వాళ్ళు కూడా వున్నారు గానీ, దానికి మార్గాన్ని చెప్పడం వాళ్ళకి సాధ్యం కాలేదు. అందుకే మార్క్సు ’ఈ ప్రపంచం గురించి తత్వ వేత్తలు రక రకాలుగా వ్యాఖ్యానించారు. కానీ, అసలు ప్రశ్న, దాన్ని మార్చడం’ అన్నాడు. ’ఈ ప్రపంచం తల్ల కిందులుగా వుంది. దీన్ని తిన్నగా మార్చాలి’ అని కూడా అన్నాడు. మార్క్సు చెప్పిన సిద్ధాంతం, ’శాస్త్రీయ కమ్యూనిజం’గా ఎందుకు అయిందంటే, ఆ సిద్ధాంతం, ’సమానత్వానికి’ మార్గం చెప్ప గలిగింది కాబట్టి. మానవ సంబంధాల్లో, భేదాలన్నిటినీ ఎప్పటి లాగే వుంచి, దాన్నే ’వసుధైక కుటుంబం’ అంటే, అది అలాంటిది అయిపోదు. ’వసుధైక కుటుంబం’ అనే ఉత్తమ భావం, నిజం కావాలంటే, ’శ్రమ దోపిడీ’ మారడమూ, జనాభాలో ’అసమాన శ్రమ విభజన’ మారడమూ, జరిగితేనే, అది సాధ్యం.

ప్ర: మన వివాహ వ్యవస్థలో రావలసిన మార్పులు, సంస్కరణలు ఏమిటి?

జ: వివాహ వ్యవస్థలో మార్పు లేమిటీ – అనే ప్రశ్న రావడం అంటే, ఆ వ్యవస్తలో లోపాలు వున్నాయి – అనేదే. మొట్ట మొదటగా కనపడే ప్రధానమైన లోపం, ‘వివాహం’ అనగానే ’డబ్బు’ మీద ఆధారపడ్డ సంబంధంగా ఏర్పడడమే. ఆడ పెళ్ళి వాళ్ళు, మొగ పెళ్ళి వాళ్ళకు వున్న ’ఆస్తి’ కోసం చూడడం; అలాగే, అటు వాళ్ళు, వీళ్ళ నించి వచ్చే ’కట్న కానుకల’ కోసం చూడడం! ఇదంతా, ధనికుల కుటుంబాల్లో కాదు; నిరుపేదల కుటుంబాల్లో కూడా ఈ విషయాలే జరుగుతున్నాయి. కొంత చిన్నస్థాయిలో. ఇక, రెండవ లోపంగా ఎంచుకోవలిసింది, భార్యాభర్తలుగా ఏర్పడే యువతీ యువకుల భావాల మధ్య అనేక భేదాలు వుండడం. గత కాలపు ఆధిపత్యాలు ఈ నాడు కొంత మారినట్టు కనపడినా, అది నిజమైన మార్పుగా వుండడం లేదు. ఈ నాటికీ, భార్యాభర్తల మధ్య సామరస్యాలు వుండడం లేదు. ఏ నాడు, ఏ పెత్తనం అయినా నేరమే. అది, శాంతి సుఖాలకు అవరోధమే. వివాహ వ్యవస్థలో లోపాల్ని చట్టాల ద్వారా సరి దిద్దడం సాధ్యం కాదు. భావాల్లోనే లోపాలు వుంటే, ఆ భావాల్ని చట్టాల ద్వారా సరి చెయ్యడం సాధ్యం కాదు. పిల్లల పెంపకంతో ప్రారంభం కావాలంటే, తల్లిదండ్రులకు సాహిత్యం ద్వారా మంచి చెడ్డలు తెలిసి వుండాలి. పిల్లలు పెరిగి పెద్దవుతోన్న కొద్దీ, చదువుల కాలంలో, ఆ పుస్తకాలు, అన్ని రకాల లోపాల్నీ వ్యతిరేకించే భావాల్ని ఇవ్వాలి.

యువతీ యువకులు, పెళ్ళి చూపుల ద్వారా ఒక అర గంట కాలంలో, రక రకాల అబద్దాల సంభాషణలతో, జీవిత సంబంధాల్ని నిర్ణయించు కోవడం, హేతు విరుద్ధ విషయం. ఈ నాడు, అంత కన్నా ఇతర మార్గాలు లేవు. అయినా, గత కాలం కన్నా, ఈ కాలం వివాహాలకు కొంత వరకైనా సరైనదే. ఇది ఇలాగే వుండి పోదు. మానవుల శ్రమ సంబంధాల్లో ప్రధానమైన లోపం వున్నప్పుడు, వివాహ వ్యవస్తలో లోపాలు పోయే మార్గం మరొకటి వుంటుందా? ఉండదు. వుండాలి.

ప్ర: పెళ్ళితో నిమిత్తం లేకుండా సహజీవనం సాధ్యమేనా? సహజీవనానికీ చట్ట పరిమితులు ఉన్నాయి కదా?

జ: ’పెళ్ళి’ అంటే భార్యా భర్తల సంబంధం. పిల్లలకు తల్లిదండ్రుల సంబంధం. ’సహ జీవనం’ అనే దాంట్లో, ఈ సంబంధాలు వుండవు. పిల్లలు పుడతారు గానీ, వాళ్ళ గురించి, తండ్రి బాధ్యతలతో వుండడానికి, ఆ పురుషుడు అంగీకరించడు. మరి ’సహ జీవనం’ ఎందుకు? ’పెళ్ళి’లో వుండే సంబంధాలు, ’సహ జీవనం’లో కూడా వుంటేనే, ’పెళ్ళి’ అనే పేరుని మార్చుకోవచ్చు. అలా లేకపోతే, ’సహ జీవనం’ అనేది, ఇంకేదో అర్ధంతో మాత్రమే వుంటుంది. తాత్కాలిక సంబంధాల కోసమే, శరీరాన్ని అప్పజెప్పుకునే సంబంధం అయితే, ఆడ వాళ్ళకి పిల్లలు వుంటారు. మొగ వాళ్ళకి పిల్లలు వుండరు.

ప్ర: పెళ్ళి చూపుల్లో ఆడ పిల్లలు వరుడి ఉద్యోగం, సంపాదనకే ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇది ఎంత వరకు సహేతుకం?

జ: మీ ప్రశ్నల్లోనే మీ జవాబు వుంది. సంపాదనకే ప్రాధాన్యం ఇచ్చి, ఆ వ్యక్తిని భర్తగా ఇష్ట పడడం అంటే, అది ’సహేతుకం’ అవదని మీరే అంటున్నారు. ఆ ఆడపిల్లకి, డబ్బు గల, పెద్ద వుద్యోగం గల మొగుడు చాలు. అది, ఆమెకి సహేతుకమే.

ప్ర: ఈ మధ్య తెలుగు రాష్ట్రాల్లో విడాకుల సంఖ్య పెరిగింది. ఇది దేనికి సంకేతం? విడాకులకు దారితీస్తున్న అంశాలు ఏమిటి?

జ: విడాకులకు దారి తీసే అంశాలంటారా? డబ్బూ, వ్యభిచారాలూ, అధికారాలూ – ఇటు వంటివే. ఇవి కేవలం పురుషుల వేపు నించే అని కాదు. స్త్రీల వేపు నించి కూడా వుంటాయి. లెక్కలు చూస్తే, స్త్రీల వేపువి, తక్కువగా వుండొచ్చు. ఈ మధ్యనే ఒకావిడ చెప్పింది, వాళ్ళ బంధువుల సంగతి. ఆ ఇంటి కోడలు, అత్త మామల్ని అంగీకరించదట. వాళ్ళు వస్తే, ఒక్క పూట వుండి పోవాలి గానీ, వారం రోజులైనా వుండ కూడదట! ఆ అబ్బాయి, విడాకుల కోసం పెట్టేశాడట!

ప్ర: పెళ్ళి లేకుండా ఒంటరిగా జీవించాలనుకునే వారూ పెరుగుతున్నారు. దీనికి కారణాలు? పర్యవసానాలు?

జ: పెళ్ళి లేకుండా ఒంటరిగా జీవించాలనుకునే వారిలో కొందరు మంచి కారణాలతో వుండొచ్చు; కొందరు చెత్త కారణాలతో. ఒకబ్బాయి, కమ్యూనిస్టు భావాలవాడు. ఆ భావాలతో వున్న ఆడపిల్లలు అతనికి దొరకలేదు. అతను కొంత కా లం దాకా ఒకామెతో శాంతంగా చర్చలు చేయడానికీ, ఆమె కి నేర్పడానికీ, ప్రయత్నించాడు గానీ, సాధ్యం కాలేదు. పెళ్ళి మా టే వదిలేశాడు. కొందరు ఆడ పిల్లలకి ‘నగల పిచ్చి’ బాగా. ఒక అబ్బాయి ఆ పిచ్చి లేని అమ్మాయిల్ని కనిపెట్టలేక పో యాడు. పెళ్ళి లేదు. అతను తాత్కాలిక చెత్త సంబంధాలతో లే డు. ‘పెళ్ళి’ అనేది కొన్ని సమస్యల్ని తీసుకొస్తున్నప్పుడు, దాని వేపు వెళ్ళకూడదనుకుంటున్నారు. కొందరు ఆడా, మొగా, కూడా.

ప్ర: స్త్రీలు, బిడ్డల్ని కనడం, పెంచడం అనే ప్రకృతి ధర్మం, వారికి మంచి చేస్తోందా? చెడు చేస్తోందా?

జ: బిడ్డల్ని కని, పెంచే ప్రకృతి ధర్మం వల్ల ’మంచే’ గానీ, ’చెడ్డ’ ఎలా వుంటుంది? అయితే, ’బిడ్డల పుటక’కు తల్లే కాదు; తండ్రి కూడా వుంటాడు. కాబట్టి, బిడ్డల పెంపకం, కేవలం ’తల్లి బాధ్యత’ గానే గాక, తండ్రి బాధ్యతగా కూడా వుండాలి. పిల్లల పెంపకం బాధ్యత తల్లిదండ్రులది ఇద్దరిదీ అయితే, అది, ఆ ఇద్దరిలో ఎవ్వరికీ ’చెడ్డ’ చేయదు. పెద్ద తరం, చిన్న తరాన్ని పెంచితే, ఆ చిన్న తరం, వృద్ధులైన పెద్ద తరాన్ని క్షేమంగా చూడాలి. ఈ చిన్న తరం, పెద్దదైనప్పుడు, దానికి కూడా అలాగే క్షేమంగా జరగాలి.

ప్ర: చాలా మంది స్త్రీలు/గృహిణులు, పురుషాధిపత్యాన్ని స్వచ్ఛందంగానే ఆమోదిస్తారు. దీనికి కారణాలేమిటి? దాన్నో సేఫ్టీ జోన్ గా పరిగణించడమే ననుకోవచ్చా?

జ: అవును, అదే రక్షణ అనుకోవచ్చు. వేరే పోషణ మార్గం లేకపోతే, అదే రక్షణ అవుతుంది కదా? నా పరిస్తితి కొంత కాలం అలాగే అయింది. ఆ ‘అధికారం’ నించి బైట పడింది, కొంత రక్షణ దొరికి కాదు. అప్పటికి ఆ ‘తెగింపు’ జరిగింది. రాతలు జరుగుతోన్నా, వాటి వల్ల వచ్చే డబ్బేమీ బతకడానికి చాలదు. అదే నిజం, స్త్రీలకి.

ప్ర: జరిగే పనులన్నింటా పురుషులే కనిపిస్తారు. ఇది, స్త్రీలతో నిండిపోయే పరిస్తితి వస్తే ఏయే మార్పులు జరగవచ్చు? మహిళలే క్యాబ్/ఆటో డ్రైవర్లుగా ఉండడం, ఉపాధి అవకా శాలు పెరిగి, ఆఫీసుల్లో ఆడవారి ప్రాబల్యం పెరగడం వంటి పరిణామాలు రావచ్చా? వాటి వల్ల ఆత్మవిశ్వాసం పెరుగు తుందా? పరిస్థితి మెరుగవుతుందా?

జ: ఏ మనిషి అయినా, పురుషుడే కాదు, స్త్రీ అయినా; తన శ్రమతో తను జీవించాలి. స్త్రీల సమస్యలుగా వున్నవి, స్త్రీలవే కాదు; ఆ స్త్రీలతో కలిసి జీవించవలిసిన పురుషులది కూడా కావా? శ్రమలు అనేవి, వ్యక్తిగతంగా కాదు; సమాజానికి అవసరమైన అర్ధంతో, సమిష్టి శ్రమలు గానే వుండాలి. అయితే, స్త్రీ – పురుషుల శారీరక స్తితి గతుల్లో తేడాల్ని బట్టి, శ్రమ కాలాల్లో మార్పులు అవసరం అవుతాయి. గర్భిణీగా వున్న దశలో గానీ, బిడ్డకు పాలిచ్చే బాలెంతగా వున్న దశలో గానీ, ఆ స్త్రీకి కొన్ని రకాల శ్రమల నించి విరామాలు అవసరమే. స్త్రీ పురుషుల రాత్రి పని డ్యూటీలు (నైట్ షిఫ్టు లు), మానవ జీవితాలకే విరుద్ధం. అవి, స్త్రీలకే కాదు; పురుషుల కైనా తగనివే. సైనికులుగా చెయ్యడాలూ, యుద్ధాలూ, పురుషులకు మాత్రం తగినవా? అవి, మానవ జీవితాలకు అత్యవసరాలా? సమానత్వ సమాజాన్నే ఊహిస్తే, మానవ జీవితానికి అవసరం అయిన ఏ శ్రమకైనా, ఏ మనిషి అయినా అర్హులే.

ప్ర: కుటుంబాల్లోనూ, బయటా, ఆడపిల్లల పట్ల వివక్ష కొన సాగుతూనే ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో ఇది మరీ ఎక్కువ. పేదరికంలో పిల్లల్ని చిన్నపుడే పనులకు పంపుతారు తల్లిదం డ్రులు. చదువుకి పంపరు. సమాజపరంగా మన ఆలోచనల్లో రావలసిన మార్పులు ఏమిటి?

జ: ఆడ పిల్లల్ని తక్కువగా చూడడం, స్త్రీ – పురుషుల మధ్య ఈ అసమానత్వం ఏర్పడ్డప్పట్నించీ వున్నట్టే తెలుస్తుంది. ఆ అసమానత్వానికి కారణాలు, అసమాన శ్రమ విభజనా, ’ఆస్తి’ అన దగ్గ విషయంలో పురుషుల ఆధిక్యతా – ఈ కారణాలే కనపడతాయి. పిల్లల్ని చిన్న తనం లోనే పనులకు పంపడానికి కారణం, ఆ తల్లిదండ్రుల పేదరికమే. ధనవంతుల పిల్ల లెవరైనా, చిన్న తనంలో ’కూలి’ పనులకు వెళ్తారా? వాళ్ళు పెద్ద తనం లోనే పెద్ద రకం పనులు చేస్తారు. మన ఆలోచనల్లో ఎటువంటి మార్పులు జరగాలంటే, పేదరికమూ, అసమానత్వాలూ పోవాలనే కదా? ఆ మార్పులు ఏ సిద్ధాంతం వల్ల జరుగుతాయో, అదే కావాలని గ్రహించాలి.

ప్ర: స్త్రీని సెక్స్ సింబల్గా చూసే ధోరణి నుంచి సమాజం ఎప్పుడు ఎదుగుతుంది?

జ: ముఖ్యంగా స్త్రీని ’సెక్స్ సింబల్’గా చూడడం పురుషుల దృష్టే కాదు, స్త్రీల దృష్టి కూడా.స్త్రీలలో, అందాలకోసం ఎంతెంత పిచ్చి చేష్టలు! గుండెల మీదా, వీపుల మీదా, తొడల మీదా, గుడ్డలు తీసేస్తున్నారు. మత గ్రంధాల్లో చూడండి, స్త్రీల గురించిన వర్ణనలు ఎలా వుంటాయో! ఆ గ్రంధాల్ని స్త్రీలు రాసినా, ఆ వర్ణనలు అలాగే వుంటాయి! ’అదంతా మన సంస్కృతి’ అంటారు. అంతే కదా?

ప్ర: స్త్రీ, పురుషుల శ్రమ విభజనను ఎలా చూడాలి? వేతనాలను ఆడవారికి ఈ నాటికీ తక్కువ చెల్లిస్తున్నారు. ఆడ వారు శారీరకంగా బలహీనులు కనుక ఉత్పాదకత తక్కువ ఉంటుందనే కారణం సహేతుకమా?

జ: స్త్రీ – పురుషుల ’శ్రమ విభజన’ని చూడాలంటే, ఇప్పటికి కూడా ప్రధానంగా వున్న విభజన, స్త్రీలకు ఇంటి పనీ, పురుషులకు బైటి పనీ – అనేదే. ఈ శ్రమ విభజన, సమానత్వ దృష్టితో మారితే, ఇద్దరికీ ఇంటి పనీ, ఇద్దరికీ బైటి పనీ – గా అవుతుంది. ’ఆడ వారు శారీరకంగా బలహీనులు’ అనే మాట తార్కికంగా నిలబడదు. స్త్రీలు, పురుషుల కన్నా ఎత్తు తక్కువగా, లావు తక్కువగా వుండడం, ప్రకృతి ధర్మం. పక్షుల్లో కూడా ఈ రకం తేడాలు వుంటాయి. అది, బలహీనతకు రుజువు కాదు. సమాజంలో వున్న ఏ పని అయినా చెయ్యడానికి, లావులూ, ఎత్తులూ, అక్కర లేదు. సహజంగా వున్న శరీర ధర్మాలతో, శ్రమలు చెయ్య లేని పరిస్తితి వుండదు. పెట్టుబడి దారీ ఆటల వ్యాపారాల్ని చూస్తే, ’ఇంతింత పరుగులు స్త్రీలకు సాధ్యమా?’ అని భావించే వాళ్ళు, స్త్రీలలో కూడా వున్నారు. ’అసలు, అంతంత పరుగులు, పురుషులకు మాత్రం అవసరమా?’ అనే ప్రశ్నలు రావు. ’యుద్ధాన్ని’ తీసుకుంటే, స్త్రీలు యుద్ధం చెయ్యగలరా – అనే ప్రశ్న వచ్చే వాళ్ళకి, ’పురుషులు మాత్రం యుద్ధం చెయ్యగలరా? వాళ్ళకి నెలల తరబడీ ఘోరంగా నేర్పితే కదా అవన్నీ వచ్చాయి?’ అనే ప్రశ్న రావాలి. స్త్రీలలో అయినా, పురుషుల్లో అయినా, కొందరు, పుటుకల్లోనే, అంధులుగా, మూగలుగా, ఆశక్తులుగా, వుండడం జరిగినట్టే, బలహీనులుగా వుండడం కూడా జరగవచ్చు.

ఆ తేడాల సంగతి అనవసరం. అసలు, సమాజానికి కావలిసిన శ్రమలు, వ్యవసాయాలూ, చేతి పనులూ, యంత్రాల్ని నడపడాలూ – వంటివే. ఈ శ్రమలకు, శరీరాల లావులూ, ఎత్తులూ, అక్కర్లేదు. మొదట నేర్చుకుంటే, తగిన సాంకేతికతలతో, ఎవ్వరైనా, ఏ శ్రమైనా చెయ్యగలరు. స్కూల్లో పిల్లలకు, సహనంగా, తేలికగా నేర్పే టీచరు వుంటే, పిల్లలందరికీ అన్నీ వస్తాయి. తెలివి తేటల్లో కొన్ని తేడాలు వున్నా, అవసరమైన విద్యల కోసం, ఆ తేడాలతో సంబంధం వుండదు. సమాజానికి కావలిసిన విద్యల్నీ, శ్రమల్నీ, ఏ తేడాల వాళ్ళయినా నేర్పగలరూ; నేర్వగలరూ.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News