Home తాజా వార్తలు ప్రకృతికి దగ్గరగా ఉన్న కథతో

ప్రకృతికి దగ్గరగా ఉన్న కథతో

Director Maruthi

 

సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ మారుతి ప్రస్తుతం సాయిధరమ్ తేజ్‌తో ‘ప్రతిరోజు పండగే’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. రాశి ఖన్నా హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రం త్వరలో విడుదలకానుంది. మంగళవారం తన పుట్టినరోజును పురస్కరించుకొని మారుతి విలేకరులతో ముచ్చటిస్తూ చెప్పిన విశేషాలు…

‘ఈ రోజుల్లో’తో డైరెక్టర్‌గా…
డైరెక్టర్ కావాలనే నా కోరిక ‘ఈరోజుల్లో’ చిత్రంతో తీరింది. నేను ఒక సినిమా డైరెక్ట్ చేయగలనని ఫ్రెండ్స్‌కు చూపించడానికి ‘ఈ రోజుల్లో’ తీశాను. అది పెద్ద సక్సెస్ అయింది. ఆ మూవీ రిలీజ్ అయ్యాక చాలా మంది నిర్మాతలు సినిమాలు చేయమని అడిగారు. అలా వరుసగా సినిమాలు చేస్తూ వచ్చాను.

ఎమోషన్స్‌తో పాటు ఎంటర్‌టైన్‌మెంట్…
సమాజంలో జరుగుతున్న అంశాలను తీసుకొని నా తరహాలో దానికి ఎంటర్‌టైన్‌మెంట్ జోడించి సినిమాలు తీశాను. అవి సక్సెస్ అయ్యాయి. ప్రస్తుతం చేస్తున్న ‘ప్రతిరోజు పండగే’లో ఎమోషన్స్‌తో పాటు ఎంటర్‌టైన్‌మెంట్ ఉంటుంది. సాయిధరమ్ తేజ్‌కు ముందు ఈ స్టోరీ లైన్ చెప్పాను. అతనికి నచ్చడంతో పూర్తి స్క్రిప్ట్ వినిపించాను. సాయి కెరీర్‌లో ఇది డిఫరెంట్ సినిమా అని చెప్పవచ్చు. పూర్తి స్థాయి ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్ సబ్జెక్ట్ ఇది.

కథ నచ్చడంతో ప్రారంభం…
‘ప్రతిరోజు పండగే’ కథను ముందుగా యువి క్రియేషన్స్ వంశీకి చెప్పాను. వంశీకి కథ బాగా నచ్చింది. ఈ సబ్జెక్ట్‌ను డెవలప్ చేస్తున్న సమయంలో అల్లు అరవింద్‌కి పూర్తి కథ చెప్పాను. ఆయనకు కథ నచ్చడంతో గీతా ఆర్ట్2లో ఈ చిత్రాన్ని ప్రారంభించాము.

వినోదాత్మకంగా చెప్పాము…
మనిషి పుట్టినప్పుడు సంతోషంగా సెలెబ్రేట్ చేసుకుంటారు. కానీ మనిషి చావు బతుకుల్లో ఉన్నప్పుడు అతన్ని మానసికంగా సంతోష పెడితే మరిన్ని ఎక్కువ రోజులు బ్రతుకుతాడనే విషయాన్ని ఈ సినిమాలో వినోదాత్మకంగా చెప్పాము. ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యే చాలా అంశాలు ఈ సినిమాలో ఉండబోతున్నాయి.

పచ్చని పొలాల్లో కీలక సన్నివేశాలు…
‘ప్రతిరోజు పండగే’ సినిమాను రాజమండ్రిలో కొన్ని రోజులు షూట్ చేశాం. ప్రకృతికి దగ్గరగా ఉన్న ఈ కథ కోసం పచ్చని పొలాల్లో కీలక సన్నివేశాలు చిత్రీకరించడం జరిగింది. సినిమాలో ఐదు పాటలు ఉన్నాయి. తమన్ మంచి సాంగ్స్ ఇచ్చాడు. సత్యరాజ్ నటన సినిమాకు అదనవు ఆకర్షణ కానుంది.

రియల్ లొకేషన్స్‌లో…
ఈ సినిమా షూటింగ్ 80 శాతం పూర్తయింది. అమెరికాలో ఐదు రోజులు షూట్ చేయాలి. ఎక్కడా రాజీపడకుండా సినిమాను రియల్ లొకేషన్స్‌లో షూట్ చేస్తున్నాము. సినిమా ఔట్‌ఫుట్‌తో హ్యాపీగా ఉన్నాము. డిసెంబర్ రెండో వారంలో ఫస్ట్ కాపీ సిద్ధమవుతుంది. సినిమా విడుదల తేదీని నిర్మాతలు అల్లు అరవింద్, బన్నీ వాసు ప్రకటిస్తారు.

Interview with Director Maruthi