Home సినిమా 36 రోజుల్లో పూర్తిచేశాం

36 రోజుల్లో పూర్తిచేశాం

భారీ చిత్రాల నిర్మాణ సంస్థలైన గీతా ఆర్ట్, యు.వి. క్రియేషన్స్, స్టూడియో గ్రీన్ కలిసి వి4 క్రియేషన్స్ పేరుతో ఓ కొత్త చిత్ర నిర్మాణ సంస్థను స్థాపించారు. ఈ బ్యానర్‌పై ‘నెక్ట్ నువ్వే’ పేరుతో ఓ హర్రర్ ఎంటర్‌టైనర్‌ను నిర్మించారు. ఆది, వైభవి శాండిల్య, రష్మీ గౌతమ్, బ్రహ్మాజీ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి టివి యాంకర్, నటుడు ప్రభాకర్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని బన్ని వాసు నిర్మించారు. ఈ చిత్రం నవంబర్ 3న విడుదలకానుంది. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు ప్రభాకర్ విలేకరులతో ముచ్చటిస్తూ చెప్పిన విశేషాలు…

prabhakar

 నా కథకు బదులుగా రీమేక్ కథ...
వి4 క్రియేషన్స్ బ్యానర్ తొలి చిత్రం ‘నెక్ట్ నువ్వే’కు నేను దర్శకుడిగా చేయడం నా అదృష్టం. అయితే ఓ రోజు నేను బయట బ్యానర్‌లో శిరీష్‌తో ఓ సినిమా చేద్దామనుకొని ఆయనను కలిసి కథ చెప్పాను. కథ నచ్చడంతో… ‘సినిమా చాలా ఫన్నీగా ఉంది. కాకపోతే నేను ఈ సినిమా చేయను. కానీ మేము ఈ సినిమాను నిర్మిస్తాం’అని అన్నారు. ఈ కథను అల్లు అరవింద్‌కు చెప్పమని శిరీష్ నాకు చెప్పారు. అల్లు అరవింద్‌ను కలిసి ఈ కథ చెప్పగా… సెకండాఫ్‌ను ఇంకాస్త డెవలప్ చేస్తే బావుంటుందని ఆయన అన్నారు. ఆతర్వాత బన్ని వాసుకు ఈ కథ చెప్పాను. ఈ కథను ఆయన ఎంజాయ్ చేశారు. కానీ ఆయన నాతో ‘మన దగ్గర ఓ తమిళ సినిమా రీమేక్ రైట్స్ ఉన్నాయి. ఆ సినిమాను మీరు చేయాలి’అని చెప్పారు. ‘రీమేక్ చేసినా ఉన్నది ఉన్నట్లు కాకుండా… కథ మొత్తాన్ని మన నేటివిటీలో రాసుకోవాలి’అని ఆయన అన్నారు. ఆ తమిళ సినిమా చూసిన తర్వాత నాకు ఆ సినిమా బాగా నచ్చింది. అనంతరం ఈ కథ రాసుకోవడానికి నాకు ఎనిమిది నెలల సమయం పట్టింది. కానీ ఈ సినిమా ఓకే కావడానికి ఎదురుచూడాల్సి వచ్చింది.

 అయ్యప్ప స్వామియే దారి చూపించారు…
ఓ రోజు అయ్యప్ప స్వామి పూజకు బన్నివాసును పిలిచాను. కానీ అప్పటికి కూడా సినిమా సమస్య తీరలేదు. అయితే శబరిమలలో అయ్యప్ప స్వామి దర్శనం అవగానే… ఈ సమస్య క్లియర్ అయినట్లు నాకు మెసేజ్ వచ్చింది. ఆ అయ్యప్ప స్వామియే నాకు దారి చూపించారని అనిపించింది. అక్కడి నుంచి వచ్చిన 15 రోజుల తర్వాత ఈ సినిమాను ప్రారంభించాం.

 ఆదితో సినిమా ప్రారంభమైంది…
ఈ సినిమాకు హీరోగా ఎవరిని అనుకుంటున్నారని బన్ని వాసు నన్ను అడిగారు. యంగ్ హీరో ఆదిని అనుకుంటున్నామని చెప్పి అతన్ని సంప్రదించాను. సాయికుమార్, ఆదికి తమిళ్ సినిమా చూపించి ఎక్కడెక్కడ మార్పులు చేశామో చెప్పాను. ఆతర్వాత ఈ సినిమా ప్రారంభమైంది.

 పలు కామెంట్స్ చేశారు…
ఈ సినిమా ఆగిపోయినప్పుడు పలువురు నానా రకాలుగా కామెంట్స్ చేశారు. కానీ అసలు ఏం జరిగిందో నాకు తెలుసు. అయితే ఈ గ్యాప్‌లో ఇతర నిర్మాతలను నేను కలవలేదు. ఈ పెద్ద బ్యానర్‌లోనే సినిమా చేయాలనుకొని ఆగాను. చివరికి నా నిరీక్షణ ఫలించి ఈ సినిమా ప్రారంభమైంది.

 బాగా సహకరించారు…
సింగిల్ షెడ్యూల్‌లోనే ‘నెక్ట్ నువ్వే’ను పూర్తిచేశాం. 36 రోజుల్లో ఈ సినిమాను పూర్తిచేయడం జరిగింది. హార్రర్ ఎలిమెంట్‌తో పాటు ఇది సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ కాబట్టి రాత్రిళ్లు కూడా సినిమా షూటింగ్ చేశాం. లాంగ్ షెడ్యూల్ కాబట్టి ఆది, వైభవి, రష్మీ, బ్రహ్మాజీలకు ఎక్కువ ఇబ్బంది అనిపించేది. ఈ నలుగురిలో బ్రహ్మాజీ అయితే మూడు, నాలుగు సినిమాలు చేసేవారు. కానీ రాత్రి రెండు గంటల వరకు షూటింగ్ జరిగినప్పటికీ ఆయన బాగా సహకరించారు. బ్రహ్మాజీ కెరీర్‌లో ఇది మంచి సినిమాగా నిలుస్తుంది.

 అతనికిది లైఫ్‌టైమ్ క్యారెక్టర్…
ఈ చిత్రంలో ఆది అద్భుతంగా నటించాడు. అతనికిది లైఫ్‌టైమ్ క్యారెక్టర్ అని భావిస్తున్నాను. డిఫరెంట్ వేరియేషన్స్ ఉన్న అతని క్యారెక్టర్‌ను చేయడం అంత సులభం కాదు. అలాగే హీరోయిన్లు వైభవి, రష్మీలు కూడా చక్కగా నటించారు.

 సీరియల్స్‌కు బ్రేక్ ఇచ్చాను..
నేను టివి సీరియల్స్ ఆపలేదు. బ్రేక్ ఇచ్చానంతే. అందుకు కారణం సినిమాలు చేయడం కాదు. కొన్ని నెలల క్రితం స్టార్ మా ఛానల్ కోసం ‘దేవుడు చేసిన పెళ్లి’ అనే సీరియల్‌ను ప్రారంభించాను. కానీ షూటింగ్‌కు రెండు రోజుల ముందు గా నా తమ్ముడికి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. తనే ఈ సీరియల్‌కు కెమెరామన్. అతను ఇప్పుడు ఐసియులో ఉన్నాడు. తన కండీషన్ అలా ఉన్నప్పుడు సీరియల్ చేయడం ఎందుకని బ్రేక్ ఇచ్చాను. నా తమ్ముడు కోలుకోగానే మళ్లీ సీరియల్స్ చేస్తాను. సినిమాలు చేస్తే సీరియల్స్ చేయకూడదు… సీరియల్స్ చేస్తే సినిమాలు చేయకూడదని నేను అనుకోను. స్టార్ హీరోలు చిరంజీవి, ఎన్‌టిఆర్ సినిమాలు చేస్తూనే టివి షోలు చేశారు కదా.

 తదుపరి చిత్రాలు…
నా తదుపరి సినిమా మారుతి ప్రొడక్షన్‌లో జరుగుతోంది. మారుతి ఓసారి నన్ను కలిసి ‘నా దగ్గర ఓ కథ ఉంది. కన్నడ హీరో సుమంత్ శైలేం ద్రతో తెలుగులో ఈ సినిమా చేయాలి. నువ్వే డైరెక్ట్ చేయాలి’అని అన్నారు. అయితే అప్పటికే నేను ‘నెక్స్ నువ్వే’ సినిమా చేస్తుండడంతో కొత్త సి నిమా కోసం అల్లు అరవింద్, వాసుల పర్మిషన్ అవసరమని చెప్పాను. వారు పర్మిషన్ ఇచ్చిన తర్వాత మారుతి ప్రొడక్షన్‌లో సినిమాను ప్రారం భించాను. ఇప్పటికే ఈ సినిమా 75 శాతం చిత్రీక రణ పూర్తయింది. ఔట్ అండ్ ఔట్ ఎంటర్‌టైనర్‌గా సాగే లవ్ స్టోరీ ఇది. కథ, మాటలు మారుతి రాశారు. నేను డైరెక్షన్ మాత్రమే చేశాను. అలాగే స్టూడియో గ్రీన్ బ్యానర్‌లో ఓ సినిమాకు ఓకే చెప్పాను.