Tuesday, April 23, 2024

ఎన్‌టిఆర్ అంటే ఇష్టం…. ఘంటసాల పాట ప్రాణం

- Advertisement -
- Advertisement -

Interview with PV Narasimha rao Grandson

 

తాత జ్ఞాపకాల్లో పివి పెద్దమనవడు సుభాష్

పివి…ఈ పేరు వింటేనే తమలో తెలియని ఒక వైబ్రేషన్స్ కలుగుతాయి. ప్రేమ, ఆప్యాయత, అనురాగాలు గుర్తుకొస్తాయి. ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగి ఉండాలనే నిబద్ధత….. నిరాడంబరత… నిస్వార్ధంగా ప్రజలకు సేవ చేయాలన్న తపన అణువణువునా కలిగిస్తాయని మాజీ ప్రధాన మంత్రి పి.వి. నర్సింహారావు పెద్ద మనవడైన ఎన్‌వి సుభాష్ తెలిపారు. అలాంటి వ్యక్తి జన్మంచి (జూన్ 28) అప్పుడే వంద సంవత్సరాలు అవుతున్నదా? అన్న భావన కలుగుతోందన్నారు. అదే సమయంలో ఆయన భౌతికంగా ఇక్కడ లేడన్న విషయం గుర్తు కొచ్చినప్పుడల్లా తెలియని బాధ కలుగుతుందన్నారు. ఆ మహోన్నత వ్యక్తి శతజయంతి ఉత్సవాలు ఆదివారం నుంచి సంవత్సరం పాటు రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న నేపథ్యంలో పివితో గడిపిన మధుర క్షణాలు, తీపి గుర్తులను, మరిచిపోలేని ఘటనలను ఒక్కసారి సుభాష్ గుర్తు చేసుకుని ‘మన తెలంగాణ ప్రతినిధి’తో పంచుకున్నారు.

అచ్చ తెలుగు సంప్రదాయాలకు.. నైతిక విలువలకు నిలువెత్తు నిదర్శనమైన పివి గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుందన్నారు. పెద్దమనవడిగా పుట్టడం వల్ల పివితో ఎక్కువ కాలం గడిపే అవకాశం తనకు లభించిందన్నారు. దీంతో నాటి స్మతులు ఇంకా తన మదిలోనే ఉన్నాయన్నారు. పివికి పెద్ద కూతురు తన తల్లి శారదాదేవి. తన తండ్రి అయిన వెంకట కిషన్ రావు కుటుంబంతో దగ్గరి బంధుత్వం ఉన్న కారణంగా ఆయన వారిద్దరికి పెళ్ళి జరిపించారన్నారు. వారికి మొదటి సంతానంగా జనవరి..14, 1960లో తాను జన్మించానని తెలిపారు. కాగా రెండు కుటుంబాలు జమీందారులు, భూస్వాములు కావడంతో సహజంగానే అప్పట్లో రజాకార్ల కన్ను తమపై ఉండేదన్నారు. తమ కుటుంబంపై ఆధిపత్యం చెలాయించాలని పలుమార్లు రజాకార్లు యత్నించారని తన చిన్న నాటి ఘటనలను వెల్లడించారు. వారి ఎత్తులకు పైఎత్తులు వేస్తూనే తమ ఆస్తిపాస్తులను కాపాడుకోగలిగామన్నారు.

కాగా తనకు ఎనిమిదేళ్ళ వయస్సు వచ్చే నాటికే పివి రాష్ట్ర కాంగ్రెస్ రాజకీయాల్లో ముఖ్యమైన నేతగా ఎదిగారన్నారు. అప్పటికే ఆయన రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రిగా కొనసాగుతున్నారని తెలిపారు. ఆ సమయంలోనే మొదటి సారిగా పివితో కలిసి రామేశ్వరానికి వెళ్లాల్సి వచ్చిందన్నారు. అయితే మంత్రిగా కొనసాగుతున్నప్పటికీ రామేశ్వరంలో ఎక్కడా ఆ దర్పం చూపిన దాఖలాలు తనకు కనిపించలేదన్నారు. రాజకీయాల్లో ఆయన ఎంతో ఉన్నతమైన పదవులను చేపట్టినప్పటికీ ఏనాడు ఆ డాబు…దర్పంతో వ్యవహరించ లేదన్నారు.

పైగా ఎంత ఎత్తుకు ఎదిగితే అంత ఒదిగి ఉండాలన్న లక్షం పివిది అని అన్నారు. అదే తమకు చెప్పారని సుభాష్ గుర్తు చేసుకున్నారు. ఆ స్పూర్తినే ఇంకా తమ కుటుంబ సభ్యులందరూ పాటిస్తున్నారని తెలిపారు. ఏ రంగంలోనైనా స్వయం కృషితో ఎదగాలని నిత్యం చెబుతుండే వారని గుర్తు చేసుకున్నారు. అధికారముంటే ఎంతోమంది మన చుట్టూ కనిస్తారని….ఆ పదవి కోల్పోయిన నాడు సదరు వ్యక్తులంతా కనిపించరని పివి తరుచూ కుటుంబ సభ్యులకు చెప్పేవారన్నారు. మన వ్యక్తిత్వాన్ని గుర్తించి వచ్చే వారికే మనం ప్రాధాన్యతను ఇవ్వాలని సూచించే వారన్నారు. ఆయన చెప్పిన సూత్రాలను తామంతా పాటిస్తున్నామన్నారు.

ఇందిరాగాంధీ కుటుంబానికి నమ్మిన బంటు

పలు భాషాలపై పివికి మంచి పట్టు ఉండడంతో ఇందిరాగాంధీ సైతం ఎంతో ఆదరణ చూపే వారన్నారు. ఆమె స్పీచ్‌కు సంబంధించిన కాపీలు, పార్టీ ఎన్నికల ఎజెండా రూపకల్పన తదితర అంశాలలో పివి ప్రముఖపాత్ర పోషించే వారన్నారు. అందుకే ఇందిరాగాంధీ స్వయంగా ఆయనను కేంద్ర రాజకీయాల్లోకి రావాలని కోరారని తెలిపారు. ఆమె కోరిక మేరకే మొదటి సారి పివి హన్మకొండ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసి ఘన విజయం సాధించారన్నారు. ఎంపిగా గెలువడంతో ఇందిరాగాంధీకి మరింత చేరువయ్యారని సుభాష్ తెలిపారు. ఆమె మరణాంతరం రాజీవ్‌గాంధీకి సన్నిహితంగా ఉండేవారన్నారు. అయితే రాజీవ్‌గాంధీ కోటరీలో కొందరు ప్రముఖలకు ఇది నచ్చేది కాదన్నారు.

దీంతో పివిని ఉద్దేశపూర్వకంగా దూరం పెట్టే యత్నం చేసే వారని తెలిపారు. కొన్ని సందర్భాల్లో ఆయనను అవమాన పరిచే విధంగా కూడా వ్యవహరించారన్నారు. ఇవన్నీ రాజీవ్ గాంధీకి తెలియకుండా జరిగాయన్నారు. కలకత్తాలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన ప్లీనరీ సమావేశంలో రాజీవ్‌గాంధీ కోటరిలోని కొందరు పివిని పూర్తిగా పక్కన పెట్టారన్నారు. ఈ విషయం తెలుసుకుని రాజీవ్‌గాంధీ సంబంధిత నాయకులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారన్నారు. ఈ ఘటన జరిగిన సమయంలో తాను కూడా అక్కడే ఉన్నట్లు సుభాష్ తెలిపారు.

ఎన్టీఆర్ అంటే ఇష్టం.. ఘంటసాల పాట ప్రాణం

రాజకీయాల్లో పివి ఎంత బిజిగా గడిపినప్పటికీ కాస్త ఖాళీ సమయం లభిస్తే మాత్రం తప్పకుండా సినిమాలు చూసేవారన్నారు.ముఖ్యంగా తెలుగు సినిమా రంగంలో సీనియర్ ఎన్‌టిఆర్ అంటే మహా ఇష్టమన్నారు. ఆ యన నటించిన సినిమాలను పదేపదే చూసేవారన్నారు. అలాగే హీరోయిన్లలో సావిత్రి, జమున, వాణిశ్రీ సినిమాలను చూసేవారు అని సుభాష్ తెలిపారు. ఇక హిందీలో దిలీప్‌కుమార్, రాజేంద్రకుమార్ సినిమాలు చూసేవారన్నా రు. అలాగే మరాఠీ సినిమాలపై కూడా మో జు ఉండేదని ఆయన వెల్లడించారు. హైదరాబాద్‌లోని బసంత్, రాజాడీలక్స్ (రాత్ మహల్), డ్రీమ్‌ల్యాండ్, సంగీత్, ప్రభాత్, లిబర్టీ తదితర థియేటర్లలో పివితో కలిసి పలు సినిమాలు చూశానన్నారు. పివికి ఘంటసాల పాడిన అంటే చెవికోసుకునే వారని తెలిపారు.

వస్తున్నాడంటే భయం వేసేది

కేంద్ర, రాష్ట్ర రాజకీయాల్లో బిజీగా ఉన్న సమయంలో పివి ఇంటికి వస్తున్నారంటే కుటుంబంలో పెద్ద సందడిగా ఉండేదన్నారు. అయితే అదే సమయంలో భయం కూడా ఉండేదని పేర్కొన్నారు. ఇంటికి వచ్చిన మరుక్షణం ప్రతి ఒక్కరి ప్రోగ్రెస్ కార్డు చూసేవారని, ప్రతి సబ్జెక్టులో మార్కులు ఎలా వచ్చాయి…ఎందుకు తక్కువ వచ్చాయి అని అడిగేవారన్నారు. దీంతో తాత ను కలవాలంటే కొన్ని సందర్భాల్లో చాలా భయంగా ఉండేదన్నారు. చదువు విషయంలో కఠినంగా ఉన్నప్పటికీ ఇక మిగిలిన విషయాల్లో మాత్రం చాలా ప్రేమగా ఉండేవారని సుభాష్ గుర్తు చేసుకున్నారు.

ఆదాయం పన్ను చెల్లించాలని చెబుతుండే వారు

ఆదాయం పన్ను కట్టడంలో మన కుటుంబ సభ్యులంతా ముందువరసలో ఉండాలని ఆయన చెప్పేవారన్నారు. ఈ విషయంలో కూడా ఆయన చాలా నిక్కచ్చిగా ఉండేవారన్నారు. అందుకే తాను ఇప్పటికీ అడ్వాన్స్ టాక్స్ చెల్లిస్తున్నానని చెప్పారు.

వారసత్వ రాజకీయాలకు దూరం

సామాన్య వ్యక్తి నుంచి పివి దేశ ప్రధాన మంత్రి స్థాయికి ఎదిగినప్పటికీ ఏ నాడూ కుటుంబ సభ్యులను వారసత్వ రాజకీలను ప్రొత్సహించ లేదని సుభాష్ తెలిపారు. స్వతహాగా ఆయనకు వారసత్వ రాజకీయాలంటే ఇష్టం లేదన్నారు. ఒకరి పేరు చెప్పుకుని కాకుండా సొంతంగా ఎదగాలన్నదే పివి లక్షమన్నారు. అందుకే తమది పెద్ద కుటుంబమే అయినప్పటికీ వారసులుగా రాజకీయాల్లో ప్రస్తుతం ఎవరూ కొనసాగుతున్న దాఖలాలు లేవన్నారు. అప్పట్లో ఆయన తీసుకున్న ఈ నిర్ణయమే ప్రస్తుతం తమకు కొంత ఇబ్బందిగా మారిందన్నారు.

రాజకీయాల్లో పివి ఉన్నత స్థానంలో ఉన్నప్పటికీ కుటుంబ సభ్యులను కూడా రాజకీయాల్లో ప్రొత్సహించి ఉంటే తాము కూడా అగ్రనాయకులుగా గుర్తింపు పొందేవారమన్నారు. అందుకే స్వశక్తితో రాజకీయాల్లోకి అడుగుపెట్టామన్నారు. ప్రస్తుతం తాను బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధిగా కొనసాగుతున్నప్పటికీ తాతలాగే ఒక్కొక్క మెట్టు ఎక్కేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. తాను చేస్తున్న కృషికి తప్పకుండా ఫలితం లభిస్తుందన్న ధీమా వ్యక్తం చేశారు. ఇందుకు తనకు పివి ఆశీస్సులు కూడా ఉంటాయని పేర్కొన్నారు.

సిఎం కెసిఆర్ తీసుకున్న నిర్ణయం ఆమోఘం

పివి శతజయంతి ఉత్సవాలను సంవత్సరం పాటు నిర్వహించాలని సిఎం కెసిఆర్ తీసుకున్న నిర్ణయం ఆమోఘమైనదని సుభాష్ తెలిపారు. ఒక తెలుగువాడికి దక్కాల్సిన అరుదైన గుర్తింపు, గౌరవాన్ని కెసిఆర్ ఇస్తుండడం పట్ల ఆనందాన్ని వ్యక్తం చేశారు. పివి బతికినంతకాలం కాంగ్రెస్ పార్టీ ప్రయోజనం కోసమే పనిచేసినప్పటికీ….ఆ పార్టీ ఆయన సేవలను గుర్తించిన పాపాన పోలేదని తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. రాజకీయాలకు అతీతంగా సిఎం కెసిఆర్ తీసుకున్న నిర్ణయంపై తెలుగు ప్రజలంతా హర్షిస్తున్నారన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News