Home తాజా వార్తలు ‘వ్యూహమో’, కాకతాళీయమో తెలియదు!

‘వ్యూహమో’, కాకతాళీయమో తెలియదు!

Interview with PV son Prabhakar rao

 

పివి అంత్యక్రియల్లో జరిగిన అవమానం ఇప్పటికీ అర్థం కాదు n ఢిల్లీని ఆయన తనకర్మ భూమిగా భావించారు n చివరి క్షణం వరకు కాంగ్రెస్ కోసమే పనిచేశారు n అయినా అడుగడుగునా అవమానం… నిర్లక్షమే కనిపించింది n మాజీ ప్రధాన మంత్రికి ఇవ్వాల్సిన గౌరవ మర్యాద కూడా ఇవ్వలేదు n ఆ ఘటనలను తలుచుకుంటే ఇంకా హైడ్రామాగానే కనిపిస్తోంది
n పివి శతజయంతి ఉత్సవాల సందర్భంగా ‘మన తెలంగాణ’తో తన మనోభావాలను పంచుకున్న ఆయన కుమారుడు ప్రభాకర్ రావు.

పివి అంతిమ సంస్కారాల సందర్భంగా ఏం జరిగిందో తెలియ దు.. అంతా ఒక వ్యూహం ప్రకారం జరిగిందా? లేక కాకతాళీయంగా జరిగిందో తమకు ఇప్పటికి అర్ధం కాని విషయంగానే మిగిలుందని పివి కుమారుడైన ప్రభాకర్‌రావు తెలిపారు. దేశానికి ప్రధాన మంత్రిగా చేసిన ఆయన చివరి అంతిమ యాత్రలో అడుగడుగునా అవమానాలే ఎదురయ్యాయని ఎంతో బాధాతప్త హృదయంతో చెప్పారు. పివి బ్రతికినంత కాలం ఢిల్లీని తన ఖర్మభూమిగా భావించే వారన్నారు. కానీ అక్కడ దహన సంస్కారాలు కాదు కదా.. కనీసం అంతియ యాత్రను కూడా పదిహేను నిమిషాల్లోనే ముగించేశారని గుర్తు చేసుకున్నారు.

పివి శతజయంతి ఉత్సవాలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ఘనంగా జరుపుతున్న నేపథ్యం లో ఆయన కుమారుడైన ప్రభాకర్‌రావు అప్పటి జ్ఞాపకాలను ఒకసారి గుర్తుకు తెచ్చుకున్నారు. పివితో తనకున్న అనుబంధం గురించి చెబుతూనే ఆయన చివరి క్షణాల్లో పివితో గడిపిన క్షణాలు….చెప్పిన మాటలు ఇంకా గుర్తుకున్నాయన్నారు. ముఖ్యంగా పివి చనిపోయిన తరువాత ఆయన అంతిమ సంస్కారాల విషయంలో కాంగ్రెస్ హైకమాండ్ వ్యవహరించిన తీరు.. ఢిల్లీలో జరిగాల్సిన అంతిమ సంస్కారాలు… హైదరాబాద్‌కు మారిన సీను.. శవం సగమే కాలడం…. దహన సంస్కారాలు పూర్తిగా ముగిసే వరకు కావడి వాడు అక్కడ లేకపోవడం వంటి పలు అంశాలపై ఆయన మన తెలంగాణతో తన అనుభవాలను పంచుకున్నారు. దేశానికి దశా, దిశ లేని పరిస్థితుల్లో పివి నరసింహారావు ప్రధాన మంత్రిగా బాధ్యతలు చేపట్టారన్నారు. అప్పటికే దేశ ఆర్ధిక పరిస్థితి పూర్తిగా అస్తవ్యస్తంగా ఉన్న సమయంలో ఆయన పలు విప్లవాత్మకమైన సంస్కరణలకు శ్రీకారం చుట్టి… అనతికాలంలోనే దేశ ప్రగతినే మార్చివేశారన్నారు. అలాంటి వ్యక్తి చనిపోతే కనీసం ప్రోటోకాల్ కూడా పాటించలేదని అప్పటి ఘటనలను వివరించారు.

పివి ఆరోగ్యం 2003 నుంచి బాగా క్షీణించిందన్నా రు. ఆ సయమంలో దాదాపుగా ఆయనతోనే తాను ఉన్నానని తెలిపారు. అయితే 23 డిసెంబర్.. 2004 లో ఉదయం 11 గంటలకు ఆయన చనిపోయారన్నారు. చనిపోయిన తరువాత ఆసుపత్రిలో జరగాల్సిన ఫార్మాలిటీ కారణంగా మధ్యాహ్నం రెండున్నర గంటల సమయంలో ఇంటికి బాడీని తీసుకొచ్చారన్నారు. మొదటగా తమ ఇంటికి అప్పటి హోంశాఖ మంత్రి అయిన శివరాజ్‌పాటిల్ వచ్చి రాగానే ఎక్కడ అంత్యక్రియలు చేస్తారని అడిగారన్నారు. హైదరాబాద్‌లో చేయాల్సిందిగా ఆయనే సూచించారన్నారు. ఆ మాటలు విని తాను ఒక్కసారిగా షాక్‌కు గురయ్యాయని ప్రభాకర్ రావు పేర్కొన్నారు. అదేంటి పూర్వ ప్రధాన మంత్రులు చనిపోయినప్పుడు ప్రోటోకాల్ ప్రకారంగా ఢిల్లీలోని యమునా నది తీరాన నిర్వహిస్తారు కదా? అని సమాధానమిచ్చానని అన్నారు.

ప్రోటోకాల్ ప్రకారం యమునా నది ప్రక్కన చేయమని చెప్పాను. హైదరాబాద్‌లో చేయమని చెప్పడానికి గల కారణాలు ఏమిటని తాను అడిగాన్నారు. కానీ శివరాజ్‌పాటిల్ సరైన సమాధానం చెప్పకుండానే అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఇక ఆ మరుక్షణం నుంచి పివికి చాలా దగ్గరగా ఉన్న వ్యక్తులు, నేతల నుంచి కూడా అదే విధంగా చెప్పడం ప్రారంభమైందన్నారు. అదే రోజు సాయ ంత్రం 5 గంటలకు ప్రధాని మన్మోహన్‌సింగ్ తమ ఇంటికి వచ్చారన్నారు. ఆయన కూడా అంతిమ సంస్కారాలను హైదరాబాద్‌లోనే చేస్తేనే బాగుంటుందని చెప్పారు. ఇక అది మీ ఇష్టం అని చెప్పి వెళ్ళిపోయారు. అదే రోజున ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్ రాజశేఖర్‌రెడ్డికు తనకు ఫోన్ చేసి దహన సంస్కారాలపై తాను సాయంత్రం ఇంటికి వచ్చి మాట్లాడుతా అని చెప్పారు. వైఎస్ చెప్పినట్లుగానే సాయంత్రం 6 గంటలకు వచ్చారన్నారు. వైఎస్ కూడా అదే విధంగా అడిగారన్నారు.

హైదరాబాద్‌లో అయితే పివి పేరు మీద అద్భుతమైన మెమోరియల్ కట్టిస్తా అని చెప్పారన్నారు. తమ కుటుంబానికి దగరగా ఉన్నవారందరితో కూడా తమకు ఇదే విధంగా చెప్పించారన్నారు. అయితే పూర్వ ప్రధానలందరికి ఢిల్లీలోనే అంతిమ సంస్కారాలు చేశారు కదా… పివి విషయంలోనే అందరూ హైదరాబాద్‌లో జరగాలని ఎందుకు పట్టుబడుతున్నారని తాను అడగానని ఈ సందర్భంగా ప్రభాకర్‌రావు గుర్తు చేసుకున్నారు. దహన సంస్కారాలు ఢిల్లీలోనే జరిపించాలని కోరాల్సింది పోయి…. మీరు కూడా ఇలా మాట్లాడుతున్నారని వైఎస్‌ను నిలదీసినట్లు చెప్పారు. వైఎస్ వెళ్ళిపోయిన తరువాత మళ్లీ శివరాజ్ పాటిల్ వచ్చి…. అందరం కలిసి తీసుకున్న నిర్ణయం ప్రకారం అంత్యక్రియలు హైదరాబాద్‌లో జరపాలని నిర్ణయించామన్నారు. ఇందుకు కుటుంబ సభ్యులంతా అంగీకరించాలని కోరారు. దహన సంస్కారాలు హైదరాబాద్‌లో జరిగినప్పటికీ ఢిల్లీలో పివి పేరు మీద మంచి మెమోరియల్ కట్టిస్తామన్నారు.

ఇదే విషయాన్ని ప్రధానితో చెప్పించాలని తాము కోరామన్నారు. ఇందుకు శివరాజ్‌పాటిల్ ఒప్పుకుని తమ కుటుంబానికి చెందిన ముఖ్య వ్యక్తులతో కలిసి రాత్రి 11 గంటల సమయంలో మన్మోహన్ సింగ్ ఇంటికి వెళ్ళారన్నారు. వారితో ప్రధాని కూడా అద్భుతమైన మెమోరియల్ కట్టిస్తామని చెప్పారన్నారు. అయితే అప్పటికే ఇదంతా కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ నిర్ణయని తెలిసిందన్నారు. దీంతో తాము కూడా అంతి మ సంస్కారాలు హైదరాబాద్‌లో నిర్వహించడానికి అంగీకరించామన్నారు. ఆ మరుసటి రోజున పివి మృతదేహాన్ని ఉదయం తొమ్మిదిన్నర…పది గంటల మధ్య ఊరేగింపుగా కాంగ్రెస్ పార్టీ హెడ్ క్వార్టర్స్ వద్దకు తీసుకొచ్చామన్నారు. అక్కడికి రాగానే ర్యాలీలో వచ్చిన వారే కొన్ని అభ్యంతరాలను వ్యక్తం చేశారన్నారు. ఢిల్లీ నుంచి నేరుగా బాడీని హైదరాబాద్‌లోని జూబ్లీహాల్లో పెట్టామన్నారు. ఆ మరుసటి రోజున నగరంలోని నెక్లస్ రోడ్డులోని పివి జ్ఞానభూమిలో అంతమ సంస్కారాలు జరిగాయన్నారు.

ఆ కార్యక్రమం కూడా అసంపూర్తిగా జరిగినట్లుగా పలు ఎలక్ట్రానిక్ మీడియా ప్రచారం చేసేంత వరకు ఎవరికీ తెలియలేదన్నారు. రాత్రి 11 గంటలకు మా సోదరి వాణి ఫోన్ చేసి…ఎంతో బాధతో టివిలో చూసి చెప్పు అని అన్నారు. సగం కాలిన శవాన్ని చూపిస్తున్నారన్నారు. కావడి కూడా ఎవరు లేరా? అని అడిగారు. ఆ వెంటనే తనకు 20 ఫోన్లు వచ్చాయన్నారు. వెంటనే తాను టివి చూసి తాను శివరాజ్‌పాటిల్‌కు ఫోన్ చేశాన్నారు. జరిగిన దానికి తాను చింతిస్తున్నట్లు చెప్పి ఆయన వెంటనే ఆయన వైఎస్‌కు ఫోన్ చేశారన్నారు. ఐదు నిమిషాల్లోనే వైఎస్ తనకు ఫోనే చేసి జరిగిన దానికి సారీ చెప్పారు. అయితే ఇదంతా రాజకీయ వ్యూహం ప్రకారం జరిగినట్లుగా అనిపించిందని ప్రభాకర్‌రావు తెలిపారు. దీని వెనుక ఎవరు ఉన్నారో తమకు ఇప్పుటికి తెలియదన్నారు. బహుషా పివి అంటే… నెహ్రూస్థాయి కాదని కాంగ్రెస్ హైకమాండ్ భావించి ఉంటుందని అనుకుంటున్నట్లు తెలిపారు. అందుకనే పివి దహన సంస్కారాలను ఢిల్లీలో జరగనివ్వలేదని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.

సామాన్య కార్యకర్త నుంచి ప్రధాని స్థాయికి

కార్యకర్త స్థాయి నుంచి ప్రధాని స్థాయికి చేరుకునేందుకు ఆయన రోజుకు సుమారు 14 గంటల పాటు కాంగ్రెస్ పార్టీ కోసమే పనిచేశారన్నారు. అయితే ఏ రోజు ప్రధాని కావాలన్న ఉద్దేశంతో చేయలేదని ప్రభాకర్‌రావు తెలిపారు. రోజు పుస్తకాలు చదవడం, తన చుట్టూ జరుగుతున్న వాటిని అకళింపు చేసుకోవడం పివి అలవాటుగా ఉండేదన్నారు. పైగా ఆయనలో విప్లవతత్వం పుష్కలంగా ఉండేదని ప్రభాకర్‌రావు చెప్పారు. పుట్టినందుకు ఏదో చేయాలన్న తపన పివిలో బలంగా కనిపించేదన్నారు.

ముఖ్యంగా సమజంలో అట్టుడుగు ఉన్న వారికి తవ వంతు చేయూతనందించాలన్న కసి, పట్టుదల అనుక్షణం కనిపించేదన్నారు. ఈ నేపథ్యంలో పివి తన 22 సంవత్సరాల వయస్సులోనే రామానంద తీర్ధకు ప్రియ శిష్యుడిగా మారాన్నారు. నిజాం వ్యతిరేక పోరాటంలో పనిచేశారన్నారు. శిష్యుడును ఎలా మలుచుకోవాలో పివి ఆయన వద్దే నేర్చుకున్నారు. ఆయన శిష్యరికంలోనే కొత్త పివిగా అవతరించారన్నారు. పివి ఎప్పుడు తన గురించిగానీ…. కుటుంబం గురించిగానీ ఆలోచించలేదన్నారు. విప్లవకారుడిగా అడవుల్లో తిరుగుతూ, నిజాం వ్యతిరేక పోరాటంలో ఉండేవారన్నారు. అప్పుడు తాను నాలుగు సంవత్సరాల పిల్లవాడినని ప్రభాకర్ చెప్పారు.