Home వార్తలు బంధాలను కొత్తగా చూపించే ‘బ్రహ్మోత్సవం’

బంధాలను కొత్తగా చూపించే ‘బ్రహ్మోత్సవం’

మహేష్‌తో ‘సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు’ వంటి పెద్ద హిట్ సినిమా చేసిన శ్రీకాంత్ అడ్డాల మరోసారి అతను హీరోగా చేసిన చిత్రం ‘బ్రహ్మోత్సవం’. పివిపి బ్యానర్‌లో రూపుదిద్దుకున్న ఈ చిత్రం శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా విడుదలకానుంది. ఈ సందర్భంగా శ్రీకాంత్ అడ్డాలతో ఇంటర్వూ విశేషాలు..

srikanth-addalaదర్శకుల హీరో…
మొదటిసారి మహేష్‌తో చేసిన ‘సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు’ పెద్ద విజయాన్ని సాధించింది. మహేష్‌తో చేసిన రెండవ సినిమా ‘బ్రహ్మోత్సవం’. ఒక సెన్సిటివ్ స్టోరీని అర్థం చేసుకొని ఆయన నాకు రెండవ సారి అవకాశం ఇవ్వడనేది గొప్ప విషయం. ఆయన నటుడికంటే ముందు మంచి మనిషి, గొప్ప వ్యక్తి. ఆయన దర్శకుల హీరో. ఆయనతో కలిసి పనిచేయడం గొప్ప అనుభూతినిచ్చింది.
విజయవాడ బ్యాక్‌డ్రాప్‌లో…
సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, బ్రహ్మోత్సవం… రెండు వేర్వేరు కథలు. ఆ సినిమా ఇద్దరి అన్నదమ్ముల కథ. మధ్య తరగతి కుటుంబం వారి మధ్య నడిచే కథ. ‘బ్రహ్మోత్సవం’ కథ పూర్తిగా డిఫరెంట్‌గా ఉంటుంది.ఒక సంపన్న కుటుంబానికి చెందిన కథ ఇది. విజయవాడ బ్యాక్‌డ్రాప్‌లో నడుస్తుంది. నాలుగైదు కుటుంబాలు కలిసుండే వాతావరణంలో సినిమా కొనసాగుతుంది. సినిమా ఔట్‌పుట్ చాలా బాగా వచ్చింది. బంధాలను కొత్తగా చూపించే సినిమా ఇది.
కుటుంబపరంగా చెప్పాలని…
నేటి పోటీ ప్రపంచంలో మనం అనుకున్నది జరుగుతుందా..లేదా… ఇలా రకరకాల ప్రశ్నల నేపథ్యంలో మనుషుల మధ్య ప్రశాంతత లేకుండా పోతోంది. ఆ ప్రశాంతత ఎక్కడో బయటకు టూర్లకు వెళ్తేనో… ఇంకేమైనా చేస్తేనో రాదు. మనుషుల మధ్యనే ఆ ప్రశాంతత దొరుకుతుంది. అదే పాయింట్‌ను కుటుంబపరంగా చెప్పాలని ఈ సినిమా చేశాను. నాకు మనుషులంటే ఇష్టం. ఈ పాయింట్‌ను మహేష్‌కు చెప్పగానే సినిమా చేద్దామన్నారు.
అందుకే ఆలస్యమైంది…
ఏ సినిమా చేసినప్పుడైనా వత్తిడి అనేది ఉంటుంది. ఈ సినిమాకు ఎక్కువ మంది ఆర్టిస్టులతో కలిసి పనిచేయడం, అందరి డేట్స్ అడ్జస్ట్ కాకపోవడం వల్ల చాలా ఇబ్బందులు ఎదుక్కొన్నాను. దీంతో సినిమా కొంత ఆలస్యమైంది. అయితే మహేష్ ఈ సినిమా చేయడానికి ఒప్పుకున్నప్పుడే నేను ఎలాంటి వత్తిడినైనా ఎదుర్కొనగలననే నమ్మకం కలిగింది. మహేషే నా బలం. సినిమా చేస్తున్నప్పుడు ఎగుడుదిగుడులు అన్నీ వస్తుంటాయి. అవన్నీ పట్టించుకుంటే సినిమా చేయలేం.
ఆయనే ఓంకారం చేశారు…
‘సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు’ సినిమా సమయంలో నా స్థాయికంటే ఎక్కువగా పనిచేయాల్సి వచ్చింది. అప్పుడు గణేష్ పాత్రో నాకు సహాయం చేస్తారని ఆయన దగ్గరకు వెళ్లాను ఆయన అనుభవం సినిమాకు ఎంతో ఉపయోగపడింది. ‘ముకుంద’ సినిమా సమయంలోనే ‘బ్రహ్మోత్సవం’ సినిమా చేస్తున్నానని ఆయనకు చెప్పాను. కథ విని రెండు, మూడు పేజీలు స్క్రీన్‌ప్లే రాసిచ్చారు. ఆయనిప్పుడు లేకపోవడం బాధాకరం. ‘బ్రహ్మోత్సవం’ సినిమాకు ఓంకారం చేసింది ఆయనే.
అన్నీ కూడిన కథ ఇది…
నలుగురు ఉన్న సమ్మేళనమే ఉత్సవం. ఉత్సవం పతాక స్థాయికి వెళ్తే అదే ‘బ్రహ్మోత్సవం’. లవ్ స్టోరీ, ఫ్యామిలీ ఎమోషన్స్… ఇలా అన్నీ కూడిన కథ ఇది. నేనొకసారి భక్తి ఛానల్ చూస్తున్నప్పుడు ‘బ్రహ్మోత్సవం’ అనే పేరు కనిపించింది. ఈ పదం చాలా బావుందనుకొని దాన్నే సినిమాకు టైటిల్‌గా పెట్టాను.
హీరోలకు పేర్లు రాసుకోను…
నేను కథలు రాసుకున్నప్పుడు ఎందుకో పాత్రల పేర్లు రాసుకోను. హీరోలు కూడా కథ మొత్తం విని పేరేంటి అని అడుగుతుంటారు. సినిమాల్లో హీరోలకు ముద్దు పేర్లు పెడుతుంటాను.‘బ్రహ్మోత్సవం’లోనూ ఈ విధంగానే ఉంటుంది.
పెద్ద టెక్నీషియన్లను తీసుకున్నాం…
ఇలాంటి అందమైన కథను ప్రజెంట్ చేయాలను కున్నప్పుడు రత్నవేలు వంటి పెద్ద సినిమాటోగ్రాఫర్ అయితే బాగుంటుందని అతన్ని తీసుకున్నాం. అలాగే ఆర్ట్ డైరెక్టర్ తోట తరణి సెట్స్ అద్భుతంగా ఉంటాయి. ప్రతి సెట్ చాలా బాగా వేశారు. నిర్మాత పివిపి అతని పేరును సూచించారు. సినిమాలోని ఎన్నో అందమైన సెట్‌లను అద్భుతంగా తీర్చిదిద్దారు. ఈ భారీ ప్రాజెక్ట్‌కు అందరూ పెద్ద టెక్నీషియన్లనే తీసుకున్నాం.
తండ్రి పట్ల గౌరవం, వినయం…
మహేష్ తన తండ్రికి చెప్పులు తొడిగే సినిమా పోస్టర్‌కు మంచి స్పందన వచ్చింది. ఫంక్షన్ కోసం హడావిడిగా వెళ్తున్న తన తండ్రికి మహేష్ పరిగెత్తుకుంటూ వచ్చి చెప్పులు తొడిగిస్తాడు. తండ్రి పట్ల గౌరవాన్ని, వినయాన్ని ఎలా చూపించాలో ఆలోచించి… చివరికి ఈ విధంగా చూపించాం. అదే పోస్టర్‌గా రిలీజ్ చేశాం.
ఏడు తరాల కాన్సెప్ట్‌తో…
‘బ్రహ్మోత్సవం’లో ఏడు తరాల కాన్సెప్ట్ ఒకటి ఉంటుంది. కథను ముందుకు తీసుకెళ్లడంలో అది ప్రధాన భూమికను నిర్వహిస్తుంది. ప్రేక్షకులకు మరచిపోలేని అనుభూతులను మిగిల్చే విధంగా సినిమా అద్భుతంగా రూపుదిద్దుకుంది.
గొప్ప సినిమాగా నిలుస్తుంది…
‘శ్రీమంతుడు’ వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత మహేష్ చేసిన సినిమా ఇది. దీంతో ‘బ్రహ్మోత్సవం’ కూడా ఆ స్థాయిలో ఉండాలనే ప్రయత్నంతో చేశాను. మహేష్ కెరీర్‌లో ఇది ఓ గొప్ప సినిమాగా నిలుస్తుందన్న నమ్మకముంది.
కథ రాసుకున్న తర్వాతే…
నేను ముందుగా కథ రాసుకుంటాను. ఆతర్వాత కథకు తగ్గట్టుగానే హీరోగా ఎంపికచేసుకుంటాను. ఇప్పటివరకు చేసిన సినిమాలన్నీ ఆవిధంగానే చేయడం జరిగింది. ఇక నేను చేసే తదుపరి సినిమా ఏదనేది ఇంకా నిర్ణయించుకోలేదు.