Home లైఫ్ స్టైల్ ఒంటరి జీవితాలకో ఆశ..

ఒంటరి జీవితాలకో ఆశ..

సెకండ్ ఇన్నింగ్స్ ఇన్ లైఫ్ 

సంప్రదాయ మూలాలను ఛేదించి జీవనగమనంలో బతుకులను మార్చుకుంది ఆ సంస్థ. ఒంటరి జీవితాల్లో ఆశలు చిగురింపచేసి తోడు అందించేందుకు నిరంతరం శ్రమిస్తుంది ఆ స్వచ్ఛంద సంస్థ. బతుకుపోరులో అలిసి భాగస్వాములను కోల్పోయిన వృద్ధులకు తోడై వారికి జీవన సహచరులను వెతికి పెళ్ళిళ్ళు చేస్తుంది ‘తోడునీడ’ సామాజిక సంస్థ. మనవళ్ళు ఉన్న వయస్సులో భాగస్వాములను కోల్పోయి కుటుంబ ఆదరణ కరువై ఒంటరి జీవితాలను అనుభవిస్తున్న వృద్ధులకు జంటలను చూసి పెళ్ళిళ్లు చేస్తూ మేమున్నామంటున్న తోడునీడ సంస్థ ఇప్పటి వరకు సుమారు రెండువందల వృద్ధులకు పెళ్ళిళ్ళు చేసి సంప్రదాయ చట్రాలను ఛేదించింది. 50ఏళ్ళు పైబడిన వితంతువులకు పెళ్ళి సంబంధాలు చూపిస్తుంది. జీవిత భాగస్వాములను కోల్పోయిన వృద్ధులను మరోసారి పెళ్ళికొడుకులను చేస్తుంది. అన్నివర్గాలు,కులాలు,మతాలకు చెందినవారికి లాభాపేక్ష లేకుండా పెళ్ళిళ్ళు చేస్తున్న తోడునీడ నిబంధనలు కూడా కఠినంగానే ఉన్నాయి. డెత్ సర్టిఫికెట్, ఆధార్ కార్డు, హెల్త్ ఫిట్నెస్ సర్టిఫికెట్ తప్పనిసరి అంటున్న తోడునీడ వ్యవస్థాపకురాలు ఎన్.ఎమ్ రాజేశ్వరీ తో ‘మన తెలంగాణ’ మాటా మంతి….

ph

వృద్దులు పెళ్ళిళ్ళు చేసుకోవల్సిన అవసరం ఉందంటారా?
సమాజంలో ఉమ్మడి కుటుంబాలు క్రమేణ అంతరించడంతో భాగస్వాములను కోల్పోయిన వృద్ధులు ఒంటరి జీవితం అనుభవించలేక క్షణక్షణం జీవితంపై భరోసా కోల్పోతున్నారు. జీవితంలో అనేక ఆటుపోట్లకు గురై..,మంచి చెడులను ఆస్వాదించి అనుభవించి భాగస్వాములను కోల్పోయినవారి బతుకులు ఒంటరిగానే మిగిలిపోతున్నాయి. పిల్లలు ప్రయోజకులు కాగానే వృద్ధ తల్లిదండ్రులను ఆశ్రమాల్లో వదిలి నెలసరి ఖర్చులు ఇస్తున్నారు. అయితే వారికి కావల్సింది కాసింత ప్రేమ, ఆప్యాయత కానీ ఆశ్రమాల్లో బతుకులు కావు. అందుకే ఆరోగ్యంగా వున్న వృద్ధులకు వివాహ పరిచయ వేదికలు ఏర్పాటు చేసి పెళ్ళిళ్ళను కుదురుస్తున్నాము. మహిళల విషయంలో ఇంకా సమాజం మారలేదు. భర్త కోల్పోయి వితంతువులా బతుకు ఈడుస్తున్నా కుటుంబసభ్యుల కనికరం ఉండదు. పనిచేసే యంత్రంలాగే భావిస్తారు కానీ మనసును అర్థం చేసుకునే వారుండరు. కష్టసుఖాల్లో భాగస్వాములు కారు. ఒకే ఇంట్లో ఉన్నా ఎవరికి వారే యాంత్రిక జీవనం అనుభవిస్తుంటారు. ఎన్ని సంస్కరణలు వచ్చినా వితంతువులు మళ్ళీ పెళ్ళి చేసుకుంటే సమాజం ఏమి అనుకున్నా కుటుంబ సభ్యులే వ్యతిరేకిస్తుంటారు. 50ఏళ్ళు దాటిన ఒంటరి మహిళ బతుకు నరకంగా మారుతుంది. ఈ నేపథ్యంలో వారికి సరైన ఒంటరి వృద్ధునితో పెళ్ళిచేస్తే ఒంటరితనం నుంచి బయటకువచ్చి బతికినన్నాళ్ళు ఆనందంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. అందుకే 50ఏళ్ళు పైబడిన ఒంటరి జీవితాలను జంటలుగా చేస్తున్నాము. ఇందులో లాభాపేక్షలేదు. మా సంస్థలో ఇప్పటి వరకు సుమారు రెండువేల మంది సభ్యులుఉన్నారు. పరిచయవేదికల్లో కొత్తవాళ్ళు వస్తుంటారు.
వృద్ధులకు పెళ్ళిళ్ళు చేస్తే వారి కుటుంబసభ్యులు అంగీకరిస్తారా ?
అంగీకరించేందుకు కుటుంబ సభ్యులు ముందుకు రారు ఎందుకంటే వారికి ఒంటరి జీవితం గురించి తెలియదు. అలాగే ఆస్తుల పంపకాల్లో మరో భాగస్వామి వస్తుందనే ఆందోళనలో ఉంటారు. ఏకం కావాలనుకునే వారికి అప్పటికే పిల్లలు ఉంటారు. కొందరు తాతలు, అమ్మమ్మలుఉంటారు. వారందరితో సంప్రదించాల్సి వస్తుంది. ఇటీవల ఒక సంఘటన జరిగింది. ఒక 60 ఏళ్ళ వృద్ధుడు ఒంటరిబతుకు బతకలేక పెళ్ళికి సిద్ధమయ్యారు. 55 ఏళ్ళ వితంతువు పెళ్ళి చేసుకునేందుకు ముందుకు వచ్చింది. అయితే కుటుంబసభ్యులు అంగీకరించలేదు. ఆస్తులను వదులుకుంటే అభ్యంతరం లేదన్నారు. వెంటనే ఆస్తులను వదిలి వితంతువును పెళ్ళిచేసుకుని హాయిగా ఉంటున్నారు. అయితే సమాజంలోని సంప్రదాయ బంధాలను తెంచుకుంటేనే ఒంటరి బతుకులు జంటలుగా మారుతాయి.
ఎక్కువశాతం ఏ వయస్సుల వారు ముందుకు వస్తున్నారు ?
వృద్ధుల్లో 50ఏళ్ళు పైబడిన ఒంటరివారే ముందుకు వస్తున్నారు. జీవన సహచరులను కోల్పోయినవారు తోడుకోసం తహతహలాడుతుంటారు. అయితే వితంతు మహిళలు, ఒంటరి మహిళలు ఎక్కువగా ముందుకు రావడం లేదు. ఇంకా సమాజానికి భయపడుతూ కాలాన్ని వెళ్ళబుచ్చుతున్నారు.
మీసంస్థను వివాహపరిచయవేదికగా భావించవచ్చా ?
తోడునీడ సంస్థ వివాహ పరిచయ సంస్థ కాదు. ఒంటరి బతుకులను ఏకంచేసి జీవితానికి తోడు అందిస్తున్నాము. పూర్తిగా స్వచ్ఛందసంస్థ, ఎలాంటి ఫీజులు వసూలు చేయము. దాతలు విరాళాలు ఇస్తే స్వీకరిస్తాము. ప్రస్తుతం ఆర్థిక ఇబ్బందుల్లో సంస్థ ముందుకు వెళుతోంది.
వయస్సు పైబడిన వారిలో దీర్ఘకాలిక రోగులు ఉంటారు వారికి కూడా పెళ్ళిసంబంధాలు చూస్తారా ?
ఈ విషయంలో సంస్థ చాలా కఠినంగా వ్యవహరిస్తుంది. ఒకసారి ఒంటరిబతుకు బతికినవారు మరోసారి ఒంటరి బతుకు బతికేందుకు సిద్ధంగా ఉండరు. అందుకే పెళ్ళికంటే ముందే ఆరోగ్యపరీక్షలు చేయించుకుని రిపోర్టులు తీసుకురావల్సి ఉంటుంది. అలాగే భర్త చనిపోతే డెత్ సర్టిఫికెట్ పరిశీలిస్తాము. ఇద్దరి వృద్ధుల కుటుంబ ఆదాయాన్ని కూడా పరిశీలించిన అనంతరమే వృద్ధులను దంపతులుగా ఏకం చేస్తాము. ఇప్పటివరకు సమారు రెండువందల వృద్ధులకు పెళ్ళిళ్లు చేశాము అందరూ సంతోషంగానే ఉన్నారు.
ప్రధానంగా ఏ వర్గాలవారు ఎక్కువగా వస్తుంటారు ?
మాదగ్గర దరఖాస్తు చేసుకున్న వారిలో రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగులు, వ్యాపారవేత్తలు. టీచర్లు, లెక్చరర్లు, మాజీ ఐఏఎస్ లు కూడా ఉన్నారు. వారికి సరైన తోడు లభిస్తే పెళ్ళిచేస్తాము. అప్ప టివరకు పేర్లను రహస్యంగానే ఉంచుతాము.
వృద్ధుల పెళ్ళిళ్లలో కులాల పట్టింపు ఉంటుందా ?
సమాజం అనుకున్నంత వేగంగా ముందుకు పోవడంలేదు. కులాలపట్టింపులు వృద్ధుల్లోనే అధికంగా ఉంటున్నాయి. ఇటీవల ఆంధ్రవారు ఆంధ్రవారిని, తెలంగాణవారు తెలంగాణవారినే కోరుకుంటున్నారు. కులాలతోపాటు ప్రాంతాలవారిగా సంబంధాలు చూడాల్సివస్తోంది. అయితే ఆదర్శవంతంగా సామాజిక రుగ్మతలను అధిగమిస్తూ చేసే ఈపెళ్ళిళ్ళు ఒంటరి బతుకుల్లో ఆశలు చిగురింపచేస్తాయని ఆశిస్తున్నాము.

వి.భూమేశ్వర్
మనతెలంగాణ ప్రతినిధి