Saturday, April 20, 2024

దర్యాప్తులో గుట్టు తేలేనా?

- Advertisement -
- Advertisement -

Investigation on Coronavirus

 

చైనాలోని వూహాన్ నగర కేంద్రంగా పుట్టుకొచ్చిన కరోనా మహమ్మారి సృష్టిస్తున్న కల్లోలానికి ప్రపంచం మొత్తం చిగురుటాకులా వణికిపోతోంది. రోజురోజుకు అత్యంత వేగంగా వ్యాపిస్తున్న కరోనా రక్కసి బారినపడి లక్షల సంఖ్యలో మరణాలు సంభవిస్తున్నాయి. ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలు అతలాకుతలమవుతోన్న నేపథ్యంలో కోట్ల సంఖ్యలో ఉద్యోగాలుపోతున్న తరుణంలో వేతన జీవులు విలవిల్లాడుతున్నారు. గత 60 రోజులుగా పని లేని పరిస్థితులలో రెక్కాడితేకాని డొక్కాడని దినసరి కూలీల, వలస కార్మికుల బతుకులు ఛిద్రమవుతున్నాయి. ఇటువంటి దుర్భర విపత్కర పరిస్థితులలో అగ్ర రాజ్యాలైన అమెరికా, చైనా మధ్య కరోనా తీవ్రమైన కల్లోలానికి కారణమైంది.

కరోనా వైరస్ వ్యాప్తికి మీరంటే మీరే కారణమని ఆరోపణలు, ప్రత్యారోపణలతో నిత్యం ఇరుదేశాలు సంఘర్షణ పడుతున్నా యి. దీంతో అమెరికా చైనాల నడుమ పచ్చిగడ్డి వేస్తే భగ్గుమనే ప్రచ్ఛన్న యుద్ధ పరిస్థితులు నెలకొన్నాయి. కరోనా వైరస్ కాదది చైనీస్ అంటూ అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తన ఆక్రోషం వెళ్లగక్కుతున్నాడు. కరోనా వైరస్ వ్యాప్తి అమెరికా సైన్యం పనే అని వారే దానిని వూహాన్ తీసుకొచ్చారని చైనా ప్రత్యారోపణలకు పాల్పడుతున్నది. ఇరు దేశాల ప్రతినిధులు, దౌత్యాధికారులు, అధినేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఫలితంగా కరోనా వైరస్ వ్యాప్తిలో కుట్ర కోణం దాగి ఉందా అన్న అనుమానాలు ప్రపంచ దేశాల్లో పెరిగిపోతున్నాయి.

ప్రపంచ వ్యాప్తంగా దాదాపు అన్ని దేశాల పైన దుష్ప్రభావం చూపుతున్న కరోనా మహమ్మారిపై సర్వత్రా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. కరోనా సహజ సిద్ధంగా పుట్టిందా? వూహాన్‌లోని ప్రయోగశాల నుంచే లీకయిందా? ఇది నిజంగా జీవాయుధమా? వైరస్ వ్యాప్తిలో గబ్బిలాల పాత్ర ఉందా? వూహాన్‌లోని మాంసం విక్రయ మార్కెట్ దీని వ్యాప్తికి ఎంత వరకు కారణం? అనే అనేక ప్రశ్నలు తలెత్తుతున్న నేపథ్యంలో ఎట్టకేలకు కరోనా వైరస్ గుట్టు తేల్చే ప్రక్రియకు ప్రపంచ ఆరోగ్య సంస్థ అంగీకరించింది.

మే 18, 19వ తేదీలలో స్విట్జర్లాండ్ రాజధాని జెనీవాలో జరిగిన డబ్లుహెచ్‌ఒ విధాన నిర్ణాయక సంస్థ అయిన ప్రపంచ ఆరోగ్య సభ (వరల్డ్ హెల్త్ అసెంబ్లీ) 73వ వార్షిక సమావేశాల్లో కరోనా వైరస్‌పై స్వతంత్ర దర్యాప్తుకు ఆమోదం లభించింది. డబ్లుహెచ్‌ఒలోని 194 సభ్య దేశాల ఆరోగ్యశాఖల మంత్రులు వరల్డ్ హెల్త్ అసెంబ్లీ (డబ్లుహెచ్‌ఎ) సభ్యులుగా ఉంటారు. వార్షిక సమావేశాలు సాధారణంగా మూడు వారాల పాటు జరుగుతాయి. కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఈ సారి సమావేశాలను రెండ్రోజులకు కుదించటంతో పాటు తొలిసారి విడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించారు.

కరోనా వైరస్ పుట్టుకపై స్వతంత్ర సంస్థతో అంతర్జాతీయ దర్యాప్తు జరుపాలన్న తీర్మానాన్ని ఈ సదస్సులో యూరోపియన్ యూనియన్ (ఇయు) ప్రవేశపెట్టింది. దీనికి ఆస్ట్రేలియా, జపాన్ వెన్నుదన్నుగా నిలిచాయి. కరోనా వైరస్ ఎక్కడ ఎలా పుట్టింది? మానవుల్లోకి ఎలా ప్రవేశించింది? ఏ జీవి వాహకంగా పని చేసింది? కరోనా వ్యాప్తి, వైరస్ పై ప్రపంచ దేశాలను డబ్లుహెచ్‌ఒ అప్రమత్తం చేసిన తీరు, తీసుకున్న చర్యలు, అంతర్జాతీయ ఆరోగ్య చట్టం అమలు తీరు, కరోనాను ఎదుర్కొవడంలో గడించిన అనుభవాలు, నేర్చుకున్న పాఠాలు తదితర అంశాలపై సమగ్రంగా, స్వతంత్రంగా, శాస్త్రీయ పద్ధతిలో దర్యాప్తు జరుపాలని తీర్మానంలో ప్రతిపాదించారు.

ఈ తీర్మానానికి భారత్ సహా 120కి పైగా దేశాలు మద్దతిచ్చాయి. భారత ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ విడియో కాన్ఫరెన్స్ ద్వారా సదస్సులో పాల్గొన్నారు. సభ్య దేశాల నుండి వచ్చిన ఒత్తిడితో కరోనా వైరస్‌పై స్వతంత్ర దర్యాప్తునకు ప్రపంచ ఆరోగ్య సంస్థ తన ఆమోదాన్ని తెల్పింది. వైరస్ పుట్టుక, వ్యాప్తి, నియంత్రణపై వీలైనంత త్వరలో విచారణ చేపడతామని డబ్లుహెచ్‌ఒ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ వెల్లడించారు. డబ్లుహెచ్‌ఒ దర్యాప్తుకు తాము సహకరిస్తామని చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ పేర్కాన్నారు. కరోనా విషయంలో బాధ్యతతో వ్యవహరించామని, అన్ని విషయాలను బహిరంగంగా ఇతర దేశాలతో పంచుకున్నామని స్పష్టం చేశారు.

కరోనా వైరస్ చైనా పనే అని అమెరికా, అమెరికా నుంచే మాకు వచ్చిందని చైనా విమర్శలు కురిపించుకుంటున్న తరుణం లో కరోనా మహమ్మారి పట్టుక రహస్యం తెలుసుకోవాలని ప్రపంచ రాజ్యాలు వేచి చూస్తున్నాయి. కరోనా వైరస్ పుట్టుక, వేగంగా ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందే విషయంలో చైనా రహస్యాన్ని పాటించడం, బయటి ప్రపంచానికి తెలియకుండా నిర్బంధాన్ని అమలు చేయడం, వైరస్ ప్రభావ ఫలితంగా సంభవించిన మరణాలను, అనర్థాలను ఎవరికి తెలియనీయకుండా జర్నలిస్టులను వేధింపులకు గురి చేయడం, వారిపై కేసులు పెట్ట డం, అదృశ్యం చేయడం లాంటి అంశాలను ప్రపంచ దేశాలు చైనా వైపు వేలెత్తి చూపుతున్న మూలంగా మొదటి నుంచి దర్యాప్తుకు ససేమిరా అన్నా అంతర్జాతీయంగా ఒత్తిడి పెరగడంతో మెత్తబడి దర్యాప్తుకు తలొగ్గింది. కరోనాపై పోరులో డబ్లుహెచ్‌ఒకు సాయపడేందుకు రూ. 15,130 కోట్లు ఇవ్వబోతున్నట్లు చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ వెల్లడించారు.

డిసెంబర్ 2019లో చైనాలో వైరస్ పుడితే 2020 మార్చి మొదటి వారం వరకు దాన్ని మహమ్మారిగా ప్రకటించకుండా ప్రపంచ దేశాలను అప్రమత్తం చేయాల్సిన బాధ్యతను పక్కు పెట్టి టెడ్రోస్ ప్రవర్తించినట్లు అమెరికా, ఐరోపా దేశాలు ఆరోపిస్తున్నాయి. తైవాన్ కరోనా వైరస్‌పై పూర్తి అధ్యయనంతో అది అంటువ్యాధి అని డిసెంబర్ 2019లోనే ప్రపంచ ఆరోగ్య సంస్థకు సమాచారం అందించినా దానిని పట్టించుకోకపోవడం, జనవరి 14న కరోనా వైరస్ మనిషి నుండి మనిషికి సంక్రమిస్తుందనే దానికి స్పష్టమైన ఆధారాలు లేవని డబ్లుహెచ్‌ఒ చేసిన ప్రకటన, అంతర్జాతీయ ప్రయాణాలపై ఫిబ్రవరి మాసంలోనూ నిషేధం అవసరం లేదని టెడ్రోస్ పేర్కొనడం, పరిస్థితి విషమించిన తర్వాత మార్చి 11న కరోనా వైరస్‌ను ప్రపంచ మహమ్మారిగా ప్రకటించడం మొదలగు కారణాలతో ప్రపంచ ఆరోగ్య సంస్థ చైనా పట్ల సానుకూల దృక్పథాన్ని అవలంబిస్తున్నట్లు విమర్శల పాలయ్యింది.

తాను ఎదుర్కొంటున్న విమర్శల నేపథ్యంలో కరోనా విపత్తు దానిపై డబ్లుహెచ్‌ఒ తీసుకున్న పై విచారణకు సిద్ధంగా ఉన్నట్లు టెడ్రోస్ ప్రకటించారు. ప్రపంచంలో మహమ్మారులు ప్రబలినపుడు ప్రపంచ ఆరోగ్య సంస్థ పేషెంట్ జీరోను కనుగొంటుంది. ఇది ఆ వ్యాధిపై చేసే పరిశోధనల్లో ప్రాధాన్యత వహిస్తుంది. కాని కోవిడ్ 19 విషయంలో కరోనా వైరస్ పేషెంట్ జీరోగా వుహాన్ సీ ఫుడ్ మార్కెట్‌లో రొయ్యలు అమ్మే మహిళను పేర్కొంటున్నారు. కానీ ఇప్పటికీ జీవించి ఉన్న ఆ మహిళకు వైరస్ ఎలా సోకిందో మాత్రం చెప్పలేకపోతున్నారు.

వైరస్‌లపై పరిశోధనలు చేసేందుకు వూహాన్‌లో పీ 4 స్థాయి పరిశోధనశాలను నిర్మించారు. ఇందులో దాదాపు 1500 రకాల వైరస్‌లను నిల్వ చేసి పరిశోధనలు చేస్తున్నట్లు, దీనిలో అత్యంత ప్రమాదకరమైన వైరస్‌లు ఉన్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. 2018 జనవరిలో పీ 4 ల్యాబ్‌ను సందర్శించిన అమెరికా నిపుణులు అక్కడి లోపాలను గమనించి తమ దేశానికి సమాచారం అందించారనే వార్తను వాషింగ్టన్ పోస్టు ప్రచురించింది. 2008లో నోబెల్ విజేత ప్రముఖ వైరాలజిస్టు లుచ్ మౌంటెనియర్ కరోనా వైరస్ వూహాన్ ప్రయోగశాల నుంచే లీకయిందని ప్రకటించారు. కరోనా వైరస్‌పై స్వతంత్ర దర్యాప్తు జరుగనున్న పరిస్థితులలో నిజాలు నిగ్గు తేలేందుకు, చైనా దీనికి పూర్తిగా సహకరించి తనపై పడ్డ నిందారోపణలు తుడి చేసుకోవాలి. తక్షణమే అమెరికా కూడా తన ఆరోపణలు నిలిపివేసి దర్యాప్తులో డబ్ల్యూహెచ్‌ఒకు సహకరించి కరోనా గట్టు తేల్చాలి. తద్వారా మానవాళికి ఉపయోగకరంగా ఉంటుంది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News