Home తాజా వార్తలు నీటి తీరువా రద్దు

నీటి తీరువా రద్దు

Medak's peak of the people

మన తెలంగాణ/ మెదక్ : రాష్ట్రంలో నీటి తీరువా బకాయిలను రద్దు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదా పు రూ.700 నుంచి రూ.800 కోట్ల వరకు నీటి తీరువా బకాయిలు ఉన్నాయని, అవన్నీ రద్దు చేయడంతో పాటు భవిష్యత్తులో రైతుల నుంచి నీటి తీరు వా వసూలు చేయబోమని సిఎం స్పష్టం చేశారు. మెదక్ జిల్లా కలెక్టరేట్, ఎస్‌పి కార్యాలయ భవనాల నిర్మాణానికి బుధవారం సాయంత్రం సిఎం కెసిఆర్ శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, హరీశ్‌రావు, ఉపసభాపతి ఎం.పద్మాదేవేందర్‌రెడ్డి, పలువురు ఉన్నతాధికారు లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన బహిరంగసభలో సిఎం కెసిఆర్ ప్రసంగిస్తూ నీటి ప్రాజెక్టులు, కాలువల నిర్వహణ బాధ్యత ఇకపై ప్రభుత్వమే చూసుకుంటుందని, ఆ పూర్తి భారం ప్రభుత్వమే మోస్తుందని ఆయన తెలిపారు. రైతులు ఏ కార్యాలయానికి వెళ్లకుండా భూ రికార్డుల ప్రక్షాళన 100 రోజుల్లో పూర్తి చేయగలిగామని చెప్పారు. రికార్డు సమయంలో అధికారులు ప్రజల ఇంటి ముందుకు వచ్చి భూ రికార్డుల ప్రక్షాళన చేశారన్నారు. దేశంలో నే భూ రికార్డులు ప్రక్షాళన చేసిన రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. భూ రికార్డుల ప్రక్షాళన చేయలేమని స్వయంగా ఉత్తరప్రదేశ్ మాజీ సిఎం అఖిలేశ్ యాదవ్ తనతో అన్నారని, భూ రికార్డులను ముట్టుకుంటే ప్రభుత్వం పడిపోతుందని మహారాష్ట్ర ప్రభుత్వం చెప్పిందన్నారు. రైతులకు పెట్టుబడి సాయం దేశంలోనే కాదు ప్రపంచంలోనే ఎక్కడా లేదన్నారు.

ఎన్నికలు జరిపినంత చిత్తశుద్ధిగా రైతుబంధు పథకాన్ని అధికారులు అమలు చేయబోతున్నారని సిఎం చెప్పారు. దేశంలో ఎక్కడా జరగని సంక్షేమ పథకాలు రాష్ట్రంలో అమలు చేస్తున్నామని తెలిపారు. ఉద్యమం కోసం నేను బయలుదేరినప్పుడు అవహేళన చేశారని, తెలంగాణ వస్తే చిమ్మ చీకటి అవుతుందని అపోహలు పుట్టించారని, రాష్ట్రంలో 2014 కంటే ముందు తెలంగాణలో విద్యుత్ ఉంటే వార్త అని, నేడు విద్యుత్ పోతే వార్త అని ఆయన అన్నారు. తెలంగాణను మిగులు విద్యుత్ రాష్ట్రంగా తయారు చేసుకోగలుగుతున్నామని చెప్పారు. ప్రస్తుతం 15 వేల మెగావాట్ల స్థాపిత శక్తికి చేరుకున్నామని, రాబోయే కాలంలో 28 వేల మెగావాట్ల స్థాపిత శక్తికి చేరుకుంటామన్నారు. మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ నల్లా నీరు అందించనున్నట్లు, సెప్టెంబరు చివరి నాటికి మెదక్ జిల్లాలో ఏ మారుమూల పల్లెకు పోయినా ప్రతి ఇంటిలో నల్లా కనెక్షన్ కనిపించాలన్నారు. స్వయం పాలనలో ఘనపురం ఆయకట్టుకు పూర్వ వైభవం తీసుకొచ్చామని చెప్పారు. మెదక్‌లో ఉన్న 100 పడకల ఆస్పత్రిని 350 పడకల మల్టీస్పెషాలిటీ ఆస్పత్రి గా ఆప్‌గ్రేడ్ చేయడానికి ఉత్తర్వులు 
ఇచ్చినట్లు సిఎం ప్రకటించారు. నర్సాపూర్‌కు బస్ డిపో మంజూరు చేస్తామని ప్రకటించారు. “ఇవాళ నాకు సంతోషంగా ఉంది. కలలో కూడా అనుకోని ఒక మంచిపని జరిగింది. ఈ జిల్లాలోనే పుట్టి ఈ జిల్లాలోనే పెరిగాను. మెదక్ జిల్లా బిడ్డగా అందరి ఆశీర్వాదంతో తెలంగాణ సాధించా. మెదక్ జిల్లా కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయాలకు శంకుస్థాపన చేసినందుకు సంతోషంగా ఉంది” అని సిఎం అన్నారు.
యావత్ దేశం ఆశ్చర్యపోతుంది
ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి చూసి యావత్ దేశం ఆశ్చర్యపోతోందని ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు అన్నారు. అన్ని రంగాల్లో త్వరితగతిన మంచి ఫలితాలు సాధిస్తున్నామన్నారు. మాయ మాటలు చెప్పే అవసరం తమ ప్రభుత్వానికి లేదన్నారు. రాష్ట్ర సొంత ఆదాయం 20 శాతం పెరిగిందని, దేశంలోనే ఏ రాష్ట్రం సొంత ఆదాయం తెలంగాణ రాష్ట్రమంత లేదన్నారు. తెలంగాణ రాష్ట్రం అందరి కృషితో ముందుకు పోతుందన్నారు.
దుర్మార్గంగా మాట్లాడుతున్న ప్రతిపక్షాలు
ప్రతి పక్షాలు దుర్మార్గంగా మాట్లాడుతున్నాని, కాంగ్రెస్ టిడిపి సాక్షిగానే ఘనపురం ఆనకట్ట నాశనమైందని సిఎం కెసిఆర్ అన్నారు. ప్రజలకు నీళ్లు ఇచ్చిన కరెంటు ఇచ్చినా ప్రతిపక్షాలకు గిట్టుబాటు కావడం లేదన్నారు. ఓట్లు వేయరనే భయం కాంగ్రెస్ నాయకులకు పట్టుకుందన్నారు. 85 అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్లు రావని సీఎం తేల్చిచెప్పారు. మెదక్ జిల్లాలో 10 అసెంబ్లీ స్థానాలు, రెండు ఎంపీ స్థానాలు టీఆర్‌ఎస్ పార్టీ గెలవాలని కోరారు.ప్రజల ముందు ప్రభుత్వం చేసే పనులు కనిపిస్తున్నాయన్నారు. జూన్ 2న అద్భుతమైన రిజిస్ట్రేషన్ విధానం రాబోతున్నదన్నారు. ల్యాండ్ మ్యుటేషన్ కోసం ఏ ఆఫీసుకు వెళ్లనవసరం లేదని, రిజిస్ట్రేషన్ల విధానం దేశానికి దిక్సూచిలా ఉంటుందని చెప్పారు. పాస్ బుక్కులు, రిజిస్ట్రేషన్ కాయితాలు పోస్టులోనే ఇంటికొస్తాని తెలిపారు.
70 ఏళ్లలో జరగని అభివృద్ధి జరిగింది
రాష్ట్రంలో 70 ఏళ్లలో జరగని అభివృద్ధి నాలుగేళ్ల కాలంలో జరిగిందని, ఇది కలా నిజమా అని ఊహించనంత అభివృద్ధి జరిగిందని రాష్ట్ర మంత్రి టి.హరీశ్‌రావు అన్నారు. మెదక్ జిల్లాకు రైలు వస్తోందని, ఘనపురం ఆనకట్టను రూ. 100 కోట్లతో బాగు చేయించామని, ఫలితంగా ఘనపురం ఆయకట్టు కింద 25 వేల ఎకరాల్లో పంట పండుతోందన్నారు. రూ.1000 కోట్లతో మిషన్ భగీరథ పూర్తి చేసి మంచినీళ్లు ఇస్తున్నామని, రూ.50 కోట్లతో ఫోర్‌లైన్ రోడ్డు వేసుకున్నామని, మెదక్ మార్కెట్‌తో పాటు తుప్రాన్ మార్కెట్లను ఆధునీకరించుక్నుమని మంత్రి వివరించారు. మండలానికి ఒక గోడౌన్ నిర్మించామని, కొత్తగా 151 గ్రామపంచాయతీలు ఏర్పాటు చేశామని, 2 వేల చెరువుల పునరుద్ధరణకు రూ.550 కోట్లు కేటాయించామ చెప్పారు. మెదక్ జిల్లా గురించి క్షుణ్ణంగా తెలిసిన వ్యక్తి సిఎంకెసిఆర్ అన్నారు. గతంలో ప్రధానులు ప్రాతినిధ్యం వహించి మెదక్‌ను మరిచిపోయారన్నారు. మెదక్‌కు మూడు జాతీయ రహదారులు మంజూయ్యాయని, మెదక్ అభివృద్ధిని చూసి కాంగ్రెస్ నాయకులు ఓర్చుకోలేక కుట్రలతో ప్రాజెక్టులను అడ్డుకుంటున్నారు. దేశమంతా సిఎం కెసిఆర్‌ను మెచ్చుకుంటుంటే కాంగ్రెస్ నాయకులు నొచ్చుకుంటున్నారని హరీష్‌రావు మండిపడ్డారు.
మెదక్ జిల్లా ప్రజల ఆంకాంక్ష నెరవేరిందని డిప్యూటీ స్పీకర్ ఎం.పద్మా దేవెందర్‌రెడి సంతోషం వ్యక్తం చేశారు. సభలో దశాబ్దాల నుంచి జిల్లా కేంద్రం కోసం కొట్టాడినమని, జిల్లా ప్రజల చిరకాల స్వప్నాన్ని సీఎం కేసీఆర్ సాకారం చేశాన్నారు. మెదక్‌ను అన్ని రంగాల్లో సీఎం అభివృద్ధి చేస్తున్నాన్నారు. అభివృద్ధిలో మెదక్ జిల్లాను ముందుంచుతున్నందుకు కేసీఆర్‌కు శిరస్సు వంచి నమస్కస్తున్నామని ఆమె అన్నారు.