Home తాజా వార్తలు హెచ్చుతగ్గులు ఉంటాయ్

హెచ్చుతగ్గులు ఉంటాయ్

Investors focus on Reliance and ICICI Bank

 

క్యూ2 ఫలితాలు, అంతర్జాతీయ పరిణామాలను గమనించాలి
రిలయన్స్, ఐసిఐసిఐ బ్యాంక్‌పై ఇన్వెస్టర్ల దృష్టి
ఈవారం మార్కెట్‌పై విశ్లేషకులు

ముంబై : సెప్టెంబర్ ముగింపు నాటి రెండో త్రైమాసిక ఫలితాలు ఈ వారం మార్కెట్ ట్రెండ్‌ను నిర్దేశించనున్నాయని అలాగే డెరివేటివ్స్ గడువు తేదీ ఉండడం వల్ల తీవ్ర హెచ్చుతగ్గులు ఉంటాయని విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఇంకా అంతర్జాతీయ పరిణామాలు కూడా మార్కెట్ కీలకమని హెచ్చరిస్తున్నారు. స్వస్తికా ఇన్వెస్ట్‌మెంట్ హెడ్ (రీసెర్చ్) సంతోష్ మీనా మాట్లాడుతూ, క్యూ2 ఫలితాలను చాలా కంపెనీలు ప్రకటించాల్సి ఉందని, అక్టోబర్ ఎఫ్ అండ్ ఒ గడువు తేదీ వల్ల మార్కెట్లో ఒడిదుడుకులు ఉంటాయని అన్నారు. ఇప్పటికే క్యూ2 ఫలితాలను ప్రకటించిన రిలయన్స్, ఐసిఐసిఐ బ్యాంక్‌లపై సోమవారం మార్కెట్లో స్పందన కనిపిస్తుందని తెలిపారు. టెక్ మహీంద్రా, అంబుజా సిమెంట్, యాక్సిస్ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్, అదానీ పోర్ట్, ఎల్ అండ్ టి, బజాజ్ ఆటో, ఐటిసి, మారుతీ సుజుకీ, డిఎల్‌ఎఫ్, ఇండిగో, టాటా పవర్ వంటి కంపెనీ ఈ వారం త్రైమాసిక ఫలితాలను ప్రకటించనున్నాయి.

మోతిలాల్ ఓస్వాల్ ఫైనాన్స్ సర్వీసెస్ (రిటైల్ రీసెర్చ్) హెడ్ సిద్ధార్థ్ ఖేమ్కా మాట్లాడుతూ, అంతర్జాతీయ అంశాలతో పాటు రిలయన్స్, ఐసిఐసిఐ బ్యాంక్ ఫలితాలపై సోమవారం ఇన్వెస్టర్లు రియాక్ట్ కానున్నారని అన్నారు. శనివారం ఐసిఐసిఐ బ్యాంక్ ఉత్తమ త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది. బ్యాంక్ అత్యధికంగా లాభం రూ.5,511 కోట్లు, అలాగే ఆరోగ్యకరమైన రుణ వృద్ధిని నమోదు చేసింది. మరోవైపు మొండి బకాయిలు తగ్గుముఖం పట్టాయి. బిలియనీర్ ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ శుక్రవారం ఫలితాలను వెల్లడించగా, కంపెనీ నికర లాభం 43 శాతం పెరిగిందని ఆయన అన్నారు. ఇక జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ హెడ్ (రీసెర్చ్) వినోద్ నాయర్ మాట్లాడుతూ, క్యూ2 ఫలితాలు ఈవారం మార్కెట్‌ను నిర్దేశించనున్నాయని, మరింతగా మార్కెట్లు పడిపోవచ్చని అన్నారు. వీటితో పాటు రూపాయి, బ్రెంట్ క్రూడ్ ఆయిల్, విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు (ఎఫ్‌ఐఐ) కూడా మార్కెట్లను ప్రభావితం చేయనున్నాయి.