Home తాజా వార్తలు చేవ తగ్గని వార్నర్

చేవ తగ్గని వార్నర్

 

ఐపిఎల్‌పై తనదైన ముద్ర

మన తెలంగాణ/క్రీడా విభాగం: ఇటీవల ముగిసిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) సీజన్12లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆటగాడు డేవిడ్ వార్నర్ తనదైన ముద్ర వేశాడు. ఐపిఎల్‌లో తానెంత కీలక ఆటగాడో తన బ్యాట్ ద్వారా మరోసారి నిరూపించాడు. బాల్ టాంపరింగ్ వివాదంలో చిక్కుకుని దాదాపు ఏడాది పాటు క్రికెట్‌కు దూరమైన వార్నర్ ఐపిఎల్‌తో మళ్లీ కెరీర్‌కు శ్రీకారం చుట్టాడు. ఈ టోర్నీ ప్రారంభానికి ముందు వార్నర్ బ్యాటింగ్ ఎలా ఉంటుందనే దానిపై సర్వత్ర ఆసక్తి నెలకొంది. తీవ్ర ఒత్తిడి నేపథ్యంలో బరిలోకి దిగుతున్న వార్నర్‌కు స్థాయికి తగ్గ ఆటను కనబరచడం చాలా కష్టమని విశ్లేషకులు సయితం అభిప్రాయపడ్డారు. అయితే వార్నర్ మాత్రం అందరి అంచనాలు తారుమారు చేస్తూ పరుగుల వరద పారించాడు. ఈ సీజన్‌లో ఆడిందే 12 మ్యాచులే అయినా 692 పరుగులు సాధించి ఆరేంజ్ క్యాప్‌ను సొంతం చేసుకున్నాడు. 12 మ్యాచులు ఆడిన వార్నర్ 69.20 సగటుతో 692 పరుగులు చేయడం విశేషం. ఇక అతని స్ట్రయిర్‌రేట్ 143.87గా ఉంది. దీన్ని బట్టి అతని విధ్వంసం ఏ స్థాయిలో సాగిందో ఊహించుకోవచ్చు. మరోవైపు వార్నర్ ఈ సీజన్‌లో ఓ సెంచరీ, మరో 8 అర్ధ సెంచరీలు కొట్టాడు. అంతేగాక 57 ఫోర్లు, మరో 21 సిక్సర్లను కూడా బాదాడు. కాగా, హైదరాబాద్ ఈసారి ప్లేఆఫ్‌కు చేరిందంటే అందకు వార్నర్ ఆడిన విధ్వంసక ఇన్నింగ్స్‌లే కారణంగా చెప్పాలి. సహచర ఓపెనర్ జానీ బైర్‌స్టోతో కలిసి పలు మ్యాచుల్లో వార్నర్ కళ్లు చెదిరే శుభారంభాన్ని అందించాడు. వార్నర్ దూకుడైన బ్యాటింగ్ వల్లే హైదరాబాద్ రన్‌రేట్‌లో ప్రత్యర్థులకు అందనంత ఎత్తులో నిలిచింది. పంజాబ్, కోల్‌కతా వంటి జట్లను వెనక్కి నెట్టి హైదరాబాద్ ప్లేఆఫ్‌కు అర్హత సాధించిందంటే దానికి ప్రధాన కారణం రన్‌రేట్ అనడంలో సందేహం లేదు. మెరుగైన రన్‌రేట్ వల్లే మిగిలిన జట్లను వెనక్కి నెట్టి హైదరాబాద్ నాకౌట్ రేసులో నిలిచింది. ఇక, ఈ సీజన్‌లో వార్నర్ బ్యాటింగ్ తీరును ఎంత పొగిడినా తక్కువే. ఏడాదిపైగా క్రికెట్‌కు దూరంగా ఉన్నా దాని ప్రభావం తన బ్యాటింగ్‌పై పడకుండా వార్నర్ జాగ్రత్త పడ్డాడు. తొలి మ్యాచ్ నుంచే తనదైన శైలీలో చెలరేగి పోయాడు. ప్రత్యర్థి బౌలర్లపై ఎదురుదాడి చేస్తూ పరుగుల వర్షం కురిపించాడు. ఒకవైపు వార్నర్, మరోవైపు బైర్‌స్టోలు చెలరేగడంతో హైదరాబాద్‌కు ఎదురులేకుండా పోయింది. ఇక, వార్నర్‌పై సర్‌రైజర్స్ పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టడంలో వార్నర్ సఫలమయ్యాడు. ప్రతి మ్యాచ్‌లోనూ నిలకడగా ఆడుతూ జట్టుకు అండగా నిలిచాడు. సహచర ఆటగాడు స్టీవ్ స్మిత్ పేలవమైన ఆటతో సతమతమైన సమయంలో వార్నర్ అసాధారణ రీతిలో చెలరేగడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే సత్తా కలిగిన వార్నర్ ఐపిఎల్‌లో ఎదురులేని బ్యాట్స్‌మన్‌గా నిలిచాడు. రోహిత్ శర్మ, డివిలియర్స్, సురేశ్‌రైనా, ధోని, కోహ్లి వంటి దిగ్గజాలు బరిలో ఉన్నా వారందరిని వెనక్కి నెట్టి అత్యధిక పరుగులు సాధించిన క్రికెటర్‌గా వార్నర్ నిలువడం విశేషం. అది కూడా తీవ్ర ఒత్తిడి నెలకొన్న సమయంలో వార్నర్ ఇలాంటి ప్రదర్శన చేయడం నిజంగా ప్రశంసనీయమే. ప్రపంచ క్రికెట్‌లోని అత్యుత్తమ బ్యాట్స్‌మన్‌లలో వార్నర్ ఒకడనే విషయం తెలిసిందే. అయితే బాల్ టాంపరింగ్ వివాదం వార్నర్‌ను పీకల్లోతు కష్టాల్లోకి నెట్టింది. ఇలాంటి పరిస్థితుల్లో మళ్లీ కోలుకుని పూర్వ వైభవం సాధిస్తాడా అనేది అందరిలోనూ ఆసక్తి రేకెత్తించింది. కానీ, అందరి అభిప్రాయాలను తారుమారు చేస్తూ వార్నర్ ఐపిఎల్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగి పోయాడు. నిషేధం తన బ్యాటింగ్‌పై ఏమాత్రం ప్రభావం చూపలేదని, అంతేగాక మరింత రాటుదేలెలా చేసిందని నిరూపించాడు.
భారీ ఆశలు
ఇక, ఐపిఎల్‌లో పరుగుల వర్షం కురిపించిన వార్నర్‌పై ఆస్ట్రేలియా జట్టు భారీ ఆశలు పెట్టుకుంది. ఇంగ్లండ్ వేదికగా జరిగే వన్డే ప్రపంచకప్‌లో వార్నర్ మెరుగైన ప్రదర్శన కనబరుస్తాడనే నమ్మకంతో జట్టు ఉంది. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే సత్తా కలిగిన వార్నర్ విజృంభిస్తే ప్రత్యర్థి జట్ల బౌలర్లకు చుక్కలు కనిపించడం ఖాయం. ఐపిఎల్‌లో అసాధారణ బ్యాటింగ్‌తో అలరించిన వార్నర్ వరల్డ్‌కప్‌లోనూ అదే జోరును కనబరచాలనే పట్టుదలతో ఉన్నాడు. ఆస్ట్రేలియా జట్టు కూడా వార్నర్‌పైనే నమ్మకాన్ని ఉంచింది. ఈ ప్రపంచకప్‌లో వార్నర్ మెరుపులు మెరిపించడం ఖాయమని జట్టు యాజమాన్యం భావిస్తోంది. నిషేధం ముగిసిన తర్వాత ఆడిన తొలి టోర్నీ ఐపిఎల్‌లో వార్నర్ రాణించడం ఆస్ట్రేలియాకు శుభసూచకంగా చెప్పాలి. ప్రపంచంలోని అత్యతుత్తమ ఓపెనర్లలో ఒకడిగా పేరున్న వార్నర్ తన స్థాయికి తగ్గ ఆటను కనబరిస్తే ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియాకు ఎదురు ఉండదనే చెప్పాలి.

IPL 2019: David Warner gets Orange cap