Home IPL 2019 హాట్ కేకుల్లా అమ్ముడుపోయిన ఐపిఎల్ ఫైనల్ మ్యాచ్ టికెట్లు!

హాట్ కేకుల్లా అమ్ముడుపోయిన ఐపిఎల్ ఫైనల్ మ్యాచ్ టికెట్లు!

IPLహైదరాబాద్: నెలన్నర రోజుల పాటు క్రికెట్ అభిమానులను అలరించిన ఇండియన్ ప్రిమీయర్ లీగ్(ఐపిఎల్) 12వ సీజన్ ముగింపు దశకు చేరుకుంది. ఈ నెల 12న ఉప్పల్ వేదికగా జరుగనున్న ఫైనల్ తో ఐపిఎల్ 2019 సీజన్ కు తెరపడనుంది. ఇక ఐపిఎల్ ఫైనల్ మ్యాచ్ టికెట్ల అమ్మకాల కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూశారు. అయితే, తాజా సమాచారం ప్రకారం ఫైనల్ మ్యాచ్ టిక్కెట్లు హాట్ కేకుల్లా అమ్ముడుపోయినట్లు తెలుస్తోంది. అమ్మకాలు ప్రారంభించిన రెండు నిమిషాల వ్యవధిలోని టికెట్లు ఖతం అయినట్లు సమాచారం. ఇక ప్లేఆఫ్స్ మ్యాచుల టికెట్లను రెండు మూడు రోజుల ముందే అందుబాటులో ఉంచిన ఐపిఎల్ నిర్వాహకులు ఫైనల్ మ్యాచ్ టికెట్ల అమ్మకాలపై మాత్రం ఎలాంటి ప్రకటన ఇవ్వలేదు. ముందస్తు ప్రకటనలు లేకుండా అమ్మకాలు చేసి కేవలం రెండు నిమిషాల్లో టికెట్లను అన్నింటినీ అమ్మేశారని తెలిసింది. మంగళవారం మధ్యాహ్నం 2 గంటలకు ‘ఈవెంట్స్ డాట్ కామ్’ అనే సంస్థ ఆన్ లైన్లో టికెట్ల అమ్మకాలను ప్రారంభించింది.

అయితే, దీనికి సంబంధించి ఒక రోజు ముందో, కొన్ని గంటల ముందో ఎలాంటి ప్రకటనలు చేయలేదు. అలాగే మీడియాకు కూడా ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. గుట్టు చప్పుడు కాకుండా టికెట్ల అమ్మకాలు జరిపిన సదరు సంస్థ…  టికెట్లు అన్నీ అమ్ముడైపోయినట్లు నిమిషాల వ్యవధిలోనే తన అధికారిక వెబ్ సైట్ లో చూపించింది. అంతేగాక కేవలం రూ.1500, రూ.2000, రూ.2500, రూ. 5000 టికెట్లను మాత్రమే అందుబాటులో ఉంచిందట. నిమిషాల వ్యవధిలోనే 38 వేల టికెట్లు అమ్ముడుపోవడం ఆశ్చర్యంగా ఉందని అభిమానులు అంటున్నారు. దీనిపై మాట్లాడానికి ఈవెంట్స్ ప్రతినిధి సుధీర్ గానీ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ సిఇఒ పాండురంగ మూర్తి గానీ అందుబాటులో లేరని సమాచారం. ప్రస్తుతం ప్లేఆఫ్స్ జరుగుతున్న సంగతి తెలిసిందే. మంగళవారం చెన్నై వేదికగా జరిగిన తొలి క్యాలిఫైయర్ మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ ను ఓడించిన ముంబయి ఇండియన్స్ జట్టు నేరుగా ఫైనల్ కు చేరింది. ఇవాళ ఎలిమినేటర్ మ్యాచ్ లో ఢిల్లీతో హైదరాబాద్ తలపడబోతుంది. వైజాగ్ వేదికగా ఈ మ్యాచ్ జరుగనుంది. దీంట్లో విజయం సాధించిన జట్టు రెండో క్వాలిఫైయర్ మ్యాచ్ లో చెన్నైతో ఆడనుంది.

IPL 2019 Final Match Tickets Sold out within Minutes