Saturday, April 20, 2024

కోల్‌కతాకు షాక్

- Advertisement -
- Advertisement -

రాణించిన గైక్వాడ్, రాయుడు
జడేజా మెరుపులు, రాణా శ్రమ వృథా
నైట్‌రైడర్స్‌పై చెన్నై విజయం

IPL 2020: CSK Win by 6 Wickets against KKR

దుబాయి: చివరి బంతి వరకు ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ ఆరు వికెట్ల తేడాతో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ను చిత్తు చేసింది. ఈ ఓటమితో కోల్‌కతా ప్లేఆఫ్ అవకాశాలు క్లిష్టంగా మారాయి. మరోవైపు ఇప్పటికే ప్లేఆఫ్ రేసు నుంచి వైదొలిగిన చెన్నై ఈ మ్యాచ్‌లో గెలిచి కాస్త ఊరట పొందింది. గురువారం జరిగిన మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన కోల్‌కతా 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది. నితీష్ రాణా అద్భుత బ్యాటింగ్‌తో జట్టును ఆదుకున్నాడు. ప్రత్యర్థి బౌలర్లను దీటుగా ఎదుర్కొన్న రాణా 61 బంతుల్లోనే పది ఫోర్లు, 4 భారీ సిక్సర్లతో 87 పరుగులు చేశాడు. మరో ఓపెనర్ శుభ్‌మన్ గిల్ 4 ఫోర్లతో 27 పరుగులు సాధించాడు. చివర్లో దినేశ్ కార్తీక్ 21 (నాటౌట్) వేగం గా ఆడడంతో కోల్‌కతా గౌరవప్రద స్కోరును సాధించింది. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన చెన్నై ఇన్నింగ్స్ చివరి బంతికి విజయాన్ని అందుకుంది. రవీంద్ర జడేజా కీలక సమయంలో అద్భుత బ్యాటింగ్‌తో చెన్నై విజయంలో ముఖ్య భూమిక పోషించాడు. విధ్వంసక ఇన్నింగ్స్ ఆడిన జడేజా 11 బంతుల్లోనే మూడు సిక్సర్లు, రెండు ఫోర్లతో అజేయంగా 31 పరుగులు చేసి జట్టుకు చిరస్మరణీయ విజయం అందించాడు. ఫెర్గూసన్ వేసిన ఇన్నింగ్స్ 19 ఓవర్లలో చెన్నై 20 పరుగులు పిండుకుంది. చివరి ఓవర్‌లో పది పరుగులు చేసి అద్భుత విజయాన్ని సొంతం చేసుకుంది. మరోవైపు యువ ఆటగాడు రుతురాజ్ గైక్వాడ్ మరోసారి కీలక ఇన్నింగ్స్‌తో అలరించాడు. అసాధారణ బ్యాటింగ్‌ను కనబరిచిన ఓపెనర్ గైక్వాడ్ 53 బంతుల్లోనే రెండు సిక్స్‌లు, ఆరు ఫోర్లతో 72 పరుగులు చేశాడు. తెలుగుతేజం అంబటి రాయుడు 20 బంతుల్లోనే ఐదు ఫోర్లు, సిక్సర్‌తో వేగంగా 38 పరుగులు చేసి జట్టు విజయంలో తనవంతు పాత్ర పోషించాడు.

IPL 2020: CSK Win by 6 Wickets against KKR

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News