Friday, March 29, 2024

ఢిల్లీ సూపర్ విక్టరీ

- Advertisement -
- Advertisement -

దుబాయి: ఐపిఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ శుభారంభం చేసింది. ఆదివారం కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ సూపర్ ఓవర్‌లో విజయం సాధించింది. ఇరు జట్ల స్కోర్లు సమం కావడంతో సూపర్ ఓవర్ ద్వారా ఫలితాన్ని తేల్చారు. సూపర్ ఓవర్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన పంజాబ్ రెండు పరుగులు మాత్రమే చేసింది. ఇక పంజాబ్ ఉంచిన లక్ష్యాన్ని ఢిల్లీ మూడు బంతుల్లోనే ఛేదించింది. అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసింది. బౌలర్లు ఆధిపత్యం చెలాయించిన ఈ మ్యాచ్‌లో పరుగులు సాధించేందుకు బ్యాట్స్‌మెన్ తీవ్రంగా శ్రమించక తప్పదు. పంజాబ్ బౌలర్లు కచ్చితమైన లైన్ అండ్ లెన్త్‌తో బౌలింగ్ చేయడంతో ఢిల్లీ తక్కువ స్కోరుకే పరిమితమైంది. కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడిన శ్రేయస్ అయ్యర్ 3 సిక్సర్లతో 39 పరుగులు చేశాడు. యువ ఆటగాడు రిషబ్ పంత్ 4 ఫోర్లతో 31 పరుగులు సాధించాడు. చివర్లో మార్కోస్ స్టొయినిస్ విధ్వంసక ఇన్నింగ్స్‌తో చెలరేగి పోయాడు.

పంజాబ్ బౌలర్లను హడలెత్తించిన స్టొయినిస్ కళ్లు చెదిరే అర్ధ సెంచరీ సాధించాడు. విధ్వంసక బ్యాటింగ్ కనబరిచిన స్టొయినిస్ 21 బంతుల్లోనే మూడు భారీ సిక్సర్లు, మరో ఏడు ఫోర్లతో 53 పరుగులు చేశాడు. స్టొయినిస్ అసాధారణ బ్యాటింగ్‌తో ఢిల్లీ మెరుగైన స్కోరును సాధించింది. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్‌కు ఆరంభంలోనే కష్టాలు మొదలయ్యాయి. ఢిల్లీ బౌలర్లు కచ్చితమైన లైన్ అండ్ లెన్త్‌తో బౌలింగ్ చేస్తూ పంజాబ్‌ను కట్టడి చేశారు. రబడా, అక్షర్ పటేల్ అద్భుత బౌలింగ్‌ను కనబరిచారు. మరోవైపు రవిచంద్రన్ అశ్విన్ ఒకే ఓవర్‌లో రెండు వికెట్లు పడగొట్టి ఢిల్లీకి పైచేయి అందించాడు. అయితే గాయం బారిన పడిన అశ్విన్ ఆ తర్వాత మళ్లీ బౌలింగ్‌కు దిగలేదు. ఒకవేళ వికెట్లు పడుతున్నా మయాంక్ అగర్వాల్ అసాధారణ పోరాట పటిమను కనబరిచాడు. ఢిల్లీ బౌలర్లపై ఎదురు దాడికి దిగిన మయాంక్ మ్యాచ్‌ను టైగా ముగించడంలో కీలక పాత్ర పోషించాడు. అసాధారణ ఇన్నింగ్స్ ఆడిన మయాంక్ 60 బంతుల్లోనే ఏడు ఫోర్లు, నాలుగు సిక్సర్లతో 89 పరుగులు చేశాడు. అయితే మయాంక్ కీలక సమయంలో ఔట్ కావడంతో పంజాబ్ విజయవకాశాలు దెబ్బతిన్నాయి. ఇక సూపర్‌లో ఢిల్లీ బౌలర్ అసాధారణ రీతిలో రాణించాడు. రెండు పరుగులు మాత్రమే ఇచ్చి లోకేశ్ రాహుల్, పురాన్‌లను ఔట్ చేశాడు. దీంతో పంజాబ్ రెండు పరుగులు మాత్రమే సాధించింది. దీన్ని ఢిల్లీ అలవోకగా ఛేదించింది.

IPL 2020: DC Beat KXIP in Super Over

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News