Saturday, April 20, 2024

చేజేతులా ఓడిన సన్‌రైజర్స్

- Advertisement -
- Advertisement -

దుబాయి : ఐపిఎల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు శుభారంభం చేసింది. సోమవారం సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో బెంగళూరు 10 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో గెలిచే స్థితిలోఉండి కూడా హైదరాబాద్ చేజేతులా ఓటమి పాలైంది. ముందుగా బ్యాటింగ్ చేసిన బెంగళూరు 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసింది. తర్వాత లక్షఛేదనకు దిగిన హైదరాబాద్ 19.4 ఓవర్లలో 153 పరుగులకే కుప్పకూలింది. బెంగళూరు బౌలర్లు కీలక సమయంలో అద్భుత బౌలింగ్‌తో జట్టుకు చిరస్మరణీయ విజయం అందించారు. స్టార్ స్పిన్నర్ యజువేంద్ర చాహల్ వరుస బంతుల్లో రెండు వికెట్లు పడగొట్టి హైదరాబాద్‌ను కష్టాల్లోకి నెట్టాడు. హైదరాబాద్ జట్టులో జానీ బైర్‌స్టో ఒక్కడే రాణించాడు. బెంగళూరు బౌలర్లను దీటుగా ఎదుర్కొన్న బైర్‌స్టో 43 బంతుల్లో రెండు సిక్సర్లు, ఆరు ఫోర్లతో 61 పరుగులు చేశాడు. మనీష్ పాండే (34) తప్ప మిగతావా రు విఫలం కావడంతో హైదరాబాద్‌కు ఓటమి తప్పలేదు.
పడిక్కల్ జోరు..
అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేపట్టిన బెంగళూరుకు ఓపెనర్లు దేవ్‌దూత్ పడిక్కల్, అరోన్ ఫించ్ శుభారంభం అందించారు. ఇద్దరు హైదరాబాద్ బౌలర్లను దీటుగా ఎదుర్కొంటూ స్కోరును ముందుకు నడిపించారు. కెరీర్‌లో తొలి ఐపిఎల్ మ్యాచ్ ఆడిన పడిక్కల్ ఆరంభం నుంచే దూకుడుగా ఆడాడు. అద్భుత బ్యాటింగ్‌తో హైదరాబాద్ బౌలర్లను హడలెత్తించాడు. ఫించ్ కూడా మెరుగైన బ్యాటింగ్‌ను కనబరిచాడు. ఇటు ఫించ్ అటు పడిక్కల్ కుదురుగా ఆడడంతో స్కోరు వేగంగా పరిగెత్తింది. చూడచక్కని షాట్లతో అలరించిన పడిక్కల్‌ను ఔట్ చేసేందుకు సన్‌రైజర్స్ బౌలర్లు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. కీలక ఇన్నింగ్స్ ఆడిన పడిక్కల్ 42 బంతుల్లోనే 8 ఫోర్లతో 56 పరుగులు చేసి విజయ్ శంకర్ వేసిన అద్భుత బంతికి క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఇదే క్రమంలో తొలి వికెట్‌కు 90 పరుగులు జోడించాడు. ఆ తర్వాతి ఓవర్‌లోనే ఫించ్ కూడా ఔటయ్యాడు. రెండు సిక్స్‌లు, ఓ ఫోర్‌తో 29 పరుగులు చేసిన ఫించ్‌ను అభిషేక్ శర్మ ఔట్ చేశాడు. మరోవైపు కెప్టెన్ విరాట్ కోహ్లి ఎక్కువ సేపు క్రీజులో నిలువలేక పోయాడు. 14 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ చేరాడు. మరోవైపు స్టార్ బ్యాట్స్‌మన్ ఎబి.డివిలియర్స్ విధ్వంసక బ్యాటింగ్‌తో చెలరేగి పోయాడు. హైదరాబాద్ బౌలర్లను దీటుగా ఎదుర్కొన్న డివిలియర్స్ 30 బంతుల్లోనే రెండు సిక్సర్లు, నాలుగు ఫోర్లతో 51 పరుగులు సాధించాడు. దీంతో బెంగళూరు స్కోరు 163 పరుగులకు చేరింది.

IPL 2020: RCB beat SRH by 10 Runs

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News