Home తాజా వార్తలు రాజస్థాన్ అదరహో

రాజస్థాన్ అదరహో

 చెన్నైపై స్మిత్ సేన గెలుపు

చెలరేగిన సంజు శాంసన్.. డుప్లెసిస్ శ్రమ వృథా

షార్జా : ఐపిఎల్‌లో రాజస్థాన్ రాయల్స్ బోణీ కొట్టింది. మంగళవారం చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ 16 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 216 పరుగులు చేసింది. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన చెన్నై నిర్ణీత ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 200 పరుగులు చేసి ఓటమి పాలైంది. డుప్లెసిస్ అసాధారణ పోరాట పటిమతో చెన్నై గెలుపు కోసం చివరి వరకు పోరాడాడు. అయితే మిగతా బ్యాట్స్‌మెన్ విఫలం కావడం, లక్షం మరి పెద్దదిగా ఉండడంతో చెన్నైకి పరాజయం తప్పలేదు. క్లిష్టమైన లక్షంతో బ్యాటింగ్‌కు దిగిన చెన్నైకి ఓపెనర్లు మురళీ విజయ్, షేన్ వాట్సన్ శుభారంభం అందించారు. చెలరేగి ఆడిన వాట్సన్ 4 ఫోర్లు, సిక్స్‌తో వేగంగా 33 పరుగులు చేశాడు. అంతేగాక విజయ్ (21)తో కలిసి తొలి వికెట్‌కు 56 పరుగులు జోడించాడు. మరోవైపు అద్భుత ఇన్నింగ్స్ ఆడిన డుప్లెసిస్ 37 బంతుల్లోనే ఏడు భారీ సిక్సర్లు, మరో ఫోర్‌తో 79 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. మరోవైపు కెప్టెన్ ధోనీ మూడు సిక్సర్లతో 29 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు.
సంజు వీరవిహారం..
అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన రాజస్థాన్ రాయల్స్‌కు ఆరంభంలోనే షాక్ తగిలింది. ఓపెనర్‌గా దిగిన యశస్వి జైస్వాల్ ఆరు పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ చేరాడు. అయితే వన్‌డౌన్‌లో వచ్చిన సంజు శాంసన్ అసాధారణ బ్యాటింగ్‌తో చెలరేగి పోయాడు. కెప్టెన్ స్టీవ్ స్మిత్‌తో కలిసి శాంసన్ స్కోరును పరిగెత్తించాడు. చెన్నై బౌలర్లపై ఎదురుదాడికి దిగిన సంజు సిక్సర్లతో హోరెత్తించాడు. అతన్ని కట్టడి చేసేందుకు ప్రత్యర్థి బౌలర్లు చేసిన వ్యూహాలన్ని బెడిసి కొట్టాయి. సంజు ఆకాశమే హద్దుగా చెలరేగి పోయాడు. అతన్ని కట్టడి చేయడం చెన్నై బౌలర్ల తరం కాలేదు. అసాధారణ బ్యాటింగ్‌తో సంజు మైదానంలో సిక్సర్ల వర్షం కురిపించాడు. మరోవైపు స్మిత్ సమన్వయంతో ఆడుతూ అతనికి అండగా నిలిచాడు. కళ్లు చెదిరే షాట్లతో విరుచుకు పడిన శాంసన్ సిక్సర్ల మోత మోగించాడు. విధ్వంసక ఇన్నింగ్స్‌తో అలరించిన సంజు 32 బంతుల్లోనే 9 భారీ సిక్సర్లు, ఒక ఫోర్‌తో 74 పరుగులు చేశాడు.

ఇదే క్రమ ంలో స్మిత్‌తో కలిసి రెండో వికెట్‌కు రికార్డు స్థాయిలో 121 పరుగులు జోడించాడు. ఆ తర్వాత స్మిత్ జోరును కనబరిచాడు. అయితే తర్వాత వచ్చిన బ్యాట్స్‌మెన్ ఒకరి తర్వాత ఒకరూ పెవిలియర్ చేరారు. ఒకవైపు వికెట్లు పడుతున్నా స్మిత్ జోరును కొనసాగించాడు. చెన్నై బౌలర్లపై ఎదురుదాడి చేస్తూ స్కోరును పరిగెత్తించాడు. కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడిన స్మిత్ 47బంతుల్లోనే 4 భారీ సిక్సర్లు, మరో నాలుగు ఫోర్లతో కీలకమైన 69 పరుగులు సాధించాడు. ఇక ఎంగిడి వేసిన చివరి ఓవర్లో యువ సంచలనం జోఫ్రా అసాధారణ రీతిలో చెలరేగి పోయాడు. వరుసగా నాలుగు సిక్సర్లు కొట్టి పరుగుల వరద పారించాడు. విధ్వంసక బ్యాటింగ్‌ను కనబరిచిన ఆర్చర్ 8 బంతుల్లోనే 4 సిక్స్‌లతో 27 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. దీంతో రాజస్థాన్ స్కోరు 7 వికెట్ల నష్టానికి 216 పరుగులకు చేరింది.

IPL 2020: RR Beat CSK by 16 runs