Thursday, April 25, 2024

సమరోత్సాహంతో హైదరాబాద్

- Advertisement -
- Advertisement -

సమరోత్సాహంతో హైదరాబాద్
నేడు బెంగళూరుతో తొలి పోరు

 IPL 2020: SRH Match Against RCB Tomorrow 

దుబాయి: యుఎఇ వేదికగా జరుగుతున్న ఐపిఎల్ ట్వంటీ20 సమరానికి సన్ రైజర్స్ హైదరాబాద్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్లు సమరోత్సాహంతో సిద్ధమయ్యాయి. ఈ సీజన్‌లో ఇరు జట్లు తమ మొదటి మ్యాచ్‌ను సోమవారం ఆడనున్నాయి. ఈ మ్యాచ్‌లో గెలిచి టోర్నీలో శుభారంభం చేయాలనే పట్టుదలతో రెండు జట్లు ఉన్నాయి. ఇరు జట్లలోనూ ప్రతిభావంతులైన క్రికెటర్లకు కొదవలేదు. హైదరాబాద్‌లో డేవిడ్ వార్నర్, కేన్ విలియమ్సన్ వంటి దిగ్గజాలు ఉండగా బెంగళూరులో విరాట్ కోహ్లి, ఎబి.డివిలియర్స్ వంటి మ్యాచ్ విన్నర్ బ్యాట్స్‌మన్ ఉన్నారు. ఇక బౌలింగ్‌లో కూడా రెండు జట్లు సమంగా కనిపిస్తున్నాయి. పూర్తి భిన్నమైన పరిస్థితుల్లో జరుగుతున్న ఐపిఎల్‌లో సత్తా చాటేందుకు ఇరు జట్లు సిద్ధమయ్యాయి. బలబలాల్లో రెండు సమవుజ్జీలుగా కనిపిస్తున్నాయి. ఇక వార్నర్, విలియమ్సన్, మనీష్ పాండే, సందీప్, జానీ బైర్‌స్టో, వృద్ధిమాన్ సాహా తదితరులతో హైదరాబాద్ బ్యాటింగ్ చాలా బలంగా ఉంది. వార్నర్ చెలరేగితే ప్రత్యర్థి జట్లు బౌలర్లకు కష్టాలు ఖాయం. ఇక విలియమ్సన్ కూడా మెరుపులు మెరిపించేందుకు సిద్ధంగా ఉన్నాడు.

అఫ్గాన్ యువ సంచలనం రషీద్ ఖాన్ ఈసారి కూడా బౌలింగ్‌లో కీలకంగా మారాడు. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే సత్తా రషీద్‌కు ఉంది. ఇక అఫ్గాన్‌కే చెందిన మహ్మద్ నబి కూడా ఉండనే ఉన్నాడు. ఇక భువనేశ్వర్ కుమార్ రూపంలో మరో పదునైన అస్త్రం హైదరాబాద్‌కు అందుబాటులో ఉంది. బాసిల్ థంపిని కూడా తక్కువ అంచన వేయలేం. ఖలీల్ అహ్మద్, సందీప్ శర్మ, విజయ్ శంకర్, సిద్ధార్థ్ కౌల్ వంటి ప్రతిభావంతులైన బౌలర్లు హైదరాబాద్ జట్టులో ఉన్నారు. ఈసారి కూడా సన్‌రైజర్స్ బౌలర్లపైనే భారీ ఆశలు పెట్టుకుంది. ఇక వార్నర్ సారధ్య ప్రతిభ హైదరాబాద్‌కు అతి పెద్ద ఊరటనిస్తోంది. ఐపిఎల్‌లో విజయవంతమైన కెప్టెన్లలో వార్నర్ ఒకడిగా పేరు తెచ్చుకున్నాడు. అతనికి తగు సలహాలు, సూచనలు ఇచ్చేందుకు విలియమమ్సన్ ఉండనే ఉన్నాడు. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో సమతూకంగా కనిపిస్తున్న హైదరాబాద్ ఐపిఎల్‌లో శుభారంభం చేయాలనే పట్టుదలతో మ్యాచ్‌కు సిద్ధమైంది.
భారీ ఆశలతో
మరోవైపు విరాట్ కోహ్లి నేతృత్వంలోని బెంగళూరు ఈసారి భారీ ఆశలతో ఐపిఎల్‌కు సిద్ధమైంది. సుదీర్ఘ ఐపిఎల్ ప్రస్థానంలోవిరాట్ సేన ఒక్కసారి కూడా ట్రోఫీని సాధించలేక పోయింది. ఈసారైన ఆ లోటును తీర్చుకోవాలనే పట్టుదలతో ఉంది. కోహ్లి, డివిలియర్స్, అరోన్ ఫించ్, చాహల్, సిరాజ్, మోయిన్ అలీ, శివమ్ దూబే, పార్థివ్ పటేల్, స్టెయిన్ తదితరులతో బెంగళూరు చాలా బలంగా కనిపిస్తోంది. ఇక ఈసారి కూడా బెంగళూరు డివిలియర్స్, కోహ్లిపై భారీ ఆశలు పెట్టుకుంది. వీరిలో ఏ ఒక్కరు రాణించినా విజయం నల్లేరుపై నడకే.

 IPL 2020: SRH Match Against RCB Tomorrow 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News