Thursday, April 25, 2024

బెంగళూరు భళా..కోహ్లి సేన చేతిలో కోల్‌కతా చిత్తు..

- Advertisement -
- Advertisement -

బెంగళూరు భళా..
సిరాజ్ మ్యాజిక్, కోల్‌కతాపై కోహ్లి సేన ఘన విజయం

IPL 2020:RCB Win by 8 Wickets against KKR

అబుదాబి: ఐపిఎల్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు విజయపరంపర కొనసాగుతూనే ఉంది. బుధవారం జరిగిన మ్యాచ్‌లో బెంగళూరు 8 వికెట్ల తేడాతో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ను చిత్తు చేసింది. 85 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని బెంగళూరు 13.3 ఓవర్లలోనే కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. ఓపెనర్లు దేవ్‌దూత్ పడిక్కల్ (25), అరోన్ ఫించ్ (16) పరుగులు చేసి వెనుదిరిగారు. గుర్కిరాత్ సింగ్ మాన్ 21 (నాటౌట్), కెప్టెన్ విరాట్ కోహ్లి 18 (నాటౌట్) మిగతా లాంఛనాన్ని పూర్తి చేశారు. బెంగళూరుకు ఈ సీజన్‌లో ఇది ఏడో విజయం కావడం విశేషం. అంతేగాక ప్రస్తుతం కోహ్లి సేన పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి చేరుకుంది.
శివాలెత్తాడు..
అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు ఆరంభం నుంచే కష్టాలు మొదలయ్యాయి. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు స్పీడ్‌స్టర్ మహ్మద్ సిరాజ్ ఆకాశమే హద్దుగా చెలరేగి పోయాడు. తన తొలి ఓవర్ మూడో బంతికే ఓపెనర్ రాహుల్ త్రిపాఠిని ఔట్ చేశాడు. తర్వాతి బంతికే నితీష్ రానాను క్లీన్‌బౌల్డ్ చేశాడు. సిరాజ్ వరుసగా రెండు బంతుల్లో రెండు వికెట్లు తీయడంతో కోల్‌కతా మళ్లీ కోలుకోలేక పోయింది. తర్వాతి ఓవర్‌లో మరో ఓపెనర్ శుభ్‌మన్ గిల్ కూడా ఔటయ్యాడు. ఈ వికెట్‌ను నవ్‌దీప్ సైనీ తీశాడు. ఇక జట్టును ఆదుకుంటాడని భావించిన టామ్ బాటమ్ (10) ఎక్కువ సేపు క్రీజులో నిలువలేక పోయాడు. సిరాజ్ అద్భుత బంతితో బాటమ్‌ను పెవిలియన్ బాట పట్టించాడు. ఇక సిరాజ్ తన తొలి రెండు ఓవర్లు మెయిడిన్‌గా వేయడమే కాకుండా రెండు వికెట్లు తీయడం విశేషం. తొలి స్పెల్‌లో సిరాజ్ మూడు వికెట్లు తీసి కోల్‌కతాను కోలుకోలేని దెబ్బతీశాడు. మరోవైపు కోల్‌కతా ఏ దశలోనూ కుదురుకోలేక పోయింది. క్రిస్ మోరిస్, వాషింగ్టన్ సుందర్, యజువేంద్ర చాహల్‌లు కూడా కచ్చితమైన లైన్ అండ్ లెన్త్‌తో బౌలింగ్ చేయడంతో కోల్‌కతా బ్యాట్స్‌మెన్ వేగంగా పరుగులు చేయలేక పోయారు. జట్టును ఆదుకుంటాడని భావించిన సీనియర్ బ్యాట్స్‌మన్ దినేశ్ కార్తీక్ మరోసారి నిరాశ పరిచాడు. కార్తీక్ 4 పరుగులు మాత్రమే చేసి చాహల్ చేతికి చిక్కాడు. కమిన్స్ (4) కూడా రాణించలేక పోయాడు. కమిన్స్‌ను కూడా చాహల్ వెనక్కి పంపాడు. ఇక ఒంటరి పోరాటం చేసిన కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ మూడు ఫోర్లు, సిక్స్‌తో 30 పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఫెర్గూసన్ (19), కుల్దీప్ (12) కాస్త రాణించడంతో కోల్‌కతా స్కోరు 8 వికెట్ల నష్టానికి 84 పరుగులకు చేరింది. బెంగళూరు బౌలర్లలో సిరాజ్ మూడు, చాహల్ రెండు వికెట్లు పడగొట్టారు.

IPL 2020:RCB Win by 8 Wickets against KKR

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News