Home తాజా వార్తలు పొట్టి క్రికెట్‌కు సర్వం సిద్ధం

పొట్టి క్రికెట్‌కు సర్వం సిద్ధం

చెన్నై: అభిమానులు ఎంతో అతృతతో ఎదురు చూస్తున్న సమయం రానే వచ్చింది. ప్రపంచ క్రికెట్‌లోనే అత్యంత ఆదరణ కలిగిన క్రికెట్ టోర్నమెంట్‌గా పేరు తెచ్చుకున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) ట్వంటీ20 టోర్నమెంట్‌కు శుక్రవారం తెరలేవనుంది. ఒకవైపు కరోనా తీవ్ర రూపం దాల్చినా నిర్వాహకులు మాత్రం ఈసారి భారత్‌లోనే ఐపిఎల్‌ను నిర్వహించేందుకు మొగ్గు చూపారు. కరోనా విజృంభణ నేపథ్యంలో ఆరంభ మ్యాచ్‌లు ప్రేక్షకులు లేకుండా ఖాళీ స్టేడియాల్లోనే నిర్వహించనున్నారు. ఇక గతానికి భిన్నంగా ఈసారి ఆరు వేదికల్లోనే మొత్తం ఐపిఎల్‌ను నిర్వహిస్తున్నారు. ఈసారి హోం గ్రౌండ్, హోం అవే అని నిబంధనలు పాటించడం లేదు. దాదాపు అన్ని మ్యాచ్‌లు తటస్థ వేదికల్లోనే జరుగనున్నాయి. చెన్నై, ముంబై, న్యూఢిల్లీ, కోల్‌కతా, బెంగళూరు, అహ్మదాబాద్ నగరాల్లో ఐపిఎల్ టోర్నీ జరుగనుంది. శుక్రవారం చెన్నైలో డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్‌రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య జరిగే మ్యాచ్‌తో ఐపిఎల్ సీజన్14కు తెరలేవనుంది. ఇక అహ్మదాబాద్ వేదికగా మే 30న జరిగే ఫైనల్‌తో ఐపిఎల్‌కు తెరపడనుంది.
గెలుపుపై ఎవరీ ధీమా వారిదే!
ఈ టోర్నమెంట్‌లో మొత్తం 8 జట్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోకున్నాయి. ప్రస్తుత చాంపియన్ ముంబైతో పాటు మాజీ విజేతలు చెన్నై సూపర్ కింగ్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్‌లు ట్రోఫీపై కన్నేశాయి. ఇక అంతేగాక ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ఐపిఎల్ ట్రోఫీని సాధించని రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ కూడా ట్రోఫీ లోటును తీర్చుకోవాలనే పట్టుదలతో ఉన్నాయి. ఈసారి కూడా ముంబై ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది. ఇప్పటికే ఐదుసార్లు ఐపిఎల్ ట్రోఫీని ముద్దాడిన ముంబై ఆరో టైటిల్‌పై కన్నేసింది. వరుసగా రెండు సార్లు ఐపిఎల్‌ను సొంతం చేసుకున్న రోహిత్ సేన ఈసారి కూడా గెలిచి హ్యాట్రిక్ సాధించాలనే పట్టుదలతో ఉంది. రోహిత్, డికాక్, సూర్యకుమార్, పొలార్డ్, ఇషాన్ కిషన్, బుమ్రా, హార్దిక్, కృనాల్, బౌల్ట్ వంటి మ్యాచ్ విన్నర్లతో కూడిన ముంబై ఈసారి కూడా భారీ ఆశలతో పోటీకి సిద్ధమైంది. ఆటగాళ్లందరూ ఫామ్‌లో ఉండడంతో ముంబై హ్యాట్రిక్ ట్రోఫీలు సాధించినా ఆశ్చర్యం లేదు. ఇక కిందటి రన్నరప్ ఢిల్లీ క్యాపిటల్స్ కూడా ట్రోఫీ సాధించడమే లక్షంగా పెట్టుకుంది. రిషబ్ పంత్ సారథ్యంలో ఢిల్లీ బరిలోకి దిగుతోంది. ధావన్, పంత్, పృథ్వీషా, నోర్జె, రబడా, రహానె, అక్షర్ వంటి స్టార్ ఆటగాళ్లు ఢిల్లీకి అందుబాటులో ఉన్నారు.

దీంతో ఢిల్లీ కూడా టోర్నీ ఫేవరెట్లలో ఒకటిగా కనిపిస్తోంది. ధోనీ సారథ్యంలోని మూడు సార్ల విజేత చెన్నై సూపర్‌కింగ్స్ కూడా నాలుగో ట్రోఫీ సాధించడమే లక్షంగా పెట్టుకుంది. సురేశ్ రైనా, బ్రావో, ధోనీ, డుప్లెసిస్, మొయిన్ అలీ, జడేజా తదితరులతో చెన్నై చాలా బలంగా ఉంది. ఈసారి కూడా మెరుగైన ప్రదర్శనతో ట్రోఫీని సాధించాలని తహతహలాడుతోంది. మరోవైపు డేవిడ్ వార్నర్ సారథ్యంలోని సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు కూడా ట్రోఫీని సాధించే సత్తా ఉంది. వార్నర్, మనీష్ పాండే, సాహా, బెయిర్‌స్టో, జాసన్ రాయ్, విజయ్ శంకర్, భువనేశ్వర్, రషీద్ ఖాన్, నబి, విలియమ్సన్ వంటి మ్యాచ్ విన్నర్లు జట్టుకు అందుబాటులో ఉన్నారు. ఇతర జట్లతో పోల్చితే సన్‌రైజర్స్ అన్ని విభాగాల్లో సమతూకంగా కనిపిస్తోంది.దీంతో ఈసారి కూడా హైదరాబాద్ మెరుగైన ప్రదర్శన చేయడం ఖాయమనే చెప్పాలి. రాజస్థాన్ రాయల్స్, పంజాబ్ కింగ్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్లు కూడా ట్రోఫీని సాధిండమే లక్షంగా పెట్టుకున్నాయి. సంజు శాంసన్ కెప్టెన్సీలో రాజస్థాన్ మెరుగైన ప్రదర్శన చేయాలని భావిస్తోంది. ఇక లోకేశ్ రాహుల్ నేతృత్వంలోని పంజాబ్ కూడా ట్రోఫీపై కన్నేసింది. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే ఆటగాళ్లకు జట్టులో కొదవలేదు. దీంతో పంజాబ్‌ను కూడా తక్కువ అంచన వేయలేం. ఇక టోర్నమెంట్‌లోనే అత్యంత ఆదరణ కలిగినజట్టుగా పేరున్న బెంగళూరు కూడా భారీ ఆశలతో పోరుకు సిద్ధమైంది. సుదీర్ఘ ఐపిఎల్ ప్రస్థానంలో చాలెంజర్స్ ఒక్కసారి కూడా ట్రోఫీని సాధించలేక పోయింది. కనీసం ఈసారైనా ఆ లోటును తీర్చుకుంటుందా లేదాఅనేది సందేహంగా మారింది. కోహ్లి, డివిలియర్స్, మాక్స్‌వెల్ తదితరులతో బెంగళూరు బలంగానే ఉంది. కానీ నిలకడలేమి జట్టుకు ప్రధాన సమస్యగా మారింది. ఇప్పటికే మూడు సార్లు ఫైనల్ చేరిన బెంగళూరు ఒక్కసారి కూడా ఐపిఎల్ విజేతగా నిలువలేక పోయింది. కనీసం ఈ టోర్నీలోనైనా ఆ లోటును పూడ్చుకుంటుందా లేదా అనేది ఆసక్తిగా మారింది.
పటిష్ట ఏర్పాట్లు..
మరోవైపు కరోనా నేపథ్యంలో ఈసారి ఐపిఎల్‌ను ఖాళీ స్టేడియాల్లోనే నిర్వహిస్తున్నారు. మ్యాచ్ వేదికలను కూడా ఈసారి ఆరుకే పరిమితం చేశారు. బయోబబుల్ సెక్యూర్ విధానంలో టోర్నీని నిర్వహిస్తున్నారు. టోర్నీలో పాల్గొనే అందరూ క్రికెటర్లు బయోబబుల్‌లోనే ఉంటున్నారు. కరోనా విజృంభణ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని నిర్వాహకులు పటిష్ట చర్యలు తీసుకుంటున్నారు. ఆటగాళ్లు, సహాయక సిబ్బంది ఆరోగ్య పరిరక్షణకు ప్రాధాన్యత ఇస్తున్నారు. ఎప్పటికప్పుడూ పరిస్థితులను సమీక్షిస్తూ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుడా చూస్తున్నారు. 24 గంటలపాటు వైద్యులు అందుబాటులో ఉండేలా తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అంతేగాక ఎలాంటి సమస్య తలెత్తినా దాన్ని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నారు.

IPL 2021 Begins from April 9