Home వార్తలు గన్ను,పెన్ను తెలంగాణ మన్ను ముద్దాడుతున్న తేజ్ దీప్…

గన్ను,పెన్ను తెలంగాణ మన్ను ముద్దాడుతున్న తేజ్ దీప్…

ఉద్యోగ బాధ్యతలను నిబద్ధతో నెరవేర్చడం నాకు తృప్తినిస్తుంది.రాష్ట్ర పోలీస్ ఛీఫ్‌కు నేను అందజేసిన నివేదిక ఆధారంగా చర్యలు చేపట్టి 65 మంది మహిళలను వ్యభిచార కూపం నుండి విముక్తులను చేశారు. దానికి ఆంధ్రప్రదేశ్ హై కోర్ట్ నన్ను అప్రిషియేట్ చేసింది. 2003 సంవత్సరంలో  సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ నేషనల్ పోలీస్ ఎకాడమీ వారు గోల్డెన్ జూబ్లీ షెలోషిప్ అందజేశారు. 2006లో రోడ్ సేఫ్టీ పైన అవేర్‌నెస్ తీసుకువచ్చినందుకుగాను I R T E ప్రిన్స్ ఫిలిప్ ఇంటర్‌నేషనల్ అవార్డ్ అందించింది. ఇలా నా వృత్తి జీవితంలో  సిన్సియర్‌గా పనిచేసినందుకు ప్రభుత్వం నన్నెప్పుడూ ప్రాత్సహిస్తూనే ఉంది

tej-deep-kourపువ్వంత సున్నితత్వం, ఇనుమంత కఠినత్వం. అమ్మలోని మాతృత్వం, కర్తవ్యంలోని కర్కశత్వం. ముగ్ధమనోహర స్త్రీత్వం, అక్షర సొబగుల కవిత్వం…కలగలసి ఒక నడిచే పవర్‌హౌజ్ గా నిలిచిన వ్యక్తిత్వమే తేజ్ దీప్ కౌర్ మీనన్ ఐ.పి.ఎస్. భారత్-పాక్ విడిపోయినప్పుడు శారణార్థులుగా హైదరాబాద్ కు వలసవచ్చిన కుటుంబ నేపధ్యం నుండి భారత అత్యున్నత సర్వీసులో ఉద్యోగం పొందారు తెజ్ దీప్. కేరీర్ మరియు సామాజిక పరంగా అత్యుత్తమ సేవలందిస్తూ, తుపాకీ పట్టిన చేతులతోనే పశు, పక్ష్యాదుల, పర్యావరణ పరిరక్షణకు పాటుపాడుతున్న ఈ పక్కా హైదరాబాదీ ఎందరో అధికారులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. తన బహుముఖ ప్రఙ్ఞతో అందరి మన్ననలు పొందుతున్న తెలంగాణ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ మన తెలంగాణతో పంచుకున్న స్ఫూర్తిదాయక విశేషాలు వారి మాటల్లోనే…
ముగ్గురం అమ్మాయిలం : నాన్న నరీందర్ సింగ్ నేటి పాకిస్థాన్‌లోని లాహోర్‌కు చెందినవారు, అమ్మ రబీందర్ కౌర్ స్వస్థలం వజీరాబాద్. భారత్-పాక్ విడిపోయినప్పుడు వారు శరణార్థులుగా హైదరాబాద్ వచ్చారు. నేను పుట్టింది, పెరిగింది అంతా ఖైరతాబాద్‌లోనే. మేం ముగ్గురు ఆడపిల్లలం దాన్లో నేను పెద్ద. నాన్న బిల్డింగ్ కన్‌స్ట్రక్షన్ బిజినెస్ చేసేవారు. ఆర్థికపరమైన ఇబ్బందులున్నా మమ్మల్ని చదివించారు. చిన్నప్పుడు మాకు అమ్మా, నాన్న చెప్పింది ఒక్కటే నీకు ఎవరూ ప్రతిక్షణం తోడుగా ఉండరు, నీకు నీవే బాసటగా నిలవాలి అని. అదే నాలో ధైర్యాన్ని నూరిపోసింది. మమ్మల్ని పెంచి పెద్ద చేసే విషయంలో వారి సహకారం మరువలేనిది.
తాతయ్య స్ఫూర్తి : చిన్నప్పటి నుండి చదువులో మరియు సాంస్కృతిక కార్యక్రమాల్లో ముందుండేదాన్ని- ఐ ఆమ్ ఆన్ ఆల్ రౌండర్. నాజర్ స్కూల్, సెయింట్ ఆన్స్ ల్లో ఇంటర్ వరకు చదివాను. సెయింట్ ఫ్రాన్సిస్‌లో డిగ్రీ పూర్తికాగానే హైదరాబాద్ స్టడీ సర్కిల్‌లో సివిల్స్ కోచింగ్ తీసుకున్నాను. మెయిన్స్ కాగానే ఇంటర్వూ కోసం ఢిల్ల్లీ వెళ్ళి కోచింగ్ తీసుకున్నాను. రెండవ ప్రయత్నంలో ఐ.పి.ఎస్ కు సెలెక్ట్ అయ్యాను. తాతయ్య పోలీస్ ఆఫీసర్ కావడంతో నాకు చిన్నప్పటి నుండే ఈ ప్రొఫెషన్‌పై మక్కువ ఏర్పడింది. నేను ఐ.పి.ఎస్ కావడానికి తాతయ్యనే ఇన్‌స్పిరేషన్.
ఒకే ఒక్క మహిళను : ఐ.పి.ఎస్ పూర్తవగానే మొదటి పోస్టింగ్ విజయవాడలో ఇచ్చారు. కె.ఎస్ వ్యాస్ అప్పుడు విజయవాడ ఎస్.పి గా చేస్తూండేవారు. చుట్టూ అందరూ మగ ఆఫీసర్ల మధ్య నేనొక్కదాన్నే మహిళా ఆఫీసర్‌ని.కొత్తలో కొద్దిగా ఇబ్బందిగా అన్పించినా తర్వాత నా గమ్యం చేరాలంటే వీటిని ఎదుర్కోక తప్పదనుకున్నాను. వారితో కలిసి పనిచేయాలంటే వారిలాగ ఉండక తప్పదని నిర్ణయించుకున్నాను. ఆ నిర్ణయాన్ని నేడూ పాటిస్తున్నాను (ఈ ఫీల్డ్‌లో టఫ్‌గా ఉండకుంటే కుదరదు).
మహిళగా ఎదుర్కున్న సమస్యలు : నేను ఆఫీసర్‌గా చేరిన మొదట్లో సీనియర్స్ నన్ను ఫుల్ స్లీవ్స్ ఉన్న బ్లౌజ్ వేసుకోవాలని,చీర కట్టుకోవాలని ఒత్తిడి చేసేవారు (అప్పట్లో పంజాబీ డ్రస్సులు ఎవరూ వేసుకునేవారు కాదు).ముప్పై సంవత్సరాల క్రితం పోలీస్ స్టేషన్లలో మహిళలకు ప్రత్యేకించి టాయిలెట్లు ఉండేవి కాదు. దాంతో ఎంతో ఇబ్బందికి గురయ్యేదాన్ని. గర్భవతిగా ఉన్నప్పుడు మరియు పీరియడ్స్ సమయంలో ఈ సమస్య మరింత జఠిలం అయ్యేది.ఒక్కోసారి అనారోగ్యానికి దారితీసేది.మాతృత్వ సెలవు విషయంలో కూడా నేటి పరిస్థితులు చాలా బెటర్. మాకు మూడు నెలలు మాత్రమే సెలవులు ఉండేవి. ఇప్పుడు మహిళలకు పూర్తి వేతనంతో కూడిన పెరిగిన సెలవులు ఇస్తున్నారు. తండ్రికి కూడా సెలవు ఇవ్వాలన్న ఆలోచన నేడు రావడం ఆహ్వానించదగ్గది. ఇక నా విషయానికి వస్తే నేను(రెండు సార్లు) డెలివరీ రేపవుతానంటే ఈ రోజుకూడా నా డ్యూటీలు చేశాను.లీవు కాపాడుకుంటే దాన్ని పిల్లలు పుట్టాక వాడుకోవచ్చు అన్నది నా ఆలోచన.
హై కోర్ట్ అప్రిసియేషన్ : ఉద్యోగ బాధ్యతలను నిబద్ధతో నెరవేర్చడం నాకు తృప్తినిస్తుంది.రాష్ట్ర పోలీస్ ఛీఫ్‌కు నేను అందజేసిన నివేదిక ఆధారంగా చర్యలు చేపట్టి 65 మంది మహిళలను వ్యభిచార కూపం నుండి విముక్తులను చేశారు. దానికి ఆంధ్రప్రదేశ్ హై కోర్ట్ నన్ను అప్రిషియేట్ చేసింది. 2003 సంవత్సరంలో సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ నేషనల్ పోలీస్ ఎకాడమీ వారు గోల్డెన్ జూబ్లీ షెలోషిప్ అందజేశారు. 2006లో రోడ్ సేఫ్టీ పైన అవేర్‌నెస్ తీసుకువచ్చినందుకుగాను I R T E ప్రిన్స్ ఫిలిప్ ఇంటర్‌నేషనల్ అవార్డ్ అందించింది. ఇలా నా వృత్తి జీవితంలో సిన్సియర్‌గా పనిచేసినందుకు ప్రభుత్వం నన్నెప్పుడూ ప్రాత్సహిస్తూనే ఉంది.
స్కూల్లో ఉన్నప్పటి నుండే కవిత్వం : కాకులు డేగలు కూడా తమ సంతతి పుట్టుకను సంబరం చేసుకుంటాయి అంటూ ఆడపిల్లలని తెలియగానే చేసే బౄణ హత్యల గూర్చి,పతంగ మంత సున్నితమైన ఆమెను, సాహసోన్నతిని సంబరం చేసుకోమంటూ-నీలాకాశపు అంచుల్లోకి పంపుతాం. ఒక కఠినపు లాగుడు ఆమెను చింపేస్తుంది అంటూ అమ్మాయిలపై జరిగే అత్యచారాలను నిలదీస్తూ ఇంగ్లీషులో రాసిన కవితలను వెంకట్రామిరెడ్డి ఐ.పి.ఎస్ తెలుగులోకి అనువదించారు. ఎక్కువగా ఫెమినిజం నిండిన కవితలతో కూడిన కవితా సంకలనాలు నాలుగింటిని ప్రచురించాను. అవి క్రిటిక్స్ మెప్పు పొందాయి ఇంటర్నేషనల్ లెవెల్లో వాటికి గుర్తింపు వచ్చింది. 2003 సంవత్సరంలో యూనివర్సిటీ ఆఫ్ కేంబ్రిడ్జ్ లిటరరీ సెమినార్‌కు రావల్సిందిగా ఆహ్వానించారు. 2011 సంవత్సరంలో అహ్మదాబాద్ సాహిత్య ఎకాడమీ సదస్సుకు కూడా ఆహ్వానం అందుకున్నాను. దీనికంతటికీ కారణం నేను చదువుకునే రోజులనుండే పుస్తకాలు చదివేదాన్ని, చిన్న చిన్న కవితలు రాసేదాన్ని. నేటి పిల్లలకు పాఠ్యపుస్తకాలే లోకంగా మారాయి ఆ పద్ధతి మారాలి. పిల్లలను అన్ని రంగాల్లో ప్రోత్సహించినప్పుడే మంచి సమాజం ఏర్పడుతుంది.
మిషన్ కాకతీయలో భాగస్వామ్యం : మెదక్ జిల్లా రామచంద్రాపురం దగ్గరి అమీన్‌పూర్ చెరువులో ఉండాల్సిన స్థాయికన్నా ఎక్కువ విషపరార్థాలు ఉన్నాయని గుర్తించడంతో దాన్ని దత్తత తీసుకుని ఇప్పటివరకు ఎనిమిది క్లీన్ అప్ డ్రైవ్స్ చేపట్టాము. వినాయక చవితి సందర్భంగా మట్టి వినాయక విగ్రహాలను పూజించే విధంగా అవగాహనా కార్యక్రమాలు చేపట్టి విజయవంతమయ్యాము. చుట్టూ దాదాపు 4000 మొక్కలను నాటాము, ఈ కార్యక్రమానికి మంత్రి హరీష్‌రావు హాజరయ్యారు. ఇదివరకు ఇక్కడ 162 రకాల పక్షులు సెప్టెంబర్ నెలలో వలసవచ్చేవి ఇప్పుడు పర్యావరణంలో మార్పులు రావడంతో వాటి సంఖ్య తగ్గింది తిరిగి ఆ చెరువుకు పూర్వ వైభవం తీసుకురావడమే నా ధ్యేయం. ఆ పక్షులకు తిరిగి విడిది ఏర్పాటు చేయాలన్న సంకల్పంతో ఆ చెరువును దత్తత తీసుకోవడం జరిగింది. గ్రామ జ్యోతి కింది ఆ గ్రామాన్ని కూడా దత్తత తీసుకున్నాము దాన్లో ఏడు చెరువులు మిషన్ కాకతీయ కింద గుర్తించబడినవి. కొంపల్లి దగ్గర ఫాక్స్ సాగర్ చెరువు కూడా ప్రక్షాళన చేశాము. అక్కడ కూడా పక్షుల ఉనికిని కాపాడే ప్రయత్నం చేస్తున్నాము. అనంతగిరి పరిసరాలను సుందరీకరించాలని సంకల్పించాము. చుట్టూ మూడు ట్రెక్కింగ్ పాయింట్లను ఏర్పాటు చేశాము. అక్కడి ఔషధ మొక్కలను మరియు చాలా అరుదైన జంతుజాలాన్ని పరిరక్షించాలని, ఆలయ పరిసరాలను మరింత అందంగా మార్చాలన్నది మా ఆలోచన. దత్తత గ్రామంలో లయన్స్ క్లబ్ వారి సహకారంతో మెడికల్ క్యాంప్‌లను ఏర్పాటుచేశాం. వీటన్నిటినీ నేను దగ్గరగా ఉండి పరిశీలిస్తాను.
మహిళా ఉద్యోగినులకు : ఇంటి దగ్గర, పని ప్రదేశంలో మీ ప్రాధమ్యాలను నిర్భయంగా తెలియజేయండి. మగవారికి అర్ధమయ్యేలా మీ సమస్యలను చెప్పండి. ఆఫీస్‌లో పని ఒత్తిడిని ఇంట్లో పిల్లలకి, భర్తకీ తెలియజేసి వారి సహకారం తీసుకొండి. అనవసరంగా కోపం పెంచుకోవడం వల్ల మీకు మీరు నష్టపోతారే తప్ప ఒరిగేది ఏమీ ఉండదు. ఒకేసారి అన్ని పనులను చక్కబెట్టే సామర్థం మహిళలకు ఉంటుంది అంతే స్థాయిలో ఒత్తిడికీ లోనవుతారు. అందుకే మీకు అనుకూలంగా పరిస్థితులను మార్చుకోండి. నా వరకు నేను ఇంటిని కూడా అలంకరించుకుంటాను. త్వరగా పనులు పూర్తి చేసుకొని నా వృత్తిబాధ్యతలను నెరవేరుస్తాను. వృత్తి జీవితాన్ని, కుటుంబాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు వెళ్ళడం మంచిది. ఖాళీ సమయం అమ్మతో గడపడం ఇష్టపడతాను. గార్డెనింగ్ నేను ఇష్టంగా చేసే మరో పని.
యువతకు : కష్టపడి పని చేయండి, మరో మార్గం ఏర్పర్చుకొని లక్షఛేధనకు పూనుకోవాలి. ఒకటి ఫెయిల్ అయినా మరోటి సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది. పురుషులకు మాత్రమే ప్రత్యేకం అనుకునే ఈ ఫీల్డ్‌లోకి అమ్మాయిలు ఎక్కువమంది రావడం నేను ప్రోత్సహిస్తాను. ఎందుకంటే జీవితాన్ని ఛాలెంజ్‌గా తీసుకున్నప్పుడే మజా ఉంటుంది. ఆల్ ద బెస్ట్.
ఇంటర్వూ…అనితా యెలిశెట్టి
ఫొటోలు..కొప్పుల సర్వేశ్వర్ రెడ్డి