Friday, April 19, 2024

సంపాదకీయం: చైనాకు చేరువైన ఇరాన్

- Advertisement -
- Advertisement -

Iran construct Chabahar-Zahedan railway project without indiaచాబహార్ జహేదాన్ రైలు మార్గ నిర్మాణ భాగస్వామ్య ఒప్పందం నుంచి ఇండియాను వదులుకుంటూ ఇరాన్ తీసుకున్న నిర్ణయం దానికదే ఏకాకి పరిణామం కాదు. ప్రధాని మోడీ ప్రభుత్వం నూతన విదేశీ విధాన విన్యాసాల ఫలితమేనని స్పష్టపడుతున్నది. ఒప్పందం కుదిరి నాలుగేళ్లయినా భారత్ చొరవ చూపడం లేదని, నిధులు విడుదల చేయడం, పనులు చురుకుగా చేపట్టడం జరగడం లేదని కారణాలు చూపుతూ 400 మిలియన్ డాలర్ల ఈ ప్రాజెక్టును తానే తన జాతీయ అభివృద్ధి నిధులతో పూర్తి చేయదలచానని ఇరాన్ ప్రకటించింది. ఆ దేశ రవాణా, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి గత వారమే ఈ రైలు మార్గం పనులు ప్రారంభించారు. అఫ్ఘానిస్థాన్‌తో ఇరాన్ సరిహద్దులలో నిర్మితమయ్యే 628 కి.మీల ఈ మార్గం అత్యంత కీలకమైనది. మన సహకారంతో ఇది పూర్తయి ఉంటే అఫ్ఘానిస్థాన్, మధ్య ఆసియా దేశాలకు ఇండియా మరింత సన్నిహితం అయ్యేది. ఇప్పటికే చాబహార్ రేవు పునరుద్ధరణలో ఇరాన్‌కు సహకరించాం.

కేవలం కరాచీ రేవు గుండానే అఫ్ఘానిస్థాన్‌తో మనకు సముద్ర మార్గం ఉండేది. దానిని పాకిస్థాన్ మూసివేసింది. చాబహార్ రేవు మార్గం ప్రత్యామ్నాయంగా మనకు ఉపయోగపడింది. చాబహార్ జహేదాన్ రైలు మార్గానికయ్యే 400 మిలియన్ డాలర్ల ఖర్చులో 1.6 మిలియన్ డాలర్ల మేరకు సహకరించడానికి మనం అంగీకరించాం. పాక్‌లోని గ్వాదర్ ఓడ రేవును చైనా నిర్మిస్తున్నందున చాబహార్‌లో ఇరాన్‌తో మన సహకారం అందుకు గట్టి సమాధానంగా ఉంటుందని ప్రపంచం భావించింది. అందువల్లనే ఇండియా ఇరాన్ అఫ్ఘానిస్థాన్ల మధ్య కుదిరిన త్రైపాక్షిక ఒప్పందం కీలకమైనదని అమెరికన్ వ్యాఖ్యాతలు కూడా మెచ్చుకున్నారు. అమెరికా ప్రభుత్వం చాబహార్ రేవు పునరుద్ధరణ విషయంలో ఎటువంటి అభ్యంతరం చెప్పలేదు. ఇప్పుడు దానికి భయపడే ఈ రైలు ప్రాజెక్టుకు మోడీ ప్రభుత్వం సహకరించడం లేదని పరిశీలకులు భావిస్తున్నారు.

ఈ సందు చూసుకొని చైనా రంగ ప్రవేశం చేసింది. ఇరాన్‌కు 25 ఏళ్ల కాలంలో 400 బిలియన్ డాలర్ల సహాయమందించడానికి ఉద్దేశించిన ఒప్పందం దానితో ఖరారు చేసుకుంటున్నది. ఆ విధంగా ఇరాన్‌ను మనకు దూరం చేయడంలో అది సఫలీకృతమవుతున్నది. ఇరాన్‌తో మన సంబంధాలు దిగజారిపోడానికి మరి రెండు కీలకమైన కారణాలున్నాయి. ట్రంప్ ప్రభుత్వం టెహ్రాన్‌పై విధించిన ఆంక్షలకు తల ఒగ్గి ఇరాన్ నుంచి ఆయిల్ దిగుమతులకు పూర్తిగా స్వస్తి చెప్పాం. ముస్లింల పట్ల మోడీ ప్రభుత్వ వైఖరిని ఇరాన్ బాహాటంగా నిరసించింది. అందుకు మన ప్రభుత్వం అభ్యంతరం తెలిపింది. గతంలో ఇరాన్ నుంచి మనం భారీ ఎత్తున చమురు దిగుమతి చేసుకున్నాం. మన మొత్తం ఆయిల్ దిగుమతుల్లో 10 శాతం మేరకు అక్కడి నుంచే వచ్చేది. ఇరాక్, సౌదీ అరేబియా తర్వాత మనం చమురు దిగుమతి చేసుకునే దేశాలలో మూడవ అతి పెద్దదిగా ఇరాన్ ఉండేది. మన చమురు అవసరాల్లో 84 శాతం మేరకు దిగుమతులపైనే ఆధారపడుతున్నాం. ఏటా 220 మిలియన్ టన్నులు దిగుమతి చేసుకుంటున్నాం. అందులో 35 మిలియన్ టన్నులు ఇరాన్ నుంచే వచ్చేది.

అవి డాలర్లు చెల్లించనవసరం లేకుండా రూపాయి కరెన్సీకే లభిస్తుండేది. దాని వల్ల మన విదేశీ ద్రవ్య నిల్వలు ఆ మేరకు సురక్షితంగా ఉండేవి. ఇరాన్‌తో అంతర్జాతీయ అణు ఒప్పందం నుంచి వైదొలగిన ట్రంప్ ప్రభుత్వం సౌదీ అరేబియాతో అవగాహన మేరకు ఇరాన్ నుంచి ఏ దేశమూ ఆయిల్ దిగుమతి చేసుకోరాదనే ఆంక్షలను తిరిగి విధించింది. బరాక్ ఒబామా ప్రభుత్వం ఈ ఆంక్షలను ఎత్తి వేసింది. యూరప్ దేశాలతో కలిసి అది ఇరాన్‌తో అణు పరీక్షలకు సంబంధించిన సంధిని కుదుర్చుకున్నది. కశ్మీర్‌లో, ఇతరత్రా ముస్లింపట్ల తన వైఖరిని ఇరాన్ అధినేత ఖమేనీ బాహాటంగా నిరసించడం మోడీ ప్రభుత్వానికి కంటక ప్రాయమైంది. మోడీ నాయకత్వంలో ఎన్‌డిఎ ప్రభుత్వం దేశాన్ని అమెరికాకు పూర్తి అనుకూలంగా మార్చివేయడం ట్రంప్‌తో మన ప్రధాని వ్యక్తిగత సాన్నిహిత్యాన్ని అమితంగా పెంచుకొని చెట్టపట్టాలు వేసుకోడం చైనా, పాకిస్థాన్‌లకు మరింత కంటగింపు అయింది. అవి మనకు వ్యతిరేకంగా కుమ్మక్కును పెంచాయి. చైనా నెమ్మది నెమ్మదిగా మన చుట్టూ గల నేపాల్, బంగ్లాదేశ్ వంటి దేశాలకు సాయం పెంచుతూ తన చెప్పుచేతల్లో పెట్టుకుంటున్నది. ఇరాన్‌ను సైతం ఇప్పుడు తనకు అనుకూలంగా మార్చుకున్నది. చేరువలో దూరంలో కూడా మనకు మంట పెడుతున్నది. ఇదంతా మోడీ ప్రభుత్వం అవలంబిస్తున్న విదేశాంగ విధానం పర్యవసానమేనని భావించడానికి ఆస్కారం కలుగుతున్నది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News