Home బిజినెస్ చమురు సంక్షోభం

చమురు సంక్షోభం

Iran falls to 4th biggest oil supplier to India

రూపాయి విలువ భారీ పతనం
కరెంట్ ఖాతా లోటు, ద్రవ్యోల్బణంపైనా ప్రభావం

భారత్ చమురు విషయంలో ఎక్కువగా ఇతర దేశాలపైనే ఆధారపడింది. భారత్‌కు నాలుగో అతిపెద్ద చమురు సరఫరా దేశం ఇరాన్. భారత్‌కు చమురు దిగుమతుల్లో 9 నుంచి 10 శాతం వాటా ఇరాన్ నుంచే ఉంది. అయితే అమెరికా ఆంక్షల వల్ల వచ్చే నెల నుంచి ఇరాన్ చమురు దిగుమతులను నిలిపివేస్తే భారత్‌కు సమస్య తలెత్తే అవకాశముంది. చమురు ధరలు పెరగడం వల్ల కరెంట్ ఖాతా లోటుపై ఒత్తిడి ఏర్పడనుంది. దీని వల్ల జిడిపి(స్థూల దేశీయోత్పత్తి)లో 3 శాతానికి చేరనుంది. ఇది రూపాయిపైనా ప్రభావం చూపనుంది. ఇప్పటికే రూపాయి విలువ ఆరు నెలల కనిష్టానికి చేరింది. డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ 70ని దాటింది. మరోవైపు ద్రవ్యోల్బణంపైనా ఇరాన్ చమురు ఆంక్షల ఎఫెక్ట్ కనిపించనుంది.

వినిమయ ధరల సూచీ(సిపిఐ) ద్రవ్యోల్బణం కంటే టోకు ధరల సూచీ(డబ్లుపిఐ) ఆధారిత ద్రవ్యోల్బణంపై ఎక్కువగా ప్రభావం పడనుంది. దీంతో వడ్డీ రేట్లు తగ్గడమేమో గానీ పెరిగేందుకు అవకాశముంది. ఇప్పటివరకు ఇరాన్ నుంచి చమురు దిగుమతులు కొనసాగుతుండడం వల్ల భారత్‌కు ఇబ్బందులు తలెత్తలేదు. ఇకపై ఇరాన్ నుంచి చమురు దిగుమతి ఆపేస్తే చమురు కోసం ఇతర దేశాలపై ఆధారపడాల్సి ఉంటుంది. మరోవైపు ఒపెక్ ఉత్పత్తి కోతతో సరఫరా తగ్గిపోతుండగా, ఇప్పుడు ఇరాన్ చమురు లభించకపోతే అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురుకు మరింత డిమాండ్ పెరగనుంది. ఈ కారణంగానే ఆయిల్‌ధరలు ర్యాలీ చేస్తున్నాయి. ఇరాన్‌పై ఆంక్షల నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలకు రెక్కలు వచ్చాయి. బ్రెంట్ క్రూడ్ దాదాపు 74 డాలర్లకు చేరువైంది. కాగా అమెరికా ఆంక్షల నేపథ్యంలోనూ ఇరాన్ నుంచి ముడి చమురు దిగుమతులను చైనా, భారత్ వంటి దేశాలు పూర్తిగా తగ్గించుకోకపోవచ్చని ఇంధన విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ఇతర దేశాల వైపు చూపు

ఇరాన్ ఆయిల్ దిగుమతులపై అమెరికా ఆంక్షల నేపథ్యంలో భారత్ ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తోంది. ఇరాన్ నుంచి చమురు దిగుమతులను వచ్చే నెల నుంచి నిలిపివేయడం వల్ల ఏర్పడే లోటును ఇతర చమురు ఉత్పత్తి దేశాల నుంచి భర్తి చేయనున్నామని ప్రభుత్వం ప్రకటించింది. భారతీయ రిఫైనరీలకు క్రూడ్ ఆయిల్ అదనంగా సరఫరా చేసేందుకు ప్రభుత్వం వేగవంతంగా చర్యలు చేపడుతోంది. చమురును ఉత్పత్తి చేసే ప్రధాన దేశాల నుంచి అదనంగా ఆయిల్‌ను సేకరించి, దేశీయ అవసరాల తగ్గట్టుగా పెట్రోల్, డీజిల్, ఇతర పెట్రోలియం ఉత్పత్తులను అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని పెట్రోలియం శాఖమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు. ఇరాన్ నుంచి దిగుమతి చేసుకోకపోవడం ద్వారా ఏర్పడే లోటును భర్తీ చేయడానికి ఇతర దేశాలతో చేసుకున్న ఒప్పందాల ద్వారా భర్తీ చేస్తామని తెలిపారు. ఈ ఏడాదిలో మెక్సికో నుంచి 0.7 మిలియన్ టన్నులు, సౌదీ అరేబియా నుంచి 2 మిలియన్ టన్నులు, కువైట్ నుంచి 1.5 మిలియన్ టన్నులు, యుఎఇ నుంచి మరో మిలియన్ టన్ను ముడి చమురును దిగుమతి చేసుకునే అవకాశముంది.

మే నుంచి ఇరాన్ క్రూడ్‌కు బ్రేక్

మే 2 నుంచి భారత్, చైనా వంటి దేశాలు ఇరాన్ నుంచి చమురు దిగుమతులను ఆపేయాలి. భారత్ సహా 8 దేశాలకు ఇచ్చిన మినహాయింపును పొడిగించేది లేదని తాజాగా అమెరికా స్పష్టం చేసింది. దీంతో ఇప్పటివరకు ఎలాంటి ఆంక్షలు లేకుండా ఇరాన్ చమురును కొనుగోలు చేసుకుంటున్న భారత్‌కు ఈ వార్త షాకింగ్‌కు గురిచేసింది. గత నవంబర్‌లోనే ఇరాన్‌పై అమెరికా ఆంక్షలు విధించగా,ఆ సమయంలో 8 దేశాలకు మినహాయింపులు ఇచ్చింది. భారత్‌తో పాటు చైనా, జపాన్, దక్షిణ కొరియా, టర్కీ, తైవాన్, ఇటలీ, గ్రీస్ తదితర దేశాలు ఇరాన్ నుంచి అధికంగా చమురు కొనుగోలు చేస్తున్నాయి. ఈ మినహాయింపు గడువు మే 2కు ముగియనుంది. దీంతో గడువు పొడిగించేదిలేదని అమెరికా స్పష్టం చేసింది.

Iran falls to 4th biggest oil supplier to India