Home తాజా వార్తలు ఎదురులేని టీమిండియా

ఎదురులేని టీమిండియా

Team India

 

భారీ గెలుపుతో ఆత్మవిశ్వాసం రెట్టింపు

విశాఖపట్నం : సొంతగడ్డపై టెస్టుల్లో తనకు ఎదురులేదని టీమిండియా మరోసారి నిరూపించింది. విశాఖ వేదికగా జరిగిన తొలి టెస్టులో భారత్ 203 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ విజయంతో టెస్టు క్రికెట్‌లో తనను ఓడించడం అనుకున్నంత తేలిక కాదని స్పష్టం చేసింది. భారీ ఆశలతో సిరీస్‌కు సిద్ధమైన సఫారీలకు తొలి మ్యాచ్‌లోనే చేదు అనుభవం ఎదురైంది. ఈ మ్యాచ్‌లో ఎలాగైనా డ్రాతో గట్టెక్కాలని భావించిన సౌతాఫ్రికా కల నెరవేరలేదు. భారత ఆటగాళ్లు సమష్టి పోరాటంతో జట్టుకు ఘన విజయం అందించారు.

బౌలర్లు, బ్యాట్స్‌మెన్ తమ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించడంతో భారత్‌కు ఘన విజయం దక్కింది. ఓపెనర్లు రోహిత్ శర్మ, మయాంక్ అగర్వాల్‌లు అసాధారణ బ్యాటింగ్‌తో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. ఇక, చాలా కాలం తర్వాత టెస్టు బరిలోకి దిగిన స్టార్ బౌలర్ అశ్విన్ చారిత్రక ప్రదర్శనతో తనవంతు పాత్ర పోషించాడు. మహ్మద్ షమి కూడా అసాధారణ బౌలింగ్‌తో ఆకట్టుకున్నాడు. రవీంద్ర జడేజా కూడా ఆల్‌రౌండ్‌షోతో అదరగొట్టాడు. ఇలా ప్రతి ఆటగాడు తనవంతు భూమికను పోషించడంతో తొలి టెస్టులో భారత్ భారీ విజయం అందుకుంది.

ఎంత పొగిడినా తక్కువే..
ఇక, ఈ మ్యాచ్‌లో అశ్విన్, రోహిత్ శర్మలను ఎంత పొగిడినా తక్కువేనని చెప్పాలి. టెస్టుల్లో ఓపెనర్‌గా బరిలోకి దిగిన తొలి మ్యాచ్‌లోనే రోహిత్ రెండు ఇన్నింగ్స్‌లలోనూ సెంచరీలతో చెలరేగాడు. ఇక, అశ్విన్ కూడా తొలి ఇన్నింగ్స్‌లో ఏకంగా ఏడు వికెట్లు పడగొట్టి తానెంత విలువైన బౌలరో నిరూపించాడు. ఇక, కొత్త ఆటగాడు మయాంక్ అగర్వాల్ కూడా మొదటి ఇన్నింగ్స్‌లో డబుల్ సెంచరీతో ప్రకంపనలు సృష్టించాడు. ఇటు బౌలర్లు, అటు బ్యాట్స్‌మెన్‌లు సమష్టిగా రాణించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. దక్షిణాఫ్రికా వంటి బలమైన జట్టుపై లభించిన ఈ విజయం టీమిండియా ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేస్తుందనడంలో సందేహం లేదు. వెస్టిండీస్‌ను వారి సొంత గడ్డపై చిత్తు చేసిన టీమిండియా తాజాగా సౌతాఫ్రికాతో జరిగిన మొదటి టెస్టులో కూడా ఘన విజయం సాధించింది.

దీంతో టెస్టు ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో మరింత పటిష్టమైన స్థితికి చేరింది. ఈ గెలుపు భారత్‌కు అతి పెద్ద ఊరటగా చెప్పాలి. రానున్న మ్యాచుల్లో మరింత ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగేందుకు దోహదం చేస్తుందనే చెప్పాలి. ఓపెనర్‌గా రోహిత్ తన పాత్రను సమర్థంగా పోషించడం జట్టుకు అతి పెద్ద ఊరటగా మారింది. ఇప్పటికే వన్డేల్లో, టి20లలో రోహిత్ ఓపెనర్‌గా చారిత్రక ప్రదర్శన చేశాడు. తాజాగా టెస్టుల్లో కూడా తనకు ఎదురులేదని నిరూపించాడు.

మయాంక్ రూపంలో మరో అద్భుత ఓపెనర్ భారత్‌కు లభించాడు. ఇక, బౌలింగ్‌లో అశ్విన్ ఫామ్‌లోకి వచ్చాడు. షమి, జడేజాలు కూడా సత్తా చాటడం భారత్‌కు శుభసూచకంగానే చెప్పవచ్చు. అంతేగాక మిస్టర్ డిపెండబుల్ చటేశ్వర్ పుజారా కూడా రెండో ఇన్నింగ్స్‌లో మెరుపు బ్యాటింగ్‌తో గాడిలో పడ్డాడు. అతను ఫాంలోకి రావడం జట్టుకు కలిసి వచ్చే అంశమే. రానున్న మ్యాచుల్లో కూడా సమష్టిగా రాణిస్తే భారత్‌కు క్లీన్‌స్వీప్ చేయడం కష్టమేమి కాదు.

Irresistible Team India