Home తాజా వార్తలు నిర్వాసితుల త్యాగఫలమే సాగునీటి ప్రాజెక్టులు…

నిర్వాసితుల త్యాగఫలమే సాగునీటి ప్రాజెక్టులు…

 

2 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తాం
భూ నిర్వాసితుల కష్టాలను స్వయంగా మా కుటుంబం అనుభవించింది
ప్రాజెక్టుల కోసం భూములు ఇచ్చిన వారందరికి పాదాభివందనం
ఇంజనీర్ల పనితీరు భేష్
సిరిసిల్ల ప్రాంతంలోని 260కి పైగా చెరువులను గోదావరి జలాలతో నింపుతాము
టిఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షులు కల్వకుంట్ల తారక రామారావు

సిరిసిల్ల : కాళేశ్వరం 9వ ప్యాకేజి పనులు సాధ్యమైనంత త్వరగా పూర్తి చేసి జిల్లాలోని 2 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తామని సిరిసిల్ల శాసన సభ్యులు, తెలంగాణ రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షులు కల్వకుంట్ల తారక రామారావు అన్నారు. సోమవారం ఉదయం రాజన్న సిరిసిల్ల జిల్లాలోని మల్కపేట రిజర్వాయర్‌ను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ ప్రాజెక్టు నిర్మాణానికి ఎంత మంది భూములు ఇచ్చారని ఆయన అధికారులను అడిగి తెలుసుకున్నారు. కొంతమంది తమ విలువైన సాగు భూములు ఇవ్వడానికి ఇబ్బంధి పడ్డారని కెటిఆర్ అన్నారు.

సిఎం కేసిఆర్ కూడా స్వయం గా భూ నిర్వాసితుడని, మాతల్లి కూడా మిడ్‌మానేరు ప్రాజెక్టులో భూ నిర్వాసితురాలేనన్నారు. భూ నిర్వాసితుల కష్టాలను స్వయంగా తమకుటుంబం అనుభవించిందన్నారు. ప్రాజెక్టుల కోసం భూములు ఇచ్చిన వారందరికి శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నానన్నారు. తెలంగాణ కోటి ఎకరాల మాగాణం కావాలన్నదే కేసిఆర్ ధ్యేయమన్నారు. కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ద్వారా అన్ని చెరువులు కుం టలు జలకళను సంతరించుకుంటాయన్నారు. ప్రాజెక్టుల నిర్మాణం కోసం కృషి చేస్తున్న ఇంజనీర్ల పనితీరు భేష్ అన్నారు. భూ నిర్వాసితుల సమస్యలన్నీ సానుకూలంగా పరిష్కరిస్తామన్నారు. 9వ ప్యాకేజీ పనులను పరిశీలించిన కేటిఆర్ పనులను మరింత వేగవం తం చేయాలని ఆదేశించారు.

జడ్‌పి చైర్‌పర్సన్ అరుణ, వేములవాడ శాసన సభ్యులు చెన్నమనేని రమేశ్‌బాబు, టెస్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్ రావుతో కలిసి సిరిసిల్ల శాసన సభ్యులు, తెలంగాణ రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షులు కల్వకుంట్ల తారక రామారావు తెరాస జిల్లా కార్యాలయానికి సిరిసిల్లలో భూమిపూజ నిర్వహించారు. సిఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఉన్నంత కాలం, తెరాస ఉన్నంతకాలం తెలంగాణ రాష్ట్రానికి టిఆర్‌ఎస్ శ్రీరామరక్షఅన్నారు. 19 సంవత్సరాల క్రితం ప్రారంభమైన తెరాస ప్రస్థానం ఇలా ఉంటుందని, పార్టీ ఇలా ఎదుగుతుందని ఎవరూ ఊహించలేదన్నారు.

ఉద్యమాన్ని, పరిపాలనను సమర్ధవంతంగా నిర్వహించడం వల్ల నే రెండోసారి కూడా ప్రజల ఆశీర్వాదం లభించిందన్నారు. రాష్ట్రం బాగుపడాలంటే తెరాస బలంగా ఉండాలన్నారు. బూత్ లెవెల్‌నుండి రాష్ట్ర కమిటీ వరకు కొత్త నాయకత్వాన్ని తయారు చేసుకుని దసరా వరకు జిల్లా కేంద్రాల్లో నిర్మించే కొత్త పార్టీ కా ర్యాలయాల్లోనే కార్యకర్తలకుశిక్షణా తరగతులు నిర్వహిస్తామన్నారు. ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిలాగా పార్టీ కార్యకర్తలు పనిచేయాలన్నారు. ఇంటింటికి ప్రభు త్వ పథకాలు, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రచారం చేయాల్సి ఉందన్నా రు.

ఈ నెల 27నుండి పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభమవుతుందన్నా రు. హైదరాబాద్‌లో మొదటి సభ్యత్వాన్ని సిఎం కేసిఆర్ స్వీకరిస్తారని, ఆ తరువాత శాసన సభ్యులు, ఎంఎల్‌సిలు, ఎంపిలు, పార్టీ ప్రజాప్రతినిధులందరూ మొదటి రోజున హైదరాబాద్‌లోనే సభ్యత్వాలు స్వీకరిస్తారన్నారు. ఆ తరువాత జులైలో నెల రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా గ్రామగ్రామాన సభ్యత్వ నమోదు కార్యక్రమాలను పండుగ వాతావరణంలో నిర్వహించాలన్నారు. తెలంగాణను కోటి ఎకరాల మాగాణంగా చూడాలనే కోరికతోనే సిఎం కేసిఆర్ కాళేశ్వరం ప్రాజెక్టును రికార్డు సమయంలో పూర్తి చేశారన్నారు. సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ నియోజక వర్గంలోకి గోదావరి జలాలు ఇప్పటికే వచ్చాయని, దసరా నాటికి సిరిసిల్ల నియోజక వర్గంలోకి కూడా గోదావరి జలాలు వస్తాయని కెటిరామారావు అన్నారు.

మల్కపేట రిజర్వాయర్, సింగసముద్రం ద్వారా ఎగువ మానేరులోకి నీరు చేరుతుందని, సిరిసిల్ల ప్రాంతంలోని 260కి పైగా చెరువులను గోదావరి జలాలతో నింపుతామన్నారు. సిరిసిల్ల రైతాంగం ఎక్కువగా ఉన్న జిల్లా అన్నారు. సిరిసిల్ల కార్మిక క్షేత్రంగా, వేములవాడ ధార్మిక క్షేత్రంగా అభివృధ్ధి చెందుతున్నాయన్నారు. సిరిసిల్ల కలెక్టరేట్ నూతన భవనాన్ని దసరా నాటికి ప్రారంభిస్తామన్నారు. ఇప్పటి వరకు అన్ని ఎన్నికల్లో ప్రజలు తెరాసను ఆశీర్వదించారన్నారు. పార్టీ కార్యకర్తల సంక్షేమం కోసం బీమాలాంటి అనేక కార్యక్రమాలను ఆలోచిస్తున్నామన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టును మూ డేళ్ల కాలంలోనే నిర్మించి 45 లక్షల ఎకరాలకు నీరందించే విధంగా రూపు దిద్దడం పట్ల కేంద్ర మంత్రులు, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు సైతం ఆశ్చర్యపోతున్నారన్నారు.

ప్రాజెక్టు నిర్మాణ పనితీరును అడిగి తెలుసుకుంటున్నారన్నారు. ఉద్యమాన్ని మాత్రమే కాదు రాష్ట్రాన్ని కూడా ఆదర్శంగా తీర్చిదిద్దినట్లే, తెరాస పార్టీని కూడా దేశంలోని అన్ని పార్టీలకు ఆదర్శంగా అభివృధ్ధి పరుస్తూ 33 జిల్లాల్లో పార్టీ కార్యాలయాలు నిర్మాణం చేస్తున్నామన్నారు. ప్రజలు దేశ చరిత్రలోనే అన్ని రికార్డులు తిరగరాస్తూ ఎంఎల్‌ఏ ఎన్నికల్లో తెరాసకు అధికారం అప్పగిస్తూ, 50 శాతం ఓట్లు వేశారన్నారు. 9 పార్లమెంట్ స్థానాలు అప్పగించారని, జిల్లా పరిషత్, మండల పరిషత్, సర్పంచ్ తదితర అన్ని ఎన్నికల్లో తెరాసకు అసాధారణ విజయం అందించారన్నారు. దేశ చరిత్రలోనే మొదటి సారిగా ఒక రాష్ట్రంలోని అన్ని జిల్లా పరిషత్‌లపై గులాబీ జండాలు ఎగుర వేయడం చారిత్రక విజయమన్నారు.

రాష్ట్రంలో సర్పంచ్, ఎంపిటిసి, జడ్‌పిటిసి, ఎంపిపి మొదలుకొని ఎంపీలు, సిఎం వరకు తెరాస నేతలే కొనసాగుతుండటం ప్రజలిచ్చిన దీవెన అన్నారు. అనంతరం కెటిఆర్ కోనరావుపేట మండలంలోని మల్కపేటలో కాళేశ్వరం ప్రాజెక్టు తొమ్మిదో ప్యాకేజిలో భాగంగా చేపడుతున్న మల్కపేట జలాశయం పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. భూగర్భంలోని సొరంగంలోకి వెళ్లి పనితీరును పరిశీలించారు. అనంతరం అక్కడే అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.

అటు తరువాత సిరిసిల్లలో వీధి వ్యాపారుల కోసం అంబేద్కర్ చౌక్‌లో ఏర్పాటు చేసిన దుకాణాలను ప్రారంభించారు. తారకరామానగర్, వెంకంపేటలోని కమ్యూనిటి హళ్లను, జయప్రకాశ్‌నగర్‌లో పార్క్‌ను, డిఆర్‌సిసి షెడ్‌ను, వ్యర్థ పదార్థాలను శుధ్ది చేసే ప్లాంటును ప్రారంభించారు. చివరగా సిరిసిల్ల పట్టణ పద్మశాలి సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో శాసన సభ్యులు రసమయి బాలకిషన్, సుంకె రవి శంకర్, కలెక్టర్ కృష్ణభాస్కర్, జేసి యాస్మిన్‌భాష, మున్సిపల్ చైర్‌పర్సన్ సామల పావని,ఆర్‌డిఓ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

Irrigation Projects are Result of Sacrifices of Expats