Home ఎడిటోరియల్ కోటాపై ఆర్‌ఎస్‌ఎస్ మాట!

కోటాపై ఆర్‌ఎస్‌ఎస్ మాట!

Sampadakiyam      తానేమీ కాదంటూనే దేశానికి దిశానిర్దేశం చేస్తున్న అతి ప్రధాన అప్రధాన వ్యక్తి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) అధిపతి మోహన్ భగవత్ మరో పదునైన తూటాను పేల్చారు. దేశ సామాజిక పటాన్ని ఉన్నట్టుండి అతలాకుతలం చేయగల అత్యంత శక్తివంతమైన ఆయన ప్రతిపాదనపై తగ్గుస్థాయిలోనైనా అలజడి అప్పుడే ప్రారంభమైంది. న్యూఢిల్లీలో ఒక సభలో మాట్లాడుతూ రిజర్వేషన్ల అనుకూలురు, ప్రతికూలుర మధ్య సామరస్య పూర్వక వాతావరణంలో సంభాషణలు జరగాలని మొన్న సోమవారం నాడు భగవత్ సూచించారు. మొత్తం రిజర్వేషన్ల విధానంపైనే సమీక్ష జరగాలని ఈ సదుపాయం ఎవరికి ఎంత కాలం అవసరమో పరిశీలించి సిఫారసు చేయడానికి రాజకీయేతర నిపుణులతో కూడిన కమిటీని నెలకొల్పాలని కూడా ఆయన సూచించారు.

రిజర్వేషన్లను రాజకీయ స్వప్రయోజనకాండకు దుర్వినియోగపరుస్తున్నారని వ్యాఖ్యానించారు. ఇది కేవలం ఉబుసుపోకకో, ఆషామాషీగానో చేసిన ప్రతిపాదన కాదని స్పష్టపడుతూనే ఉంది. పనిలో పనిగా భగవత్ మరో మాట కూడా అన్నారు. ఆర్‌ఎస్‌ఎస్, బిజెపి, ఆ పార్టీ సారథ్యంలో నడుస్తున్న ప్రభుత్వం మూడూ భిన్నమైనవి, ఒకదాని చర్యలకు మరో దానిని బాధ్యురాలిని చేయడం తగదు, బిజెపిలో, దాని ప్రభుత్వంలో ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్తలున్నందున వారు దాని మాట వినవచ్చు, కాని అది చెప్పినట్టల్లా తప్పని సరిగా నడుచుకోవలసిన అగత్యం వారికి లేదు అని భగవత్ స్పష్టం చేశారు. ఇదంతా సభ్య సమాజపు మర్యాదలూ, రాజకీయ మెళకువలకు సంబంధించిన పరిభాష.

తన స్థాయి వ్యక్తి నుంచి ఇటువంటి అతి ముఖ్యమైన ప్రతిపాదన వచ్చిన తర్వాత దానిని ఎవరూ సీరియస్‌గా తీసుకోవలసిన పని లేదు అనడం బాగానే ఉంటుంది, వాస్తవం అందుకు పూర్తి విరుద్ధంగా ఉండకూడదని లేదు. కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పిస్తూ వచ్చిన ఆర్టికల్ 370 శాశ్వతమైనది కాదని కేంద్ర హోం మంత్రి అమిత్ షా పార్లమెంటులో మొదటిసారి ప్రకటించినప్పుడు కూడా దానిని అంతగా ఎవరూ పట్టించుకోలేదు, గట్టిగా చర్చ జరిగే సమయానికే దానిని రద్దు చేయడం, జమ్మూ కశ్మీర్ రాష్ట్ర ప్రతిపత్తినే హరించి దానిని రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించడం జరిగిపోయింది. సామాజికంగా అత్యంత బలహీనులు, అణచివేతకు గురవుతున్న వారికి విద్య, ఉద్యోగాల్లో ప్రత్యేక కేటాయింపులు అనుమతిస్తున్న రిజర్వేషన్ల విధానాన్ని కూడా ఆదిలో 10 ఏళ్లకు మించి కొనసాగించనవసరం లేదనే ఉద్దేశంతోనే రాజ్యాంగం ద్వారా అమల్లోకి తెచ్చారు.

అయితే ఏ సామాజిక అసమానతలను తొలగించి ఎటువంటి భవ్య సమాజాన్ని నెలకొల్పడం కోసం రిజర్వేషన్లను ఉద్దేశించారో ఆ లక్షం రానురాను మరింత దూరం జరుగుతున్న సంగతి కళ్ల ముందున్న కఠోర వాస్తవమే. అంతేకాక దేశంలో ధనిక, పేద వ్యత్యాసాలు రోజురోజుకి పెరుగుతున్నాయేగాని తగ్గడం లేదు. ఇక్కడ ధనికులంటే మొత్తమ్మీద సామాజికంగా పై స్థాయిలోనున్నవారు, పేదలంటే అడుగునగలవారనే విషయం ప్రత్యేకించి చెప్పుకోనక్కరలేదు. కుల వ్యవస్థ కారణంగా అణగారిన సామాజిక వర్గాలు శతాబ్దాల తరబడిగా భూ హక్కుకు, ఆస్తి హక్కుకు నోచుకోక అవిద్యలో అజ్ఞానంలో మగ్గి తీవ్రమైన వివక్షకు గురవుతూ వస్తున్నారు. వాస్తవానికి ఈ వర్గాలను పై వర్గాలతో సమాన స్థాయికి తీసుకు రాడానికే రిజర్వేషన్ల సూత్రం అవతరించింది.

స్వాతంత్య్రానికి ముందు సాహూ మహరాజ్ వంటి వారు దీనిని అమలు పరచి సామాజిక వ్యత్యాసాలను తగ్గించే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత భారత రాజ్యాంగంలో సామాజికంగా, విద్యా విషయకంగా వెనుకబడిన వర్గాలకు చేయూతనిచ్చి ముందుకు తీసుకుపోయేందుకు 15వ అధికరణకు సవరణను తీసుకు వచ్చారు. ఆర్టికల్ 341, 340 వంటివి అవతరించాయి. అందుచేత రిజర్వేషన్లనేవి కుల వ్యవస్థ మెజారిటీ ప్రజలను శూద్రులుగా, అంటరాని వారుగా వేరు చేసి శతాబ్దాలుగా అణగదొక్కి సాగించిన పలు రకాల అమానుష దోపిడీకి విరుగుడుగా అవతరించినవే. వాటిని వ్యతిరేకించేవారున్నారంటే ఈ దోపిడీని వారు సమర్థిస్తున్నారని భావించక తప్పదు.

గతంలో హింసాత్మకంగా సాగిన రిజర్వేషన్ల వ్యతిరేక ఉద్యమంలో సంఘ్ పరివార్ శక్తుల హస్తమున్నదనే అభిప్రాయం గాఢంగా నెలకొని ఉన్నది. హిందూత్వ మాదిరిగానే రిజర్వేషన్లను కూడా రాజకీయ స్వప్రయోజన కాండకు వినియోగించుకుంటున్న శక్తులు ఉన్న మాట వాస్తవమే. అంత మాత్రాన రిజర్వేషన్లను వ్యతిరేకిస్తున్న శక్తులకు ప్రాధాన్యం కల్పించి వారితో చర్చలు జరపాలని సూచించడం తగదు గాక తగదు. ఒక అమానుష వ్యవస్థను అంతమొందించడానికి పుట్టిన రిజర్వేషన్లకు తెర దించే కుట్ర భగవత్ సూచనలో దాగి ఉందనిపించడాన్ని తప్పుపట్టలేము.

Is Abrogation of Reservation on the Cards