Home ఎడిటోరియల్ ఐసిస్ రాక్షస క్రీడకు బలి

ఐసిస్ రాక్షస క్రీడకు బలి

sampadakeyam

“ఇరాక్‌లోని మోసుల్‌ను ఆక్రమించుకున్న ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్, సిరియా’(ఐఎస్‌ఐఎస్) 2014 జూన్‌లో కిడ్నాప్ చేసిన 39 మంది భారత కార్మికులను చంపివేసింది, వారి భౌతిక కాయాలు దొరికాయి” అని విదేశీ వ్యవహారాల మంత్రి సుష్మా స్వరాజ్ మంగళవారం రాజ్యసభలో చేసిన ప్రకటన దేశ ప్రజల్లో తెలియని బాధను, హతుల కుటుంబాల్లో విషాదం నింపింది. మృతుల్లో 27మంది పంజాబ్‌కు, నలుగురు హిమాచల్ ప్రదేశ్ కు, ఆర్గురు బీహార్‌కు, ఇద్దరు పశ్చిమ బెంగాల్‌కు చెందివారు. యుద్ధ కల్లోలంలో ఉన్న ఇరాక్‌లో తారిఖ్ నూర్ అల్‌హుడా అనే నిర్మాణ కంపెనీలో వారు పనిచేస్తుండేవారు. ఐసిస్ బంధించిన 40 మంది కార్మికుల్లో ఒకరు హర్జిత్ మాసి తప్పించుకుని భారత్ చేరుకుని తన సహ కార్మికులు 39 మందిని తుపాకీ కాల్పులతో చంపివేశారని నాలుగేళ్ల క్రితమే చెప్పాడు. అయితే ప్రభుత్వం దాన్ని కొట్టి పారేసింది. గత నాలుగేళ్లలో కనీసం ఏడుసార్లు తమవారు సజీవంగానే ఉన్నారని ప్రభుత్వం తమను ఎందుకు నమ్మించిందని, సుష్మ ప్రకటన టెలివిజన్ ప్రసారం ద్వారా తెలుసుకుని దిగ్భ్రాంతికి గురైన ఆ 39మంది అభాగ్యుల కుటుంబ సభ్యులు ప్రశ్నిస్తున్నారు. కొన్ని ప్రతిపక్ష పార్టీలు కూడా ప్రభుత్వం తప్పు సమాచారంతో పార్లమెంటును తప్పు త్రోవ పట్టించిందని ఆరోపించాయి. అయితే సుష్మాస్వరాజ్ సమర్థన సానుభూతితో అర్థం చేసుకోదగింది. “మాసీ ఒక వ్యక్తి. ఇతర 39 మంది చంపబడినట్లు అతడు చెప్పవచ్చు. కాని మేము ప్రభుత్వం, బాధ్యతతో వ్యవహరించాలి, నిర్థారణ పూర్వకమైన రుజువు లేకుండా ఎవరినీ చనిపోయినట్లు ప్రకటించలేను. ఇవాళ ఆధారపూర్వకంగా పార్లమెంటుకు ముందుకు వచ్చాను” అన్నారామె.
మోసుల్ పట్టణంలో కిడ్నాప్ చేసిన 40మంది భారత కార్మికులను అక్కడికి 25 కిలోమీటర్లలోని బాదుష్ తీసుకెళ్లిన ఐసిస్ కిరాతకులు వారిని చంపి పెద్ద గోతిలో పూడ్చివేశారు. బంగ్లాదేశ్ ముస్లింనంటూ ఒకరు తప్పించుకున్నారు. ఆ కార్మికుల జాడ తెలుసుకునేందుకు భారతప్రభుత్వం నాటినుంచీ అనేక మార్గాల్లో ప్రయత్నించింది. ఇరాక్ సైన్యాలు 2017 చివరలో ఐసిస్ దిగ్బంధం నుంచి మోసుల్‌ను విముక్తి చేసిన తదుపరి గాని, ‘తప్పిపోయిన’ భారతీయుల కొరకు అన్వేషణ సాధ్యం కాలేదు. 2017 అక్టోబర్ లో విదేశీ వ్యవహారాల సహాయమంత్రి వికెసింగ్ భారతీయుల జాడ తెలుసుకునే ప్రయత్నాలు ముమ్మరం చేసేందుకు ఇరాక్ వెళ్లారు. బాదుష్ ప్రాంతానికి వెళ్లినపుడు, సమీపంలోని దిబ్బకింద అనేక శవాలు పూడ్చిపెట్టారని స్థానికులు చెప్పారు. లోతుకు చొచ్చుకు పోగల రాడార్లతో పరీక్షించగా ఆ గోతిలో కచ్చితంగా 39 మృతదేహాలున్నాయి. ఈలోపు భారతప్రభుత్వం మృతుల కుటుంబీకుల డిఎన్‌ఎ శాంపిల్స్ సేకరించి పంపగా, బాగ్దాద్ లో జరిపిన పరీక్షల్లో 38 మృతదేహాలు గుర్తించబడ్డాయి. 39వ వ్యక్తి డిఎన్‌ఎ అతని బంధువు డిఎన్‌ఎతో 70శాతం సరిపోలింది. హతుల భౌతిక అవశేషాలను భారత్‌కు తెచ్చి వారి కుటుంబాలకు అప్పగించే ప్రయత్నాలు జరుగుతున్నాయి.
ఇప్పుడు జరగాల్సిందేమిటి? మృతుల కుటుంబాలకు కేంద్రప్రభుత్వం గణనీయం గా ఆర్థిక సహాయంప్రకటించటంతోపాటు, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించి ఆ కుటుంబాలు దుఃఖసాగరంనుంచి కోలుకుని సాధారణ జీవితం గడిపేందుకు చేయూత ఇవ్వాలి.అధిక ఆర్జనతో కుటుంబాలను పోషించవచ్చనే భావనతో పొట్ట చేతబట్టుకుని కల్లోల పశ్చిమాసియాకు వెళ్లి బాధలనుభవిస్తున్న భారత కార్మికులపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. ప్రభుత్వ ఏజన్సీల ద్వారానే కార్మికులను పంపే పద్ధతి ఎంతైనా అవసరం. మలేషియాలో చిక్కుకున్న 35మంది జార్ఖండ్, పశ్చిమ బెంగాల్ వలసకార్మికులను సుష్మా స్వరాజ్, మాల్దా కాంగ్రెస్ నాయకుడు మౌసం నూర్ చొరవతో భారత్ తీసుకు రావటం జరుగుతున్నది. అజర్‌బైజాన్‌లో చిక్కుకుపోయిన 160మంది బెంగాల్, జార్ఖండ్ వలస కార్మికుల అతీగతీ ఏమిటో తెలియదు. సౌదీ అరేబియాలో కూడా ఇటువంటి ఘటన వివరాలు తెలియాల్సి ఉంది. చేతులు కాలాక ఆకులు పట్టుకునే దానికన్నా ముందస్తు జాగ్రత్తలు మేలు.