Home తాజా వార్తలు ‘ఇస్మార్ట్‌ శంకర్‌’ కాన్సెప్ట్‌ నాదే: హీరో ఆకాశ్

‘ఇస్మార్ట్‌ శంకర్‌’ కాన్సెప్ట్‌ నాదే: హీరో ఆకాశ్

 

హైదరాబాద్‌: ‘ఇస్మార్ట్‌ శంకర్‌’ కాన్సెప్ట్‌ తనదేనని, చట్టపరంగా చర్యలు తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నానని ‘ఆనందం’ ఫేం ఆకాష్‌ పేర్కొన్నాడు. దీంతో ‘ఇస్మార్ట్‌ శంకర్‌’ వివాదంలో పడింది. గత కొంతకాలంగా సరైన సక్సెస్ లేక డీలాపడ్డా డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్, రామ్ పోతినేని కళ్లల్లో ఆనందాన్ని నింపింది ‘ఇస్మార్ట్‌ శంకర్‌’. ఒక వ్యక్తి మెమొరీని వేరొక వ్యక్తి మెమొరీలోకి పెట్టి నిజాన్ని రాబట్టడం అనే మూల కథతో పూరీ ‘ఇస్మార్ట్ శంకర్’ మూవీని తెరకెక్కించాడు. ఈ నెల 18న రిలీజైన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద భారీ వసూళ్ళను రాబడుతుండడంతో చిత్రయూనిట్ ఆనందంలో మునిగితేలుతుంది. ఈ  సమయంలో.. ఈ కాన్సెప్ట్‌ తనదేనని హీరో ఆకాశ్  మీడియా ముందుకు రావడం చర్చనీయాంశం అయ్యింది.

ఈ సందర్భంగా ఆకాశ్ మాట్లాడుతూ… ‘ఇదే ఇతివృత్తంతో తెలుగు-తమిళ భాషల్లో నేను రాసిన కథ, కథనాలతో నన్నే హీరోగా పెట్టి దర్శకురాలు రాధా ఓ సినిమా తీశారు. ఆ చిత్రం తమిళంలో ఇప్పటికే ‘నాన్ యార్’ పేరుతో విడుదలైంది. తెలుగులో ‘కొత్తగా ఉన్నాడు’ టైటిల్‌తో త్వరలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం. ఈ క్రమంలో మాకు రీసెంట్ గా విడుదలైన ‘ఇస్మార్ట్ శంకర్’ రూపంలో షాక్ తగిలింది. ఈ విషయమై పూరీ జగన్నాథ్‌ను సంప్రదించాలని ప్రయత్నించాం. కానీ ఆయన అందుబాటులోకి రాలేదు. దీంతో తమిళ నిర్మాతల సంఘంలో ఫిర్యాదు చేసి, సత్వర పరిష్కారం కోసం ఇక్కడ మీడియాను ఆశ్రయించాం’ అని చెప్పుకొచ్చాడు. అంతేకాదు తన వాదనను వినిపించే ఆధారాలను ఆకాష్ మీడియా ముందు ఉంచారు. సమస్య సామరస్యంగా పరిష్కారం కానీ పక్షంలో లీగల్‌గా ప్రొసీడ్ అయ్యేందుకు కూడా తానూ సిద్ధంగా ఉన్నట్లు ఆకాశ్ స్పష్టం చేశారు.

Ismart Shankar Concept is mine: Hero Akash