Home అంతర్జాతీయ వార్తలు తక్కువ ఖర్చుతో మించిపోతారా?

తక్కువ ఖర్చుతో మించిపోతారా?

NASA

వాషింగ్టన్ : చంద్రయాన్ కీలక ఘట్టంపై అమెరికా శాస్త్రజ్ఞులు ప్రత్యేకించి అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా సైంటిస్టులు ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. విక్రమ్ ఏ విధంగా ల్యాండ్ అవుతుందనేది అమెరికా శాస్త్రీయ వర్గాలలో ఉత్కంఠను రేపుతోంది. ఈ ఘట్టం విజయవంతం అయితే భారతదేశం అమెరికా చైనా రష్యాల సరసన చంద్ర జైత్ర యాత్రలో నాలుగో దేశంగా నిలుస్తుంది. ఇక మరో ప్రత్యేకతగా చంద్రుడి దక్షిణ ధృవంపై విజయవంతంగా ల్యాండింగ్ చేపట్టిన తొలి దేశంగా చరిత్రలో నిలుస్తుంది. చంద్రుడి నైసర్గిక స్వరూపాన్ని అక్కడి వనరుల గురించి మరింతగా తెలుసుకునేందుకు భారతదేశపు చంద్రయాన్ అమితంగా దోహదం చేస్తుందని నాసా వర్గాలు ఆశిస్తున్నాయి. చంద్రుడిపైకి ప్రజ్ఞాన్ ఆరు చక్రాల రోవర్ చేరడం కీలక ఘట్టం అవుతుందని స్పేస్. కామ్ తెలిపింది. చంద్రుడి దక్షిణ ప్రాంతాన్ని తిలకించే తొలిదశ చంద్రయాన్‌తోనే ఆవిష్కృతం అవుతుందని పేర్కొన్నారు. చంద్రయాన్‌లో 13 పరికరాలు ఉంటాయి. ఇందులో నాసాకు చెందిన ఒక సాధనం కూడా ఉంది.

ఇప్పటివరకూ అభేధ్యంగా ఉన్న ప్రాంతాలకు చంద్రయాన్‌ను తలపెట్టారని జాన్స్ హాప్కిన్స్ యూనివర్శిటీకి చెందిన ఖగోళ శాస్త్రజ్ఞులు బ్రెట్ట్ డెనివీ స్పందించారు. ఆమె శాస్త్ర వ్యవహారాల పత్రిక నేచర్ వారితో మాట్లాడారు. ఇప్పటి సమాచారం అన్ని విధాలుగా కీలకంగా మారుతుందని తెలిపారు.ఇతర దేశాల ప్రయోగాలతో పోలిస్తే తక్కువ ఖర్చుతో కూడా ప్రయోగం ఇదేనని న్యూయార్క్ టైమ్స్ పత్రిక తెలిపింది. దీని గురించి పత్రికలో విశ్లేషించారు. చంద్రయాన్ 2కు అయిన ఖర్చు హాలీవుడ్ సినిమా ఇంటర్‌స్టెల్లార్‌కు అయిన ఖర్చు కన్నా తక్కువ అని పేర్కొన్నారు. చంద్రయాన్‌కు 150 మిలియన్ డాలర్ల కన్నా తక్కువ బడ్జెట్ అని తెలిసిందని, ఇది చాలా గొప్ప విషయమే అని తెలిపారు. దక్షిణ ధృవంలో జలం ఉందనే అంచనాల నడుమ అక్కడ కీలక పరిశోధనలు మేలు చేస్తాయని, ఐస్ గురించి దాని ద్వారా జీవచరాల ఉనికికి అవకాశాల గురించి తెలుసుకునే వీలేర్పడుతుందని ఇదంతా కూడా మానవాళికి దోహదం చేసే ప్రక్రియనే అవుతుందని ఈ ప్రముఖ అమెరికా పత్రిక తెలిపింది. అక్కడ లభ్యం అయ్యే ఇంధనం అంగారకుడిపై ప్రయోగాలకు వినియోగించుకోవచ్చునని, ఈ విధంగా పలు బహుళ స్థాయిలో ఇది అనుసంధాన ప్రాజెక్టుగా నిలుస్తుందని కితాబు ఇచ్చారు.

స్పేస్ సూపర్‌పవర్ ఇండియా
అంతరిక్ష రంగంలో భారతదేశం తన ఆధిపత్యాన్ని చాటుకుంటుందని, ఈ రంగంలో సూపర్ పవర్ అయ్యేందుకు చేరువలో ఉందని సిఎన్‌ఎన్ తెలిపింది. ప్రముఖ దేశాల బృందంలో ఇండియా చేరుతుందని ఈ న్యూస్‌ఛానల్ ఒక కథనాన్ని వెలువరించింది. గత దశాబ్దంలో ఇండియా తక్కువ ఖర్చుతో అంతరిక్షంలో అత్యధిక విజయాలు సాధించుకుందని తెలిపారు. చంద్రుడి నిర్మాణం, ఉపరితల విశేషాలను తెలుసుకునేందుకు ఈ ప్రయోగం కీలకమవుతుందని, అక్కడ గనులు ఉన్నాయా? నీరుం దా? ఇంధన ఉనికి ఉందా? వంటి అనేక విషయాలు వెలుగులోకి వచ్చేలా పరిశోధనలకు వీలేర్పడుతుందని అరిజోనా వర్శిటీకి చెందిన చంద్రమండల, ఖగోళ ప్రయోగశాల డైరెక్టర్ టిమూతీ స్విండ్లే గురువారం ఎన్‌బిసి న్యూస్‌కు చెప్పారు. మరింతగా మనం అధ్యయనం చేయడం వల్ల మరిన్ని విషయాలకు అవకాశం ఏర్పడుతుంది. మానవ అన్వేషణకు, ఉపయోగానికి చంద్రుడు అత్యంత సానుకూల వేదిక. ఈ దిశలో ఇటువంటి ప్రయోగం అత్యంత కీలకం అని ప్రకటించారు.

Isro goes into huddle after losing contact with Vikram lander