Home ఎడిటోరియల్ చంద్రయాన్ 2

చంద్రయాన్ 2

Sampadakiyam             భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) తొలి చంద్రయానం జరిపిన దాదాపు పదకొండేళ్ల తర్వాత రెండవ ఘట్టానికి ముహూర్తాన్ని ప్రకటించడం అమిత సంతోషదాయకమైన పరిణామం. అమెరికా, సోవియెట్, చైనా మాదిరిగానే చంద్ర విజయాన్ని సాధించి తీరాలంటూ 2000 సం॥లో చెప్పుకున్న ఘన సంకల్ప సాధనలో మలి అడుగు వేయబోతుండడం స్వాగతించవలసిన అంశం. దేశంలో రాజకీయాధికారం మత పరమైన భావజాలం గూడుకట్టుకున్న మితవాద శక్తుల గుప్పెట్లోకి జారిపోయినా శాస్త్ర సాంకేతిక రంగాల్లో, ముఖ్యంగా అంతరిక్ష శోధనలో మాత్రం ముందడుగు పడుతూ ఉండడం ముదావహం. వచ్చే నెల 15వ తేదీన శ్రీహరి కోటలోని సతీశ్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి దూసుకుపోనున్న చంద్రయాన్ 2 చంద్రమండల ఉపరితలంలోని ఖనిజాలు, రసాయన స్థితి, నీటి జాడలు, రాళ్ల ఉనికి వంటి వాటి గురించి తెలుసుకొనే దిశగా పలు ప్రయోగాలు చేస్తుంది. 3.8 టన్నుల బరువుండే ఈ అంతరిక్ష నౌక జిఎస్‌ఎల్‌వి మార్క్ 3 ద్వారా ప్రయాణం చేస్తుంది.

చంద్రుని ఉపరితలం మీద అతి నెమ్మదిగా దిగుతుంది. ఇలా దిగే ప్రక్రియను భారత్ చేపట్టనుండడం ఇదే మొదటిసారి. ఈ అంతరిక్ష నౌకలోని రోవర్ అనే పరికరం సెకనుకు సెంటిమీటర్ వేగంతో 500 మీటర్ల దూరం చంద్రోపరితలమ్మీద ప్రయాణిస్తుంది. ఈ అతి సున్నితమైన, క్లిష్టమైన ప్రక్రియలో విజయవంతమైతే ఇంతవరకు దీనిని సాధించిన అమెరికా, సోవియెట్, చైనాల సరసన భారత్ చేరుతుంది. చంద్రయాన్ 2 ఇప్పటి వరకు ఏ దేశ శోధనకూ గురి కాని చంద్రతలంలోని దక్షిణ ధ్రువ ప్రాంతంలో దిగి పరిశోధన చేస్తుంది. భూమికి అభిముఖంగా ఉండే చంద్రోపరితలం మీదనే దిగడం ఆనవాయితీ. ఇందుకు భిన్నంగా గత జనవరి 3వ తేదీన వెళ్లిన చైనా అంతరిక్ష నౌక చంద్రతలం వెనుక వైపు దిగింది. చంద్రయాన్ 2 నౌకలో కక్షకే పరిమితమయ్యే ఆర్బిటర్, ఉపరితలం మీద దిగే ల్యాండర్ అక్కడ ప్రయోగాలు జరిపే రోవర్ అనే మూడు విభాగాలుంటాయి. మన అంతరిక్ష పరిశోధనకు ఆద్యుడైన విక్రమ్ సారాభాయ్ పేరిట ల్యాండర్‌కు విక్రమ్ అని, రోవర్‌కు ప్రజ్ఞాన్ అని పేరు పెట్టారు.

మొత్తం 13 ఉపగ్రహాలను ఈ నౌక తీసుకెళుతుంది. ఆర్బిటర్‌లో 8, ల్యాండర్‌లో 3, రోవర్‌లో 2 ఉంటాయి. ల్యాండర్‌ను వీడి ఉపరితలం మీద సంచరించేది రోవర్. అది తాను సంగ్రహించిన సమాచారాన్ని ల్యాండర్‌కు చేరవేస్తుంది. ల్యాండర్, ఆర్బిటర్లు దానిని ఇస్రోకు అందజేస్తాయి. అమెరికన్ నేషనల్ ఏరోనాటిక్స్, స్పేస్ అడ్మినిస్ట్రేషన్‌కు చెందిన పరిమిత పరిశోధక ఉపగ్రహం కూడా చంద్రయాన్ 2 ద్వారా వెళుతూ ఉండడం విశేషం. అమెరికాతో భారత దేశం పెనవేసుకున్న శాస్త్రవిజ్ఞాన శోధక సంబంధాలకిది నిదర్శనం. 2008 అక్టోబర్ 22న ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్ 1 అంతరిక్ష నౌక చంద్రమండల ఉపరితలానికి 100 కిలోమీటర్ల పైనుంచి అక్కడి పరిస్థితులపై పరిశోధనలు జరిపింది. అందులో వెళ్లిన 5 భారతీయ శాస్త్రశోధక ఉపగ్రహాలు గణనీయమైన కృషి చేశాయి. చంద్రోపరితలం మీద హైడ్రోజన్ ఆకిజన్ మిశ్రమాన్ని, నీటి జాడలను, మంచు ఉనికికి సంకేతమైన రేడియోధార్మిక పదార్థాలను కనుగొన్నది.

పిఎస్‌ఎల్‌వి సి 11 రాకెట్ ద్వారా ప్రయోగించిన చంద్రయాన్ 1 చంద్రునిపై అన్వేషణకు సంబంధించి దేశీయ పరిజ్ఞానాన్ని సమకూర్చుకోవడంలో ఉపయోగపడింది. అది తనకు అప్పగించిన లక్షాలలో 95 శాతం సాధించి అర్ధంతరంగా భూమితో సంబంధాలను కోల్పోయింది. రెండేళ్లపాటు సాగి ఉండవలసిన ఆ పరిశోధన 312 రోజులకే ముగిసింది. చంద్రయాన్ 2లో పూర్తి స్థాయి దేశీయ పరిజ్ఞానాన్ని వినియోగించుకున్నామని అతి నెమ్మదిగా దిగే ల్యాండింగ్ ప్రక్రియను కొత్తగా చేపడుతున్నామని ఆర్బిటర్ నుంచి ల్యాండర్ విడివడే ఆ క్లిష్టమైన ప్రక్రియలో ఎటువంటి సమస్యలు ఎదురుకాకుండా అవసరమైన జాగ్రత్తలు తీసుకున్నామని ఇస్రో చైర్మన్ కె శివన్ ప్రకటించారు. ఈ కృషిలో పాలుపంచుకున్న శాస్త్రజ్ఞుల్లో 30 శాతం మంది మహిళలే కావడం గమనించవలసిన విశేషం.

చంద్రయాన్ 2 భూ కక్షలోకి ప్రవేశించిన తర్వాత 3.5 లక్షల కిలోమీటర్ల దూరం చంద్రుని వైపు ప్రయాణిస్తుంది. ఆ తర్వాత వాహక రాకెట్ నుంచి విడిపోయి ఆర్బిటర్, ల్యాండర్, రోవర్‌లు చంద్రుడి దక్షిణ ధ్రువం వైపు మళ్లుతాయి. చంద్రుడికి 30 కిలోమీటర్ల దూరంలో ఆర్బిటర్ నుంచి ల్యాండర్ విడివడే సున్నితమైన దశపైనే ఇది అందరి దృష్టి కేంద్రీకృతమై ఉంది. మనం కూడా ఒక అంతరిక్ష కేంద్రాన్ని నిర్మించుకోదలిచామని 2022 నాటికి అంతరిక్షంలోకి మానవ సహిత యాత్ర జరపాలని సంకల్పించా మని కేంద్రం ప్రభుత్వం గురువారం నాడు చేసిన ప్రకటన మన రోదసీ శోధన భవిష్యత్తు మహోజ్వలంగా ఉండగలదనే ఆశలను రేకెత్తిస్తున్నది.

ISRO launches Samwad with Students on New Year Day