Home జాతీయ వార్తలు జాబిలిపై విక్రమ్ జాడ తెలిసింది

జాబిలిపై విక్రమ్ జాడ తెలిసింది

Vikram Lander

 

బెంగళూరు : చంద్రయాన్‌పై తిరిగి ఆశలు చిగురించాయి. చంద్రుడి ఉపరితలంపై ల్యాండర్ విక్రమ్ జాడ తెలిసిందని ఇస్రో ఛైర్మన్ కె శివన్ ఆదివారం తెలిపారు. వ్యోమనౌక నుంచి విడిపోతూనే ఇది నిర్ణీత ప్రక్రియకు విరుద్ధంగా చంద్రుడి ఉపరితలాన్ని బలంగా ఢీకొందని ఈ విధంగా హార్డ్ ల్యాండింగ్ జరిగి ఉంటుందని తెలిపారు. నిర్ణయించిన ప్రకారం విక్రమ్ చంద్రుడి ఉపరితలంపై సజావుగా దిగడంలో విఫలం అయిందని ఆయన అంగీకరించారు. విక్రమ్‌తో తిరిగి సంబంధాలను నెలకొల్పుకునేందుకు యత్నిస్తున్నట్లు, దీనికి ఆర్బిటర్ సాయం తీసుకుంటున్నట్లు ఆయన వివరించారు. చంద్రుడి ఉపరితలంపై పడి ఉన్న విక్రమ్ ఆచూకీని చంద్రయాన్ వ్యోమనౌకకు చెందిన ఆర్బిటర్‌కు అనుసంధానమై ఉన్న కెమెరా ఛాయాచిత్రాల ద్వారా కనుగొన్నట్లు శివన్ వివరించారు. ల్యాండర్ లోపల రోవర్ ప్రజ్ఞాన్ ఉంది.

ఉపరితలాన్ని గట్టిగా తాకుతూ సాగిన హార్డ్ ల్యాండింగ్‌తో విక్రమ్ దెబ్బతిందా? అనే ప్రశ్నకు శివన్ స్పందిస్తూ , దీని గురించి ఇప్పటికైతే తమకు తెలియదని చెప్పారు. ల్యాండర్‌తో సంబంధాల పునరుద్ధరణకు అన్ని విధాలుగా యత్నిస్తున్నట్లు వివరించారు. శనివారం తెల్లవారుజామున చంద్రయాన్ 2 యాత్రలో చివరి ప్రక్రియ అయిన ల్యాండింగ్ దశ వికటించింది. విక్రమ్ ల్యాండర్ గ్రౌండ్ స్టేషన్‌తో సంబంధాలు లేకుండా జాడ తెలియకుండా పోయింది. దీనితో ఇస్రోలో తీవ్ర నిరాశ నిస్పృహలు వ్యక్తం అయ్యాయి. ఉపరితలానికి కేవలం రెండు కిలోమీటర్ల దూరంలోనే ఉన్న సమయంలో ల్యాండింగ్ ప్రక్రియ బెడిసికొట్టడం ఈ ప్రయోగంలో వైఫల్యంగా మారింది. నిర్ణీత విధంగా కాకుండా ల్యాండర్ ఉపరితలాన్ని వేగంగా ఢికొట్టడం, అదుపు తప్పడం వంటి పరిణామాలు ఎందుకు సంభవించాయనేది వెల్లడి కావాల్సి ఉందని శివన్ చెప్పారు.

అప్పటివరకూ అంతా సజావుగానే ఉండి , మధ్యలో కొంత మార్గం మళ్లి తిరిగి సవ్యమైన మార్గంలోకి వచ్చిన ల్యాండర్ చివరి నిమిషాలలో కంట్రోలు తప్పడం, కమ్యూనికేషన తెగిపోవడంతో ఈ యాత్ర అపజయం కావడానికి దారితీసింది. ప్రస్తుతం తాము ల్యాండర్ డాటాను విశ్లేషించుకుంటున్నట్లు ఆయన ఇస్రోకు చెందిన ఇస్‌ట్రాక్ సెంటర్‌లో వార్తా సంస్థల వారికి తెలిపారు. సాధారణంగా ల్యాండర్ నిర్ణీత వేగంతో నాలుగు చక్రాలపై ఉపరితలంపై దిగి ఉండే ల్యాండింగ్ సరైన విధంగా జరిగి ఉండేదని, అయితే ఈ విధంగా కాకుండా విక్రమ్ అడ్డగోలుగా ల్యాండింగ్ అయిన దశలో అది పూర్తిగా దెబ్బతినే అవకాశం కూడా ఉండి ఉంటుందని అంతరిక్ష నిపుణులు కొందరు చెప్పారు. ల్యాండర్‌లోని వ్యవస్థలు చివరి దశలో సరిగ్గా పనిచేయకపోవడం వల్లనే అది అదుపు తప్పి ఉపరితలాన్ని గట్టిగా తాకి ఉంటుందని వారు తెలిపారు.

ల్యాండింగ్ ప్రక్రియకు అవసరం అయిన పదిహేను నిమిషాల వ్యవధి అత్యంత సంక్లిష్టతతో కూడుకున్నది. ఈ దశలో అన్ని అంశాలూ సక్రమ ల్యాండింగ్‌కు అనుకూలించాలి. ఉపరితలంపై ఉండే ఆకర్షణ శక్తి, ల్యాండర్ ప్రధాన నౌక నుంచి విడిపొయ్యేటప్పుడు ఉండే గమనశక్తి అన్ని సమన్వయంతో ఉంటేనే సక్రమ ల్యాండింగ్‌కు వీలుంటుంది. అయితే ఈ క్రమంలో తలెత్తిన సమన్వయ లోపంతోనే హార్డ్ ల్యాండింగ్ జరిగి ఉంటుందని, ల్యాండర్‌లోని పరికరాలు దెబ్బతింటే అది ఇక పనికిరాకుండా పోతుందని, అయితే భూ కేంద్రం నుంచి సరైన విధంగా సంకేతాలు పంపిస్తే , వీటిని అది సమీకరించుకోగల్గితే తిరిగి సక్రమ దశకు చేరుకుంటుందని నిపుణులు తెలిపారు. ఆర్బిటర్ ద్వారా ల్యాండర్‌తో సంబంధాల పునరుద్ధరణనే ఇప్పుడు కీలకంగా మారిందని అంగీకరించారు.

ISRO locates Vikram lander position on Moon