Saturday, April 20, 2024

ఇస్రో మరో ముందడుగు

- Advertisement -
- Advertisement -

శ్రీహరికోట : భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) పుటల్లో మరో విజయం వచ్చి చేరింది. నూతన దశ నావిగేషన్ శాటిలైట్ ఎన్‌విఎస్ 01ను ఇస్రో శాస్త్రజ్ఞులు, సాంకేతిక బృందం శ్రీహరికోట సతీష్ ధావన్ ప్రయోగ వేదిక షార్ నుంచి సోమవారం విజయవంతంగా పరీక్షించారు. ఇస్రోకు విశ్వాస పాత్ర పోషిస్తోన్న జిఎస్‌ఎల్‌వి రాకెట్ నుంచి నిర్ణీత కక్షలోకి నింగికి ఎగిసి దూసుకువెళ్లింది. సంబంధిత క్రైయెజెనిక్ అప్పర్ స్టేజ్‌లోకి ఉపగ్రహాన్ని ప్రవేశపెట్టడంలో విజయం సాధించారు. దీనితో ప్రయోగ కేంద్రం షార్‌లో శాస్త్రజ్ఞులు , సిబ్బంది హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. ప్రయోగం విజయవంతం అయినట్లు ఇస్రో ఛైర్మన్ ఎస్ సోమనాథ్ ప్రకటించారు.

ఈ లక్షం అత్యద్భుతంగా విజయవంతం చేయడంలో పాత్ర వహించిన వారందరికి అభినందనలు తెలియచేస్తున్నట్లు తెలిపారు. ఉదయం 10.42 గంటలకు జిఎస్‌ఎల్‌వి ఎఫ్ 12 రాకెట్ నుంచి ఎస్‌విఎస్ 01 శాటిలైట్‌ను నింగిలోకి పంపించిన విషయం నిర్థారణ అయిందని పేర్కొన్నారు. రెండో తరం నావిగేషన్ శాటిలైట్ల వరుసలో ఇది తొలి ఉపగ్రహంగా నిలిచింది. 27.5 గంటల కౌంట్‌డౌన్ తరువాత మూడు స్టేజీల జిఎస్‌ఎల్‌వి వాహక నుంచి శాటిలైట్‌ను పంపించారు. జిఎస్‌ఎల్‌వికి ఇది 15 వ ప్రయోగ ఘట్టంగా నిలిచింది. ఇప్పటి శాటిలైట్ ప్రయోగానికి పలు ప్రత్యేకతలు ఉన్నాయి. ఇప్పుడు ప్రాంతీయ నావిగేషన్‌కు , రియల్ టైం నావిగేషన్‌కు తోడ్పాటు అందించే ఈ శాటిలైట్‌లో ప్రత్యేకంగా రుబిడియం అణుగడియారం ఉంది.

ఈ ప్రత్యేక గడియారాన్ని అహ్మదాబాద్‌లో స్పేస్ అప్లికేషన్ సెంటర్‌లో రూపొందించారు. ఇది అత్యంత ప్రత్యేకతల టెక్నాలజీని సంతరించుకుని ఉంది. ఇటువంటి సాంకేతికతో కూడిన అణుగడియారాలు అతి కొద్దిదేశాల వద్దనే ఉన్నాయి. దీని సాయంతో ఎప్పటికప్పుడు సమగ్రరీతిలో నిర్ణీత లక్షంతో కూడిన నావిగేషన్ డాటాను చేరవేసేందుకు వీలేర్పడుతుంది. ఈ నావిగేషన్ సిస్టమ్ జిపిఎస్ మాదిరిగానే రియల్ టైం నావిగేషన్‌కు ఉపయోగపడుతుంది. జిఎస్‌ఎల్‌వి ఎప్ 10 వైఫల్యంతరువాత దక్కిన విజయం ఇదే. 2021లో ఇంజిన్ ఇంధనలోపాలతో నిర్ణీత విధంగా ప్రయోగం విజయవంతం కాలేకపోయింది.

ఇంతకు ముందటి వైఫల్యాలను సమీక్షించుకుని ఇప్పుడు దీనిని విజయవంతం చేసినట్లు , తగు విధంగా దిద్దుబాటు చర్యలు తీసుకున్నందుకు సంబంధిత విశ్లేషణల కమిటీని అభినందిస్తున్నట్లు తెలిపారు. ఇస్రో నావిక్ సిస్టమ్‌ను దేశపు పలు అవసరాల నేపథ్యంలో రూపొందించింది. ప్రత్యేకించి పౌర విమానయానం, సైనిక అవసరాల కోసం దీనిని సమాయత్తం చేశారు. రాకెట్ నుంచి నింగిలోకి దూసుకువెళ్లిన తరువాత 20 నిమిషాలలోపున 2232 కిలోల ఈ శాటిలైట్ దాదాపు 251 కిలోమీటర్ల ఎత్తున నిర్ధేశిత జిటిఒ కక్షలోకి ప్రవేశించింది. ఇంతకు ముందటి నావిక్ ఉపగ్రహాలు పది సంవత్సరాలే సేవలు అందించే సామర్థంతో ఉన్నాయి.

కాగా ఇప్పుడు ఆధునీకరించిన ఈ రెండో తరం ఉపగ్రహాలు 12 ఏండ్ల పాటు సేవలను కల్పిస్తాయి. అంతేకాకుండా ఈ తరహా శాటిలైట్స్ పంపించే ఎల్ 1 సిగ్నల్స్‌తో శాటిలైట్స్ ఆధారిత నావిగేషన్ వ్యవస్థ మరింత సమగ్రంగా పనిచేయగల్గుతుంది. ఇప్పుడు ప్రయోగించిన శాటిలైట్ భారతదేశ ప్రధాన భూభాగానికి దాదాపు 1500 కిలోమీటర్ల పరిధి వరకూ రియల్ టైం నావిగేషన్ సేవలు అందిస్తుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News