Home జాతీయ వార్తలు ‘దైనిక్ భాస్కర్’ ఆఫీసులపై ఐటి దాడులు

‘దైనిక్ భాస్కర్’ ఆఫీసులపై ఐటి దాడులు

IT attacks on dainik bhaskar group offices

 

యుపి టెలివిజన్ చానల్ భారత్ సమాచార్‌పై కూడా

న్యూఢిల్లీ: పన్ను ఎగవేత ఆరోపణలకు సంబంధించి ఆదాయం పన్ను శాఖ గురువారం దేశంలోని రెండు ప్రముఖ మీడియా సంస్థలపై దాడులు జరిపింది. ప్రఖ్యా త హిందీ దినపత్రిక దైనిక్ భాస్కర్ గ్రూపు, ఉత్తరప్రదేశ్‌కు చెందిన ప్రముఖ టెలివిజన్‌చానల్ భారత్ సమాచార్‌పై ఐటి శాఖ సోదాలు చేపట్టింది. దైనిక్ భాస్కర్‌కు చెందిన 35 లొకేషన్లలో ఈ సోదాలు జరిగినట్లు తెలుస్తోంది. ఢిల్లీ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్, మహారాష్ట్ర రాష్ట్రాల్లోని దైనిక్ భాస్కర్ కార్యాలయాల్లో ఈ సోదాలు నిర్వహించారు. ఇక భారత్ సమాచార్‌కు సంబంధించి లక్నోలోని ఆ సంస్థ ప్రధాన కార్యాలయంలో ఐటి అధికారులు సోదాలు నిర్వహించారు.

ఆ చానల్ ఎడిటర్ నివాసంలోను సోదాలు నిర్వహించినట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ఆ రెండు మీడియా సంస్థలు ప్రభుత్వానికి పన్నులు ఎగవేసినట్లు కచ్చితమైన సాక్షాలు ఉన్నందునే సోదాలు నిర్వహిస్తున్నామని ఐటి అధికారులు తెలిపారు. ఇటీవల దైనిక్ భాస్కర్ పత్రిక, భారత్ సమాచార్ టెలివిజన్‌లో వచ్చిన కథనాలతో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తీవ్ర ఇరకాటంలో పడింది. దాంతో ఆ రెండు మీడియా సంస్థలు పన్ను ఎగవేసినట్లు గుర్తించిన ప్రభుత్వం ఇప్పుడు సోదాలు చేయిస్తున్నది.

అయితే కరోనా మహమ్మారిని కట్టడి చేయడంలో యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం వైఫల్యాలను బైటపెట్టినందుకే ప్రభుత్వం ఆసంస్థలపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని విపక్షాలు విమర్శిస్తున్నాయి. ఈ దాడులను ఆప్ అధినేత,ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్, కాంగ్రెస్ నాయకుడు, రాజస్థాన్ సిఎం అశోక్ గెహ్లాట్ సహా పలువురు విపక్ష నేతలు ఖండించారు. ఈ దాడులపై కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ ‘ కరోనా కట్టడిలో మోడీ వైఫల్యాలను ఎత్తి చూపించినందుకు దైనిక్ భాస్కర్ మూల్యం చెల్లిస్తోంది. అరుణ్ శౌరీ చెప్పినట్లు ఇది అప్రకటిత ఎమర్జెన్సీ… ఎమర్జెన్సీకి మరో రూపం’ అని పేర్కొన్నారు.

IT attacks on dainik bhaskar group offices