Saturday, April 20, 2024

ఇరవై ఏళ్ల టిఆర్‌ఎస్

- Advertisement -
- Advertisement -

It has been 20 years since TRS party was formed

వ్యక్తులకైతే 20 ఏళ్ల వయసు నేలకేస్తే పైకిలేచే బంతివంటిదే. రాజకీయ పార్టీ విషయంలో దీనిని మరో కోణంలో చూడవలసి ఉంటుంది. కొన్ని పార్టీలు పుట్టిన చోటనే పడివుండి ఎప్పటికీ ఎదగకుండా జాబితా పెరగడానికే తోడ్పడతాయి. కొద్ది రాజకీయ పక్షాలు మాత్రం ఒడ్డులొరుసుకొని పారే జీవనదుల్లా చైతన్యం తొణికిసలాడుతుంటాయి, నిత్యం మార్మోగుతుంటాయి. రాష్ట్రాన్ని ఏడేళ్లుగా పాలిస్తున్న తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్‌ఎస్) అటువంటి శక్తివంతమైన పార్టీల్లో చెప్పుకోదగినది. తెలంగాణను అవతరింప చేసిన ఘనత మూటగట్టుకొని అప్పటి నుంచి వరుసగా రెండు సార్లు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలమద్దతును చూరగొని టిఆర్‌ఎస్ రాష్ట్రాన్ని నిర్విరామంగా పాలిస్తున్నది. రెండోసారి పదవీ కాలం సగం పూర్తయింది. మరో సగం మిగిలి ఉంది. అదే సమయంలో పార్టీ ఆవిర్భవించి 20 సంవత్సరాలు నిండాయి. ఈ రెండు సందర్భాలు కీలకమైనవే. ఏ పార్టీ అయినా తనను తాను చూసుకొని మురిసిపోదగినవే. సంబురం చేసుకోదగినవే. సింహావలోకనం, ఆత్మావలోకనం గావించుకొని మరింత మెరుగైన, ఉజ్వలమైన భవిష్యత్తుకు బాటలు వేసుకోదగిన విశేష సమయఘట్టాలే.

మొన్న 25వ తేదీ సోమవారం నాడు ఘనంగా జరుపుకున్న పార్టీ విస్తృత స్థాయి సమావేశం (ప్లీనరీ) గాని, వచ్చే నెల 15న వరంగల్‌లో తలపెట్టిన విజయ గర్జన సభ గాని ఇందుకు పూర్తి అర్హమైనవి, సమంజసమైనవి. దేశ రాజకీయాలు ఇప్పుడొక విలక్షణమైన మలుపులో ఉన్నాయి. గతంలో మాదిరిగా, అయితే అటు లేకపోతే ఇటు అనే పరిస్థితి కాదు. లోక్‌సభలో సొంత మెజారిటీ కలిగి ఎదురులేని అధికార దండాన్ని ధరించి ఏకపక్ష, నిరంకుశ విధానాలతో, హిందుత్వ అజెండాతో, కార్పొరేట్ శక్తుల సేవలో తరించే ఆర్థిక ఆలోచనలతో పరిపాలన సాగిస్తున్న పాలక భారతీయ జనతా పార్టీ ఒకవైపు, లోక్‌సభలో ప్రతిపక్ష గుర్తింపు సైతం పొందలేకపోయిన అతి తక్కువ బలంతో నీరసించిన కాంగ్రెస్ మరోవైపు ఉండి ఏకపార్టీ నియంతృత్వం దిశగా అడుగులు పడుతున్నాయా అనిపిస్తున్న దుస్థితి దేశ రాజకీయాలను ఆవహించింది. జాతీయ స్థాయిలో భారతీయ జనతా పార్టీకి గట్టి సెక్యులర్ ప్రత్యామాయాన్ని నిర్మించవలసిన అవసరం ఒక పెద్ద సవాలుగా ప్రతిపక్ష రాజకీయ శిబిరం ముందు నిలబడింది. దీనిని స్వీకరించవలసిన అసాధారణ బాధ్యత నేడు ప్రాంతీయ రాజకీయ పక్షాల మీద పడింది.

అందుకు అర్హమైన అతి కొద్ది పార్టీలలో టిఆర్‌ఎస్ ఒకటి. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ చెప్పుకోదగిన బలాన్ని సంపాదించుకొని రాష్ట్రాధికారాన్ని తిరిగి కైవసం చేసుకున్నప్పుడే టిఆర్‌ఎస్ జాతీయ స్థాయిలో అటువంటి చరిత్రాత్మకమైన పాత్రను పోషించగలుగుతుంది. వాస్తవానికి రాష్ట్రంలో టిఆర్‌ఎస్‌కు గట్టి పోటీ ఇవ్వగల ప్రతిపక్షం లేదు. కాంగ్రెస్ స్వీయ బలహీనతలతో తీసుకుంటున్నది. ఆశలావు పీక సన్నం అన్నట్టు కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపికి రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలన్న ఆబ దండిగా ఉంది గాని అంతటి శక్తి లేదు. అయినా కాంగ్రెస్, బిజెపిలు రెండూ స్వరం పెంచి ఆర్భాటం చేస్తున్న మాట వాస్తవం. ఈ నేపథ్యంలో తన శక్తిసామర్థాలను మరింత సునిశితం చేసుకోవలసిన అగత్యం టిఆర్‌ఎస్‌కున్నది. సోమవారం నాటి ప్లీనరీ ఆ దిశగా జరిగిన మంచి కసరత్తు అని అంగీకరించాలి. పార్టీ శ్రేణులు మరోసారి మరింత నిబద్ధతతో అధినేత, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు వెంట నిలిచిన దృశ్యం ప్లీనరీలో స్పష్టంగా కనిపించింది. ఈ సన్నివేశాన్ని ఈ విధంగా పండించడంలో టిఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారక రామారావు చేసిన కృషి మెచ్చుకోదగినది.

ఇటువంటి ఘట్టాలను పార్టీ ఎప్పుడు తలపెట్టినా అవి ఘనంగా విజయవంతం కావడానికి మూలంలో ఉన్నది ప్రభుత్వం ప్రజలకు అందిస్తున్న పాలనే. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోడానికి సాగించిన పోరాటంలో టిఆర్‌ఎస్ వహించిన పాత్ర, దాని సారథిగా స్వయంగా కెసిఆర్ చేసిన త్యాగాలు రాష్ట్ర ప్రజలను ముగ్ధులను చేసి ఆ పార్టీ వైపు నడిపించాయి. అదే సమయంలో కెసిఆర్ నేతృత్వంలోని గత ఏడేళ్ల పాలన రాష్ట్రాన్ని వలస పాలకుల నాటి ఊబిలోనుంచి బయటకు లాగి అభివృద్ధి సంక్షేమ రంగాలు రెండింటిలోనూ దేశంలోనే గణనీయమైన స్థానాన్ని అలంకరించేలా చేసింది. కల్యాణ లక్ష్మి, రైతుబంధు, రైతు బీమా, దళిత బంధు వంటి విశేష సంక్షేమ పథకాలు, మిషన్ కాకతీయ, భగీరథ, కాళేశ్వరం, ఐటి రంగం వికాసం కోసం చేస్తున్న కృషి తదితర అభివృద్ధి వ్యూహాలు టిఆర్‌ఎస్ పాలన కిరీటంలో తురాయిలు. నిష్పక్షపాతంగా చెప్పుకోవాలంటే ఉమ్మడి పాలనలోని తెలంగాణ రూపురేఖలను సమూలంగా మార్చివేయడానికి టిఆర్‌ఎస్ ప్రభుత్వం సాగించిన కృషి అసాధారణమైనది. అదే సందర్భంలో అది సాధించవలసిన లక్షాలు ఇంకెన్నో ఉన్నాయి. అందుచేత ఇప్పటి వరకు సమకూర్చకున్న బలంతో ప్రజలను మరింతగా సంతృప్తి పరచాలనే దీక్షను టిఆర్‌ఎస్ పూనవలసిన సందర్భమిది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News