Home స్కోర్ సమష్టి వైఫల్యం..

సమష్టి వైఫల్యం..

 collective responsibility for the team's defeat

జట్టు ఓటమికి సమష్టి బాధ్యత వహించక తప్పదు. రానున్న మ్యాచుల్లో మెరుగ్గా రాణించాలంటే జట్టు సభ్యులు ఒత్తిడిని తట్టు కుని ముందుకు సాగాలి. మానసిక సమస్యలతో ఆటగాళ్లు సతమత మవుతున్నారనే విషయం నాకు స్పష్టమైంది. దీని ప్రభావం వారి ఆటపై స్పష్టంగా కనిపిస్తుంది.                                                                

                                                                                                                                             – విరాట్ కోహ్లి

మన తెలంగాణ/ క్రీడా విభాగం: వరుసగా రెండు టెస్టుల్లో ఓటమి పాలైన టీమిండియా ఆత్మరక్షణలో పడింది. ఇక సిరీస్‌ను గెలవాలంటే భారత్ మిగిలిన మూడు టెస్టుల్లోనూ గెలవాలి. లేదా సిరీస్ సమం చేయాలంటే కనీసం రెండు మ్యాచుల్లోనైన గెలవాలి. ప్రస్తుతం టీమిండియా ఆటను చూస్తుంటే సిరీస్ గెలవడం అటుంచి కనీసం ఒక్క మ్యాచ్‌నైన డ్రా చేస్తారా అనే అనుమానం కలుగుతోంది. అంత చెత్తగా కోహ్లి సేన ఆట తయారైంది. లార్డ్ వేదికగా జరిగిన రెండో టెస్టులో టీమిండియా ఇన్నింగ్స్ 159 పరుగుల తేడాతో అవమానకర రీతిలో ఓటమి పాలైన విషయం తెలిసిందే.

రెండు ఇన్నింగ్స్‌లలోనూ భారత బ్యాట్స్‌మెన్ ఘోరంగా విఫలమయ్యారు. ఓపెనర్లు మురళీ విజయ్, లోకేశ్ రాహుల్‌లతో సహా టాప్ ఆర్డర్, లోయర్ ఆర్డర్, మిడిలార్డర్ ఘోర వైఫల్యం చవిచూసింది. బ్యాటింగ్ వైఫల్యం వల్లే భారత్ రెండు మ్యాచుల్లోనూ పరాజయం చవి చూడాల్సి వచ్చింది. ఎడ్జ్‌బాస్టన్‌లో జరిగిన తొలి టెస్టులో భారత్ కాస్త మెరుగైన ఆటనే కనబరిచింది. కానీ, లార్డ్‌కు వచ్చే సరికి చెత్త ఆటతో అభిమానుల ఆశలపై నీళ్లు చల్లింది. తొలి మ్యాచ్‌లో బ్యాట్స్‌మెన్ విఫలమైనా బౌలర్లు రాణించారు. అయితే లార్డ్‌లో రెండు విభాగాల్లో భారత్ విఫలమైంది.

కీలక సమయంలో వికెట్లు తీయడంలో బౌలర్లు విఫలమయ్యారు. బౌలర్ల వైఫల్యాన్ని సద్వినియోగం చేసుకున్న క్రిస్ వోక్స్ అజేయ శతకంతో ఇంగ్లండ్‌ను ఆదుకున్నాడు. వికెట్ కీపర్ బైర్‌స్టో కూడా అసాధారణ పోరాట పటిమతో ఇంగ్లండ్‌కు అండగా నిలిచాడు. వీరిద్దరూ కీలక బ్యాటింగ్‌ను కనబరచడంతో భారత్ ఇన్నింగ్స్ తేడాతో ఓటమి పాలుకాక తప్పలేదు. ఇంగ్లండ్ బౌలర్లు అండర్సన్, బ్రాడ్, వోక్స్‌లు అద్భుత బౌలింగ్‌తో భారత బ్యాటింగ్ లైనప్‌ను కుప్పకూల్చారు. మరోవైపు భారత జట్టులో ఉమేశ్ యాదవ్ లేని లోటు స్పష్టంగా కనిపించింది. ఒక వేళ ఈ మ్యాచ్‌లో ఉమేశ్ ఉండి ఉంటే మ్యాచ్ పరిస్థితి మరో విధంగా ఉండేదని విశ్లేషకులు అంటున్నారు.

అందరి బాధ్యత..
టీమిండియా పరాజయానికి సమష్టి వైఫల్యమే కారణమని చెప్పాలి. ఒకరిపై నింద వేసే పరిస్థితి లేదు. ప్రతి ఒక్కరూ విఫలమయ్యారు. పిచ్ కూడా భారత్‌కు ప్రతికూలంగా మారింది. రెండో రోజు ప్రతికూల వాతావరణం భారత బ్యాటింగ్‌ను దెబ్బతీసిందని చెప్పాలి. పిచ్ స్వింగ్‌కు అనుకూలంగా మారింది. దీంతో ఇంగ్లీష్ బౌలర్లు అద్భుతంగా రాణించారు. ఈ పరిస్థితుల్లో కేవలం కొద్ది మంది ఆటగాళ్లనే బాధ్యులుగా పేర్కొనడం ఏమాత్రం సబబు కాదు. అందరి దీనికి సమాన బాధ్యులేనని చెప్పక తప్పదు. కాగా, తొలి ఇన్నింగ్స్‌లో భారత్ కనీసం 200 పరుగులు సాధించి ఉంటే మ్యాచ్‌పై పట్టు సాధించే అవకాశాలు అధికంగా ఉండేది. పిచ్ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుంటే ఈ స్కోరు నమోదై ఉంటే ఇంగ్లండ్‌పై ఒత్తిడి పెరిగేది. ఆ ఒత్తిడిలో ఇంగ్లండ్ తక్కువ స్కోరుకే ఆలౌటయ్యే అవకాశాలు అధికంగా ఉండేవి. కానీ, భారత్ మరి తక్కువగా 107 పరుగులకే కుప్పకూలడం ఇంగ్లండ్‌కు కలిసి వచ్చింది.

భారత్ తక్కువ స్కోరుకు ఆలౌటవ్వడం ఒకవైపు స్పిన్నర్లు విఫలం కావడం మరోవైపు భారత్‌కు ప్రతికూలంగా మారింది. ఒకవేళ అశ్విన్, కుల్దీప్‌లలో ఏ ఒక్కరు చెలరేగి ఉన్నా మ్యాచ్ పరిస్థితి వేరే విధంగా ఉండేదని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఈ మ్యాచ్‌లో ఇటు బౌలర్లు, అటు బ్యాట్స్‌మెన్ సమాన బాధ్యులని చెప్పాలి. కెప్టెన్ విరాట్ కోహ్లితో సహా అతని డిప్యూటీ రహానె, మిస్టర్ డిపెండబుల్ పుజారా, ఓపెనర్లు విజయ్, రాహుల్, వికెట్ కీపర్ దినేష్ కార్తీక్ తదితరులు జట్టు ఓటమికి బాధ్యత వహించక తప్పదు. బౌలర్లు కూడా తప్పించుకునే పరిస్థితి లేదు. ఇంగ్లండ్ బౌలర్లు చెలరేగిన పిచ్‌పై భారత బౌలర్లు తేలి పోయారు. బైర్‌స్టో, వోక్స్‌లను కట్టడి చేయడంలో బౌలర్లు ఘోరంగా విఫలమయ్యారు. ఇద్దరిలో ఒక్కరిని తక్కువ స్కోరుకు వెనక్కి పంపినా మ్యాచ్‌లో భారత్ పైచేయి సాధించేది.