Home జాతీయ వార్తలు కర్నాటకలో ‘ఐటి’ కలకలం

కర్నాటకలో ‘ఐటి’ కలకలం

Ex Karnataka deputy CM

 

మాజీ డిప్యూటీ సిఎం పరమేశ్వర ట్రస్టులు, కాలేజీల్లో సోదాలు
మాజీ ఎంపి జాలప్ప కుమారుడి విద్యాసంస్థల్లోనూ దాడులు
ఏకకాలంలో 30 చోట్ల సోదాలు

బెంగళూరు : కర్నాటకలోమాజీ ఉపముఖ్యమంత్రి జి పరమేశ్వర నివాసాలు, కార్యాలయాలు, ఆయన సంబంధిత కాలేజీలపై గురువారం ఆదాయపు పన్ను శాఖ దాడులకు దిగింది. ఇదే సమయంలో మాజీ ఎంపి ఆర్‌ఎల్ జాలప్ప కుమారుడు జె రాజేంద్రలకు చెందిన నివాసాలలో కూడా సోదాలు జరిగాయి. 300 మందికి పైగా ఐటి అధికారులు ఈ దాడులలో పాల్గొన్నారు. పరమేశ్వరన్ కుటుంబం రాష్ట్రంలో సిద్ధార్థ సంస్థలను నిర్వహిస్తోంది. దీనిని 58 ఏండ్ల క్రితమే పరమేశ్వరన్ తండ్రి హెచ్‌ఎం గంగాధరయ్య స్థాపించారు. పరమేశ్వరన్ కా ర్యాలయాలు, నివాసం, సంస్థలలో సోదాలతో పాటు ఆయన సోదరుడు జి శివప్రసాద్, వ్యక్తిగత సహాయకులు రమేష్ నివాసాలపై కూడా సోదాలు నిర్వహించారు.

ఇక మాజీ ఎంపి జాలప్ప కుమారుడు రాజేంద్ర నిర్వహణలో రాష్ట్రంలోని దొడ్డబళ్లాపురం, కోలార్‌ల్లో ఉన్న ఆర్‌ఎల్ జాలప్ప ఐటి సంస్థపై కూడా దాడులు జరిగాయి. నీట్ పరీక్షల నిర్వహణలో అవకతవకల వ్యవహారంతో సంబంధాలు, పన్నుల ఎగవేతలకు సంబంధించి కర్నాటకతో పాటు రాజస్థాన్‌లోనూ దాడులు సోదాలు జరిగాయని, ఇక్కడ జాలప్ప ఐటి సంస్థపై దాడులు ఇందులో భాగమే అని అధికార వర్గాలు ధృవీకరించాయి. నీట్ అక్రమాలకు సంబంధించి జరిపిన దర్యాప్తులో కర్నాటకలోని తూంకురులోని రెండు వైద్య కళాశాలల ప్రమేయం ఉందని తెలిందని, దీనితో ఈ దాడులు నిర్వహించినట్లు తెలిపారు. మాజీ డిప్యూటీ సిఎం పరమేశ్వర ఛైర్మన్‌గా ఉన్న సిద్దార్థ ఎడ్యుకేషన్ ట్రస్టు ఆధ్వర్యంలో ఈ మెడికల్ కాలేజీలు నడుస్తున్నందున సంబంధిత వ్యక్తుల నివాసాలు, కార్యాలయాలపై కూడా సోదాలకు దిగినట్లు వెల్లడించారు.

జాతీయ స్థాయి వైద్య విద్యా ప్రవేశపరీక్షలు నీట్‌లో భారీ స్థాయి అక్రమాల ఆరోపణలు వెలువడ్డాయి. ఫోర్జరీ, వేరే అభ్యర్థులతో పరీక్షలు రాయించడం, అక్రమ చెల్లింపులు వంటి అభియోగాలతో కేసులు దాఖలు అయ్యాయి. మెడికల్ సీట్లను దక్కించుకునేందుకు భారీ స్థాయిలో జరిగిన అక్రమాలలో కొన్ని విద్యాసంస్థల ప్రమేయం ఉందనే ఫిర్యాదుల మేరకు ఆదాయపు పన్ను శాఖ సంబంధిత సంస్థలపై దాడులు చేపట్టాల్సి వచ్చిందని అధికారులు తెలిపారు. రాజస్థాన్‌లో కూడా సంబంధిత అంశంపై సోదాలు నిర్వహించారని , ఒకరికి బదులుగా పరీక్షలు రాసిన విద్యార్థులను పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టారని అధికారులు ధృవీకరించారు. అయితే కర్నాటకలో దాడులు సోదాలపై రాజకీయ దుమారం నెలకొంది.

దాడులు ఎందుకో సమాచారంలేదు: పరమేశ్వర
ఉన్నట్లుండి సోదాలు దాడులకు దిగారని, ఎందుకు చేస్తున్నారనేది తమకు తెలియదని, దీనిపై సమాచారం లేదని మాజీ ఉపముఖ్యమంత్రి పరమేశ్వర బెంగళూరులో తెలిపారు. ఐటి అధికారులు వచ్చారని తెలియగానే తాను ఇంటికి చేరుకున్నానని చెప్పారు. తమ కుటుంబానికి విద్యాసంస్థలు నిర్వహించడం తప్ప వేరే వ్యాపకాలతో సంబంధం లేదని, ఐటి రిటర్న్‌ను ఖచ్చితంగా దాఖలు చేస్తున్నట్లు తెలిపారు. దాడులలో రాజకీయ కక్ష సాధింపు ఉందని భావిస్తున్నారా? అనే ప్రశ్నకు తానేమీ స్పందించలేనన్నారు. కాంగ్రెస్ నేతల నివాసాలపై దాడులను మాజీ సిఎం సిద్ధరామయ్య ఇతర కాంగ్రెస్ నాయకులు ఖండించారు. ఇవి కేవలం రాజకీయదురుద్ధేశపు చర్యలని విమర్శించారు. మాజీ ప్రధాని, జెడిఎస్ అధినేత దేవెగౌడ కూడా స్పందించారు. ఇటువంటి చర్యలన్ని కూడా బురదచల్లే యత్నాలే అని మండిపడ్డారు. ఐటి దాడులను ఖండిస్తూ కాంగ్రెస్ సీనియర్ నేత ఖర్గే కూడా ప్రకటన వెలువరించారు. కాంగ్రెస్ నేతలను ఏదో విధంగా భయభ్రాంతులను చేసేందుకే ఇటువంటి చర్యలకు దిగుతున్నారని విమర్శించారు.

IT raids at ex Karnataka deputy CM residence