Thursday, April 25, 2024

రియల్ ఎస్టేట్ సంస్థలకు ‘ఐటి’ దడ

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో ఐటి సోదాలు దడ పుట్టిస్తున్నాయి. హైదరాబాద్‌లో కలకలం రేపుతున్నా యి. ఎప్పుడు ఎవరి మీద, ఏ సమయంలో ఏ దాడులు జరుగుతాయో అర్థం కాని పరిస్థితి నెలకొంది. బడా వ్యాపారవేత్తలు, పారిశ్రామిక వర్గాలు, రాజకీయ వర్గాలు ఐటి, ఇడి, సిబిఐ దాడుల తో వణికిపోతున్నారు. గత కొంత కాలంగా హైదరాబాద్ కేంద్రంగా పలు రియల్ ఏస్టేట్ సంస్థలపై ఐటి అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఆదాయ పన్ను శాఖాధికారులు చేసిన సోదాల కారణంగా కీలక సమాచారాన్ని అధికారులు సేకరిం చారు. ఈ సమాచారం ఆధారంగా ఐటీ శాఖ అధికారులు సోదాలు చేస్తున్నారని సమాచారం. ఇక తాజాగా మరో మారు హైదరాబాద్‌లో మంగళవారం తెల్లవారుజాము నుంచి ఐటి సోదాలు దడ పుట్టిస్తున్నాయి. హైదరాబాద్‌లో ఒకే సారి యాభైకి పైగా ఐటి బృందాలు సోదాలు నిర్వహిస్తున్నాయి. తెల్లాపూర్ లో ఐటీ దాడులు కొనసాగుతున్నాయి.

రాజ పుష్ప లైఫ్ స్టైల్ సిటీలో ఐదు బృందాలుగా విడిపోయి సోదాలు చేస్తున్నారు. బిఆర్‌ఎస్ ఎంఎల్‌సి వెంకట్రామి రెడ్డి ఇంటితో పాటు మొత్తం 50 ప్రాంతాల్లో ఉదయం నుంచి ఐటీ సోదాలు నిర్వహిస్తున్నారు. వెంకట్రామిరెడ్డికి సంబంధించి ఇల్ల్లు ఏకంగా 10 ఎకరాల్లో ఉంది. వెంకట్రామిరెడ్డి, ఆయన సోదరుడు ఇక్కడ నివాసం ఉంటుండగా ఎకరంలో ఇళ్లు నిర్మించి ఉంది. ఈ ఇల్లు అత్యంత అధునాతన సౌకర్యాలతో ఉన్నట్లు తెలుస్తోంది. కాగా ఆదాయానికి మించి ఆస్తులున్నాయనే ఆరోపణలతో అధికారులు పలు డాక్యుమెంట్లను, బ్యాంకు ఖాతాలను పరిశీలిస్తున్నట్లు సమాచారం. అలాగే వెంకట్రామిరెడ్డిని అధికారులు ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తుంది. ఆయనకు సంబంధించిన సంస్థల ట్యాక్స్ చెల్లింపుల వివరాలు, బ్లాక్ మనీపై ఆరా తీస్తున్నారు. ఆయన నివాసంతో పాటు ఆయనకు చెందిన రాజ పుష్ప, వర్టెక్స్, ముప్పా సంస్థల్లో అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. అధికారులు మొత్తం ఐదు బృందాలుగా విడిపోయి తనిఖీలు చేపట్టారు.

వసుధ ఫార్మా, రాజ్‌పుష్ప, ముప్ప హోమ్స్, వర్టెక్స్ సంస్థలలో అధికారులు ఆడిట్లను పరిశీలిస్తున్నారు. వర్టెక్స్ కంపెనీలో కొందరు బిఆర్‌ఎస్ నేతలు భాగస్వాములుగా ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. గత ఐదేళ్లు ఐటి రిటర్న్‌పై విచారిస్తున్నారు. భారీగా పన్నులు ఎగవేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. మాదాపూర్, ఎస్సార్ నగర్, జీడిమెట్ల లోని కంపెనీ కార్యాలయాలలో దాడులు కొనసాగుతున్నా యి. వసుధ గ్రూప్ సిఇఒ, డైరెక్టర్లు, మేనేజింగ్ డైరెక్టర్లు ఇళ్లల్లో కూడా ఐటి దాడులు కొనసాగుతున్నాయి. వసుధ ఫార్మా చైర్మన్ వెంకట రామ రాజు ఇంట్లోనూ, కార్యాలయంలోనూ తనిఖీలు చేస్తున్నారు. ఐటీ అధికారులు. వసుధ ఫార్మా తో పాటు చైర్మన్ వెంకట రామరాజు రియల్ ఎస్టేట్ వ్యాపారాలు కూడా నిర్వహి స్తున్నారు. 15 కంపెనీల పేరుతో ఆయన రియల్ ఎస్టేట్ వ్యాపారాలు నిర్వహిస్తున్నట్టు సమాచారం. ఫార్మా కంపెనీ నుండి వచ్చిన లాభాలతో రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు పెట్టినట్టు, రియల్ ఎస్టేట్ వ్యాపారం నిర్వహిస్తున్నట్టు ఐటి వర్గాలు చెబుతున్నాయి.

ఫార్మా కంపెనీ నుంచి వచ్చిన లాభాలతో రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు పెట్టినట్లు తేలింది. గతంలో పలు రియల్ ఎస్టేట్ కార్యాలయాలపై జరిపిన దాడుల్లో చాలా పెట్టుబడులకు సంబంధించిన ఆధారాలు లభించగా వాటిని ఆధారంగా చేసుకొని ఇప్పుడు ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. ఎంఎల్‌సి వెంకటరామిరెడ్డి కుటుంబసభ్యులు మొదటి నుంచి రాజ పుష్ప అనే రియల్ ఎస్టేట్ కంపెనీని నిర్వహిస్తున్నారు. ఈ సంస్థ పెద్ద ఎత్తున హైరైజ్ అపార్టుమెంట్లు, విల్లా ప్రాజెక్టులను నిర్మిస్తోంది. ఇప్పుడు ఈ సంస్థపైనా దాడులు జరగడం అధికార పార్టీలోనూ కలకలం రేపుతోంది. ఇటీవలి కాలంలో ఐటీ అధికారులు తెలంగాణలో పెద్ద ఎత్తున సోదాలు నిర్వహిస్తున్నారు.

మంత్రి మల్లారెడ్డికి చెందిన కాలేజీలు, ఇళ్లపైనా సోదాలు చేశారు. ఈ కేసులో ఇంకా విచారణ కొనసాగిస్తున్నారు. తాజాగా బిఆర్‌ఎస్ ఎంఎల్‌సి ఇంటిపై ఐటీ దాడులు చేయడం సంచలనంగా మారింది. బిజెపి, బిఆర్‌ఎస్ పార్టీల మధ్య ప్రారంభమైన రాజకీయ సమరం కారణంగా తమ నేతల్ని టార్గెట్ చేస్తున్నారని బిఆర్‌ఎస్ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే ఈ ఐటి దాడుల్లో రాజకీయ ప్రమేయం ఏమీ ఉండదని, రాజకీయ నేతలు అయినంత మాత్రాన పన్నులు ఎగ్గొడితే సోదాలు చేయకూడదా? అన్న వాదన బిజెపి నేతల నుంచి వస్తోంది. ఈ సోదాల్లో ఎంత మేర బ్లాక్ మనీ దొరికిందనేది అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది.

ఆధారాలతో దాడులు చేస్తున్న ఐటి అధికారులు…

రాష్ట్రంపై ఫోకస్ పెట్టిన కేంద్ర దర్యాప్తు సంస్థలు వరుసగా గ్రానైట్ కుంభకోణం, ఢిల్లీ లిక్కర్ కుంభకోణం వంటి అనేక వ్యవహారాలలో వేర్వేరు సందర్భాలలో మంత్రులు, వ్యాపారవేత్తలు ఇళ్లల్లో సోదాలు నిర్వహించారు. అనేకమందికి నోటీసులు ఇచ్చి వారిని విచారించారు. ఇక తాజాగా మరో మారు ఆదాయపు పన్ను శాఖాధికారుల దాడులతో తెలంగాణలో మళ్లీ దాడుల కలకలం కొనసాగుతుంది.

దడ పుట్టిస్తున్న ఐటి దాడులు….

కొద్ది రోజుల క్రితం కూడా హైదరాబాద్‌లో ఐటి సోదాలు నిర్వహించింది. తెలుగు రాష్ట్రాల్లో 50కి పైగా ప్రాంతాల్లో ఏకకాలంలో 35 టీమ్‌లుగా విడిపోయి ఐటీ సోదాలు నిర్వహించింది. రియల్ ఎస్టేట్ ,సినిమా ఫైనాన్సియర్స్ ఇళ్లపై దాడులు నిర్వహించింది.బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఉన్న ఆదిత్య కన్‌స్ట్రక్షన్‌కు చేరుకుని సోదాలు చేస్తున్నాయి. బిల్డర్ మాధవరెడ్డి, అతని కార్యాలయంతోపాటు ఇల్లు, రియల్ ఎస్టేట్ కంపెనీలపై సోదాలు సాగించింది. అలాగే ఊర్జిత ప్రాజెక్టు ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్లు శ్రీనివాస్‌రెడ్డి, వీర ప్రకాష్ నివాసాలు, వారి కార్యా లయాల్లోనూ సోదాలు నిర్వహించింది. ప్రముఖ బిల్డర్‌కు మాధవరెడ్డి బినామీగా ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. కూకట్‌పల్లిలోని లోధా అపార్ట్ మెంట్, జూబ్లీ హిల్స్, గచ్చిబౌలి, కొండాపూర్, పంజాగుట్టలో ఐటి సోదాలు జరిగాయి. సిఆర్‌పిఎఫ్ బలగాల మధ్య ఏక కాలంలో తెలుగు రాష్ట్రాల్లో సోదాలను నిర్వహించడం జరిగింది. ఇటీవల కాలంలో ఓ పార్టీలో చేరిన ప్రముఖ రాజకీయ నేత నివాసం, కార్యాలయంలో సైతం సోదాలు జరిగాయి. ఈ క్రమంలోనే తిరిగి మంగళవారం తెల్లవారు జామునే ఐటి సోదాలకు దిగడం గమనార్హం.

రెండ్రోజుల పాటు కొనసాగే అవకాశం..!

కాగా, మంగళవారం తెల్లవారు జామునుంచి కొనసాగుతున్న ఐటి సోదాలు మరో రెండ్రోజుల పాటు కొనసాగే అవకాశం ఉందని చెబుతున్నారు. తొలుత ఆయా వ్యక్తుల, ‘రియల్’ సంస్థల సమాచారం తెలుసుకునే ఐటి దాడులు కొనసాగుతున్న నేపథ్యంలో పూర్తిస్థాయిలో కూపీ లాగేందుకు ఐటి అధికారులు సోదాలు మరో రెండు రోజుల పాటు కొనసాగించే అవకాశం ఉందని తెలుస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News