Home బిజినెస్ ఆడిటర్లు, మేనేజ్‌మెంట్‌దే తప్పు

ఆడిటర్లు, మేనేజ్‌మెంట్‌దే తప్పు

మోసాన్ని గుర్తించడంలో అంతర్గతంగా, బహిర్గతంగా విఫలం

 సిఎలు ఆత్మపరిశీలన చేసుకోవాలి

పిఎన్‌బి కుంభకోణంపై కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ

Jaitleyన్యూఢిల్లీ: బిలియనీర్ నీరవ్ మోడీ రూ.11,400 కోట్ల కుంభకోణంపై ఎట్టకేలకు కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ నోరు విప్పారు. ఇది మేనేజ్‌మెంట్, ఆడిటర్ల తప్పిదం ఫలితంగానే జరిగిందని, బ్యాంకింగ్ వ్యవస్థను మోసం చేసిన వారినెవరినీ ప్రభుత్వం వదలబోదని హెచ్చరించారు. యాజమాన్యానికి అధికారాలు ఇచ్చినప్పుడు వాటిని సరిగ్గా, ప్రభావవంతంగా వినియోగించుకోవాలని.. తప్పిదాలను తెలుసుకోనట్లయితే మేనేజ్‌మెంట్ ప్రశ్నలను ఎదుర్కోవాల్సి వస్తుందని అన్నారు. ఎడిఎఫ్‌ఐఎపి(అసోసియేషన్ ఆఫ్ డెవలప్‌మెంట్ ఫైనాన్సింగ్ ఇనిస్టిట్యూషన్స్ ఇన్ ఆసియా అండ్ ద పసిఫిక్) వార్షిక సమావేశంలో జైట్లీ ఈ విధంగా అన్నారు. ‘ఆడిటర్లు ఏమి చేశారు? అంతర్గతంగా, బహిర్గతంగా ఆడిటర్లు పరిశీలించాలి. అలా జరగనట్లయితే ఆ తర్వాత సిఎ వృత్తి నిపుణులు అన్ని విషయాలను క్షుణ్ణంగా పరిశీలించాలి. సూపర్‌వైజరీ ఏజెన్సీలు కూడా కంపెనీల్లో ఏమి జరుగుతుందో తప్పనిసరిగా స్వయం పరిశీలన చేసుకోవాలి’ అని ఆయన అన్నారు. బ్యాంకుల పనితీరుపై జైట్లీ ఆగ్రహం వ్యక్తం చేశారు. రుణదాతలు, రుణగ్రస్తులు సత్సంబంధాలను కొనసాగించాలని.. నమ్మకంపైనే బ్యాంకుల పనితీరు ఆధారపడి ఉంటుందని అన్నారు. ఎవరు మోసాలకు పాల్పడుతున్నారో గుర్తించలేనప్పడు యాజమాన్యం మనుగడ సాధించలేదని ఆర్థికమంత్రి అన్నారు. పన్ను చెల్లింపుదారులు, వసూళ్లు పెరిగాయని, అయితే తాము వారికి దూరంగానే ఉంటున్నామని అన్నారు. దాదాపు 120 షెల్ కంపెనీలు (బోగస్ సంస్థలు) గుర్తించామని ఇంతకుముందు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఇడి) వెల్లడించిందని, వీటిలో 80 కంపెనీలకు నిరవ్ మోడీ, ఆయన మాన మెహుల్ చోక్సి నడుపుతున్నాడని తెలిసిందని జైట్లీ అన్నారు. ఈ కుంభకోణం కేసులో గీతాంజర్ జెమ్స్ ప్రమోటర్లు మెహుల్ చోక్సి, ఆయనకు చెందిన సంస్థలకు చెందిన 20 ప్రాంగణాల్లో ఆదాయం పన్ను శాఖ దాడులు నిర్వహించిందని తెలిపారు. చోక్సి, గీతాంజలి జెమ్స్‌కు సంబంధించిన 13 కంపెనీలపై ముంబై, పుణె, సూరత్, హైదరాబాద్, బెంగళూరు, మరికొన్ని పట్టణాల్లో దాడులు నిర్వహించారు. చోక్సి, గీతాంజలి జెమ్స్‌కు చెందిన ఆస్తులు, బ్యాంకు ఖాతాలను అటాచ్ చేసినట్టు జైట్లీ వివరించారు. దాదాపు 1.77 బిలియన్ డాలర్ల (రూ. 11,346 కోట్లు) మోసం పిఎన్‌బిలో జరిగింది. నీరవ్‌మోడీ, గీతాంజలి గ్రూపుల సంస్థలపై ఇడి, సిబిఐలు అనేక దాడులు నిర్వహించాయి. ఇప్పటికే బ్యాంకు నియంత్రణ వ్యవస్థలను తమ అధీనంలోకి తీసుకున్నామని, వాటన్నింటినీ పరిశీలిస్తున్నామని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. పిఎన్‌బి కుంభకోణం కేసులో మాజీ డిప్యూటీ జనరల్ మేనేజర్ గోకుల్‌నాథ్ శెట్టి, సింగిల్ విండో క్లర్క్ మనోజ్ కరత్‌లను సిబిఐ అరెస్ట్ చేసింది. వీరిని స్పెషల్ కోర్టు 14 రోజుల పోలీస్ కస్టడీకి తరలించింది.