Home జాతీయ వార్తలు శబరిమలలో మహిళా భక్తులకు రక్షణ కల్పించలేం

శబరిమలలో మహిళా భక్తులకు రక్షణ కల్పించలేం

Sabarimala

తిరువనంతపురం: శబరిమలలో అయ్యప్ప ఆలయాన్ని సందర్శించే మహిళలకు రక్షణ కల్పించి వారిని ఆలయానికి తోడ్కొని వెళ్లే ఆలోచనేదీ లేదని కేరళలోని ఎల్‌డిఎఫ్ ప్రభుత్వం శుక్రవారం ప్రటకించింది. శబరిమల ఆలయంలోకి అన్ని వయసుల మహిళల ప్రవేశానికి అనుమతినిస్తూ వెలువరించిన తీర్పుపై సమీక్ష కోరుతూ దాఖలైన పిటిషన్లను విస్తృత ధర్మాసనానికి నివేదించాలని సుప్రీంకోర్టు తాజాగా నిర్ణయించిన నేపథ్యంలో కేరళ ప్రభుత్వం ఈ ప్రకటన చేయడం గమనార్హం. శబరిమల ఆలయంలోకి మహిళలు చొరపబడడాన్ని తమ ప్రభుత్వం ప్రోత్సహించదని రాష్ట్ర ఆలయ వ్యవహారాల మంత్రి కడకంపల్లి సురేంద్రన్ స్పష్టం చేశారు.

ఆలయం వద్ద యధాతథ స్థితిని కొనసాగించడమే మంచిదని, శాంతి భద్రతలను కాపాడడమే ప్రభుత్వ ధ్యేయమని శుక్రవారం ఇక్కడ మీడియా సమావేశంలో మంత్రి తెలిపారు. గత ఏడాది శబరిమల ఆలయాన్ని సందర్శించడానికి ప్రయత్నించి విఫలమైన సామాజిక కార్యకర్త, భూమాత బ్రిగేడ్ నాయకురాలు తృప్తి దేశాయ్ మళ్లీ ఈ నెలలో శబరిమలను దర్శిస్తానని చేసిన ప్రకటనను ప్రస్తావించగా సామాజిక కార్యకర్తలకు అక్కడ పనేం లేదని ఆయన చెప్పారు. ఎవరైనా శబరిమలను సందర్శించ దలిస్తే కోర్టుకు ఆశ్రయించి తగిన ఉత్తర్వులు పొందవచ్చని మంత్రి చెప్పారు. సామాజిక కార్యకర్తలకు ప్రచారం కల్పిస్తున్న మీడియాపై ఆయన మండిపడ్డారు. మీకు టిఆర్‌పీలు సాధించడమే కావాలని, ఇది మంచిది కాదని ఆయన మీడియాకు హితవు చెప్పారు. పరిస్థితులను సానుకూల దృక్పథంతో చూడాలని ఆయన అన్నారు.

 

Kerala Govt Says it will not give protection to women devotees, Kerala temple affairs minister says no protection for women visiting Sabarimala Ayyappa temple