Home దునియా డాక్టర్ యాక్టర్… తెలంగాణ తేజం

డాక్టర్ యాక్టర్… తెలంగాణ తేజం

Prabhakar-Reddy

సినీనటుడుగా ప్రభాకర్‌రెడ్డి పరిచయమైంది కాంగ్రెస్ నాయకుడు పురుషోత్తమరెడ్డి ఎంతో మంచి చిత్రంగా నిలిచిపోతుందని అనుకున్న ‘చివరకు మిగిలేది’ద్వారా, సావిత్రి కూడా చాలా ఇష్టపడి ఈ చిత్రం అంగీకరించి చేసింది. 1960లో విడుదలైన ఆ సినిమాకు చాలా ప్రశంసలు వచ్చాయి. నేను ఒక చిత్రం నిర్మించి నష్టాలు చవిచూసి ‘చివరకు మిగిలేది’ ఇదేనా అనుకున్నాను. మంచి చిత్రం అనే ఆనందం కూడా వుంది” అని ఒక సందర్భంలో పురుషోత్తమరెడ్డి అన్నారు.

ప్రభాకర్‌రెడ్డి పేరు చెప్పగానే ఒక చెడ్డ విలన్, ఓ మంచి కేరక్టర్ ఆర్టిస్టు గుర్తువస్తాడు. అంతేకాదు చక్కని కుటుంబ కథాచిత్రాల కథా రచయిత, రాజకీయ వ్యంగ్య చిత్రాల కథారచయిత, దర్శకుడు, అభిరుచికి గల నిర్మాత అని కూడా జ్ఞప్తికి వస్తాడు. చిన్నతనం నుంచి రంగస్థల నటుడుగా, బుర్రకథలు చెప్పేవానిగా పేరు తెచ్చుకుని, చదువు మీద మాత్రం ఏకాగ్రత కోల్పోలేదు. ఉస్మానియా మెడికల్ కాలేజీలో ఎంబిబిఎస్ పూర్తి చేశారు. హౌస్ సర్జన్ చేస్తుండగా ‘చివరకు మిగిలేది’ చిత్రంలో పైకి సైకియాట్రిస్టు పాత్రకు గుత్తా రామినీడుడు ఎంపిక చేశారు. ఆ చిత్రం అయ్యాక కొంత కాలం డాక్టర్‌గా ప్రాక్టీస్ చేసి, అవకాశాలు పెరగడంతో మద్రాసు చేరుకున్నారు. తెలంగాణకు చెందిన డాక్టర్ అయిన తొలి యాక్టర్, దర్శక నిర్మాత మందడి ప్రభాకర్‌రెడ్డి.

నల్లగొండ జిల్లా మిర్యాలగూడ సమీపంలోని తుంగతుర్తిగ్రామంలో 1935 అక్టోబర్ 8న మందడి లకా్ష్మరెడ్డి, కౌసల్య దంపతులకు జన్మించారు. “పుట్టి పెరిగింది పల్లెటూర్లో అయినా తొమ్మిదో ఏట నుంచే రాజకీయాల మీద, రంగస్థల నటన మీద, బుర్రకథలు చెప్పడం మీద కూడా ఆసక్తి ఏర్పరచుకుని ఈ మూడింటి మీద దృష్టి నిలిపేవాణ్ణి. చదువు రాకపోతే ఇంట్లో ఊరుకోరని దాని మీద కూడా ఏకాగ్రత వుంచేవాణ్ణి” అని చెప్పారొకసారి. నాటకాలు కూడా రాసేవారు.

బుర్రకథ చెప్పేవారు ‘హావభావాలతో అలరిస్తూ కథానుగుణంగా మాటల్లో, భావ వ్యక్తీకరణలో నవరసాలు పలికించాలి. ఇది ఒంట బట్టించుకున్న కారణంగా స్కూలు, కాలేజీ తదితర చోట్ల రంగస్థల నటుడుగా కూడా చక్కని గుర్తింపు పొందారాయన. గుమ్మలూరి శాస్త్రి దర్శకత్వంలో సెల్యూకస్‌గా చాణక్య చంద్రగుప్త నాటకంలో రవీంద్రభారతిలో ఏర్పాటుచేసిన నాటక ప్రదర్శనలో పలు ప్రశంసలు పొందారు. ఆ తరువాత గుంటూరు, నాగార్జునసాగర్‌లో కూడా ఈ నాటక ప్రదర్శనలో పాల్గొన్నారు.

భీష్మ చిత్రంలో శాంతనుడు పాత్రని, పాండవ వనవాసంలో కర్ణుడు పాత్రను పోషించాక నటన మీద ఉన్న ఆసక్తితో చిత్రరంగంలోనే నిలదొక్కుకోవాలని నిర్ణయించుకున్నారు ప్రభాకర్‌రెడ్డి. పౌరాణిక, సాంఘిక, చారిత్రక, జానపద చిత్రాలలో నటించడానికి అనువైన పెర్సనాల్టీ, భావ వ్యక్తీకరణ, డైలాగ్ డెలివరీ వున్నాయని క్రమక్రమంగా నిరూపించుకున్నారు.

కొన్ని చిత్రాలలో నటించాక సినిమా కథలు రాయడం, తనే నిర్మాతగా నిర్మించడం, లేదా మరొకరితో కలిసి నిర్మించడం, దర్శకత్వం వహించడం కూడా చేపట్టారు ప్రభాకర్‌రెడ్డి. గాంధీ పుట్టిన దేశం, పండంటి కాపురం, కార్తీక దీపం, గృహప్రవేశం, కుంకుమ తిలకం చిత్రాలకు కథను సమకూర్చి నిర్మాతగానూ వ్యవహరించారు. ఈ చిత్రాలన్నీ అద్భుత విజయం సాధించడమే కాకుండా మంచి చిత్రాలుగా ప్రశంసలు పొందాయి. విలన్‌గా నటించే ప్రభాకర్‌రెడ్డిలో ఇంత చక్కని కథలు సృజించే నైపుణ్యం వుందా అని ఆశ్చర్యపోయేవారు.

పౌరాణిక చిత్రాలైన నర్తనశాలలో కర్ణుడుగా, శ్రీరామపట్టాభిషేకంలో దశరథుడుగా, శ్రీకృష్ణావతారంలో బలరాముడుగా, శ్రీకృష్ణార్జున యుద్ధంలో శివుడిగా, శ్రీ దత్త దర్శనంలో అత్రిమహామునిగా నటించి ప్రశంసలు పొందారు. మహా మంత్రి తిమ్మరుసులో వీరభద్ర గజపతిగా, పల్నాటి యుద్ధంలో కన్నమదాసుగా, విశ్వనాథ నాయకుడులో తిమ్మరుసుగా, ఇంకా అల్లూరి సీతారామరాజు వంటి చారిత్రక చిత్రాలలో ఆ పాత్రలకు వన్నె తెచ్చారు. రణభేరి, మెరుపుదాడి వంటి జానపద చిత్రాలలో నటించారు.

విలన్‌గా కోరమీసంతో, నోట్లో పైప్‌తో, లాంగ్ కోటు, ఫెల్ట్ హేట్ ధరించి పాలిష్ట్‌విలన్‌గా అట్టహాసంగా అరిచి, బెదిరిపోయేలా నవ్వి, మెత్తగా మాట్లాడుతూ ఇష్టంలేని వాడిని కత్తితో కసుక్కున పొడిచేసి, లేదా పిస్తోలుతో ఢాం అని పేల్చేసి మా చెడ్డ విలన్, దుర్మార్గుడు అనిపించుకున్నారు. ఆయా పాత్ర పోషణలో ప్రేక్షకుల నుంచి తిట్లు లభించాయంటే నటనపరంగా సంపాదించుకున్న ప్రశంసలే కదా! పునర్జన్మ, నవరాత్రి, ఉమ్మడి కుటుంబం, బ్రహ్మచారి, ఆత్మీయులు, పెత్తందార్లు, మట్టిలో మాణిక్యం, సంసారం సాగరం, యమగోల, కటకటాల రుద్రయ్య, రంగూన్ రెడీ , సర్దార్ పాపారాయుడు, బొబ్బిలిపులి, తీర్పు, ఏడంతస్తుల మేడ, ప్రేమాభిషేకం, పండంటి కాపురం, అంతిమ తీర్పు, కల్పన, ప్రతిభావంతుడు వంటి సాంఘిక చిత్రాలలో గుర్తుండిపోయే పాత్రలు పోషించారు.

హిమ్మత్, మాంగ్‌భలే సజనా , మేరీసాథీ, హిమ్మత్ ఔర్ మెహనత్, వక్త కా షెహన్ షా మొదలైన హిందీ చిత్రాలలో నటించారు. ఉత్తమ చిత్ర కథా రచయితగా గృహ ప్రవేశం (1982), గాంధీ పుట్టిన దేశం (1970) చిత్రాలకు నంది అవార్డులు లభించాయి. చిన్న కోడలు చిత్రానికి ఉత్తమ సహాయ నటుడుగా 1990లో నంది అవార్డు స్వీకరించారు. ఉత్తమ నటుడుగా అంతకుముందు ‘యువతరం కదిలింది’ చిత్రానికి 1980లో పల్లె పిలిచింది చిత్రానికి 1981లో లెఫ్టిస్టుగా పాత్ర పోషించి మెప్పించినందుకు నంది అవార్డు అందుకున్నారు.

పచ్చని సంసారం, పండంటి కాపురం, గాంధీ పుట్టిన దేశం, నాకూ స్వాతంత్య్రం వచ్చింది, కార్తీక దీపం, గృహ ప్రవేశం, కుంకుమ తిలకం, ధర్మాత్ముడు, ధర్మచక్రం, ఖైదీ రాజా, శ్రీరామచంద్రుడు చిత్రాలలో ఉదాత్తమైన పాత్రలు పోషించిన వానిగా ఇటు చిత్ర పరిశ్రమ నుంచి అటు ప్రేక్షకుల నుంచి ప్రశంసలు పొందారు. చిన్నతనం నుంచి జీవిత చరమాంకం వరకు కాంగ్రెస్ అభిమానిగ గానే కొనసాగారు. రాజకీయ వ్యంగ్య చిత్రాలు తీశారు. ఇందుకు సంబంధించి ఒకసారి ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ, “ఎన్‌టిఆర్ పార్టీ పెట్టే సమయానికి చిత్ర పరిశ్రమ రెండు వర్గాలుగా చీలిపోయింది. ఒక వర్గం వారు మరొక వర్గం వారితో తీవ్రంగా విభేదించే వారు ఆరోపణలు చేసేవారు రాజకీయాల మీద నాకు వున్న ఆసక్తి కారణంగా రాజకీయాలు కుళ్లిపోతుంటే బాధ కలిగేది. ప్రాంతీయ పార్టీలు అధికారంలోకి వచ్చాక పొలిటికల్ హేట్రెడ్‌నెస్ పెరిగిపోయింది. రాజకీయ ద్వేషం ఒక్క చిత్ర పరిశ్రమలోనే కాదు. దేశంలోని అన్ని చోట్ల వుంది. అలా అలా రాజకీయ వ్యంగ్య చిత్రాల మీదకు దృష్టి మళ్లింది” అన్నారు.

కోట శ్రీనివాసరావు టైటిల్ పాత్ర పోషించగా, భానుమతి, గుమ్మడి, విజయచందర్ ప్రభృతులు నటించగా ‘మండలాధీశుడు’ చిత్రానికి దర్శకత్వం వహించారు. డి.వి.ఎన్. రాజు నిర్మించిన ఈ చిత్రం 1987లో విడుదలై సంచలనం సృష్టించింది. కృష్ణ, విజయ నిర్మల, నరేష్, ప్రభాకర్‌రెడ్డి ప్రభృతులు నటించగా, ‘గండిపేట రహస్యం’ చిత్రానికి కూడా దర్శకత్వం వహించారు. డి.వి.ఎన్. రాజు నిర్మించిన ఈ చిత్రం 1989లో విడుదలైంది. ఇది ఎన్.టి.ఆర్. మీద ఎదురుదాడిగా తీసిన చిత్రగా పేర్కొనేవారు.

కృష్ణం రాజు, గౌతమి, సత్యనారాయణ, గుమ్మడి, కోట శ్రీనివాసరావు, ప్రభాకరరెడ్డి నటించిన ‘ప్రచండ భారతం’ చిత్రానికి కూడా దర్శకత్వం వహించారు. ఇది 1988లో విడుదలైంది. టి.ఎం. రబ్బాని ఈ చిత్రానికి నిర్మాత. ప్రభాకరరెడ్డి కథతో లక్ష్మీదీపక్ దర్శకత్వంలో ఎస్.వి.ఆర్., గుమ్మడి, కృష్ణ, విజయ నిర్మల, జమున, బి.సరోజాదేవి నటించగా బి.హనుమంతరావు నిర్మించిన ‘పండంటి కాపురం’ చిత్రానికి జాతీయస్థాయిలో ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా 1972లో అవార్డు లభించింది. ఈ చిత్రం 22 కేంద్రాలలో శతదినోత్సవం జరుపుకుంది.

కామ్రేడ్ అనే తెలుగు చిత్రానికి కూడా దర్శకత్వం వహించారు. ఈ చిత్రం రీ రికార్డింగ్‌కి రాత్రి సమయంలో చాలాసేపు పనిచేసి, ఇంటికొచ్చి నిద్రపోయి, తెల్లవారి మనవరాలితో ఆడుకుంటూ హఠాత్తుగా గుండెపోటుకు గురై 1997 నవంబర్ 26న అంతిమ శ్వాస తీసుకున్నారు హైదరాబాద్‌లో. ప్రభాకరరెడ్డి మొత్తం మీద 27 సినిమాలకు నిర్మాతగా, 21 చిత్రాలకు కథారచయితగా వ్యవహరించారు. 472కిపైగా చిత్రాలలో నటించారు. ప్రభాకరరెడ్డి ఉచ్ఛారణా శైలి గమ్మత్తుగా, విభిన్నంగా వుండేది. డైలాగ్ చివరి వరకు ఫోర్స్‌గా వచ్చి. చివర్లో లోపిచ్‌లోకి వెళ్లిపోయేది. మిమిక్రీ కళాకారులు ఆయనను బాగా అనుకరించే వారు. డైలాగ్‌తో పాటు చివర్లో గాలి కూడా స్వరంలోంచి వచ్చేదనేవారు కొందరు మిమిక్రీ ఆర్టిస్టులు.

“రచయితకు సృజనాత్మకశక్తి ఎక్కువ ఉంటుంది. కథపై, పాత్రలపై సన్నివేశాలపై పూర్తి అవగాహన వుంటుంది. కనుక కథారచయిత, సంభాషణా రచయిత కూడా అయితే డైలాగ్స్ చాలా బాగా రాయగలరు”అన్న ఆయన అభిప్రాయం తను దర్శకత్వం వహించేటప్పుడు తనలోని రచయిత, నటుడు, తన దర్శకత్వ విధానాన్ని అధిగమించి బయటకు వచ్చి నటీనటులకు పాత్ర ఒరవడివి, ప్రవర్తించే తీరుని క్షుణ్ణంగా విశదీకరించేసేలా చేసేవాడినని. అలాటప్పుడు సీనియర్ ఆర్టిస్టులు ఇంకా ఇంప్రొవైజ్ చేసి నటించేవారని ఆయన ప్పేవారు. “కొత్త నటీనటులైతే వారికి అర్థం అయ్యేలా పదే పదే వివరించి, అనుకున్న ఫలితం వచ్చేవరకు రిహార్సల్ చేయించే వాడిని” అని తన శైలి గురించి చెప్పారొకసారి ప్రభాకరరెడ్డి.

-వి.ఎస్. కేశవరావు, సెల్‌ః 9989235320