Home ఎడిటోరియల్ ముప్పయి ఆరేళ్ల నెత్తుటి మరక

ముప్పయి ఆరేళ్ల నెత్తుటి మరక

  • ఏప్రిల్ 20 నాటి ఇంద్రవెల్లి ఘటనకు 36 ఏళ్లు

indravelli-stupam

ఇంద్రవెల్లి సంఘటనను జాతీయ మీడియా జలియన్ వాలాబాగ్ సంఘటనతో పోల్చడంలో అతి శయమేమీలేదు. ప్రతి ఏటా ఏప్రిల్ 20వ తేదీ ఓ శోకదినమే. నక్సలైట్లు తలపెట్టిన సభను ధ్వంసం చేయాలనే ప్రభుత్వ సంకల్పానికి గిరిజనులు సమిధలయ్యారు. అడవి నీడలో స్వేచ్ఛగా బతికిన గిరిజనులకు స్వతంత్ర భారత చట్టాల చొరబాటు ఇప్పటికే అర్థంకాని విషయమే. ఇది తమ దేశం, తమ బాగోగు లు చూస్తుంది, దాని పాలనకు తాము బద్ధులై ఉండా లనే స్పృహ గిరిజనుల్లో కలిగించడంలో ప్రభుత్వాలు విఫలమవుతూనే ఉన్నాయి. ప్రభుత్వ ప్రయత్నాల్లో నక్కజిత్తులే అధికం.
పోడు వ్యవసాయం ద్వారా సాగు చేసుకుంటున్న భూమి నుండి రెవెన్యూ అధికారులు ఖాళీ చేయించడం, ఇంటికో, పనిముట్టుకో చెట్టును ముడితే అటవీ సిబ్బంది కేసులు పెట్టడం వలస వ్యాపారుల చేతుల్లో సేకరించిన అటవీ ఉత్పత్తులు, పండించిన గింజలు ధర భంగం పొందడం లాంటివన్నీ అడవి బిడ్డలకు కొత్త బందీఖానాలయ్యాయి. వీటినుండి విముక్తి కలిగిస్తామన్న నక్సలైట్లు గిరిజనులకు బంధువులయ్యారు. వారి మాట నమ్మకంగా కన బడింది. తమ సమస్యలకు ఓ పరిష్కారం దొరుకు తుందనే ఆశతో గిరిజనులు ఇంద్రవెల్లి సభకు రావడానికి సిద్ధపడ్డారు.
20 ఏప్రిల్ 1981 రోజున ఉదయం నుండే అడవిపుత్రులు తండాకో సమూహంగా తుడుం మోగిస్తూ ఇంద్రవెల్లి బాటపట్టారు. చివరి నిముషం దాకా సభకు అనుమతినీయని పోలీసులు ఉదయం నుంచే నిషేధాజ్ఞలు విధించారు. 144 సెక్షన్ ప్రకారం అయిదారు మించి సమూహాలుగా ఇంద్రవెల్లిలో అడుగుపెట్టవద్దని మైకుల ద్వారా ప్రచారం మొదలుపెట్టారు. పోలీసుల భాష, సెక్షన్లు, అర్థం కాని గిరిజనులు, పోలీసుల మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడింది. చేతిలో తుపాకులున్న పోలీసులు కాల్పులు జరిపారు. ఈ కాల్పులు ఎంత పాశవికంగా జరిపారో ఎన్నో వార్తా కథనాలు వచ్చాయి. ఈ దారుణ సంఘటనపై ప్రభుత్వ నివేదిక ఎంత తప్పుల తడికో అందరికీ అర్థమైపోయింది. ఆనాటి ప్రభుత్వం దృష్టిలో గిరిజనులు తిరుగు బాటుదారులు, ప్రభుత్వాన్ని ధిక్కరించిన వారుగానే మిగిలిపోయారు. సమస్యలు అపరిష్కృతంగానే ఉండిపోయాయి.
కూలుతూ, నిలుస్తూ, తెల్లబడుతూ, ఎర్రబడుతూ బిక్కుబిక్కు మంటూ ఒంటరిగా ఇంద్రవెల్లి అమరుల స్థూపం మాత్రం ఆ సంఘటనకు సాక్షిగా మిగిలి ఉంది. ఆ స్థూపం ఆనాటి నెత్తుటి మరకల చిహ్నం. గిరిజనుల రక్త కన్నీటి శిఖరం. ఈ దేశంలోని పౌరు లైన ఆదిలాబాద్ గిరిజనులు కడుపారా ఏడ్వడానికి కూడా గత ప్రభుత్వాలు అవకాశం ఈయలేదు. కనీసం ప్రతి ఏటా ఏప్రిల్ 20నాడు ఆ స్థూపాన్ని తాకి తమ రక్తస్పర్శను పొందే హక్కు వారికుంది. అయితే సమైక్య ఆంధ్రప్రదేశ్‌లో ఈ చిన్న కోరిక కూడా ప్రభుత్వాన్ని భయపెట్టింది. అందువల్ల ఏప్రిల్ 20 తేదీ సమీపిస్తుందనగానే ఆదిలాబాద్ జిల్లా ఓ భయోత్పా తానికి గురయ్యే పరిస్థితులే. ఇంద్రవెల్లి చుట్టూ పోలీసుల మోహరింపు, తండాల్లో గాలింపులు, ఆ ఒక్కరోజు ప్రశాంతంగా గడవాలని ప్రాణాల్ని గుప్పిట పెట్టుకుని బతికే అమరుల స్థూపం.
ఇప్పుడు తెలంగాణలో స్వీయపాలన. అన్ని రంగాల్లో అభివృద్ధి కోసం ప్రభుత్వం పథక రచనలు సాగిస్తోంది. అన్ని వర్గాల ప్రజలు గత కాలం కన్నా భిన్నంగా మెరుగ్గా బతకాలని ప్రభుత్వం కోరుకుంటోంది.
ఉద్యమకాలంలో కెసిఆర్ ఇంద్రవెల్లి అమర వీరుల సంస్మరణ సభకు ప్రభుత్వాలు అడ్డుతగ లడాన్ని వ్యతిరేకించారు. అందువల్ల తెలంగాణ ప్రభుత్వం కొంత వెసులుబాటుతో గిరిజనులు స్థూపం వద్ద నివాళులు అర్పించేందుకు అవకాశం కల్పి స్తున్నది. 2015, 2016 సంవత్సరాలలో ఏప్రిల్ 20 నాడు గిరిజనులు స్థూపానికి రంగువేసి, దానిని పూలమాలలతో అలంకరించి తమ సాంప్రదాయ బద్దంగా నృత్యాలతో నివాళులు అర్పించుకోగలిగారు.
అయితే స్థూపంవద్దకు 20నుండి 30మందినే అనుమతించడం, రెండు గంటల పాటే స్థూపం వద్ద ఉండనీయడం, ఎలాంటి పందిళ్ళ నిర్మాణానికి, సభ నిర్వహణకు అవకాశం ఈయక పోవడం బాధాకరమే.
నిన్న అమరవీరుల స్థూపం శత్రునిలువెత్తు రూపం కావచ్చు. నేడు మాత్రం దానిని తెలంగాణ గిరిపుత్రుల ఆకాంక్షలకు ప్రతిరూపంగా భావించాలి. ఎక్కడైనా ఓ స్థూపం ఉందంటే దానికో గతం ఉంటుంది, చరిత్ర ఉంటుంది, ఓ స్మారకత ఉంటుంది. స్థూపం ధ్వంసం చేసినా ఆ ప్రాంతం జ్ఞాపకాలను నెవరువేస్తూనే ఉంటుంది.
స్వయంపాలనా మధురిమలను గిరిజనులు కూడా ఆస్వాదిం చాలి. తాము స్వేచ్ఛా వాయువులు పీలుస్తున్నామన్న అనుభూతి వారికి దక్కాలి. ఇప్పుడు స్థూపం ఎవరినీ భయపెట్టే స్థితిలో లేదు. కనీసం ఈ సంవత్సరం నుండయినా ఏప్రిల్ 20వ తేదీన గిరిజనులు తమ మనసు తీరా సంస్మరణ సభ నిర్వహించుకునేలా ప్రభుత్వం అవకాశం కల్పించాలి. ఇది పరాయి పాలన కాదనే భావన వారిలో కలిగించడం ప్రభుత్వం విధి కూడా.
ఇంద్రవెల్లి స్థూపాన్ని, ఆ ప్రాంతాన్ని స్మృతి వనంగా తీర్చిదిద్దాలని స్మారకస్థూపం పరిరక్షణ కమిటీ కన్వీనర్ ఎస్.సుధాకర్, కో-ఆర్డినేటర్ ఆచార్య జయధీర్ తిరుమలరావు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. నిషేధాజ్ఞలను దృష్టిలో ఉంచుకొని వీరు 2017 ఏప్రిల్ 14 నాడే స్థూపాన్ని దర్శించుకొని అక్కడి కవుల, రచయితలతో కలిసి నివాళులు అర్పించారు.
తెలంగాణ ప్రత్యక్ష, పరోక్ష వారసత్వ సంపద సంరక్షణ, పరిరక్షణ, పునరుద్ధరణ, నిర్వహణ బిల్లును ఈ మధ్యనే తెలంగాణ శాసనసభ ఆమోదిం చింది. జిల్లాలలో ఉన్న వారసత్వ సంపద ఎంపికల కోసం జిల్లాకొక కమిటీని కూడా ఏర్పాటు చేయాలని ప్రభుత్వం సంకల్పించింది. గిరిజన, పర్యాటక మంత్రి చందూలాల్ ఇంద్రవెల్లి స్థూపానికి ఆ హోదా దక్కేలా కృషి చేస్తే జాతి గుర్తుంచుకుంటుంది.