Home దునియా బరువు మోస్తున్న బాల్యం…

బరువు మోస్తున్న బాల్యం…

Girls-on-work

జనాభా లెక్కలు 2011 ప్రకారం 10.2 మిలియన్ల మంది (5-14 సంవత్సరాల మధ్య వయసు) పిల్లలు బాలకార్మికులుగా పనిచేస్తుండగా, దీన్లో 5.6 మిలియన్ల బాలలు బాలురు, 4.5 మిలియన్ల మంది అమ్మాయిలున్నారు. ఎనిమిది మిలియన్ల మంది పిల్లలు గ్రామీణ ప్రాంతాల్లో పనిచేస్తుండగా, రెండు మిలియన్ల మంది పిల్లలు పట్టణాల్లో బాలకార్మికులుగా ఉన్నారు. గ్రామాల్లో ఈ సంఖ్య 2001 నుంచి 2011 జనాభా లెక్కల ప్రకారం చూస్తే 11 మిలియన్ల బాలకార్మికుల నుంచి ఎనిమిది మిలియన్ల మందికి తగ్గగా, పట్టణాల్లో బాలకార్మికుల సంఖ్య 1.3 మిలియన్ల నుంచి 2 మిలియన్లకు పెరిగింది. కార్మిక కుటుంబాలు పట్టణాలకు వలసలు రావడమే ఈ పెరుగుదలకు కారణం.

ప్రపంచవ్యాప్తంగా ఉన్న బాల కార్మిక వ్యవస్థను రూపుమాపడానికి అంతర్జాతీయ కార్మిక వ్యవస్థ 2002లో బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన దినోత్సవాన్ని జూన్ 12 న జరుపుకునేలా నిర్ణయించింది. ప్రభుత్వాలు, ఎన్‌జివోలు, పౌర సంఘాలు, యాజమాన్యాలు, ఉద్యోగులు అందరూ ఒక్కటై బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు కృషిచేయాలన్నది ఈ దినోత్సవం ముఖ్య ఉద్దేశ్యం. ప్రపంచవ్యాప్తంగా 1.5 బిలియన్ల మంది ప్రజలు విభేదాలు, హింసాత్మక వాతావరణం, దుర్భలత్వాల మధ్య జీవిస్తుండగా, దాదాపు 200 మిలియన్ల ప్రజలు ప్రతి సంవత్సరం వివిధ రకాల విపత్తుల బారిన పడుతున్నారు, ఇటువంటి దయనీయమైన పరిస్థితుల బారిన పడుతున్న ప్రజల్లో మూడువంతులు పిల్లలే కావడం బాధాకరం. అంటే దాదాపు 168 మంది పిల్లలు బాలకార్మిక వ్యవస్థకు సమిధలవుతున్నారు. విపత్తులు, విభేదాలు, బాలకార్మికుల సంఖ్య పెరగడానికి ఏ విధంగా కారణమవుతున్నాయనే అంశాన్ని పరిశీలించడమే ఈ సంవత్సరం జరుపుకోబోయే బాలకార్మిక వ్యవస్థ వ్యతిరేక దినోత్సవ లక్షం.

మన దేశంలో: పేదరికం, నిరక్షరాస్యత వంటివి దేశంలో బాలకార్మిక వ్యవస్థకు ముఖ్య కారణాలు. తల్లిదండ్రుల్లో అవగాహన లేకపోవడం, వారి నిరక్షరాస్యత, సామాజిక, ఆర్థిక కారణాలు పిల్లలను పనిలో పెట్టేందుకు కారణమవుతున్నాయి. సరైన విద్యావసతులు లేకపోవడం, నైపుణ్యాలను నేర్పే శిక్షణ లోపించడం, పెద్దల్లో నిరుద్యోగిత వంటి వాటివల్ల సమస్య పెరుగుతుంది. కరువు ఏర్పడడం, విపత్తులు సంభవించడం, గ్రామాల నుంచి పట్టణాలకు వలసలు రావడం కూడా పిల్లలు పనిచేసే పరిస్థితులకు దారి తీస్తున్నాయి.సామాజికంగా అణగారిన వర్గాల్లోని ఆడ పిల్లలు, పాఠశాల విద్యను అకారణంగా వదిలేసిన వారు హానికారక పరిస్థితుల్లో బాల కార్మికులుగా పనిచేస్తున్నారు. కుటుంబానికి ఆర్థికంగా సాయపడాలన్న భావన పిల్లల్లో రావడం కూడా బాల కార్మికుల సంఖ్య పెరగడానికి దోహదమవుతున్నది.

కారణాలు: తక్కువ కూలీ ఇచ్చి పిల్లల్ని పనిలో పెట్టుకోవడం, ఎక్కువ పనిచేయించడం, వారి హక్కుల గూర్చి అవగాహన పిల్లల్లో ఉండకపోవడం యజమానులకు వరంగా మారుతుంది, కాని ఈ రకమైన ఒత్తిడి పిల్లలమానసిక, శారీరక అనారోగ్యానికి దారితీస్తుంది. దాంతో వారి ఎదుగుదల ప్రభావితమవుతుంది.

పని ప్రదేశాలు: మన దేశంలో బాలల హక్కులను కాపాడేందుకు ఏర్పాటు చేసిన చైల్డ్ లేబర్ ప్రొహిబిషన్ యాక్ట్(1986), నేషనల్ పాలసీ ఆన్ చైల్డ్ లేబర్(1987), జువైనల్ జస్టిస్ యాక్ట్(జెజె యాక్ట్ 2000, అమెండ్‌మెంట్ 2006), రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్(2009, ఈ యాక్ట్ కింద ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు ఆర్థికంగా బలహీన వర్గాల పిల్లలకు 25% సీట్లు ఇవ్వాలనే నిబంధన విధించారు) వంటి కఠిన చట్టాలు ఏర్పాటు చేసిన తర్వాత, అంతర్జాతీయంగా ఈ విషయంలో ఒత్తిడి ఏర్పడడంతో యజమానులు బయటకు కనిపించే పనుల్లో పిల్లలను తీసుకోవడం కొత వరకు తగ్గినా, ఇండ్లల్లో పనిచేసేందుకు పిల్లలను తీసుకోవడం పెరిగింది.

ఇంటి పని, గ్రామీణ స్థాయిలో వ్యవసాయ కూలీలుగా పత్తి చేలలో, గాజు, అగ్గిపెట్టెలు, ఇత్తడి పరిశ్రమల్లో, తాళాల తయారీ పరిశ్రమల్లో, ఎంబ్రాయిడరీ పనుల్లో, చెత్త ఏరడం, బీడీలు చుట్టడం, కార్పెట్ల తయారీలో , మైనింగ్, క్వారీల్లో, ఇటుకబట్టీల్లో, తేయాకు తోటల్లో బాల కార్మిక వ్యవస్థ నేటికీ బలంగానే ఉంది. ఆడపిల్లలు ఇంటిపనుల్లో, ఇంటి నుంచి చేసే పనుల్లో ఉండగా, అబ్బాయిలు రోజు కూలీలుగా పనిచేస్తున్నారు. ఈ పిల్లలు పెరిగే కొద్దీ పనిచేసే సమయం, పనిభారం పెరగుతుంది.

నివారించడంలో ఎదురయ్యే సవాళ్లు
అందరు పిల్లలు చేసే పని ఒకేలా ఉండకపోవడం, వారి వయసు, పనిచేసే ప్రదేశం, అది వారి కుటుంబమా కాదా అన్నది నిర్ధారించడం కష్టం, దాంతో ఈ వ్యవస్థను నిర్మూలించడం కూడా కష్టమవుతుంది. అనేకమంది, విభాగాలు, ప్రభుత్వం భాగస్వామ్యంగా దీర్ఘకాలం పనిచేస్తేనే ఈ సమస్యకు పరిష్కారం లభించే అవకాశం ఉంటుంది. విద్యా సంస్థలు, మాస్ మీడియా, స్వచ్ఛంద సంస్థలు, సామాజిక సంస్థలు, ట్రేడ్ యూనియన్లు, యాజమాన్యాలు కలిసి కొన్ని సంవత్సరాల పాటు పనిచేస్తేనే ఈ సమస్య పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా బడి ఈడు పిల్లలను పనిలో కాకుండా పాఠశాలల్లో ఉండేలా చూడాలనే ఆలోచన సమాజంలో ప్రతి ఒక్కరికి వచ్చినప్పుడే ఈ దుస్థితి రూపుమాసిపోతుంది. బాలకార్మిక వ్యవస్థను నిర్మూలించాలంటే విద్య ముఖ్యమైన ఆయుధం. అందుకే విద్యావకాశాలను మెరుగుపరిచి గ్రామాల్లో ఉండే చిట్టచివరి ఇంటివరకు అక్షరఙ్ఞానాన్ని అందించగలిగడం, విద్యలో నాణ్యతను పెంచి, సందర్భానుసారంగా విద్యావిషయాల్లో మార్పులు చేర్పులు చేపట్టి, వృత్తివిద్యా కోర్సులను చేర్చి పాఠశాల విద్యను అందించగలిగితే ఈ పరిస్థితిలో మార్పు రావచ్చు.

మన రాష్ట్రంలో: జనాభా లెక్కలు 2011 ప్రకారం మన రాష్ట్రంలో 5 నుంచి 14 సంవత్సరాల మధ్య వయస్సు పిల్లలు 1,01,18,739 కాగా అమ్మాయిలు 48.5%, అబ్బాయిలు 51.5% ఉన్నారు. ఇదే వయసు గల పిల్లలు 3.39 లక్షల మంది కార్మికులుగా ఉన్నారు. దాదాపు 9.01లక్షల మంది పిల్లలు 15 నుంచి 18 సంవత్సరాల మధ్య వయసువారు కార్మికులుగా పనిచేస్తున్నారు. రెయిన్‌బో ఫౌండేషన్ అనే స్వచ్ఛంద సంస్థ 2015-16 లో హైదరాబాద్ నగరంలో 150 ప్రాంతాల్లో చేసిన సర్వే ప్రకారం 28,560 మంది పిల్లలు వీధుల్లో నివసిస్తుండగా, వారిలో ఎక్కువ శాతం మంది బిచ్చగాళ్లుగా ఉన్నారు. వీరిలో 66.5% నిరక్షరాస్యులు(ఎన్నడూ పాఠశాలకు వెళ్లని వారున్నారు). గృహ సంబంధ పనులు చేసే పిల్లల్లో అమ్మాయిలు ఎక్కువగా ఉండగా, పాఠశాల మానేసిన పిల్లలు(14-18 వయసువారు) హానికారక పరిస్థితుల్లో పనిచేస్తున్నారు. బాల్య వివాహాల సంఖ్య రంగారెడ్డి జిల్లాలో ఎక్కువగా ఉండి మొదటి స్థానంలో నిలవగా, మహబూబ్‌నగర్ జిల్లా రెండో స్థానంలో, హైదరాబాద్ జిల్లా (వలస కుటుంబాల పిల్లలు) మూడో స్థానంలో ఉన్నారు, బండ్లగూడ, సింగరేణి కాలనీల్లో ఈ వివాహాల సంఖ్య ఎక్కువగా ఉన్నదని పిల్లల హక్కుల కోసం పనిచేస్తున్న వర్ష భార్గవి తెలిపారు.

సరైన ప్రణాళిక అవసరం: బాలకార్మిక వ్యవస్థ ప్రపంచవ్యాప్త సమస్య. మన దేశంలోనా గ్రామాలకు ఉచిత నిర్భంధ విద్యపై అవగాహన ఇంకా పూర్తి స్థాయిలో చేరలేదు. ఈ చట్టం ప్రకారం బాలలు అందరూ పాఠశాల లోపలే కాని, బయట ఉండకూడదు. విద్యావ్యవస్థ కూడా మారాలి, చదువుల్లో నాణ్యత లోపించింది, ఈ స్థితి నుంచి బయటపడాలి. తెలంగాణలో బాలలు(అమ్మాయిలు) పత్తి , మిర్చి చేలల్లో వ్యవసాయ కూలీలుగా పనిచేస్తున్నారు. ఇలా పనిచేసే వారి సంఖ్య మహబూబ్‌నగర్, గద్వాల జిల్లాల్లో ఎక్కువగా ఉంది. చాలా ప్రాంతాల్లో పాఠశాలలు లేవు, ఉన్నా వాటిల్లో టీచర్లు లేరు. బాలకార్మిక వ్యవస్థ పూర్తిగా నిర్మూలన కావాలంటే గ్రామస్థాయిలో ఉండే పంచాయతీ, విద్యాశాఖ సంయుక్తంగా ప్రణాళికలు రూపొందించి ఆచరణలో పెట్టాలి, ప్రతి గడపకు వెళ్లి విద్యావశ్యకత గూర్చి వివరించాలి. అన్నింటికంటే ముఖ్యంగా విద్యావ్యవస్థను మరమ్మతు చేయాలి. -డా. శాంతా సిన్హా ,చైర్ పర్సన్ (మాజీ), జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్.  

-అనిత యెలిశెట్టి