Home దునియా అన్న పాత పుస్తకాలు చెల్లెకు అక్కెరకు వచ్చేది

అన్న పాత పుస్తకాలు చెల్లెకు అక్కెరకు వచ్చేది

Old-Books

ఎన్కటి కాలం సదువులకు గింతగనం పైసలు పెట్టకపోయేది. పోరన్ని నర్సరీల ఏస్తాంటేనే యాబైవేలు అయితన్నయి. అరె గిది గమ్మతిగ ఉన్నది. అంత పైస దగ్గర వైకుంఠం తరీఖ అయ్యింది. శిన్న పోరనికి పోరికి టై బెల్టు స్కూల్ బ్యాగ్ రంగురంగుల పుస్తకాలు యూనిఫారం సూస్తేనే గమ్మతి అన్పిస్తంది. అసలు ఇంట్ల ఇద్దరు ముగ్గురు పిల్లలుంటే ఒగలు ఆరు ఏడు తరగతులు సదువుతె ఒగల పుస్తకాలు ఒగలకు అక్కెరకు వచ్చేది. ఏడోతరగతి అన్న ఎనిమిదికి పోయినంక ఆయన పాఠ్యపుస్తకాలు తమ్మునికి అక్కెరొస్తుండే. ఆయనయి వాళ్ల చెల్లెకు ఇస్తుండిరి ఇట్లనే నడిచేది ఒగవేళ ఈ ఇంట్ల అట్ల నడువకుంటే చిన్నమ్మ కొడుకులు బిడ్డలకు లేదా చిన్నాయన పిల్లలకు ఇస్తుండేది. గని ఎవ్వలు పుస్తకాలు కొత్తయి కొనేంత శక్తి లేకుండేది. సదివినంక దగ్గరోల్లకు ఎవలకు ఇయ్యడం కుదరనప్పుడు సగం ధరకు అమ్మేది. వాడిన పస్తకాలను సగం రేటు అమ్ముడు ఇప్పటికే హైద్రాబాద్ ఫుట్‌పాత్‌ల మీద ఉన్నట్టు ఉన్నది అయితే ఊర్లల్ల సగం ధరకు కొనుక్కునుడు ఉండెగా పుస్తకాలతో సదువు నడుస్తుండేది.

కొత్తగ బడి మల్లి సుర్వు అయ్యిందంటే పోరగల్లకు సంబురమే సంబురం. కొత్త తరగతి కొత్త సోపతిగాళ్ళు కొత్త సార్లు లేదా కొత్త బడి కొత్త ఊరు కొత్త క్లాస్ టీచర్ ఇట్లా అంత నూతనత్వం వికసించేతనం. అసలు ఎండకాలం సెలవులల్లనే కొత్త తరగతికి పోయేటప్పుడు ముందుగల పాత రాసిన పుస్తకాలు ముందట ఏసుకొని అండ్లకెల్లి రాసిన కమ్మలను చింపి తెల్లకమ్మలను ఒక్కతాన పెట్టేది. అట్ల అన్ని కాపీల తెల్లకమ్మలను ఒక్క దగ్గర చేసి దొడ్డు బుక్ తయారుచేసుడు. దబ్బునంతోని కుట్టి నోటు బుక్ తయారు చేసుడు. దానిని రఫ్ బుక్‌గ వచ్చే కొత్త తరగతికి ఉపయోగించుడు ఉంటుండె. ఇప్పుడైతే పాత పుస్తకాలు పాత రాసిన పుస్తకాలు అన్ని అటు మొకాన పారేస్తండ్రు. అసలు వాటిని వాడుతనే లేరు. మల్ల కొత్తగ బడి సారు ఇచ్చిన పుస్తకాల చిట్టి తీసికొని దుకాన్లకు పోయి వెయ్యిలకు వెయ్యిలు పెట్టి కొంటండ్రు.

రాసుకునే పుస్తకాలు కుట్టుకొని తయారు చేసికొని ఆ పుస్తకాలను తీసికపోయేందుకు చెయ్యి సంచిని కూడా వాల్లే కుట్టుకునేవాల్లు ఎన్కట గోనె సంచి పట్టా లేక ఎరువుల బస్తా సంచి బట్ట తోని లేదంటే బట్ట సంచిని చేతితోనే కుట్టుకునేది అలా కుట్టుకున్న సంచి అందుల పుస్తకాలు, సద్ది గిన్నె పట్టుకొని నాలుగైదు కిలోమీటర్ల దూరం ఉన్న పక్క ఊరి బడికి పోయివచ్చుడు. బడికి పోవుడు అంటే పొద్దుగాలనే తానం చేసి నెత్తికి సమరు రాసుకొని నిమ్మళంగ కూకోని ఇంత బువ్వ తినుడే ఉండేది. బువ్వ తప్ప టిఫిను అనే పదార్థం ఆ రోజుల్లో లేదు. ఇడ్లీలు వడలు దోసలు ఈ పది ఇరవై ఏండ్లల్ల వచ్చింది గని పూర్వం మూడు పూటలా మంచిగ వరి అన్నం తినేది. నడిచి మాత్రమే బడికి పోయేది ఐదోతరగతి దాక ఊర్లె ఆరుకు వచ్చిండ్రంటే జర పెద్ద ఊర్లకు పోయి సదువుకున్నరు ఇగ ఇంటర్‌లకు పోయేటోల్లు క్లాసుకు 5, 10 మంది కూడ ఎల్లరు. క్లాసు అంటే 50 మందికి కంటే పైననే ఉండేది. సర్కారు స్కూల్లల్లకు ఇప్పుడు ఎవ్వలు పోతలేరుగని ఆరోజుల్ల పదోతరగతి ఎ, బి,సి సెక్షన్‌లు ఉంటుండె. ఇప్పుడైతే ఒక్క తరగతి కూడా గవర్నమెంట్ స్కూల్లల్ల నిండుతలేదు.

నడిపోయి వచ్చేవాళ్లే ఎక్కువ ఎక్కన్నో కొందరు మాత్రమే సైకిల్ల మీద వచ్చేవాల్లు ఈకాలంలనైతె అన్ని బస్సులే ఉన్నయి ఊరూరికి బడి బస్సులు తిరుగుతున్నయి బడి పిల్లలను ఎక్కిచ్చుకొని పోతన్నయి. అయితె ఆ చదువుల వేరు ఈ చదువులు వేరు వీల్లు ఇంగ్లీష్ వస్తది ప్రస్తుతం అంత తిరుగుతరు అమెరికాకు పోతరు వస్తరు జీవనశైలి మొత్తం మారుతున్నకాలం ఆహ్వానించాల్సిందే వద్దనేది మంచిగ లేదనేది ఏమి లేదు కాని ఆనాటికాలం సదువులు ఎట్ల ఉన్నయి అన్ని పిలగండ్లు సుత తెల్సికోవాల్సిన అవసరం ఉన్నది. ఒగల పుస్తకాలు ఇంకొకలు అన్నతమ్ములు అక్కచెల్లెండ్లు మాత్రమే కాదు. ఒగలు పెరుగుతాంటే వాల్లకు పట్టని బట్టలు అంగీలు లాగుల గౌనులు చెల్లెండ్లకు తమ్ముల్లకు ఇచ్చేది. ఇట్లా అదలు బదలు సంసారాలు ఎల్లినకాలం ఎల్లని కాలం ఈ కాలంల అట్ల కాదు. పోరగాండ్ల కోసం తల్లిదండ్రులు ఒగల్ని సూసి ఒగలు సస్తండ్రు. మస్తు కష్టం అయినా పిలగండ్ల మొకం సూడి కట్టేట్టుగా ఉన్నది. ఎందుకంటే కథ నడవాల్సిందే నడవనియ్యాలె.

– అన్నవరం దేవేందర్, 9440763479