Home ఆంధ్రప్రదేశ్ వార్తలు హాట్ టాపిక్ గా మారిన ఎపి శాసనమండలి రద్దు?

హాట్ టాపిక్ గా మారిన ఎపి శాసనమండలి రద్దు?

CM Jagan

 

హైదరాబాద్ : ఎపి శాసనమండలి రద్దు అంశం హాట్ టాపిక్‌గా మారింది. వికేంద్రీకరణ, సిఆర్‌డిఎ రద్దు బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపాలన్న మండలి నిర్ణయంపై సిఎం జగన్ ఆగ్రహంతో శాసనమండలిని రద్దు చేయాలని పట్టుదలతో ఉన్నారు. అలాగే ఈ వ్యవహారంపై ఎజి సలహాలు కూడా తీసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. మండలి రద్దు నిర్ణయాన్ని తీసుకుంటే ఏమవుతుంది? మండలిని కొనసాగిస్తే ఎలా ఉంటుందనే అంశాలే జగన్ ప్రధానంగా చర్చిస్తున్నట్లుగా సమాచారం. మండలిని కొనసాగించాలా? వద్దా? అనే అంశం గురించి సోమవారం ఉదయం అసెంబ్లీలో చర్చ జరగనుంది. ఈ నేపథ్యంలో సిఎం జగన్ ముందుగానే కొందరు ముఖ్య నేతలతో ఈ అంశం మీద చర్చలు జరుపుతున్నారని తెలుస్తోంది. ఈ చర్చల్లో మంత్రి బుగ్గనతో పాటు ఎజి కూడా పాల్గొంటున్నట్లు సమాచారం.

మండలి రద్దు తీర్మానాన్ని ఎపి అసెంబ్లీ చేసినా దానిని కేంద్రం ఆమోదించాల్సి ఉంటుంది. అంటే.. ఈ అంశంపై ఉభయసభల్లో (లోక్‌సభ, రాజ్యసభ) ఆమోదం లభించాల్సి ఉంటుంది. అప్పుడే మండలి రద్దవుతుంది. ఎపి ప్రభుత్వం మండలిని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నా.. దానికి బిజెపి కేంద్రంలో ఒప్పుకుంటేనే మండలి రద్దు అవుతుంది. బిజెపి ఓకే అంటే ఆ తీర్మానం లోక్‌సభలో ఆమోదం పొందుతుంది. కానీ.. రాజ్యసభలో బిజెపికి కూడా గట్టి బలం లేదు. అక్కడ కాంగ్రెస్ మద్దతు అవసరపడొచ్చు. జగన్ తీసుకున్న నిర్ణయం కాబట్టి కాంగ్రెస్ స్వతహాగా వ్యతిరేకించొచ్చు. ఇటువంటి అంశాల న్నింటినీ పరిగణనలోనికి తీసుకునే సిఎం జగన్ మండలి మీద ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది. అలాగే, మండలిని కొనసాగిస్తే అనే అంశంపైనా చర్చలు జరుపుతున్నట్లుగా తెలుస్తోంది. మరో ఏడాదిలో మండలిలో వైసీపీ బలం పెరిగే అవకాశం ఉంది.

మరికొంతమంది టిడిపి ఎమ్‌ఎల్‌సిలు రాజీనామా బాటపట్టినా.. లేదా తటస్థంగా మారినా.. టిడిపి ఆటలు మండలిలో అంతగా సాగే ఆస్కారం ఉండదు. ఈ పరిణామాల గురించి కూడా జగన్ సమాలోచనలు చేస్తున్నట్లు తెలుస్తోంది. మండలి రద్దయితే జగన్‌కు సన్నిహితులుగా పేరొందిన ఇద్దరు మంత్రులు పదవులు పోగొట్టుకోవలసి వస్తుంది. వారిలో ఉప ముఖ్యమ్రంతి సుభాష్ చంద్రబోస్‌తో పాటు మరో మంత్రి మోపిదేవి వెంకటరమణలు ఉన్నారు. మండలి రద్దు అంశాన్ని సోమవారం పునఃసమీక్షిస్తామని తూర్పుగోదావరి పర్యటనలో ఉన్న మంత్రి సుభాష్ చంద్రబోస్ పేర్కొనడం గమనార్హం. మరోవైపు గత ఎన్నికలలో ఎమ్మెల్యే సీట్లు ఇవ్వలేని పలువురికి ఎమ్మెల్సీ ఆశలు చూపించారు. వారందరిని ఏమీ చేయాలనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇప్పడు ఒక్కసారిగా మండలి రద్దు అనడంతో వీరందరూ దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. అదే విషయాన్ని సిఎం జగన్‌కు నచ్చజెప్పడానికి కొందరు నాయకులు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.

అయితే నేరుగా జగన్‌కు విన్నవించుకునే సాహసం చేయలేక ఇతర పార్టీలకు చెందిన ఎమ్‌ఎల్‌సిలతో కూడా వైసీపికి చెందిన కొందరు సీనియర్ నేతలు చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. ఇందులో భాగంగా పార్టీలతో సంబంధం లేకుండా ఎక్కువ మంది ఎమ్‌ఎల్‌ఎలను సమీకరించి.. ఆది, సోమవారాల్లో ముఖ్యమంత్రిని నేరుగా కలిసి మండలి రద్దు ఆలోచనను విరమించుకోవాలని విజ్ఞప్తి చేసేలా చూడాలని ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. ఇదే క్రమంలో.. జగన్ గేట్లు తెరిస్తే టిడిపి ఎమ్‌ఎల్‌సీలలో అత్యధికులను ఆకర్షించి ఈ లోగానే మండలిలో కూడా ఆధికత్య సాధించవ్చనే ప్రతిపాదనను తెరపైకి తెస్తున్నారు. ఈ క్రమంలో సిఎం జగన్ తాననుకున్న విధంగా మండలి రద్దుకే మొగ్గుచూపుతారా? లేదా మండలి కొనసాగింపుకు ప్రాధాన్యతనిచ్చే అవకాశం ఉందా? అన్న అంశంపై తీవ్రస్థాయిలో ఉత్కంఠ నెలకొని ఉంది.

Jagan govt moves to scrap Amaravati capital region law