Home దునియా పంచదార కంటే బెల్లం మేలు

పంచదార కంటే బెల్లం మేలు

Jaggery

ఇవి చెరుకు పండే రోజులు. షాపింగ్‌మాల్స్‌లో కూడా చెరుకు ముక్కలు ప్యాక్ చేసి అమ్ముతున్నారు. ఈ చెరుకు గడ్డల నుంచి తయారయ్యే బెల్లం భారతీయుల జీవనశైలిలోనే ఒక భాగం. వంటల్లో, పెళ్లిళ్లు, పేరంటాల్లో, వేడుకల్లో బెల్లం వినియోగానికి ఉన్న ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. పంచదారలో మాత్రమే రసాయనాలు, అధిక క్యాలరీతో తియ్యదనం ఉంటుంది. కానీ బెల్లంలో విటమిన్లు, ఖనిజాలు ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. ప్రపంచ ప్రసిద్ధి చెందిన పాకశాస్త్ర ప్రవీణులు బెల్లంతో తయారు చేసే రిజర్వ్‌లకే ఇప్పుడు ప్రాధాన్యత ఇస్తున్నారు. దీన్ని లిక్విడ్ గోల్డ్ అని ద్రవరూపంలోని బంగారం అనీ అత్యంత శుద్ధమైన తీపి పదార్థమని అంటారు. చక్కని సువాసన బంగారం రంగులో, బెల్లంతో తయారు చేసిన కేకులు, మిఠాయిలు ఆరోగ్యానికి మంచిదంటారు.

ప్రపంచవ్యాప్తంగా దాదాపు అన్ని ప్రాంతాల్లో సాస్‌లు, జామ్‌లు, కేకులు, స్వీట్లు ఇప్పుడు బెల్లంతో చేస్తున్నారు. తాటిబెల్లంతో కేక్స్, హల్వా, పండ్లతో చేసే పేల్‌ఆల్, గూడ్‌కీ ఖీర్ వంటి అద్భుతమైన వంటకాల్లో బెల్లం వాడకం మొదలైంది. బెల్లాన్ని కరిగించిన లేత పాకాన్ని కస్టర్డ్‌లు, ఐస్‌క్రీమ్‌ల పైన నింపి అందిస్తున్నారు. బెల్లాన్ని చెరుకు రసం నుంచి ఎలాంటి ప్రక్రియలు లేకుండా సహజసిద్ధంగా తయారు చేస్తారు. ఖర్జూరం, తాటిచెట్లు, కొబ్బరి నుంచి కూడా బెల్లం తయారవుతుంది. కొన్ని ఫ్యాక్టరీలో తయారు చేసే తేనెల కంటే బెల్లంతో చేసే సిరప్ ఉత్తమం అంటున్నారు చెఫ్‌లు. అసలైన బెల్లం ముదురు గోధుమ రంగులో ఉంటుంది. పసుపు రంగులో మెరుస్తూ కనిపిస్తే దానికి రసాయనాలు కలిశాయని అర్థం చేసుకోవాలి. బెల్లంలో ఐరన్ సమృద్ధిగా ఉంటుంది. రక్తకణాలకు ఆక్సిజన్ సరఫరా చేసే ఎర్ర రక్తకణాలు ఐరన్ పాత్ర చాలా ముఖ్యమైంది.

ప్రతిరోజూ చిన్న బెల్లం ముక్క తిన్నా, ఎర్రరక్త కణాలకు ఐరన్ అందుతుంది. రక్తహీనతతో బాధపడే వారికి బెల్లం వల్ల ఎంతో ప్రయోజనం సమకూరుతుంది. ఇందులో ఎన్నో పోషకాలున్నాయి. ఎన్నో విటమిన్లు, ఫాస్ఫరస్, ఐరన్, మెగ్నీషియం, పోటాషియం వంటి పోషకాలు ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. ఇది మేలైన డిటాక్సిన్. జింక్, సెలీనియం వంటి ఖనిజాలు ఉండటం వల్ల శరీరంలోని వివిధ అవయవాల ద్వారా టాక్సిన్‌లను బయటకు పంపేస్తుంది. దీనితో చర్మం ఆరోగ్యంగా కాంతివంతంగా ఉంటుంది. నిత్యం సరైన పరిమాణంలో బెల్లం తీసుకుంటే పొట్ట ప్రాంతంలో అదనపు క్యాలరీలు కరిగిపోతాయి. జీర్ణ ప్రక్రియను వేగవంతం చేస్తుంది. మధుమేహం ఉన్నవారు కొద్ది పరిమాణంలో బెల్లం తీసుకుంటే ప్రమాదం ఏమీ ఉండదు. అందుకే పంచదారకు బదులు బెల్లం వాడమంటారు వైద్యులు. గ్లెకమిక్ ఇండెక్స్ ప్రకారం పంచదార కంటే బెల్లం మేలు. కాబట్టి పిల్లలకు బెల్లంతో చేసిన వేరుశనగ ఉండలు, జీడిపప్పు ఉండలు ఇవ్వచ్చు. అధిక పోషకాలతో నిండిన బెల్లం ఆరోగ్యపరంగా ఎంతో మంచిది.

Jaggery is better than sugar