Home మంచిర్యాల “బంగారం” చిక్కు

“బంగారం” చిక్కు

jgry

వనదేవతల మొక్కులకు “బంగారం” చిక్కు

* సమ్మక్క సారలమ్మ జాతరకు దొరకని బెల్లం

* దుకాణాల్లో విక్రయించవద్దని ఎక్సైజ్‌శాఖ ఆంక్షలు 

*అదను కోసం ఎదురు చూస్తున్న అక్రమార్కులు 

*బెల్లం మార్కెట్‌లోకి వస్తే మళ్లీ గుడుంబా ప్రవాహం

* అధికారుల ఆంక్షలతో భక్తులకు తప్పని తిప్పలు 

సమ్మక్క  సారలమ్మ మహాజాతరకు బెల్లం నిల్వలు లేకపోవడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులకు గురువుతున్నారు. మహాజాతర సమీపిస్తుండగా భక్తులకు బెల్లం దొరకని పరిస్థితులు నెలకొన్నాయి. జాతరకు మహాప్రసాదంగా భావించే బెల్లాన్ని వారం రోజుల ముందుగానే భక్తులు కొనుగోలు చేశారు. అయితే దుకాణాల్లో బెల్లం విక్రయాలు జరపరాదని ఎక్సైజ్‌శాఖ అధికారులు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. మొన్నటి వరకు గుడుంబా తయారీకి నల్లబెల్లాన్ని వాడగా ప్రస్తుతం కొత్తపద్ధతుల్లో తెల్ల బెల్లం నుంచి కూడా గుడుంబాను తయారు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎలాంటి
బెల్లం విక్రయాలు జరపరాదని అధికారులు ఆంక్షలు విధించారు. జాతర సందర్భంగా బెల్లం విక్రయాలకు అనుమతినిస్తే ఇదే అదనుగా భావిస్తున్న కొందరు అక్రమార్కులు పెద్ద ఎత్తున బెల్లం నిల్వలు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో బెల్లం భక్తులకు చిక్కులు తెస్తోంది. స్థానికంగా మహాజాతర సందర్భంగా మున్సిపాలిటీతో పాటు సింగరేణి, పంచాయతీ అధికారులు జాతర కోసం ఏర్పాట్లు చేస్తుంటారు. ఇంటి వద్ద వన దేవతలకు మొక్కులు చెల్లించి జాతర రోజుల్లో కొలువు దీరిన వన దేవతలకు దర్శించుకోవడం అనవాయితీగా వస్తుంది. సమ్మక్క సారలమ్మ జాతరలో ప్రదానంగా బెల్లాన్ని భక్తుల బరువుకు సమానంగా జోకి పంచిపెడుతారు. అయితే ఈ ఏడాది మహాజాతరకు బెల్లం దొరకకపోవడంతో భక్తులు అనేక ఇబ్బందులకు గురువుతున్నారు. బెల్లాన్ని వ్యాపారులు ప్రధానంగా చిత్తూరు, కర్ణాటక, వరంగల్ ప్రాంతాల నుంచి జిల్లాకు తరలిస్తారు. ప్రతి ఏడాది జాతర సమయాల్లో కొందరు బెల్లం వ్యాపారులు సిండికేట్‌గా ఏర్పడి ధరలను విపరీతంగా పెంచుతారు. అయితే గుడుంబా విక్రయాలను అరికట్టేందుకు ఎక్సైజ్‌శాఖ అధికారులు బెల్లం అమ్మకాలను పూర్తిగా నిషేధించారు. అధిక మొత్తంలో నిల్వలు ఉంటే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. దీంతో పల్లెలతో పాటు పట్టణాల్లో కూడా బెల్లం దొరకని పరిస్థితులు ఏర్పడ్డాయి. 2017 నవంబర్, డిసెంబర్ నెలల్లో గుడుంబా తయారీని అరికట్టి మద్యం అమ్మకాలు పెంచామని, ఎక్సైజ్ అధికారులు సంబరాలు జరుపుకున్నారు.
ఎక్సైజ్ కేసుల నమోదు వివరాలు ….
జిల్లాలో గత ఏడాది జనవరి నుంచి డిసెంబర్ వరకు నమోదైన ఎక్సైజ్ కేసుల వివరాలిలా ఉన్నాయి. జిల్లాలో 827 కేసులు నమోదు కాగా 761 మందిని అరెస్టు చేశారు. 5143 లీటర్ల నాటుసారాను స్వాధీనం చేసుకోగా, 81,205 లీటర్ల బెల్లం పానకాన్ని ధ్వంసం చేశారు. అదే విధంగా 44,237 కిలోల బెల్లాన్ని స్వాధీనం చేసుకోగా 7510 కిలోల పటికను మరో 53 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. అయితే మహాజాతర సమీపిస్తున్నకొద్దీ బెల్లం అమ్మకాలపై సడలింపు చేసినట్లయితే కొందరు అక్రమార్కులు పెద్ద ఎత్తున బెల్లం నిల్వలను ఏర్పాటు చేసి, గుడుంబా తయారీకి విక్రయించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏదిఏమైనా సమ్మక్క సారలమ్మ జాతర భక్తులకు బెల్లం అమ్మకాలపై ఆంక్షలు విధించడం భక్తుల పాలిట శాపంగా మారింది.