Friday, April 26, 2024

700 కోట్లతో జగిత్యాల అభివృద్ధి

- Advertisement -
- Advertisement -

జగిత్యాలః జగిత్యాల అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం రూ.700 కోట్లు వెచ్చించిందని, లక్ష జనాభా ఉన్న ఏ పట్టణానికి ఇవ్వనంతగా జగిత్యాలకు 4500 డబుల్ బెడ్ రూం ఇండ్లు ఇచ్చి పేదల సొంతింటి కల తీర్చబోతోందని జగిత్యాల ఎంఎల్‌ఎ సంజయ్‌ కుమార్ అన్నారు. బుధవారం నూకపల్లి అర్బన్ హౌజింగ్ కాలనీ (కెసిఆర్ కాలనీ)లో రూ.9.06 కోట్లతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు ఎంఎల్‌ఎ సంజయ్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎంఎల్‌ఎ మాట్లాడుతూ… రూ.340 కోట్లతో 4500 డబుల్ బెడ్ రూం ఇండ్లు చేపట్టడం జరిగిందన్నారు. కాలనీలో అంతర్గత రోడ్లు, డ్రైనేజీలు, సెప్టిక్ ట్యాంకుల నిర్మాణం కోసం ప్రభుత్వం రూ.10 కోట్లు మంజూరు చేసిందన్నారు.

అన్ని వసతులతో ఇండ్లు నిర్మించడంతో పాటు కాలనీలో మౌలిక వసతుల కల్పనపై ప్రత్యేక దృష్టి సారించామన్నారు. రూ.2.30 కోట్లతో అంతర్గత సిసి రోడ్లు, 1.50 కోట్లతో సెప్టిక్ ట్యాంకులు, డ్రైనేజీల నిర్మాణ పనులు చేపడుతున్నామన్నారు. 4000 ఇండ్లకు రూ.5.10 కోట్లు సెప్టిక్ ట్యాంకులు నిర్మించేందుకు వెచ్చిస్తున్నామన్నారు. మౌలిక వసతుల కల్పన కోసం ముఖ్యమంత్రిని కలిసి రూ.10 కోట్లు కేటాయించాలని కోరగానే వెంటనే నిధులు మంజూరుకు ఆదేశాలు జారీ చేశారన్నారు. పంచాయతీ రాజ్ శాఖ మంత్రి మరో రూ.10 కోట్లు ఇస్తానని హామీ ఇచ్చారని, అలాగే ఆర్‌అండ్ బి మంత్రి ప్రశాంత్‌రెడ్డి రూ.25 కోట్లు నిధులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చినట్లు ఎంఎల్‌ఎ తెలిపారు.
సుమారు 2500 ఇండ్ల నిర్మాణాలు పూర్తయ్యాయని వాటిని త్వరలోనే లభ్దిదారులకు అందజేస్తామన్నారు. డబుల్ బెడ్ రూం ఇండ్లలో ముస్లింలకు 12 శాతం, దళితులకు 15 శాతం, గిరిజనులకు 7 శాతం రిజర్వేషన్ కల్పించనున్నట్లు పేర్కొన్నారు. ఇప్పటికే అందిన డబుల్ బెడ్ రూం ఇండ్ల దరఖాస్తులను రెవెన్యూ అధికారులు పరిశీలన చేస్తున్నారనీ, ఎలాంటి పైరవీలకు తావు లేకుండా అర్హులైన వారికి దక్కేలా పకడ్భందీ చర్యలు చేపడుతున్నారన్నారు. ఇండ్ల మంజూరులో అవినీతి అక్రమాలకు ఆస్కారం లేకుండా పారదర్శకంగా కేటాయిస్తారని తెలిపారు. డబుల్ బెడ్ రూం ఇండ్లకు దరఖాస్తు చేసుకోని వారు వెంటనే దరఖాస్తు చేసుకోవాలని ఎంఎల్‌ఎ సూచించారు. అర్హులందరికీ డబుల్ ఇండ్లు అందించడమే తన ధ్యేయమని, ప్రస్తుతం నిర్మిస్తున్న ఇండ్లు సరిపోని పక్షంలో మరిన్ని ఇండ్ల నిర్మాణాలకు మంజూరు తీసుకువస్తానన్నారు.

లక్ష జనాభా ఉన్న జగిత్యాల వంటి పట్టణాల్లో ఎక్కడ కూడా ఇంత పెద్ద ఎత్తున ఇండ్లు మంజూరు కాలేదని, కవితమ్మ ప్రత్యేక చొరవతోనే 4500 ఇండ్లు మంజూరయ్యాయన్నారు.జగిత్యాలలో రూ.350 కోట్లతో డబుల్ ఇండ్లు, రూ.70 కోట్లతో వైద్య కళాశాల, రూ.100 కోట్లతో కలెక్టరేట్ నిర్మించుకోవడం జరిగిందన్నారు. అలాగే జిల్లా గ్రంధాలయం, మైనార్టీ పాఠశాలలు (2), ఎస్‌టి డిగ్రీ కళాశాల, బిసి జూనియర్ కళాశాల, కస్తూరిబా బాలికల పాఠశాలల కోసం కోట్లాది రూపాయలు వెచ్చిస్తూ విద్యకు అత్యంత ప్రాధాన్యతనిస్తున్నామన్నారు. జగిత్యాల పట్టణంలో మంచినీటి సమస్య శాశ్వత పరిష్కారం కోసం మిషన్ భగీరథ ద్వారా రూ.46 కోట్లతో 120 కిలోమీటర్ల మేర పైపులైన్ వేశామన్నారు. రూ.7 కోట్లతో అర్బన్ హౌజింగ్ కాలనీకి ప్రత్యేక పైపులైన్, ఓవర్ హెడ్ ట్యాంకులు ఏర్పాటు చేసుకున్నామన్నారు.

అవసరం ఉన్న చోట పార్కులు, స్మశానాలు, బస్తీదవాఖానలు, మన ఊరు మనబడి ద్వారా ప్రభుత్వ పాఠశాలలన్నింటినీ అభివృద్ధి చేయడం జరిగిందన్నారు. పట్టణంలో ట్రాఫిక్ రద్దీ తగ్గించి బైపాస్ ద్వారా రాకపోకలు సాగించేలా రైల్వే గేటును తెరిపించామన్నారు. రూ.18 కోట్లతో మంచినీళ్ల బావి నుంచి చల్‌గల్ వరకు ఫోర్ లైన్ రోడ్డు చేపట్టబోతున్నామన్నారు. పోటీ పరీక్షలకు విద్యార్థులు యువతను సన్నద్దం చేసేందుకు స్టడీ సర్కిళ్ల ఏర్పాటుతో పాటు క్రీడా మైదానాలను అభివృద్ధి చేస్తున్నామన్నారు.నూతనంగా పట్టణంలో పలు చోట్ల మార్కెట్లను ఏర్పాటు చేసి వాటి అభివృద్ధికి నిధులు కేటాయించామన్నారు. అన్ని కులాలకు కమ్యూనిటీ హాల్స్ నిర్మించుకునేందుకు నిధులు మంజూరు చేశామన్నారు. గతంలో పట్టణానికి సరైన మాస్టర్ ప్లాన్ లేక అస్తవ్యస్తంగా తయారై రోడ్లన్నీ ఇరుకుగా మారిపోయాయన్నారు.

కొత్తగా మాస్టర్ ప్లాన్ తీసుకువచ్చి ప్రభుత్వ నిబంధనల మేరకు నిర్మాణాలు జరిగేలా పకడ్భంధీ చర్యలు తీసుకుంటున్నామన్నారు. తప్పుల తడకగా ఉన్న జోన్‌లకు మార్పు చేసి ప్రజల ఇబ్బందులను తొలగించామన్నారు. పట్టణాన్ని పరిశుభ్రంగా, పచ్చదనంగా తీర్చిదిద్దే బాధ్యత అందరిపై ఉంటుందని, ప్రతి ఒక్కరూ తమ ఇంటిని శుభ్రంగా ఉంచుకున్నట్లుగానే పట్టణాన్ని శుభ్రంగా ఉంచాలన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ బోగ శ్రావణి, వైస్ చైర్మన్ గోళి శ్రీనివాస్, జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ డాక్టర్ చంద్రశేఖర్ గౌడ్, మున్సిపల్ కమిషనర్ డాక్టర్ నరేష్, డిఇ రాజేశ్వర్, కౌన్సిలర్లు, పంచాయతీ రాజ్ ఇంజనీర్లు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News